Previous Page Next Page 
జైలు పేజి 25


    ఈమె రెండోసారి చచ్చిపోతానంటోంది. రెండేళ్ళ క్రితం ఇదే రోజు మొదటిసారి చచ్చిపోయిందట. అంటే ఈమె చచ్చిపోయి తిరిగొచ్చింది. అయితే తాను ఇంతవరకు మాట్లాడింది ఒకసారి చచ్చిపోయి, రెండోసారి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్న ఆమెతోనా! అంటే దెయ్యం...

 

    అంతకంటే వూహించలేకపోయాడు.

 

    అక్కడినుంచి ఎలా లేచాడో, ఎలా పరుగులంకించుకున్నాడో ఆయనకు తెలీదు.

 

    మరోక్షణంలో ఆయన కాలేజీ గేటుదాటి రోడ్డుమీద వగర్చుకుంటూ పరుగెడుతున్నాడు.

 

    ఇక పదిరోజులు ఇటు రాడని అనుకుంటూ పైకి లేచింది లాలస. వెనుక సీటులోనున్న తాడును, టార్చ్ నీ తీసుకుంది.

 

    సరిగ్గా అప్పుడు టైమ్ ఒంటిగంట.  

 

                               *    *    *    *

 

    కొన్నిగంటలపాటు కదలకుండా నీళ్ళలో వుండడంవల్ల తిలక్ కి. బుద్ధుడికి, ఉత్తరుడికి ఒళ్ళంతా పట్టేసింది. శరీరానికి పెయింట్ రాసుకున్నట్టు చర్మం బిగుసుకుపోయింది.

 

    రాత్రంతా భోజనం లేకపోవడం వల్ల ఆకలి చిట్టెలుక పేగులను తూట్లు పొడుస్తోంది. దాహమేసినప్పుడు మాత్రం నోటిని ముంచి నీళ్ళు తాగుతున్నారు.

 

    అప్పుడప్పుడు బూట్ల శబ్దం మళ్ళీ మళ్ళీ వచ్చే పీడకలలా లీలగా వినిపిస్తోంది. అవయవాలన్నీ అరవాకొరవాగానే పనిచేస్తున్నాయని వాళ్ళకు తెలుస్తూనే వుంది.

 

    ఎప్పుడు కరెంట్ ఆగిపోతుందా బయటకు ఉరుకుదామా అన్న ఆతృత క్షణక్షణానికి ఎక్కువవుతోంది.

 

    ముగ్గురూ ట్యాంక్ కంతకు నుంచి లోపల పడుతున్న వెలుగునే చూస్తున్నారు. గుండ్రంగా ముడుచుకు పడుకున్న తెల్లటిపాములగా కనిపిస్తోంది వెలుగు. చీకటి కొరడా ఝళిపిస్తే తప్ప అది మాయమయ్యేటట్టు లేదు.

 

    ఇంతకీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా అన్న సందేహం తిలక్ ను పీడిస్తూనే వుంది. అదే సమయంలో అన్నీ సవ్యంగా జరుగుతాయన్న నమ్మకమూ కలుగుతోంది.

 

    టైమ్ ఒంటిగంట అవుతూ వుండవచ్చు. లాలస ఈసరికి రడీగా కాలేజీ దగ్గరుంటుంది. టెర్రస్ మీదున్న లైట్ ఆరిపోగానే ఆమె కాంపౌండ్ వాల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడున్న గార్డు కళ్ళల్లో పడకుండా కిందకు దిగాలి.

 

    ప్రహారీగోడకు, జెయిలుకీ మధ్యనున్న సందు మరీ చిన్నది కావడంతో ఆ తరువాత పైనున్న గార్డుకు తాము కనపడే అవకాశం లేదు. జెయిలు చుట్టూ తిరిగే వార్డరు వచ్చేలోపు తాము గోడ దూకెయ్యాలి.

 

    ఇంతకీ లాలస వచ్చి వుంటుందా? ఏ కారణం వలన తను రిస్క్ తీసుకుంటోంది. తమను రక్షించాక ఆమె వెళ్ళిపోతుందా? లేకుంటే తమతోనే వుండిపోతుందా? ఆమెను గురించి ఆలోచించడం ఎందుకో బావుంటోంది అతనికి.

 

    అంత చలాకీగా వున్న ఆమె కళ్ళల్లో ఏదో విషాదం గూడు కట్టుకుపోయింది. ఏమిటది? తన గురించి ఎలా తెలుసుకుంది?

 

    లేక ఇదంతా ఒట్టి నాటకమేనా? రూపాయి రాయుడు మరోసారి తనను ఫూల్ ను చేయడానికి పంపించాడా? తను ఆమెను గుడ్డిగా నమ్మి కష్టాలలో ఇరుక్కుపోతున్నాడా?

 

    తిలక్ ఆలోచనలు విరామం లేకుండా సాగిపోతున్నాయి.

 

    తాము తప్పించుకుపోవడం ఖచ్చితమని తోస్తోంది బుద్ధిడికి. తిలక్ మీద అంత గొప్ప నమ్మకం ఏర్పడిపోయింది అతనికి. పథకం ప్రకారం అన్నీ సవ్యంగా జరిగిపోతూ వుండడం కూడా అతని భరోసాకి కారణం.

 

    టైమ్ సమీపించిందని రడీగా ఉండమని విక్టరీ సైన్ చేశాడు తిలక్. ఉత్తరుడు సర్దుకున్నాడు. నీళ్ళు చిన్నగా కదిలి ఆగాయి.

 

    ముగ్గురూ వెలుగుపడుతున్నచోటే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. అలా ఎంతసేపున్నారో తెలియదు. కరెంట్ ఆఫ్ కాలేదు. ఆశ నిరాశల మధ్య వాళ్ళు కొట్టుకుంటున్నారు.

 

    కొంతసేపయ్యాక ఎవరో మెట్లెక్కుతున్నట్టు శబ్దం వినిపించింది.

 

    ముగ్గురూ వూపిరి బిగపట్టారు.

 

    ఆ వచ్చిన వార్డర్ ని చూసి గార్డు కదిలినట్టు దగ్గరగా బూట్లు చప్పుడు చెవులను రిక్కరించారు.

 

    వార్డర్ గార్డుతో వున్నాడు. "ఈరోజు మాతోపాటు మీకూ జాగారమే. మామూలుగా అయితే మీకీ డ్యూటీ వుండదుగా. ఎంచక్కా రూమ్ లో నిద్రపోతుండే వాళ్ళు"

 

    "అవును. వాళ్ళు తప్పించుకుని మనల్ని శిక్షిస్తున్నారు. ఇంతకీ ఏమైంది? ఏమైనా సమాచారం తెలిసిందా?" గార్డు అడిగాడు.

 

    "ఇంకా ట్రేస్ చేయలేదట. సూపరింటెండెంట్ మహా హైరానా పడిపోతున్నాడు."

 

    "దొర ఇంటికెళ్ళలేదా?"

 

    "లేదు. ఆఫీసులోనే గబ్బిళంలా వేలాడుతున్నాడు."

 

    "ఇంతకీ టైమ్ ఎంతైంది?"

 

    "రెండు దాటుతోంది?"

 

    ఒక్కసారిగా తమ చెవులు పగిలిపోయి పనిచేయనట్టు చెవిటి వాళ్ళయిపోయారు తిలక్, బుద్ధుడు, ఉత్తరుడు.

 

    ఎక్కడో శిఖరం మీద నుంచి మంటల లోయల్లోకి పడిపోతున్నట్టు ఫీలయ్యారు.

 

    టైమ్ రెండు దాటిందని తెలియగానే గుండె ఆగి, తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది ఉత్తరుడికి.

 

    ఇక కరెంట్ ఆగిపోదేమోనన్న అనుమానం రాగానే బుద్ధుడు కూడా జావ కారిపోతున్నాడు. లోపల్నుంచి దుఃఖం తన్నుకొస్తుంది.

 

    లోపలపడుతున్న వెలుగు తనను వెక్కిరిస్తున్నట్టే వుంది తిలక్ కి. అతికష్టం మీద మరో నాలుగు గంటల గడిచాయి. కరెంట్ ఆఫ్ కాలేదు. తూర్పు తెల్లబారింది. సూర్యకిరణాలు టైంకి లోపలకు దిగుతుంటే బిగ్గరగా ఏడ్చాడు ఉత్తరుడు.

 

    కాపలా కాస్తున్న గార్డు ఓ క్షణంపాటు ఉలిక్కిపడి, అంతలో తేరుకుని ట్యాంక్ వైపుకు పరుగెత్తాడు. లోపలున్న ముగ్గురుకి తుపాకీ గురిపెట్టి పైకి రమ్మన్నట్టు సైగ చేశాడు.

 

                                  *    *    *    *

 

    తిలక్ పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిసినప్పట్నుంచి రాయుడు దెబ్బతిన్న పులిలా తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. తిలక్ తనపై పగసాధించి తీరుతాడనే నమ్మకం క్షణక్షణానికి ఎక్కువవుతోంది. అయితే ఇవేమీ బయటికి కనపడకుండా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

 

    ఎదురుగ్గా కూర్చున్న చిత్ర జరిగిందానికన్నా. జరగబోయే దాన్ని గురించే ఎక్కువ ఆలోచిస్తోంది.

 Previous Page Next Page