Previous Page Next Page 
జైలు పేజి 26


    "తిలక్ ఇంత త్వరగా పారిపోవడానికి ప్రయత్నిస్తాడని అనుకోలేదు" అంది ఆమె.

 

    "అదే మన పొరబాటు. శత్రువును ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. అందులో తిలక్ లాంటి వాడితో మరింత జాగ్రత్తగా వుండాలి."

 

    "అందుకే అతనిమీద నిఘా వేయడానికి కైలాసం అనే వాడిని నియమించాను. ఎప్పటికప్పుడు అతని కదలికలను తెలుసుకుంటూ చెబుతున్నాడు."

 

    "ఇకనుంచి మరింత జాగ్రత్తగా వుండాలి మనం. ఆ రాత్రి కరెంట్ ఆఫ్ కాకపోవడం మన అదృష్టం. వాడి దురదృష్టం. అదే జరిగే వుంటే వాడు ఈసరికి నా మెడకు వురి బిగించి వుండేవాడు!"

 

    "ఇప్పుడేం చేద్దాం?" చిత్ర అడిగింది.

 

    "దానికి రెండే మార్గాలు. ఒకటి వాడ్ని జైల్లోనే చంపేయడం, రెండు వాడు జైల్లోనే మగ్గిచావడం. మొదటిది మన భుజబలాన్ని లోకానికి తెలియజేస్తుంది. రెండోది మన బుద్ధిబలాన్ని చాటి చెబుతుంది. నేను మాత్రం రెండవదాన్ని ఇష్టపడతాను. ఎందుకంటే బుద్ధిబలాన్నిచూసే జనం జడుసుకుంటారు గనుక. మనం శత్రువుని ఏవిధంగా దెబ్బ తీశామా అని అందరూ గమనిస్తుంటారు. మనం ఎంత తెలివిగా శత్రువును దెబ్బతీశామన్న విషయం మీద మన ప్రతిష్ట, మన పరపతి ఆధారపడి వుంటాయి. అందుకే నేను వాడ్ని చంపను అయితే చచ్చేటట్టు చేస్తాను. వాడు జెయిలు నుంచి బయటికి రాకూడదు. అదే నాకు కావలసింది" ఆగాడు రాయుడు.

 

    చిత్ర ఆశక్తిగా వింటోంది.

 

    "ఇందుకు ఓ పథకం ఒకటి ఆలోచించాను. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయవలసింది నువ్వే"

 

    ఆమె ఉలిక్కిపడి వెంటనే సర్దుకుంది.

 

    "నేనా?"

 

    "ఆఁ నువ్వే. ఆ నాటక సూత్రధారిని నేనైతే, పాత్రధారివి నువ్వు" అని ఆమె ఏం చేయాలో మొత్తం వివరించాడు రాయుడు.

 

    "గొప్ప ఐడియా. కానీ ఈ నాటకం మంచి ఫలితాన్ని ఇస్తుందంటావా?" ఆమె సందేహంగా అడిగింది.

 

    రాయుడు పకపకా నవ్వాడు "నీకు నామీద నమ్మకం లేక నచ్చేనేమోగానీ నామీద నాకు మాత్రం చాలా నమ్మకముంది. నాటకం రక్తికట్టడం ఆ నాటక పాత్రధారులమీద ఆధారపడి వుంటుంది. కాబట్టి ఈ నాటకాన్ని రక్తి కట్టించి తిలక్ శిక్షాకాలాన్ని పెంచే భారం నీమీదే వుంది" అన్నాడు.

 

    చిత్ర కొంతసేపు ఆలోచించాక "ఓ.కే. ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తాను" అని లేచింది.

 

    "ఈ క్షణమే దానికి ముహూర్తం. గో ఏ హెడ్" అన్నాడు రాయుడు ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ.

 

    ఆమె అక్కడినుంచి ఇంటికొచ్చింది.

 

    బెడ్ మీద పడుకుని రాయుడు చెప్పిన ప్లాన్ ను మననం చేసుకుంది. ఆలోచించినకొద్దీ తిలక్ తమ వలలో పడిపోతాడన్న గట్టి నమ్మకం కుదిరింది.

 

    అప్పుడు టైమ్ చూసింది. నాలుగు గంటలకు మరో అయిదు నిముషాలుంది.

 

    తన భర్త వచ్చే టైమ్ కావడంతో తమ నాటకానికి తెరలాగడానికి సమాయత్తమైంది.

 

    కొంతసేపటికి భర్త వచ్చినట్టు పసికట్టింది.

 

    శ్రీపతి బూట్లు వరండాలో వదిలి ఆమెను పిలిస్తూ బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.

 

    ఆమె కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తోంది.

 

    భార్య ఇంకా సాయంకాలం నిద్ర నుంచి లేవలేదనుకుని ఆయన బట్టలు మార్చుకున్నాడు.

 

    వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపాడు. తనో కప్పు తీసుకుని, మరో కప్పుతో చిత్ర దగ్గరికి వచ్చాడు.

 

    "చిత్ర... చిత్రా" మెల్లగా పిలిచాడు.

 

    అప్పుడే మెలకువ వచ్చినట్టు ఆమె దిగ్గున లేచి కూర్చుంది.

 

    "ఎప్పుడొచ్చారు" అని అడిగింది కళ్ళు నులుముకుంటూ.

 

    "ఇప్పుడే వచ్చాను. ఇదిగో కాఫీ" అని ఓ కప్పును అందించాడు. ఆమె దానిని తీసుకుని చాలా మనోహరంగా నవ్వింది.

 

    అతను ఆ నవ్వును చూసి కాస్తంత బెదిరాడు. ఆమె ఆకర్షనీయమైన రూపం అతన్ని ఎప్పుడూ కలవరపెడుతూంది. గుర్రున స్వారీ రానివాడు పంచకళ్యాన్ని గుర్రాన్ని ఎక్కవలసి వస్తే ఎలా వణికిపోతాడో అలా వుంటుంది అయన పరిస్థితి.

 

    భర్తను చూసి మరోసారి నవ్వింది. సెక్స్ లో ముంచి లేపినట్టున్న నవ్వును చూసి శ్రీపతి కంగారుపడ్డాడు.

 

    "అవునండీ! మొద్దునిద్ర... ఇప్పుడే మెలకువ వచ్చింది"

 

    "కాఫీ తాగు ఫ్రెష్ గా వుంటుంది"

 

    చిత్ర లేచికూర్చుని కప్పు అందుకుంది.

 

    "మీరూ కూర్చోండి. కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం."

 

    శ్రీపతికి అక్కడ కూర్చోవడం ఇష్టం లేకపోయినా కూర్చున్నాడు.

 

    ఇక నాటకం మొదలు పెట్టాలనుకుంది చిత్ర. ఎంత వీలైతే అంత త్వరగా రాయుడు మెప్పు పొందాలని ఆమె ఆరాటపడుతోంది-

 

    "ఏమిటోనండీ ఈమధ్య సరిగా నిద్రపట్టడం లేదు. భయంగా వుంటోంది. మన ఇంటి వెనకనున్న రైల్వే క్వార్టర్స్ లో రాత్రి దొంగలు పడ్డారు. వస్తువులు ఎత్తుకుపోవడమే కాకుండా ఇంటిల్లిపాదినీ చావబాదారట" అప్పుడే విన్నట్టుగా అన్ని రసాలు అభినయిస్తూ చెప్పింది చిత్ర.

 

    "నిజమా!"

 

    "అవునండీ! అప్పటినుండి నాకూ భయంగా వుందండీ"

 

    "ఛీ! భయమెందుకు? మనింటికి దొంగలు రావడానికి ఎంత ధైర్యం? జెయిలు సూపరింటెండెంట్ అంటే మాటలా?"

 

    "మీరలా అనుకుంటూ వుండండి. ఎప్పుడో ఒకప్పుడు మీరు ఇంట్లో లేని సమయంలో దొంగలుపడి నన్ను చంపి మొత్తం ఇంటినంతా వూడ్చుకుని పోతారు. ఆ తరువాత తీరిగ్గా ఏడవండి" ఆమె కళ్ళల్లో నీళ్ళు వూరి కిందకు దూకడానికి ప్రయత్నిస్తున్నాయి.  

 

    చిత్ర ఏడ్వడంతో ఆయన కంగారు పడిపోయాడు.

 

    "ఛీ ఛీ! ఆ కన్నీళ్ళేమిటి? ఏదో ఒకటి ఆలోచిస్తాలే కావాలంటే రాత్రిపూట ఎవరో ఒక గార్డుని ఇక్కడ కాపలా వుంచుతాలే" అన్నాడు అనునయిస్తున్నట్టు.

 

    "మీ గార్డులు ఎందుకు పనికొస్తారు నిద్రపోవడానికి తప్ప. గార్డులు ఒద్దులెండి ఎవరైనా బలమైన ఖైదీని మనింట్లో పనికి కుదర్చండి. ఇది కలికాలం పగలుకూడా ఇళ్ళల్లో దొంగలు దూరుతున్నారు."

 Previous Page Next Page