నిజంగా, నిండుగా ప్రేమించిన స్త్రీ ఇచ్చే అనుభవం, సుఖం ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది....
సాధారణంగా కోరుకున్నది లభించగానే దానిని మరిచిపోయి అందకుండా శేషంగా మిగిలిపోతున్న దాని గురించి అమితంగా ఆలోచించడం ఆరాటపడటం....మగవాళ్ళ లక్షణం....అది నీలో లేదు గనుక నేను నిన్ను వదులుకోటానికి సిద్దంగా లేను.
నీ కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించటానికయినా సిద్దమే....ఒక విషయాన్ని సాధించే ప్రయత్నంలో మగవాడే కాదు, స్త్రీ కూడా అంతకంటే పట్టుదలగా నిలవగలదని నేను నిరూపిస్తాను...." పట్టుదలగా అంది మాయాదేవి.
"అందుకు నేనే దొరికానా నీకు?" ఏడుపు ముఖం పెట్టి అన్నాడు మనోహర్.
ఆ మరుక్షణమే మిస్ మాయాదేవి చటుక్కున తడిదేరిన మనోహర కళ్ళని మృదువుగా ముద్దు పెట్టుకుంది.
"అదేమిటోనోయ్....నాకు నువ్వె దొరికావు....ఇక వాదనలొద్దులే! నువ్వు ఇంక ఇక్కడే ఉండి, అమాయకంగా ఏదేదో అడుగుతుంటే చూస్తూ నీకు దూరంగా నేను వుండలేను. కోరిక పుట్టినప్పుడు అదంటేనే తెలియనట్లుగా నరాల్ని తెంపుకోవడం నాకు ఇష్టం వుండదు.
ఒక అనుభవాన్ని కోరుకున్నప్పుడు, దాని అనుభూతి ఎంతటిదో స్త్రీ ఆలోచిస్తే....దాని మూలంగా ఎదురయ్యే లాభనష్టాల్నీ, కష్టసుఖాల్నీ మగవాడు ఆలోచిస్తాడుట....ఇక నన్ను ఒప్పించే ప్రయత్నం మానుకో. నా విలువ, నా ప్రేమ విలువ ఏనాటికయినా నీకు తెలియకపోదు.....కోర్టులో కలుసుకుందాం....బై...." అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని, ఇంటర్ కమ్ నొక్కి జనరల్ మేనేజర్ ని లోపలికి రమ్మని పిలిచింది మాయాదేవి.
ఇక ఆమెతో మాట్లాడి ప్రయోజనం లేదని ముఖం మాడ్చుకుని మనోహర్ బైటికి వెళ్ళిపోయాడు.
సరిగ్గా ఉదయం పదకొండు గంటల పదిహేను నిముషాలు.....స్పెషల్ కోర్టుగంట మోగింది!
ఆర్గ్యు మెంట్స్ ప్రారంభం కాబోతున్న విషయాన్ని తెలియజేస్తూ....
* * * *
లాయర్ మాలవ్య నేరుగా కోర్టుకే వస్తుందని తెలిసిన మనోహర్, ఆఫీసు ఫైల్స్ కట్టిపెట్టి కోర్టుకు వెళ్ళేందుకు బయలుదేరాడు.
సరిగ్గా టైంకి దుర్గాప్రసాద్ హడావిడిగా మనోహర్ క్యాబిన్ కి వచ్చాడు.
"ఏమిటీ? ఎక్కడికీ బయల్దేరుతున్నావు?" కంగారుపడుతూ అడిగాడు దుర్గాప్రసాద్.
"కోర్టులో ట్రయల్ నడుస్తోంది కదా....కోర్టుకెళ్ళాలి...అందుకే బయలుదేరుతున్నా...." అన్నాడు మనోహర్ హడావిడి పడిపోతూ.
"ఈ రోజుకోసం నువ్వు అప్లయ్ చేసిన లీవ్ ని పర్సనల్ ఆఫీసర్ రిజక్ట్ చేశారు. పైగా బ్యాంకుకు వెళ్ళే పనికూడా వుంది. కోర్టుకయినా, ఇంకెక్కడికయినా నువ్వు వెళ్ళటానికి ఒప్పుకోవడం లేదు పర్సనల్ ఆఫీసర్!" చెప్పాడు దుర్గాప్రసాద్.
కొద్ది క్షణాలు మనోహర్ మెదడు పనిచేయలేదు.
"ఇది ఖచ్చితంగా ఆ రాక్షసి పనే.....నేను నెగ్గకూడదనే ఉద్దేశ్యంతో నాకీరోజు లీవ్ శాంక్షన్ చేయవద్దని చెప్పి వుంటుంది పర్సనల్ ఆఫీసర్ కి.
మాట్లాడితే నేను రాసిన బాండ్ గుర్తుకుతెస్తారు. ఇక్కడ నేను బానిసనా? ఉద్యోగినా? లీవ్ పెట్టే హక్కు నాకు లేదా....?" ఆగ్రహావేశాలతో అన్నాడు మనోహర్.
"నువ్వు పెద్ద డాకు మంగళ్ సింగ్ వి.....చేసేదంతా చాటుగా చేస్తూ బైట బిల్డప్ లు ఇస్తుంటావు...." వెటకారంగా అన్నాడు దుర్గాప్రసాద్.
అతని మాటలకు పుండుమీద కారం రాసినట్లు ఫీలయ్యాడు మనోహర్.
"ఆడపిల్లల మనసులో అణగారి వుండే అగ్ని పర్వతం ఎప్పుడో ఒకసారి బద్దలుకాక తప్పదు....ఎగచిమ్మే ఆ లావా వేడికి మగవాడి ఛాందస స్వభావాలు దగ్ధంకాక తప్పదు!" ఆవేశంగా అన్నాడు దుర్గాప్రసాద్.
హఠాత్తుగా అతను ఎందుకు అంత ఆవేశపడ్డాడో, అతను ఏం మాట్లాడాడో అర్ధంకాక పిచ్చి పట్టినట్లు చూశాడు మనోహర్.
"ఆడవాళ్ళ జీవితంతో ఆటలాడుకునే మగవాళ్ళ మనస్తత్వాన్ని ఎండగట్టి వాళ్ళకి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్న మన మేడమ్ మాయాదేవి గారంటే నాకెంతో గౌరవం" అన్నాడు దుర్గాప్రసాద్.
"గౌరవమా గాడిద గుడ్డా....ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అవసరానికి మించిన సెలవులు కొట్టేయాలనే దురుద్దేశంతోటే నువ్వామెను సపోర్ట్ చేస్తున్నావు. లేదంటే తప్పు చేసింది ఆవిడైతే, ప్రపంచంలోని స్త్రీ జాతికి నేనొక్కన్నే ఏదో అన్యాయం చేసినట్లు మాట్లాడతావేం....?" చిరాగ్గా అన్నాడు మనోహర్.
"తప్పు ఆవిడ చేశారా....నువ్వు చేశావా?"
"అదేమిటీ, ఏమీ తెలీనట్లు అడుగుతావు?"
"తెలియనట్లు కాదు....తెలీకనే అడుగుతున్నా...."
"తప్పు ఆవిడే చేసింది."
"నే న్నీకెలా కనిపిస్తున్నాను? పాగల్ గాడి లానా? అరగంట క్రితం నేను సరిగ్గా మేడమ్ గారి క్యాబిన్ లోకి ఎంటర్ అవుతుండగా నువ్వే ఆవిడని కౌగిలించుకునే దృశ్యాన్ని నేను కళ్ళారా చూశాను.
ఉత్త కౌగిలించుకోవటమా? ఎంత గట్టిగా, ఎంత బలంగా కౌగిలించుకుందీ కూడా చూశాను,
నీ మొరటు సరసానికి ఆమె సుకుమారమయిన శరీరం ఏమయిపోతుందోనని ఎంతో భయపడ్డాను కూడా.
ఆమె గదిలోకెళ్ళి, తలుపులు దగ్గరికేసి అంత గట్టిగా కౌగిలించుకుంటావా?" గద్దిస్తున్నట్లుగా అన్నాడు దుర్గాప్రసాద్.
దుర్గాప్రసాద్ ఏమన్నాడో, తనేం విన్నాడో కొద్ది క్షణాలవరకూ మనోహర్ కేం అర్ధం కాలేదు. అర్ధం కాగానే పిడికిలితో నుదురు కొట్టుకున్నాడు.....దుర్గాప్రసాద్ కేసి వెర్రి చూపులు చూశాడు!
"నీ తప్పేమీ లేదని చెప్పటానికి ఇదో నాటకమా? ఇంకాసేపు వుంటే ఆమె కౌగిలించుకోమంటేనే నేను కౌగిలించుకున్నాను....అని చెప్పేటట్లు వున్నావ్!" వేళాకోళంగా అన్నాడు దుర్గాప్రసాద్.