Previous Page Next Page 
ఉషోదయం పేజి 26

    వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఫోన్ నెంబరు లొకేట్ చేస్తే అది మెహదీపట్నంలో వున్న పబ్లిక్ టెలిఫోను. పోలీసు బృందం ఆ టెలిఫోన్ బూత్ నడుపుతున్న వ్యక్తి బిత్తరపోయాడు పోలీసులని చూసి. అరగంట క్రితంనించి ఎవరెవరు వచ్చి ఫోన్ చేశారు? ఎక్కడికి చేశారు లాంటి అన్ని వివరాలు సేకరించారు. ఫోన్ లో రిజిష్టరైన నెంబర్లు చూస్తే అందులో ఇరవై నిమిషాల క్రితం నారాయణమూర్తి గారింటికి చేసిన నెంబరుంది.
    "ఇదిగో, ఈ నెంబరుకి ఎవరు కాల్ చేశారో చెప్పగలవా! ఇరవై నిముషాల క్రితం ఎవరొచ్చారో గుర్తుచేసుకో" ఇన్ స్పెక్టర్ అడిగినదానికి అయోమయంగా చూశాడు. పోలీసులని చూసి భయపడిపోయాడు అతను.
    "గుర్తులేదు సార్. ఉదయం నించి కనీసం ఇరవైమంది చేసుంటారు ఫోన్లు. ఏదో వస్తుంటారు పోతుంటారు మేం పట్టించుకోం..."
    "ఆలోచించు... కారులో వచ్చాడా, స్కూటరా, సైకిలా... ఎత్తు, లావు, రంగు... ఏదన్నా గుర్తుకురావచ్చు ఆలోచించు..." ఇబ్బందిగా చూశాడతను.
    "కారులో అయితే ఎవరూ రాలేదు. స్కూటర్లో కూడా. ఉదయం ఏడుగంటలకొకరొచ్చారు. తరువాత సైకిలు, నడిచి వచ్చినవారే వున్నారు... ఆ టైములో నేను పేపరు చదువుకుంటూ అసలు ఎవరినీ సరిగా గమనించనే లేదు సార్... ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాల్సిన విధంగా ఎవరూ కనబడలేదు."
    "వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఇక్కడ కూర్చున్ననీకేం వినబడదా!" మధ్యలో గాజుతలుపు పార్టిషన్ వుంది. అవతల పక్క ఫోన్లు, ఇటు ఓ టేబిలు, కుర్చీ యజమానివి వున్నాయి.
    "తలుపులు మూసుకోకపోతే అప్పుడప్పుడు కొన్నిమాటలు యధాలాపంగా వినబడినా మాకేం ఇంట్రెస్ట్ వుంటుంది! పట్టించుకోం సార్... తలుపులు మూసుకుంటే అసలు వినబడదు సార్..." వివరించాడు. ఇన్ స్పెక్టర్ లోపలికి వెళ్ళి మాట్లాడితే వినబడటం లేదని సౌంజ్ఞ చేశాడు బూత్ యజమాని.
    "ఎవరినన్నా బెదిరించే మాటలు, కిడ్నాప్ గురించి వార్నింగులు అసలు అలాంటి మాటలు వినబడే ఛాన్స్ లేదన్నమాట."
    "లేదు సార్" వినయంగా అన్నాడు.
    ఇంక అతన్ని ఏమి అడిగినా లాభం లేదనిపించింది. ఆఖరికి రూపురేఖలైనా కాస్తయినా గమనించినా ఏదైనా ఆధారం దొరికేది. ఒక్కక్షణం ఆలోచించి "రేపు ఉదయం... పదిగంటలకి ఓసారి పోలీస్ స్టేషన్ కి రా."
    "ఎందుకు సార్! నేనేం చేశాను సార్."
    "భయపడకు. మేము కొంతమంది ఫోటోలు చూపిస్తాం, అందులో ఎవరినన్నా చూసిన గుర్తు వుందేమో చూద్దాం... నీకేం ఫరవాలేదు అరగంట పని, వచ్చి వెళ్ళు" భుజం తట్టి ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు.
    పోలీసులకి ఏవిధమైన క్లూ దొరకడంలేదు.
    నారాయణమూర్తిగారికి మనోవ్యధతో పాటు జ్వరం హెచ్చి ఆ రోజంతా మూసిన కన్ను తెరవలేదు. లలితమ్మ ఎంత బతిమలాడినా ఎంగిలి పడలేదు. తల్లిదండ్రులని చూసి బాధపడడం మినహా ఏంచెయ్యలేక నిస్సహాయంగా కూర్చుంది శారద.
    ఉదయం ప్రకాష్ వచ్చి మామగారితో మాట్లాడి వెళ్లాడు. అనుమానితులుగా ఎవరిమీదన్నా కంప్లయింట్ ఇవ్వడానికి తమ దగ్గిర ఏ సాక్ష్యాధారాలూ లేవు. వారు బెదిరించి వుండచ్చు అన్న ఆలోచన తప్ప వారే తప్పక ఈ పని చేశారని పోలీసులని, కోర్టుని నమ్మించదగ్గ ఏ చిన్న ఆధారమూ లేదు. పోలీసులే అనుమానితులుగా వారిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించే హక్కు వుంటుంది. కానీ ఇది మామూలు చిల్లర సామాన్య మనుషుల విషయం కాదు. వేయబోయే ప్రతి అడుగూ ఆచితూచి వెయ్యాలి... కాస్త ఇటూ అటూ అయితే మధ్యన తాము ఇరుక్కుంటామని పోలీసుల భయం.
    కాని ముఖ్యమంత్రి డి.ఐ.జి.కి కేసు డీల్ చెయ్యడానికి ఇచ్చిన స్వేచ్ఛ వారికి ప్రోత్సాహాన్నిచ్చింది. డిపార్ట్ మెంట్ హెడ్స్ అందరూ కూర్చుని బ్యాంక్ డిఫాల్టర్ల లిస్టు తయారుచేసి అందరినీ అనుమానితులుగా మామూలుగా విచారణ జరపాలని నిర్ణయించారు. నేరం చేసినవాడు అంగీకరించడు. సాక్ష్యాధారాలు ఏమీ దొరకనపుడు అసలు అంగీకరించడు. కానీ విచారణలో ఏ చిన్నపోరపాటుమాటైనా దొర్లచ్చు... ఏ చిన్న క్లూ అన్నా దొరకచ్చు... నేరం చేసినవాడి తడబాటు కళ్ళల్లో పసిగట్టే అనుభవం పోలీసులకుంటుంది.
    కేసు కాస్తయినా ముందుకెళ్ళాలంటే వారితో మాట్లాడక తప్పదని నిర్ణయించారు. పెద్ద పేరున్న ఘరానా మనుషులు కనుక మామూలు ఇన్ స్పెక్టరు స్థాయికాక ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విచారణకి ఆదేశం ఇచ్చాడు డి. ఐ. జి.
    అనుకున్నట్టే ఒక్కొక్కరిని కలిసి వివరణ కోరి విచారణ మొదలుపెట్టగానే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు అందరూ.. మేం దోషులుగా నిర్ణయించేముందు ఆధారాలు చూపాలని. తమకీ న్యాయస్థానం రూల్స్ తెలుసని, పోలీసుల హక్కులు ఎంతవరకు వున్నాయో తెలుసని, దబాయించారు... ఆగ్రహించారు. జావాబు చెప్పడానికి నిరాకరించారు.
    అనుమానితులుగా నారాయణమూర్తిగారిచ్చిన కంప్లయింట్ మేరకు విచారించే హక్కు పోలీసులకుందని దయచేసి సహకరించాలని ఎస్.పి. రంగారావు కోరారు.
    తమ లాయర్లతో సంప్రదించాలని కొందరు, తమకేం తెలీదని, తాము అసలా టైములో ఊళ్ళోనే లేమని కొందరు వాదించారు. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నలకీ సమాధానం ఇవ్వలేదు. వారిచ్చిన జవాబులో ఏ చిన్నపాటి క్లూగానీ, అనుమానాస్పదమైన ఆధారంగాని పోలీసులకి దొరకలేదు.
    పబ్లిక్ టెలిఫోన్ బూత్ యజమానికి పోలీసులు తమ దగ్గరున్న రౌడీషీటర్లు, దొంగతనాలు, దోపిడీలు చేసి జైళ్ళకెళ్ళిన వారు, అల్లర్లు రేపేవారి ఫోటోలు మొత్తం తమ దగ్గిరున్న ఫైలు ఫోటోలు అన్నీ చూపి, ఎవరినైనా చూసిన గుర్తుందా అని విచారించారు.
    అసలు మనిషి మొహమే నే సరిగా చూడలేదు. పేపరు చదవడంలో మునిగాను అంటూ మళ్ళీ చెప్పాడు. ఊళ్ళో వున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ ల వారికి పోలీసులు వచ్చి ఫోన్ చేసినవారి వివరాలు రిజిష్టరులో నమోదు చెయ్యాలని, అనుమానితులుగా వుండే ఎవరినైనా సరిగా గమనించి గుర్తుపెట్టుకోవాలనీ... వారి మాటలు ఏమైనా వినగలిగి సందేహాస్పదంగా వుండే అలాంటి మాటలు మాట్లాడిన వారిని గుర్తించి వెంటనే పోలీసులకి తెలియచెయ్యాలని ఆదేశాలు వెళ్ళాయి.

 Previous Page Next Page