ప్రేమని బాహాటంగా ఎగ్జాగరేట్ చేసి చూపనవసరంలేదు.
ఎగ్జిబిట్ చేసినా చాలుగా.
అసలు ప్రేమకీ, ద్వేషానికీ వున్న తేడాని పెంచుకున్న జంతువులే పసికడతాయే! మరో ఆలోచించగల బుద్ది వున్న స్త్రీ ఇలాంటి జీవితాన్ని ఎలా భరించగలదు?
ధీర మాటలు, ఆమె ఆలోచనలు, ప్రవర్తనా ఇప్పుడు సహజంగా అనిపిస్తుంటే వెంటనే ఫోన్ రిసీవర్ అందుకుంది.
డయల్ చేసిన అరనిమిషంలోనే లైన్ లోకి వచ్చాడు తేజా.
" నేనే" బిడియంగా అంది ఆర్తి.
"థాంక్యూ!" అన్నాడు తేజా ఆర్తి కంఠాన్ని గుర్తుపట్టినట్టుగా.
"మీ గురించే అనుకుంటున్నా."
ఎంత గర్వం అనిపించిందని... ."నిజమా?"
"ఏం? నమ్మలేకపోతున్నారా?"
"అదికాదు తేజా! మీకు నాలాంటి అభిమానులు ఎందరో వుండగా నా గొంతుని వెంటనే మీరు గుర్తుపట్టగలగడం ఆశ్చర్యమేగా?"
"కొన్ని పరిచయాలు స్వల్పకాలంలోనే మనసుని చాలా రాపిడికి గురిచేస్తాయి మిసెస్ ఆర్తీ!"
తను ఇంత ప్రభావాన్ని చూపించగలిగిందా?
ఏం చేసిందని ఇంత ఆర్ద్రతని ధ్వనిస్తూ మాట్లాడుతున్నాడు?
"మీరు అందరితనూ ఇలానే మాట్లాడతారా?" నిర్మొహమాటంగా అనేసింది.
"కోపం వచ్చిందా?"
"కాకపోతే" క్షణం ఆగి అన్నాడు "నాకు మానసికమైన ప్రాబ్లం వున్నట్టు లెక్క."
నవ్వేసింది ఆర్తి. "అయితే సారీ! ఇప్పుడు చెప్పండి. మీరు నా గురించే ఆలోచించగలిగే గొప్ప పని నేనేం చేశాను?"
"ఈ ప్రపంచంలో ఒక మనిషి గొప్పతనాన్ని నిర్దేశించేది లాభాలను ఆసరా చేసుకుని ఎదగటం కాదు.. .నష్టపరిచే అనుభవాల అండతో పైకి సాగిపోవడం. ఎందుకంటే మొదటిది మూర్ఖుడైనా చేయగలడు కాబట్టి, రెండోది మేధావులకి మాత్రమే పరిమితమైన విషయం కాబట్టి ఇది 'విలియమ్ బోలితో' అన్న వాక్యాలు కదూ?"
"అవుననుకుంటా" అతడుదేన్ని వుద్దేశించి అలా అన్నదీ బోధపడింది.
"మీరు పంపిన గ్రీటింగ్ కార్డులో వున్న వాక్యాలు యివేగా?"
ఆర్తి మాట్లాడలేదు.
"మంచి కార్డ్ సెలెక్ట్ చేసి పంపారు. కానీ ఏ అకేషన్ దృష్టిలో పెట్టుకుని పంపారో నాకు అర్దంకాలేదు."
"మీ పరిచయమే గొప్ప అకేషన్ నాకు దక్కనప్పుడు నేనిక దేనికోసం ఆలోచించాలి?"
"థాంక్యూ" తేజా కంఠంలో నిట్టూర్పుతో బాటు అణువంత గర్వమూ ధ్వనించింది.
"ఇంతకాలానికి దక్కించుకున్నాను."
"ఏమిటి?"
"ఓ ఇంటెల్లెక్చువల్ కంపేనియన్ని."
ఆర్తి గుండె లయతప్పినట్లయింది. "నేనంత గొప్పదాన్ని కాదు."
"అని అంగీకరించకపోవడమూ గొప్పతనమే."
"ములగచెట్టు ఎక్కించేస్తున్నారు మాస్టారూ!"
"అయామ్ సీరియస్ నెస్ ఆర్తీ."
"మిసెస్ ఆర్తీ" గుర్తు చేసింది.
"మీరు పెళ్లయిన స్త్రీగా నాకు పదేపదే గుర్తుచేయనవసరం లేదు."
కిసిక్కున నవ్వింది. "కానీ కరెక్ట్ చేయడం తప్పుకాదే."
"కరెక్ట్ చేయాల్సినంత తప్పు నేనేం చేయలేదే?"
"మీకు వుడుకుమోత్తనం ఎక్కువ."
"అఫ్ కోర్స్! ఇష్టమైన వ్యక్తుల దగ్గర నేనిలా ప్రవర్తిస్తుంటాను."
ఆర్తి నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ అంది -
"మనం పాయింటు వదిలి చాలా దూరం వచ్చినట్టున్నాం."
"ఐ డోంట్ థింక్ సో."
"అదికాదు మహానుభావా! మీరు నాకో పజిల్ యిచ్చారు."
"ఓహ్ సారీ! మరిచిపోయాను- చెప్పండి... ఆ కవిత ఎందులోనిది?"
"చెబితే ఏమిస్తారు?"
"ఏం కావాలో చెప్పండి."
ఆర్తి నేత్రాలు ఆరాధనాభరితంగా మూలుకున్నాయి. "కాదనరుగా?"
"కాదనలేనిదే మీరు అడుగుతారన్న నమ్మకం వుంది."
"స్మైల్ ...అండ్ ఎవ్వర్ లాస్టింగ్ స్మైల్.....
అండ్ థేంక్యూ ఫర్ ఎవైల్
ఫరాల్ దట్ యూ హేవ్ డన్ ఫరజ్
వియ్ హేవ్ నౌ లెరంట్ టు స్మైల్.
బికాజాఫ్ యువర్ కన్ సర్న్ ఫర్ మీ."
"బావుంది."
"ఏమిటి?"
"కవిత."
"కానీ నేను అది చెప్పడంలో వుద్దేశ్యం మీరు కాదనకుండా చూపించాల్సిన కన్ సర్న్ గురించి" అందామె.
"అర్దం కావటంలేదు."
"డియర్ రైటర్" ఆర్తి మరికాస్త చనువుగా అంది. "మాలాంటి పాఠకుల దృష్టిలో రచయిత ఓ మేధావి... గైడ్ ...ఫిలాసఫికల్ ...మిమ్మల్ని చదువుతుంటాం... మీ నుంచి కొంత ఓదార్పునీ కోరుకుంటుంటాము అందుకే మీరు నాకోసం ఏమీ చేయనవసరంలేదు. మిమ్మల్ని అప్పుడప్పుడూ ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినా భరించి కాస్త టైం స్పేర్ చేయమంటున్నాను."
"అంతగా అర్దించాల్సిన అవసరంలేదు.. .నేను సిద్దం. అవునూ.... ఇదంతా దేని గురించి మాట్లాడుకుంటున్నాం."
ఆర్తి వెంటనే జవాబు చెప్పలేకపోయింది.