నీరద కిడ్నాప్ కి గురై మూడురోజులు దాటినా పరిశోధన అరంగుళం కూడా కదలలేదు. నారాయణమూర్తిగారికి జ్వరం తగ్గినా పక్కమీదనించి లేవలేనంత డీలా పడిపోయారు. శారద ఎంత ధైర్యం చెప్పినా ఆయన తన అశ్రద్ధ వల్లనే అలా జరిగిందని వాపోయేవారు.
ఈ మూడురోజుల పేపరు బయటికి తీసుకురావటానికి శ్రీనివాస్ ఒక్కడే శ్రమ పడాల్సి వచ్చింది. తాము కలెక్ట్ చేసిన కథల ప్రచురుణ ఆపకుండా కొనసాగిస్తూనే వున్నారు... "సార్! పేపరాఫీసుకి మనం పోలీసు ప్రొటెక్షన్ కోరితే మంచిదనిపిస్తోంది. దుండగులు ఏ దౌర్జన్యం అన్నా చేస్తే అడ్డుకునే శక్తి మనదగ్గిరలేదు... ముందుజాగ్రత్తగా ప్రొటెక్షన్ కోరదాం" అన్న శ్రీనివాస్ సూచనకి నారాయణమూర్తి అంగీకరించి డిపార్ట్ మెంట్ సాయం కోరారు. వెంటనే రాత్రింబగళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పోలీస్ డిపార్ట్ మెంట్.
కేసులో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదన్న వార్తలు చదివి "నీరదని వదలాలి. ఉషోదయం పేపరుకి న్యాయం జరగాలి, ప్రభుత్వం త్వరితంగా నీరదకేసు పరిష్కరించాలి" అంటూ బ్యాంక్ ఉద్యోగులు, డిపాజిటర్లు మళ్ళీ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.
పోలీసుల అసమర్థతని ఎత్తిచూపుతూ అల్లర్లు సృష్టించడంతో పోలీసులు సంకట పరిస్థితిలో పడ్డారు. డి. ఐ. జి. కి ముఖ్యమంత్రినించి ఫోను వచ్చింది. కేసులో పురోగతి లేనందుకు ఆయన తన అసంతృప్తిని వెలబుచ్చారు.
"ఏ చిన్నపాటి క్లూ కూడా లభ్యం కాలేదు సార్.. పెద్ద మనుషులని కారణం లేకుండా కేవలం అనుమానంతో ఎలా అరెస్ట్ చేయగలం సార్..."
"ఏమో ఏం చేస్తారో. ఎల్లుండినించి అసెంబ్లీ మొదలవుతోంది. ప్రతిపక్షాల ప్రశ్నలకి జవాబు లేదు మన దగ్గిర..." ముఖ్యమంత్రి అసహనంగా అన్నాడు.
"మా పరిశోధన మరింత తీవ్రం చేస్తాం సార్..." అప్పటికి తప్పించుకున్నాడు ఐ. జి.
* * *
మళ్ళీ ఫోనుకూడా రాకపోవడంతో నీరద పరిస్థితి ఏమిటి అన్నది ఎవరి ఊహకీ అందడం లేదు. ఇది డబ్బుకోసం చేసిన కిడ్నాప్ కాదు. ఫోన్ చేసి డబ్బు తీసుకుని ఫలానా చోటికి రమ్మంటే వల వేసి పట్టుకోవడానికి... ఫోనువస్తే పబ్లిక్ టెలిఫోన్లని అప్రమత్తం చేశారు కనుక ఈసారి ఏ చిన్న క్లూ అన్నా దొరకకపోదా అన్న పోలీసుల ఆశ నిరాశ అయింది.
ఊళ్ళో మొత్తం సుమోల వివరాలు సేకరించారు. ఏ విధమైన అనుమానాస్పదమైన క్లూలూ లభించలేదు. అంటే పై ఊరికి సంబంధించిన టాటా సుమో అయివుండచ్చు... ఆ ప్రయత్నమూ ఫలించలేదు.
నీరద కిడ్నాప్ అయిన ఐదోరోజున ఆఖరికి ఎదురు చూస్తున్న ఫోను వచ్చింది... ఇన్ స్పెక్టర్ వెంటనే రికార్డ్ మెషిన్ ఆన్ చేశాడు. ఏదో నెల్ నెంబరు 92తో ఆరంభించిన ఫోను టాటా ఇండికామ్ ది. నారాయణమూర్తిగారు ఆరాటంగా ఫోనందుకున్నారు.
"సో, నీకు నీ కూతురు కంటే నీ పత్రికే ముఖ్యం అన్నమాట.. ఇంకా నీ కథలు ఆపలేదు పత్రికలో. పోలీసులు మమ్మల్నేం చేయలేరు అన్నది తెలిసింది కదా... నీ కూతురు గతి ఏమైందో ఊహిస్తూ వుండు.
"ఏయ్, ఆగు. నీకు నామీద కోపం. నా కూతురేం చేసిందని దాన్ని హింసిస్తారు.."
"నీ కూతురేగా ఇది మొదలెట్టింది. నీ కూతుర్నేమన్నా చేస్తే గదా నీకు బాధ కలిగేది..."
"ప్లీజ్... ఆమెని వదిలేయండి... ఇంక ఆ కథలు ఆపేస్తాం" స్వభావానికి విరుద్ధంగా దిగజారి దీనంగా అన్నారు.
"ఈ బుద్ధి ముందే వుంటే ఇది జరిగేదికాదు. జరగవల్సిన డామేజ్ జరిగాక ఇంక నీవేం చేసినా మాకేమిటి... చేసినదానికి శిక్ష అనుభవించు..." ఫోన్ క్లిక్ అయింది.
వెంటనే హెడ్ క్వార్టర్స్ కి మెసేజ్ అందింది. ఫోన్ నెంబరు ట్రేస్ చేయడానికి పోలీసు బృందం రంగంలోకి దిగింది. టాటా ఇండికామ్ రిజిష్టర్ లో ఆ నెంబరు సెల్ ఫోను అడ్రసు పట్టుకున్నారు. అట్టహాసంగా పోలీసుబృందం ఆ అడ్రసుకి వెళ్ళింది. ఆ నెంబరు ఎల్. వంశీకృష్ణ అనే యువకుడిది. అతనో బట్టలషాపులో సేల్స్ మేన్. పోలీసులని చూసి బిత్తరపోయాడు. షాపులో అంతా భయం భయంగా చూశారు. షాపు యజమాని గాభరాపడి లేచాడు.
"నీ సెల్ ఫోను ఏది?" ఇన్ స్పెక్టర్ గద్దించి అడిగాడు ఉపోద్ఘాతం లేకుండానే.
"పోయింది సార్... ఇందాకే పోయింది సార్" భయంగా అన్నాడు.
"రాస్కెల్, అబద్దాలాడకు. కావాలనే పారేశావా, ఫోన్ చేశాక దొరికిపోతానని..."
తెల్లమొహం వేశాడు వంశీకృష్ణ.
"నిజం చెప్పు. ఇందాక ఈ నెంబరుకి ఫోన్ చేశావా లేదా... అరగంట క్రితం నీ సెల్ నించి ఈ నెంబరుకి బెదిరిస్తూ ఫోను చేశావు..." ఇన్ స్పెక్టర్ అతని కళ్ళల్లోకి చూశాడు.
"నేనా, నా సెల్ ఫోన్ ఎవరో కొట్టేశారు సార్, నేనెలా ఫోన్ చేస్తాను" అమాయకంగా అన్నాడు.
షాపు యజమాని ముందుకు వచ్చి "అవును సార్! మావాడు బ్యాంక్ లో డబ్బు కట్టడానికి వెళ్ళాడు. ఫోను పోయిందని పాపం గోలెడుతున్నాడు సార్... అతను డబ్బు డ్రా చేసి లెక్కపెట్టుకుంటూ సెల్ పక్కన పెట్టాడట... లెక్క పూర్తి అయ్యేసరికి ఫోన్ లేదట. పక్కన ఎవడో కొట్టేశాడని గోలెడుతూ వచ్చాడు ఇందాకే.."
వంశీకృష్ణ మొహంలో నిజాయితీ కనిపించింది. అతన్ని అనుమానించడానికి ఆధారం ఏదీ కనబడలేదు. కిడ్నాపర్స్ చాలా తెలివిగా, దొంగిలించిన సెల్ ఫోన్ నించి మాట్లాడారు,పబ్లిక్ బూత్ నించి ఈసారి మాట్లాడితే పట్టుబడతామన్న భయంతో.
వెంటనే టాటా ఇండికామ్ వారికి ఆ నెంబరునించి ఏ కాల్ వచ్చినా, ఎవరికి వెళ్లినా ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ అన్నీ ట్రేస్ చేయమని ఆర్డరు వెళ్ళింది. ఆ ఫోను నెంబరుకి ఎన్నిసార్లు రింగ్ చేసినా స్విచ్ ఆఫ్ చేసిన మెసేజ్ రాసాగింది. ఆ ఫోన్ నెంబర్ కి కూడా ఏ కాల్స్ వెళ్ళలేదు. ఆ సెల్ నెంబరు అబ్జర్వేషన్ లో పెట్టమని కోరాడు ఇన్ స్పెక్టర్.
ఉదయం రోడ్డు తుడిచేవారికి ఆ సెల్ ఫోను చితకకొట్టబడి పోలీసు స్టేషన్ గేటుముందు దొరికింది. సెంట్రీ రోడ్డు ఊడిచేవారి మాట విని ఆ సెల్ ఫోన్ తీసుకుని చూసి, వెంటనే ఇన్ స్పెక్టర్ కి మెసేజ్ అందించాడు. ఆ వున్న చిన్న క్లూ కూడా నాశనం అయింది అనుకున్నాడు ఇన్ స్పెక్టర్ నిస్పృహగా.