Previous Page Next Page 
మరోమనసు కథ పేజి 24

    "మీరామెతో మాట్లాడారా?"
   
    "ఆమెతోనే మాట్లాడుతున్నాను. ఆమె ఎలా రియాక్టు అవుతుందో నని ఆలోచిస్తున్నాను" అని అనలేదు తనలోతనే అనుకున్నాడు.
   
    "ఏమిటాలోచిస్తున్నారు?"
   
    ఉలిక్కిపడ్డాడు కృష్ణ.
   
    సుధ తన మనసును చదివేస్తూంది. ఆమెకు ఈపాటికి అంతా అర్ధమయే వుంటుంది.
   
    ఐనా__
   
    "మాట్లాడరేం? ఆమెతో మాట్లాడారా?"
   
    "లేదు, ఇంకాలేదు." తడబడ్డాడు కృష్ణ.
   
    "ఆమె ఎక్కడుందీ?"
   
    "ఇక్కడే!"
   
    "ఇక్కడా?" సుధ కనురెప్పలు మూతపడలేదు.
   
    "అదే....అదే....ఈ ఊళ్ళోనే-"
   
    "ఆమె భర్త ఏం చేస్తూంటాడూ?"
   
    "మా ఆఫీసులోనే-"
   
    "ఆమె భర్త ఒప్పుకున్నాడు. అతనే భార్యతో మాట్లాడొచ్చుగా? మధ్యలో మీకెందుకూ?"
   
    "అవునవును! అడగొచ్చు! కాని అతనికి ధైర్యం చాలడంలేదు. ఆమె ఒప్పుకోకపోతే ఎలాగ అని సందేహిస్తున్నాడు."
   
    సుధ బిగ్గరగా నవ్వసాగింది.
   
    కృష్ణ కంగారుగ సుధకేసి చూశాడు.
   
    "అలాటి భర్తతో ఆమె ఇంకా కాపురం చేస్తుందనుకుంటున్నారా? మాజీ ప్రియుడిదగ్గిరకు పంపిస్తానంటున్న భర్త కాళ్ళకు మొక్కి ప్రియుడి దగ్గిరకు వెళ్ళిపోవడమో, లేదా ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడమో చేస్తుంది. అంతేకాని ఆ మొగుడితో మాత్రం కాపురం చెయ్యదు." సుధ మాట్లాడుతూంటే సుధ కళ్ళల్లోకే చూస్తూ నిలబడ్డాడు కృష్ణ.
   
    సుధ నిర్ణయం ఏదో అతనికి అర్ధమైనట్టే ఏముందీ ఆమె ప్రేమ ఫలించినప్పుడు? అతన్ని వివాహం చేసుకొని హాయిగా ఉండొచ్చుగా? తనకు దూరమైనా బిడ్డ మళ్ళీ ఒళ్ళోకి చేరుతుంది. ఏ తల్లికైనా అంతకంటే కావాల్సిందేముంటుంది?"
   
    "ఆడదాని మనసు మీకు తెలియదు. మగవాడు ఆడదాని తరపున తనే ఆలోచిస్తాడు. తన నిర్ణయమే ఆమె నిర్ణయంగా ఆమె నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తాడు. స్త్రీ తరపున పురుషుడు ఆలోచించడం మానేస్తే స్త్రీ సమస్యలు ఎన్నో వాటంతటవే పరిష్కారం అవుతాయి."
   
    "ఓ.కె. నీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఈ సమస్యకు పరిష్కారమార్గం ఆలోచించు."
   
    "నేనా?"
   
    "అవును. నువ్వే ఆలోచించి చెప్పాలి."
   
    "నన్నామె దగ్గిరకు తీసుకెళతారా?"
   
    మురళీకృష్ణ కలవరపడ్డాడు.
   
    కథ మళ్ళీ మొదటికొచ్చింది.
   
    తనామెను అంతా అర్ధమైపోయిందనుకుంటున్న దశలో, తనకూ, ఈసమస్యకూ అసలు సంబంధమే లేనట్టుగా మాట్లాడుతోంది. స్త్రీ మనసులో ఏదీ దాగదంటారు, అంత అబద్దం. స్త్రీ హృదయం పసిఫిక్ మహాసముద్రమంత లోతు! ఇహ తప్పదు, తను నేరుగా, సూటిగా చెప్పెయ్యాలి.
   
    "వెళదామా?" అంటూ సుధ గబగబా నడవసాగింది.
   
    తన కళ్ళలోకి చూస్తూనే తన నిర్ణయాన్ని పసికట్టింది. తనకా అవకాశం ఇవ్వకుండానే చరచరా ముందకు సాగిపోతున్నది.
   
    ఆలోచిస్తూ మురళీకృష్ణ ఆమెను అనుసరించాడు.
   
                                             16
   
    "ఏమిటమ్మా నువ్వంటున్నది? నేను నమ్మలేకపోతున్నాను."
   
    "నిజం అంకుల్! ఆయన మద్రాసునుంచి తిరిగొచ్చినప్పటినుంచీ ఇదే గొడవలో వున్నారు. మనసులో మనసున్నట్టులేదు. అంతా కథలు కథలుగా చెపుతున్నాడు. నిన్న గండిపేటలో....."
   
    "గండిపేట తీసుకెళ్ళాడా?" డాక్టర్ చౌదరి అదిరిపడ్డాడు.
   
    "అవునంకుల్."
   
    "ఇదివరకిలా తరచు వెళుతుండేవాళ్ళా?"
   
    "అంతకుముందు ఒక్కసారిమాత్రం వెళ్ళాం."
   
    "నాకు చెప్పకుండా ఇక నువ్వెప్పుడూ అలా వెళ్ళొద్దు" సాలోచనగా చెప్పాడు అంకుల్ చౌదరి.
   
    "అంకుల్ ఆఫీసులో ఆయన ప్రవర్తన...."
   
    "అబ్బే! అదేమీ లేదమ్మా! చాలా నార్మల్! మామూలుగా వుంటున్నాడు" సుధ మాట పూర్తి కాకుండానే అందుకొని చెప్పాడు చౌదరి.
   
    "ఐతే మరి వారితో బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారెందుకూ?" ఆమె గుండెల్లో ఏదో గుబులు గుబులుగా వుంది.
   
    "నువ్వు చెప్పినదాన్నిబట్టే నీకా సలహా ఇచ్చాను. కృష్ణలో ఏదో మార్పు వచ్చిందన్నావ్? తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడన్నావ్. అలాంటి మనిషితో చెరువులదగ్గిరకూ, రైలుకట్టలదగ్గిరకూ వెళ్లడం మంచిది కాదని అన్నాను."
   
    "అంటే కృష్ణకు...." సుధ కంఠం పూడుకుపోయింది.
   
    "అప్పుడే ఆ నిర్ణయానికి రావడం మంచిదికాదు అయినా...."
   
    "ఏం నిర్ణయం అంకుల్?"
   
    "మతిస్థిమితం లేదని మనం ఎలా నిర్ణయిస్తాం? ఓసారి సైకియాట్రిస్టుకు చూపిస్తే మంచిది."
   
    "నాకేదో భయంగా వుంది అంకుల్, నాన్నకు ఫోన్ చేసి పిలిపించండి" సుధ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
   
    "ఏం ఫర్వాలేదమ్మా! కంగారుపడకు. జయానాగరాజన్ ఎక్స్ ఫర్ట్ సైకియాట్రిస్టు. ఆమెగారికి ఓసారి చూపిద్దాం. భయపడకు. చాలా ప్రథమ దశలో వున్నాడు, తప్పకుండా నయమవుతుంది."
   
    డాక్టర్ చౌదరి మాటలు ఆమెకు విన్పించలేదు. కాళ్ళక్రింది భూమి కృంగిపోతున్నట్టుగా వుంది. ఇంటికప్పు గుండ్రంగా తిరిగిపోతున్నట్టుగా వుంది ఆమెకు.
   
    "సుధా! సుధా!"
   
    చౌదరి కంగారుగా సోఫాలోంచి లేచాడు. ఆమెను పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు.
   
    సుధ ముఖం పాలిపోయింది. పెదవులు వణికిపోతున్నాయి. ఏదో మాట్లాడాలని ప్రయత్నం, కాని సాధ్యం కావడంలేదు.
   
    "కృష్ణతో మాట్లాడతాను. రేపే సైకియాట్రిస్టును కన్సల్టు చేద్దాం. ఎవిరి థింగ్ విల్ బి ఓ.కే. డోంట్ వర్రీ బేబీ!" అనునయిస్తూ అన్నాడు చౌదరి.
   
    "నాన్నగారినికూడా పిలిపించండి" కళ్ళు తుడుచుకుంటూ అంది సుధ.
   
    "తప్పకుండా! రాత్రికే ఫోన్ చేస్తాను, రేపు మార్నింగ్ విమానంలో బయలుదేరి రమ్మంటాను. నువ్వు ధైర్యంగా వుండాలి. నే వస్తానమ్మా!" అంటూ చౌదరి లేచి నిలబడ్డాడు.
   
    "వారింకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారో ఏమో అంకుల్!" ఆలోచిస్తూ అంది సుధ.
   
    "ఆఫీసులోనే వున్నాడు, లాబ్ నుంచి రిజల్ట్సు వచ్చేదాకా వుండి చూసి రమ్మన్నాను, నేను ఇప్పుడు ఆఫీసుకే వెళుతున్నాను, నువ్వు అర్జంతుగా రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను."
   
    "అంకుల్ ఆయనగారితో ఏం మాట్లాడతారు? ఎలా మాట్లాడతారో నాకంతా భయంగా వుంది."
   
    "ఆ సంగతులు నాకు వదిలెయ్. నేను చూసుకుంటాగా! వస్తా!" అంటూ చౌదరి వెళ్ళిపోయాడు.
   
                                           17

   
    రాత్రి తొమ్మిదయినా మురళీకృష్ణ ఇంటికి రాలేదు. సుధ ఘడియలు లెక్కపెడుతూ వీధికేసి చూస్తూ వాకిట్లోనే నిలబడింది.
   
    అంకుల్ ఏం మాట్లాడారో? సైకియాట్రిస్టు దగ్గిరకు వెళ్ళడానికి ఆయన ఒప్పుకొన్నారా? ఆయన మానసికస్థితి ఎలా వుందో? ఇదంతా అంకుల్ తో చెప్పినందుకు తనమీద కోపంగా వున్నాడేమో?
   
    స్కూటర్ హెడ్ లైట్ కాంతి ముఖంమీద పడి సుధ కళ్ళు చిడత లారాయి.
   
    స్కూటర్ షెడ్ లో పెట్టి మురళీకృష్ణ మెట్లెక్కి వస్తున్నాడు.
   
    సుధ గుండెలు దడదడలాడిపోతున్నాయి.
   
    ఏమంటాడో?
   
    ఏం చేస్తాడో?... ....
   
    "నేను పిచ్చివాడినా?"

 Previous Page Next Page