Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 25

   

    కొంతమందిని చూస్తే కుమార్ కు ఆశ్చర్యంగా వుంటుంది. అతని బంధువుల కుటుంబం ఒకటుంది. వలలు ఎనమండుగురు అన్నదమ్ములు. అందులో నాలుగోవాడు మినహా అందరూ ఉద్యోగస్తులు లేదా ఏదో వృత్తిని స్వీకరించిన వాళ్ళు అతనికంటే చిన్నవాళ్ళు చక్కగా వేళప్రకారం ఆఫీసులకీ, ఉద్యోగాలకూ వెళ్ళిపోతుంటే ఇతను ఇంట్లో కూర్చుని పెళ్ళాం బలహీనంగా వున్నదని టిఫిను సరిగ్గా తినమని బలవంతం చేయటమో, పిల్లలకు వేన్నీళ్ళు కాగాయోలేదో అని క్షణక్షణానికీ తనిఖీ చేస్తుండటమో, లేకపోతే "పిల్లలు-వారి ఆరోగ్యం" గురించి కాలాన్ని వెచ్చిస్తుండటమో చేస్తూండేవాడు. ఇంట్లో కూర్చుని ఉద్యోగాలకు అప్లికేషన్ ఫారమ్స్ పూర్తిచేసి పంపిస్తూండేవాడు. "ఎంత ప్రయత్నం చేసినా రావటంలేదు. ఏంచెయ్యను?" అనేవాడు ఇంట్లోంచి కదలకుండా, ఆరునెలలకోసారి మాత్రం తిరుపతి కొండకు వెళ్ళి గుండు చేయించుకొస్తుండేవాడు.
   
    అయితే భాస్కరం ఇంకోరకం. ఇతరులచేత పోషింపబడటం తన హక్కన్నట్లుగా అతను ప్రవర్తిస్తాడు. అతను పాత ఉద్యోగం వదిలి, కొత్త ఉద్యోగం నెపంతో ఈ ఊరు వచ్చేసరికి జేబులో రెండురూపాయల కంటే ఎక్కువలేవు. అయినా అతనిలో భయమున్నట్లు లేదు. నిర్దాక్షిణ్యంగా బావగార్ని అడిగి పుచ్చుకుంటున్నాడు. 'బావగారూ! ఓ పదివ్వండి, బావగారూ! అయిదివ్వండి' అని సొంతజేబులోంచి వాడుకున్నంత ఫ్రీగా కుమార్ నడిగి పుచ్చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎలా నిరాకరించాలో తెలియని కుమార్ అతను పది అడిగితే ఆరిచ్చీ, ఆరడిగితే నాలుగిచ్చీ, చాలా చాతుర్యంగా ప్రవర్తించానని మురిసిపోతున్నాడు. భాస్కరం బట్టలు లాండ్రీకేస్తే ప్రభావతి డబ్బులిచ్చి తెస్తున్నది. అతను లుంగీలు లేవని అందంగా వాపోతే లుంగీలు కొనిపెట్టింది. బనీన్లు చిరిగిపోయాయని పదేపదే గుర్తుచేస్తే బనీన్లు కొనిపెట్టింది. క్షవరం చేయించుకోవడానికి డబ్బుల్లేవని అల్టిమేటమ్ ఇస్తే డబ్బులిచ్చి క్షవరం చేయించుకోవటానికి తోడ్పడింది.
   
    భాస్కరం ఉనికినేమీ కుమార్ హర్షించటంలేదు. అతని ప్రతిచర్యా కుమార్ కి అసహ్యంగానే వుంది. అతను ఉద్యోగ ప్రయత్నమంటూ ఎక్కడెక్కడో తిరిగి మధ్యాహ్నం రెండుగంటల వేళ ఇంటికివస్తే, ఏం చేయాలో తెలియని ప్రభావతి అన్నకి అన్నం పెడుతుంటే ఆ సమయానికి అప్పటికే నిద్రముగించి లేచిన తండ్రి ప్రక్కహాల్లో పేపరు చదువుకుంటుంటే, విమల అప్పటికి వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద మామగారికి కాఫీ ప్రయత్నాలు చేస్తుంటే ఆ దృశ్యాలను చూసిన కుమార్ కి కంపరంగా వుండేది. తండ్రి నోరువిప్పి బయటికెళ్ళు అనలేదుగానీ ఏదో తప్పుచేసినట్లు కుమార్ తల్లక్రిందులైపోతుండేవాడు. తండ్రి అనవచ్చు, అనకపోవచ్చు. కానీ తనని గుచ్చిగుచ్చి ఏదో అన్నట్లే ఉండేది.
   
    ఈరోజు ఉదయం పెద్దకొడుకు మురళి చాటుగా, ఎవరికంటా పడకూడదన్నట్లు ప్రయత్నంచేస్తూ బయటకు పోవటంచూసి తను ఎక్కడికిరా అని అడిగాడు.
   
    వాడు ఈ ప్రశ్న అడిగించుకోవటం ఇష్టంలేదన్నట్లు ముఖంపెట్టి సైలెంటుగా నిలబడ్డాడు.
   
    "ఏరా! ఎక్కడికంటే మాట్లాడవేం?"
   
    కుమార్ ఒకటికి రెండుసార్లు నొక్కి నొక్కి అడిగేసరికి మురళికి చెప్పక తప్పలేదు.
   
    "మామయ్యకి సిగరెట్లు కావాలిట. కిళ్ళీకొట్టుకు వెళ్ళి తీసుకురమ్మన్నాడు" అన్నాడు. తనేదో వీరోచిత కార్యానికి దోహదంచేస్తున్న తృప్తి వాడిముఖంలో కనిపించింది.
   
    పైగా 'బర్కిలీ సిగరెట్లు తెమ్మన్నాడు. ప్యాకెట్' అన్నాడు మళ్ళీ మురళి.
   
    కుమార్ కి తల తిరిగినట్లయింది. తన కొడుకుచేత అతను సిగరెట్లు తెప్పించటమా? ఒళ్ళంతా కారం రాసినట్లయింది. పైగా తన కొడుక్కి సిగరెట్ల పేర్లుకూడా నేర్పిస్తున్నాడు.
   
    "ఏం అక్కర్లేదులే నోరుమూసుకుని పడుండు" అని అరుద్దామనుకున్నాడు. పిల్లలమీద అరవటానికి అతనికేం అభ్యంతరం లేదుగానీ భాస్కరం వింటాడని మొహమాటపడ్డాడు.
   
    "ఏం చేద్దామా? మురళిని కసిరి లోపలి పంపించేద్దామా? లేకపోతే ఈసారికి తీసుకురా ఇంకెప్పుడైనా అడిగితే మా నాన్నగారు కోప్పడుతారని చెప్పు" అందామా అని ఆలోచిస్తుంటే లోపల్నుంచి సుధాకర్ వచ్చాడు.
   
    "ఏమిటన్నయ్యా? మురళీగాడేమైనా అల్లరి చేస్తున్నాడా?" అనడిగాడు.
   
    కుమార్ మెల్లిగా జరిగిన విషయం చెప్పాడు.
   
    సుధాకర్ వెంటనే విజ్రుంభించాడు. "అభం శుభం తెలీని పిల్లలకు ఇలాంటి పనులు చెబుతాడా? అతనికేమయినా కామన్ సెన్స్ వుందా? ఉండు, పైకి పోయి నాలుగు కడిగేసి వస్తాను" అంటూ ముందుకు ఉరకబోయాడు.
   
    కుమార్ తమ్ముడ్ని భుజంపట్టుకుని ఆపాడు "మన ఇంట్లో అతిధిగా వున్నాడురా అతనితో దెబ్బలాడితే బాగుండదు. నువ్వేమనకు" అన్నాడు అతని ఉద్రేకాన్ని చల్లబరచడానికి ప్రయత్నిస్తూ.
   
    "కొన్ని విషయాలు అతిధులకు తెలియకపోతే చెప్పటం మనవిధి అన్నయ్యా! కొందరు తమ ఇళ్ళల్లో బజారులో తిరిగివచ్చిన బూట్లు, చెప్పులతో వంటిళ్ళలో తిరగవచ్చు. ఇంకొకరి ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాచేస్తే ముఖంమీద చెప్పాలి. వాళ్ళకు తెలుసుకునే జ్ఞానం లేనప్పుడు చెప్పటం చాలా అవసరం" అని "పోన్లే, నీకు కష్టంకలిగించే పని చేయను" అని మురళిని దగ్గరకు పిలిచి "ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులుచేస్తే మా బాబాయి తోలు వలిచేస్తాడని చెప్పు. పో" అన్నాడు.
   
    మురళి డబ్బులు పట్టుకుని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయాడు.
   
    అన్న, తమ్ముడు నిముషంసేపు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుని నెమ్మదిగా లోపలకు వెళ్ళిపోయారు.
   
    అతనంటే ఆప్యాయత లేకుండా, అతని మాటల్లో అభిరుచి అంతకంటే లేకుండా అతని మాటల్ని వింటున్నాడు కుమార్.
   
    తను ఈ జిడ్డునుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. తన పలుకుబడి ఉపయోగించి సాధ్యమైనంత తొందరగా అతనికి ఉద్యోగం ఇప్పించటం.
   
    తన ఇష్టం వచ్చినంతసేపు సంభాషణలో వీరవిహారం చేసి, చివరకు క్లయిమాక్సు అయిపోయినట్లు తనే ఫీలయి "పాపం, మీకు నిద్ర వస్తున్నట్లుంది. పడుకోండి" అని అక్కడ్నుంచి లేచి ప్రక్కగదిలోకి వెళ్ళిపోయాడు.
   
    నిద్రపోవాల్సిన సకాలం దాటిపోగా కుమార్ తర్వాత కాసేపు ప్రయత్నించినా నిద్రపట్టక విసుగుదలతో క్రిందకు వచ్చాడు.
   
    ఆకాశం మబ్బు మబ్బుగా వుంది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
   
    ముందు గదిలోకి వచ్చేసరికి తండ్రి ఎవరితోనో ఘర్షణపడటం కనిపించింది.
   
    ఎవరో ఇద్దరు మనుషులు గుమ్మం అవతల నిలబడి వున్నారు. గళ్ళలుంగీలు వేసుకుని, బనీనుతో వున్నారు. పొట్టి క్రాఫింగులూ, మొరటు మొహాలతో చూడటానికి గూండాలలా కనిపిస్తున్నారు.
   
    వాళ్ళ చేతిలో ఏవో కాగితాలు వున్నాయి.
   
    "పండక్కి ఉత్సవం చేసి రధాన్ని ఊరేగిస్తానంటే డబ్బులియ్యకపోతే ఎలా బాబూ! మీలాంటివాళ్ళియ్యకపోతే ఎవరిస్తారు? కృష్ణమూర్తిగారు పది రూపాయలిచ్చారు. సుబ్బారావుగారు అయిదు రూపాయలిచ్చారు. మీరు పెద్ద డాక్టర్లయివుండీ యియ్యకపోతే ఎలాబాబూ?" అంటున్నాడు అందులో ఎత్తుగా, బలంగా వున్నవాడు.
   
    అతను మాట్లాడుతుంటే నోట్లోంచి నాటుసారా వాసన గుప్పుమని వస్తోంది.
   
    అతన్ని ఆ వాడకట్టులో చాలాసార్లు చూశాడు కుమార్. అతనికి రౌడీగా కూడా పేరువుంది. అతనికో చిన్న గ్యాంగు, ఫాలోయింగు వగైరాలన్నీ వున్నాయి. అడపాదడపా తాగటం, ఒకర్ని బాదటంలాంటిది చేస్తుంటాడు కాబట్టి ఆ చుట్టుప్రక్కల కుటుంబీకులందరికీ అతనంటే కొంత భయంకూడా.

 Previous Page Next Page