లలితమ్మకి నిద్రమాత్ర పాలలో కలిపి ఇచ్చి పడుకోబెట్టింది శారద.
ప్రకాష్ వెళ్ళాలో వద్దో తేల్చుకోలేక అసహనంగా కూర్చున్నాడు.
"మీరింటికి వెళ్ళండి. ఇక్కడుండి చేసేదేం లేదు గదా, రేపు పోలీసులతో మాట్లాడాలి కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి" అంది.
"నీవు రావా" అన్నాడు సందేహంగా.
"నేనా, ఈ పరిస్థితిలో ఎలా వస్తాను..."
"మరి రాహుల్... స్కూలు" గొణిగాడు.
"అత్తయ్యగారు చూసుకుంటారు లెండి. చాలా రాత్రయింది మీరు వెళ్ళండి."
"బాబూ, శ్రీనివాస్! రా, కాస్త పెరుగన్నమైనా తిందువుగాని..." అతనికి బలవంతంగా అన్నం పెట్టింది. ఇద్దరూ రాత్రంతా ఫోన్ కాల్ కోసం చూస్తూ కూర్చున్నారు.
శ్రీనివాస్ చాలా డీలాపడిపోయాడు. "అక్కా... నీరదకేం కాదుగదా" బేలగా అడిగాడు. శారద అతని చెయ్యి ఆప్యాయంగా నొక్కింది. నీరద, శ్రీనివాస్ ల మధ్య పెరుగుతున్న అనుబంధం అందరికీ ఆమోదయోగ్యమైనదే!
* * *
మర్నాడు పత్రికలలో, టీవీలలో వార్తలలో నీరద కిడ్నాప్ గురించి ప్రముఖంగా చిత్రీకరించారు. 'ఉషోదయం' పేపరు బ్యాంకుల స్కాముల గురించి పెద్దమనుషుల గుట్టు బయట పెట్టినందుకే ఈ కిడ్నాప్ జరిగిందని... ఇందులో ఎవరి హస్తం వుందో ఊహించడం కష్టం కాదని పత్రికలన్నీ ఏకధాటిగా ప్రచురించాయి.
పోలీసులు ఈ కేసుని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పరిశోధిస్తున్నారని వార్తలు వచ్చాయి. బ్యాంకు ఉద్యోగులు, డిపాజిటర్లు పేపరాఫీసుముందు తమ వత్తాసు పలికి నారాయణమూర్తి గారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. తామందరూ వారి వెనుక వున్నామన్నా భరోసా అందించారు. పేపరులో రాసినందుకు ఇంత కక్షకట్టి ఇలాంటి దారుణం చేసినా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ నిలేశారు జనం.
నీరద కిడ్నాప్ వార్త హైదరాబాద్ నే కాక మొత్తం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ప్రభుత్వం అలక్ష్య వైఖరే కారణమని, అలాటి ఘరానా మనుషులకి అండదండగా ప్రభుత్వం వుండబట్టే అంత సాహసం చేయగలిగారని ప్రతిపక్షాలు గవర్నమెంటుని దుయ్యబట్టాయి. ముఖ్యమంత్రికి సంకట పరిస్థితి వచ్చింది.
చట్టం తన పని తాను చేస్తుంది, పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని... నేరస్థులు ఎవరైనా న్యాయస్థానం శిక్షిస్తుందని ముఖ్యమంత్రి స్టేట్ మెంట్లు గుప్పించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వయంగా జోక్యం చేసుకుని కేసుని త్వరితగతిని పరిష్కరించాలని ఆర్డర్ వేశారు. నారాయణమూర్తి వూళ్ళో పెద్దమనిషి... ఆయన చేతిలో పేపరుంది... పత్రికలు, ప్రజలు అంతా ఆయన పక్షం వున్న తరుణంలో తాము చూస్తూ ఊరుకుంటే ప్రతిపక్షం ఇది పెద్ద ఇష్యూ చేస్తుందని ప్రభుత్వానికి తెలుసు. ప్రెస్ ని మంచి చేసుకోకపోతే జరిగే చేటు తెలుసు. అంచేత ముఖ్యమంత్రి స్వయంగా నారాయణమూర్తికి ఫోనులో సానుభూతి ప్రకటించి ప్రభుత్వం అన్నివిధాలా సహరిస్తుందని హామీ ఇచ్చారు.,
శ్రీనివాస్ నారాయణమూర్తిగారు ఆఫీసుకెళ్ళి పత్రిక పనులు చూడమని, పత్రిక ఆగకూడదని, తాము సిద్ధం చేసుకున్న మేటరు ఆపకుండా వేయమని ఆదేశం ఇచ్చి ఆఫీసుకి పంపారు.
"అక్కా! ఏదన్నా ఫోను వస్తే..."
"ఆ మాట నీవు చెప్పాలా... వెళ్ళు. నీ పని నీవు చూసుకో. నేను ఈరోజు ఇక్కడే వుంటాలే..." అంది శారద. అత్తగారికి ఫోను చేసి కొడుకుని స్కూల్ కి తయారుచేసి పంపమని, ఈరోజు ఇక్కడే వుంటానని చెప్పింది.
"వాడి విషయం నేను చూసుకుంటాను. అన్నీ నేను చూసుకుంటాను. ఈ సమయంలో నీవక్కడ వుండాలి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో" అంది సత్యవతి.
"ప్రకాష్ ని ఆఫీసుకి వెళ్ళేముందు ఓసారి వచ్చి వెళ్ళమనండత్తయ్యా. నాన్న ఏదో మాట్లాడాలంటున్నారు."
"అలాగే..." అంది సత్యవతి. శారద ఫోన్ పెట్టగానే మళ్ళీ ఫోన్ మోగింది. ఇన్ స్పెక్టర్ ఫోన్ తీయబోతున్న శారదని ఆగమని సౌంజ్ఞ చేసి రికార్డు బటన్ నొక్కాడు. ఏ కాల్ వచ్చినా ఆ జాగ్రత్త తీసుకోమని ఆర్డర్ వుండడంతో ప్రతి ఫోనుకి ముందు రికార్డు బటన్ నొక్కాకే ఫోన్ ఎత్తమన్నారు. శారద ఫోన్ ఎత్తేసరికి అవతలినించి మగగొంతు...
"పోలీస్ రిపోర్టు, పోలీస్ బందోబస్తు అన్నీ ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన నీ కూతురిని కాపాడగలననుకుంటున్నావా... నీవు చేసిన పనికి శిక్ష నీ కూతురు అనుభవించబోతోంది. చూసుకో ఆమెకి ఏ గతి పట్టిస్తామో..."
"మీరెవరు? ఏం కావాలి... అన్యాయంగా నీరదని ఎందుకు తీసుకెళ్ళారు? మీకేం కావాలో చెప్పండి. ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తాం. ఆమెని వదిలిపెట్టండి. ప్లీజ్" అంది శారద.
"వదిలిపెట్టాలా... ఆహాహా... ఏం? మేం పత్రికలో రాతలు ఆపమని మూడుసార్లు రిక్వెస్ట్ చేస్తే విన్నారా? మా పరువుతో చెలగాటం ఆడిన మీ కుటుంబం అంతు చూడకుండా వదలం. ఇది మొదటి స్టెప్... ఇంకా ఎన్నో సర్ ప్రైజ్ లు. కాసుకోండి."
"అంటే మీరు అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన పెద్ద మనుషులేనన్నమాట. ఇదంతా చేయించింది... మాకేదో కీడు చేస్తే మీరూ శిక్షించబడతారన్నది గుర్తెరగండి. ఇంకా పోలీసులు, న్యాయస్థానాలు పనిచేస్తూనే వున్నాయి దేశంలో... మీరు ఏం చేసినా మీ డబ్బుతో తప్పించుకోగలమనుకోకండి... ఇంకా కొద్దో గొప్పో న్యాయం, ధర్మం మిగిలే వున్నాయి లోకంలో... నేరం చేసినవాడు ఎప్పటికైనా శిక్షింపబడతాడు అన్నమాట ఇప్పటికీ వుంది."
"ఆపండి మేడమ... మీ సూక్తులు వినడానికి ఫోన్ చెయ్యలేదు. ఏ పోలీసులు, ఏ చట్టాలు మీ అమ్మాయిని కాపాడలేవు అని మరోసారి హెచ్చరిస్తున్నాం" ఫోన్ కట్ అయింది. ఇన్ స్పెక్టర్ నెంబర్ నోట్ చేసుకుని హెడ్ క్వార్టర్స్ కి సమాచారం తెలిపాడు.