Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 24

    ఒక భారతీయుడు బ్రిటన్ వెళ్ళేందుకు వీసాకోసం అప్లయ్ చేశాడు. ఆ వీసా అప్లికేషన్ లో భారతీయుడు బ్రిటన్ లో ఆరునెలలు వుండేందుకు అవకాశం కోరాడు. ఆ కాలమ్ చూసిన బ్రిటీష్ ఆఫీసరు అన్నిరోజులు మా దేశంలో మీరేం చేస్తారు? అని భారతీయుడిని అడిగాడు.
   
    ఒళ్ళు మండిన భారతీయుడు నూట ఎనభై రోజులకే 'మా దేశంలో మీరేం చేస్తారు?' అని నువ్వు నన్ను అడిగావు. మరి మా దేశంలో వందల సంవత్సరాలు ఎందుకు వుండి చచ్చారు? అని అడిగాడు భారతీయుడు.
   
    ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని బ్రిటీష్ కాన్సలేట్ అధికారి తెల్లముఖం వేశాడుట. ఈ సంఘటన ఎందుకు చెప్పానో నీకు అర్ధమయిందా?" అడిగింది మాయాదేవి. తీపి నొప్పులకు లోనయిన శరీరాన్ని తడుముకుంటూ....
   
    అసలు విషయానికి రాకుండా ఆమె ఎక్కడెక్కడికో వెళ్తున్నందుకు నిజంగానే కోపం వచ్చింది మనోహర్ కి.
   
    "కోపంలో నువ్వు మరింత అందంగా వుంటావోయ్" అతనికేసే చిలిపిగా చూస్తూ అంది మాయాదేవి.
   
    "ఇవన్నీ నాకు అనవసరం- తప్పు నీదని ఒప్పుకుంటావా, లేదా?"
   
    "ఎక్కడ? ఇక్కడా? కోర్టులోనా?"
   
    "కోర్టులోనే."
   
    "కోర్టులోనే ఎందుకు?"
   
    "జరిగిన తప్పు నా మూలంగా కాదని నలుగురికి తెలియటానికి."
   
    "నువ్వు అనుకునేది, నేను చేసింది తప్పే అయితే నువ్వు ఒక్కడివీ నోరు మూసుకుంటే సరిపోయేది కదా? విషయాన్ని కోర్టుదాకా ఎందుకు తీసుకెళ్ళావు? మిస్ మాయాదేవిలాంటి గొప్ప అందగత్తె, డబ్బున్న అమ్మాయి, పెళ్ళికాని అమ్మాయి, అంతస్తు వున్న అమ్మాయి నేనంటే పడిచస్తుందని ప్రపంచానికి తెలియజెప్పటానికా? అలా నీ అంతఃచేతనంలో నిబిడీకృతమై వుండే పురుష ప్రకృతిని సంతృప్తి పరుచుకోవటానికా? అదలా వుంచు- ఇప్పుడు నేను కోర్టులో తప్పు నాదే అని ఒప్పుకుంటే, అది ఒప్పయిపోతుందా? తప్పులు ఇంత తేలిగ్గా ఒప్పులైపోతాయా?" ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయి అడిగింది మిస్ మాయాదేవి.
   
    "నువ్వు తప్పు ఒప్పుకుంటే, నా నిజాయితీ బయటికి వస్తుంది....అప్పుడు నా మేనకోడల్ని నేను పెళ్ళిచేసుకోవటానికి అభ్యంతరం వుండదు. అంతేకానీ నీ అందం చూసి, నీ లెవెల్ చూసి మురిసిపోయి మీరు నా కోసం పడి ఛస్తున్నారని ప్రపంచానికి తెలియజెప్పుకోవటానికి కాదు. తప్పు ఆడది చేసినా, మగవాడు చేసినా ఒక్కటే. అని తెలియజేయటానికే కోర్టుకెళ్ళాను. ఇప్పుడు అర్ధమయిందా? ఒకటి- చేసిన మేలు మరిచిపోయి, ఆస్తి, అంతస్తు కోసం నేనే మీ వెనుకపడ్డాననే అపవాదు తొలగించుకోవటానికి.
   
    రెండు- తప్పెవరు చేసినా ఒకటే....అని తెలియచెప్పటానికి.
   
    ఈ రెంటి కోసమే నేను వివాదానికి దిగాను" స్కూల్ పిల్లాడు పాఠం ఒప్పజెప్పినట్లు చెప్పాడు మనోహర్.
   
    "తప్పు ఎవరు చేసినా ఒక్కటే అనే పాయింట్ తప్పు జరిగాక వస్తుంది....ఇక్కడ అసలు తప్పే జరగలేదు. నేనే తప్పు చేయలేదు....నువ్వు చేశావో, లేదో అనే విషయం మీద నేను ఇంకా ఒక నిర్దారణకి రాలేదు. ఇకపోతే డబ్బుకోసమే నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని అనుకోవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నేను, నిన్ను పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడుతున్నప్పుడు నా మీద కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం నీకెందుకుంటుంది? ఈ విషయం గ్రహించటానికి పిసరంత మెదడుంటే చాలు. వెర్రిబాగుల వాళ్ళ విమర్శల్ని పట్టించుకోవలసిన అవసరం నీకుందని నేననుకోను" సూట్ లో పచార్లు చేస్తూ అంది మాయాదేవి.
   
    "ఇదంతా ఎందుకు? తప్పు చేశానని ఒప్పుకోరాదూ. ఓ పనైపోతుంది. నేనూ ఒడ్డున పడిపోతాను" అర్ధిస్తున్నట్టుగా అడిగాడు మనోహర్.
   
    "చేయలేదు గనుక, ఒప్పుకోవలసిన అవసరం ఏముంది?" చిరునవ్వు చిందిస్తూ అంది మాయాదేవి.
   
    "నన్ను మర్చిపోగూడదూ ప్లీజ్!" మరింత వేడుకోలుగా అడిగాడు మనోహర్.
   
    "కోరుకున్నది లభిస్తే దాన్ని మరిచిపోవడం మగవాడి లక్షణం....లభించాక శాశ్వతం చేసుకోవడం స్త్రీ లక్షణం....నువ్వు నాకు లభించావు. ఇక మరిచిపోవడం అన్నది ఎలా సాధ్యం?"
   
    "నేను నీకు లభించాను అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వెన్ని వేషాలు వేసినా, మరెన్ని ప్రయత్నాలు చేసినా, నేను నీకు దక్కను" మొండిగా అన్నాడు మనోహర్.
   
    జల తరంగణిలా నవ్వింది మాయాదేవి.
   
    మనోహర్ కి పిచ్చి పట్టినట్లయింది. ఆమెను ఎలా ఒప్పించాలో అర్ధం కాలేదు.
   
    "నీకు దణ్ణం పెడతాను.....నేనే తప్పు చేశాను....ఇందులో మనోహర్ తప్పేమీ లేదని ఒక్కసారి అను చాలు...."
   
    "స్త్రీకి మగవాడు దణ్ణం పెట్టడంలో మగవాడు ఎలాంటి అహాన్నీ ఫీలవ్వక్కరలేదు....అని తెలియజెప్పినందుకే నేను నీకు దణ్ణం పెడతాను....నా చిటికిన వేలు పట్టుకో....నీకు తెలియకుండానే మిగిలిపోయిన చాలా పెద్ద ప్రపంచాన్ని నేనే నీకు చూపిస్తాను....మగవాడు తన చిటికెన వేలు పట్టుకుని ఎంతో నమ్మకంతో తన వెంట వచ్చే స్త్రీకి ప్రపంచం మొత్తాన్నీ, వంటగది, పడకగది కింద మార్చి చూపిస్తాడు.
   
    అదే స్త్రీ అయితే నిజమయిన ప్రపంచాన్ని నిండుగా చూపిస్తుంది! అక్కర తీర్చే ఆడది అతి సమీపంలో ఉండగా వేరే ప్రపంచాన్ని ఎందుకు చూడాలి అనుకునే మగవాడు తన చిటికెన వేలు స్త్రీకి ఎందుకు అందిస్తాడు....?
   
    ఇంత జరిగాక, ఒకజ అద్భుతమయిన అనుభవాన్ని మనిద్దరం సొంతం చేసుకున్నాక, నేను నిన్ను మరిచిపోవడం కాదు.....నువ్వెప్పటికీ నన్ను మరిచిపోలేవు. నా మీద నాకు చాలా గొప్ప నమ్మకముంది!
   
    నేను నీకు అందించిన అనుభవం ప్రపంచంలో మరే ఇతర స్త్రీ నీకు అందించలేదు....ఎందుకంటే నేను నిన్ను ప్రేమించినంతగా ప్రపంచంలో మరే స్త్రీ నిన్ను ప్రేమించదు....ప్రేమించలేదు కూడా!

 Previous Page Next Page