Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 24


    అవంతి తీరు చూస్తుంటే కొరగాని కొయ్యలా అనిపించింది ఇందర్ కి. మంచి మాటలతో వినే రకంగా కనిపించలేదు. కిటికీ తలుపులు తియ్యటానికి ముందుకు వచ్చాడు.

    అవంతి అది గ్రహించి రెండంగల్లో కిటికీ దగ్గరకు చేరి కిటికీ కడ్డంగా నించుని ఏడ్పు మొదలుపెట్టింది.

    "అమ్మా! తల్లీ! నీ రూపానికి ప్రవర్తనకీ ఎక్కడా పోలిక పొంతన లేదు. నాకు ఏడ్పు అంటే చచ్చే చిరాకు. ముందా ఏడ్పు ఆపు. నా వల్ల నీకు భయం ఐతే చెప్పు. తలుపులు కిటికీలు బార్లా తెరిచి పెడతాను."

    "వద్దు వద్దు."

    ఇందర్ కి ఏదో అనుమానం వచ్చింది. "సరే తలుపు తెరవను. నీవు ఏడ్పు ఆపేసి నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి."

    "నాకు ఏడ్పు అంటే మా చెడ్డ చిరాకు. సరేనా?"

    "ఊ...."

    "నీవలా మంచంమీద కూర్చో, నేనిలా కుర్చీలో కూర్చుంటాను."

    "నేను నుంచుంటాను."

    "కూర్చుంటావా లేదా!" ఇందర్ ఒక్క గద్దింపు గద్దించాడు.

    అవంతి చటుక్కున ఇవతలికి వచ్చి మంచం చివరగా కూర్చుంది.

    "గుడ్ మంచి అమ్మాయి ఎప్పుడూ చెప్పినట్లు వింటుంది. ఇంక నేను అడిగే ప్రశ్నలకి జవాబులు చక్కగా చెప్పు" అంటూ ఇందర్ లోలోపలే నవ్వు దాచుకుని కుర్చీలో కూర్చున్నాడు.

    "అలాగే...." తలవంచుకొని నెమ్మదిగా అంది అవంతి.


                         *    *    *


    అవంతి ఆలోచించుకొని రెడీగా కూర్చుంది. ఇందర్ మీ అడగలేదు.

    ఇతడేమన్నా మూగనోము పట్టాడా ఏమిటి? అనుకుంటూ తలఎత్తి చూసిన అవంతి చూపులు కళ్ళార్పకుండా తననే గుచ్చి గుచ్చి చూస్తున్న ఇందర్ చూపుల్లో చిక్కుకుని క్షణకాలం గజిబిజి అయింది. అంతలోనే ఇరువురు తెలివి తెచ్చుకుని ముఖం పక్కకు తిప్పేసుకున్నారు.

    తను ఏ చిన్న పొరపాటు చేయకుండా చాలా సహజంగా నటించి అతన్ని నమ్మించాలి. చంద్రలాగా కాదు. చూస్తుంటే గురుడు చాలా గట్టివాడు లాగున్నాడు. తన్ని వాసన పసిగట్టాడో ఇంతే సంగతులు. కొత్త చిక్కులు ఎదురవుతాయి. తెలివిగా ఇక్కడ నుంచి తప్పించుకుంటే....

    "చంద్ర ఏమయ్యాడు?" మొదటి ప్రశ్న వదిలాడు ఇందర్.

    "ఎవరు?" అవంతి అమాయకంగా అడిగింది.

    "నా స్నేహితుడు ఈ ఇంట్లో వుండే అతను."

    "పేరు చంద్రా?"

    "ఆ...."

    "ఎక్కడికో వెళ్ళాడు."

    "నీతో ఏం చెప్పాడు?"

    "ఏమీ చెప్పలేదు."

    "ఎందుకని?"

    "ఏమో?"

    ఇందర్ కి వళ్ళు మండింది. ఈ పిల్ల నిజమే మాట్లాడుతున్నదా, నటిస్తున్నదా అనుకున్నాడు. "ఏంటీ, ఏమో, ఏమీ చెప్పకుండా ఎలా వెళ్ళాడు! నిన్ను లోపల వుంచి బైట తాళం వేసి ఎలా వెళ్ళాడు! ఎందుకు వెళ్ళాడు! ఏమో అని సమాధానం చెప్పావంటే వూరుకోను. ఏడ్చావంటే అసలు వూరుకోను. ఊ....ఏం జరిగిందో అంతా నీకే చెప్పు. నేనసలే మహా కోపిష్టిని. దుర్వాస మహాముని నా ముక్కు చివర కూర్చుని చాలా రోజులు తపస్సు చేశాడు. ఆ....ఆ....ఇంక చెప్పేసేయి."

    "మీరు కోప్పడకూడదు."

    "ఎబ్బే నోఇజం చెపితే నాకు కోపం రాదు. ముక్కుసూటిగా నిజం చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం."

    "మరి....మరి....నేను పరుగెత్తుకుంటూ వచ్చి...."

    "ఎందుకు?"

    "వరసగా చెప్పకపోతే నాకు గుర్తుండదు" అవంతి అంది.

    "మా తల్లే! నీకు మంచి లక్షణాలు చాలానే వున్నాయి" అనుకున్న ఇందర్ "సరేలే అడ్డు తగలను చెప్పు" అన్నాడు.

    "నేను పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి తలుపు గడియపెట్టాను. అప్పుడేమో ఈ గదిలో ఎవరూ లేరు. అక్కడ నుంచేమో ఈలపాట వినపడుతున్నది...."

    అవంతి చెపుతుంటే ఇందర్ కి కొద్దికొద్దిగా ఏదో అర్ధమయినట్లయింది. చంద్ర ఉషారుగా వున్నప్పుడు ఈలపాట పాడతాడని తెలుసు. "పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో ఎందుకు దూరావ్!" అని మధ్యలో అడ్డు తగిలితే ఈ పిల్ల చెప్పేది మర్చిపోయా నంటుందేమో అని ఇందర్ నోరు మూసుకుని వింటూ కూర్చున్నాడు.

    "నేను అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా నడుచి బీరువా చాటుకెళ్ళి దాక్కున్నాను. అప్పుడేమో ఓ అబ్బాయి స్నానం చేసి వచ్చాడు. నన్ను చూడలేదు. గబగబ పెట్టెలో బట్టలు సర్దుకుని వెళ్ళిపోయాడు.

    అవంతి చెపుతున్నది జాగ్రత్తగా వింటున్న ఇందర్ "ఆగాగు" అన్నాడు.

    ఎందుకో అర్ధంగాక అవంతి ఉలిక్కిపడి ఆగింది. 

 Previous Page Next Page