Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 25

    బోసుబాబు బయలుదేరంగానే, మళ్ళీ లక్ష్మణమూర్తి బయలుదేరాడు.

    ఆ యింటి దగ్గరకి రాగానే, లక్ష్మణమూర్తి కాళ్ళు అప్రయత్నంగా ఆగిపోయాయి.

    "బోసుబాబు యిక్కడ వుండి ఏం చేశాడు? ఇక్కడ ఏమైనా వస్తువు పెట్టి వెళ్ళాడా? వెళ్ళి చూస్తే?" ఆ మాట అనుకోగానే రెండు అంగల్లో గుమ్మం దగ్గరికి చేరాడు లక్ష్మణమూర్తి.

    లక్ష్మణమూర్తి అంచనా తప్పుకాలేదు.

    గుమ్మానికి వున్న మెట్లకి ప్రక్కగా, కోడిగుడ్డంత సైజు ఏదో వస్తువుపెట్టి ఉంది. దానికి చిన్న తోకకూడా వుంది. చూడగానే ఎండిపోయిన ఏదో కాయలాగా కానవస్తున్నది. కానీ, దాని ఆకారం మాత్రం అచ్చం చిన్న నాటుబాంబులాగా ఉంది.

    ఇప్పుడది తీసికెళ్లాలా? అక్కడే వుంచాలా?

    ఒక్క నిముషం తటపటాయించాడు లక్ష్మణమూర్తి. అతని గుండెలు శరవేగంతో కొట్టుకున్నాయి, కానీ దానిని చేత్తో ముట్టుకునే సాహసం మాత్రం చెయ్యలేదు.

    తను తర్జన భర్జన పడుతూ నేలకి కొట్టిన మేకులాగా ఇక్కడే నిలుచుంటే అవతల తమ్ముడు మాయమవుతాడు. ముందు అక్కడ తమ్ముడు కనుమరుగవుతాడు. వాడి వెనుక వెళ్లటం మంచిది, లక్ష్మణమూర్తి తిరిగి నడక సాగించాడు.

    అప్పటికి బోసుబాబు ఆ సందు మలుపు తిరుగుతున్నాడు.

    లక్ష్మణమూర్తి అడుగుల వేగం హెచ్చించి ఆ సందులోకి ప్రవేశించేసరికి, దూరంగా ఓ యింటిముందు బోసుబాబు నుంచొని చేతులు తిప్పుకుంటూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

    కానీ. ఎదుటి మనిషి మాత్రం కనపడటంలేదు.

    బహుశా ఆ యింటి తాలూకా ఆడో, మగో తలుపు తీసి గుమ్మం అవతలే నిలుచుని వుండి వుంటారు. అందువల్ల అవతలి మనిషి కనిపించడం లేదు.

    బోసుబాబు పిడికిలి బిగించి అరచేతిలో కొట్టుకుంటూ, మధ్య మధ్య కొట్టినంత పని చేస్తూ ఏదో మొత్తానికి పోట్లాటలాగా అనిపిస్తోంది.

    లక్ష్మణమూర్తి దూరంగా ఉండటంవల్ల బోసుబాబు కనిపిస్తున్నాడు. గానీ బోసుబాబు మాటలు వినిపించటంలేదు.

    అలా బోసుబాబు అక్కడ నిలుచుని, రెండు నిమిషాలు పైనే మాట్లాడటం జరిగింది. ఆ తరువాత బోసుబాబు తను తెచ్చిన చిన్నబాగ్ తెరిచి దాన్లోంచి ఏదో తీసి, ఆ యింట్లో వాళ్ళకి అందించాడు.

    ఆ తరువాత.

    మళ్లీ బ్యాగ్ ని చంకలో పెట్టుకుని ముందుకు సాగాడు.

    వెనుక లక్ష్మణమూర్తి బయలుదేరాడు.

    తనని ఎవరైనా అనుసరించి వస్తున్నారన్న నమ్మకం బోసుబాబుకి లేనట్లుంది. అతను దిక్కులు చూస్తూ టైమ్ వృధా చెయ్యటం లేదు, తన పని తను కానిచ్చుకుని, ముందుకి సాగిపోతున్నాడు.

    ఆ యింటి దాకా వచ్చిన లక్ష్మణమూర్తి కాళ్ళు టకీమని ఆగిపోయాయి. ఇప్పుడు ఈ యింటి తలుపులు వేసివున్నాయి. పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్ బోర్డు తలుపుకి తగిలించబడి వుంది. ఎ.వి. అవతారమూర్తి బి.ఎ.బి.ఎల్.

    ఆ అడ్వకేట్ పేరు చదవంగానే, ఆ లాయరు ఎవరో గుర్తుకు వచ్చాడు లక్ష్మణమూర్తికి. ఎ.వి. అవతారం అనే ఆయనకి మంచిపేరు లేదు.

    ఈయన క్లయింట్ లందరూ దొంగలూ, హంతకులూ, నేరస్తులూ లుచ్చా వెధవల్ని రక్షింపటానికి ఈయన లాయరు అయ్యాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేపట్టిన ప్రతికేసూ లుచ్చా కోరులని రక్షించేవే.

    ఈ విషయం లక్ష్మణమూర్తికి బాగా తెలుసు.

    ఇంక అక్కడ ఆగి చేసేదేమీ కనపడక మళ్లీ తమ్ముడి వెనుకనే ఫాలో కావడం మొదలుపెట్టాడు.

    లక్ష్మణమూర్తి ఆలోచనలు పరిపరి విధాల సాగుతున్నాయి. 

    ఏదన్నా కేసు అయితే పగలు కలుసుకుని మాట్లాడతారు. అర్దరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లు ఇప్పుడు ఆయన్ని కలుసుకోవటం ఏమిటి? దీనిని బట్టి ఇది మరోరకం కేసేమో అనిపిస్తోంది.

    బోసుబాబు అయినా యింట్లోకి వెళ్ళలేదు. వాకిట్లోనే మాట్లాడి వెళ్ళిపోయాడు. అది కూడా మాట్లాడినట్లుగా లేదు. పోట్లాడినట్లు వుంది.

    బోసుబాబు బ్యాగ్ లోంచి ఏదోతీసి ఇవ్వటం జరిగింది.

    ఆ యిచ్చింది ఏమిటి?

    అది చాలా చిన్న జిప్ బ్యాగ్ కాబట్టి, దానిలో వస్తువులు పెద్దవి కావటానికి లేదు. ఏదో చిన్న వస్తువులే దానిలోంచి తీసి యివ్వడం జరిగింది.

    ఆ వస్తువు ఏమిటి?

    బోసుబాబు కానిపనులు కానరాకుండా చేస్తున్నాడన్నది. ఈ రెండు చర్యలతో అర్ధమయింది. ఆ కానిపనులు అన్నవి మాత్రమే యింకా పూర్తిగా తెలియలేదు. ఏ రహస్యమూ ఎల్లకాలమూ దాగదు. ఎప్పుడో అప్పుడు బయటపడి తీరుతుంది.

    బోసుబాబు కర్మకాలి, ఈ రోజు అన్న కంటపడ్డాడు.

    మరో నాలుగిళ్ళు దాటిన బోసుబాబు ఓ యింటి దగ్గర ఆగి, జిప్ బ్యాగ్ తీశాడు. దానిలో వస్తువు తీసి తెరిచివున్న కిటికీలోకి పోనిచ్చి, ఆ వస్తువుని అక్కడ జారవిడిచి మళ్లీ తలవంచుకుని వడివడిగా ముందుకి సాగాడు.

    లక్ష్మణమూర్తి ఆ యింటి దగ్గరకు వచ్చి ఆగాడు.

    అది పాతకాలం నాటి పెంకుటిల్లు, నేమ్ బోర్డులాంటిది ఏమీ ఆ యింటికి లేదు. తలుపు మీద సినిమా యాక్టరు బొమ్మ మాత్రం అతికించివుంది. క్రింద కిటికీలు వేసి వున్నాయి. పైన కిటికీ తలుపులు మాత్రం తీసి వున్నాయి. సామాన్యులు వుండే యిల్లులాగా వుంది ఆ యిల్లు.

    తెరిచివున్న కిటికీలోంచి, బోసుబాబు ఆ యింట్లో పడేసింది ఏమిటి?

    ఆ వీధిలో పనయిపోయినట్లు, వీధి మలుపు తిరిగేశాడు బోసుబాబు.

    బోసుబాబు వీధి మలుపు తిరిగిన దాకా, ఆగి అప్పుడు ఆ యింటి దగ్గర నుండి బయలుదేరాడు లక్ష్మణమూర్తి.

    వీధి చివరికి వెళ్ళి బోసుబాబు తిరిగిన వీధిలోకి తొంగి చూశాడు.

    బోసుబాబు ఆ వీధిలో ఏ ఇంటి ముందన్నా ఆగి గాని, ఎవరితోనన్నా మాట్లాడుతున్నట్లుగాని ఆనవాలు లేదు.

    ఆ వీధిలోకి తిరిగిన బోసుబాబు హఠాత్తుగా మాయమయ్యాడు.

    వీధి సన్నగా చాలా పొడుగ్గా ఉంది. ఆ వీధికి అడ్డసందులు లేవు. ఈ కొద్దిసేపటిలో ఎంత త్వరగా నడిచినా వీధి సగంలో వుండాల్సిందే కానీ వీధి చివరికి చేరలేడు....

    ఈ మాట అనుకున్న లక్ష్మణమూర్తి వీధి మొదట్లోనే గోడవారగా ఆగిపోయి మళ్లీ ఆలోచించటం మొదలుపెట్టాడు.

    "బోసుబాబు ఈ వీధి దాటి వెళ్ళలేదన్నది ఖాయం. ఏ యింటిలోనో దూరి వుంటాడు. తను పరిశోధన చెయ్యటానికి ముందుకి సాగితే, ఏదో ఒక యింటిలోంచి బోసు బయటకి వచ్చాడంటే తనని చూడటం ఖాయం. తను రహస్యంగా బోసుని అనుసరించి వచ్చాడు.

    బోసు తనని చూస్తే ఎంతమాత్రం బాగుండదు. అన్నయ్య తన వెనుకనే వచ్చి పత్తేదారు పని చేస్తున్నాడని కోపగించుకుంటాడు. అపార్ధం చేసుకుంటాడు. లేక మరేమయినా చెయ్యవచ్చు.

 Previous Page Next Page