"నేను చేసే ఉద్యోగం ఎంతో పవిత్రమయింది నాన్నగారూ. సమాజ శ్రేయస్సూ, ప్రజా సంక్షేమాన్ని కాపాడే బాధ్యత పాత్రికేయులది, పత్రికలది. పత్రికలు వున్నది కేవలం రాజకీయ పార్టీలు ఒకరిమీదఒకరు ఎలా బురద చల్లుకున్నారన్నది చెప్పటానికి కాదు.
అధికారపార్టీ ప్రతిపక్షపార్టీ నెన్నితిట్లు తిట్టింది, ప్రతిపక్షపార్టీ అధికార పార్టీ నెన్నితిట్లు తిట్టింది తెలుసుకునేందుకు ప్రొద్దుటే ఉపయోగించుకునే చౌకబారు కరపత్రం కాదు పత్రికంటే.
ప్రజలు ఏమైపోతున్నారన్నది మర్చిపోయి రాష్ట్రం, దేశం ఎటువేపు వెళుతున్నారన్నది వదిలేసి నువ్వు దొంగవి నువ్వు అన్నీ దోచుకున్నావంటే ఛీ ఛీ రామరామా నేను తప్పుచేయను అని నా ప్రజలకు తెలుసు అంటూ నువ్వే ఇంత దోచుకున్నావు అని సిగ్గువిడిచి బందిపోట్లులా కొట్లాడుకునే నేటి దౌర్భాగ్యపు రాజకీయవేత్తల గురించే వ్రాయాలా__?" శశిభూషణ్ కూతురికి అడ్డు తగులుతూ అన్నాడు.
"రాయాలి తల్లీ....మీరెంతటి నీతిమంతుల్ని ఎన్నుకున్నారో తెల్సా? మీ ఓటు హక్కుపై మీకు ఏవగింపుగా లేదా అని ప్రశ్నించాలి ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకునేందుకు కనుక భవిష్యత్ లో రాళ్ళను ఎన్నుకోవద్దు.
రత్నాలను ఎన్నుకునే ప్రయత్నం చేయండంటూ సలహాలివ్వాలి. ఏ రుగ్మతకయినా కారణం రాజకీయ వ్యవస్థే తల్లీ....అన్ని వ్రాసి ప్రజల కళ్ళు తెరిపించాలి" నెమ్మదిగా అన్నా, స్పష్టంగా అన్నాడు శశిభూషణ్ కూతురివేపు ప్రేమగా చూస్తూ.
"అలా వ్రాసినంత మాత్రాన పచ్చి దొంగల్ని ఎన్నుకోవటం మానేస్తారంటావా నాన్నగారూ. అమాయక ప్రజల ఎలక్షన్స్ వాగ్దానాల ప్రలోభంలో తిరిగి చిక్కుకుపోయా?"
తండ్రీ కూతుళ్ళ సంభాషణని ఆసక్తిగా వింటోంది ఉష తల్లి.
"అంటే ప్రజలు మారరనా నీ ఉద్దేశం"
"అవును నాన్నగారూ మారరు"
"సరిగ్గా చెప్పావమ్మా. అలాగే దొంగ చిట్ ఫండ్ కంపెనీల గురించి, ఫైనాన్స్ కంపెనీలగురించి వ్రాస్తేమటుకు ప్రజలు కళ్ళు తెరుస్తారంటావా?"
ఉషా తండ్రి ఆర్గుమెంటుకి ఒకింత షాక్ అయింది. ఎలాంటి సంకట పరిస్థితినుంచయినా వెంటనే తేరుకోవటం ఆమె ప్రత్యేకత.
"నేడు సమాజమంతటా ఎక్కువగా రాళ్ళేవున్నాయి నాన్నగారూ రత్నాలున్నా చాలా తక్కువ వాటికి చొరవ స్వార్ధంలేవు కనుక రాళ్ళే నిలబడతాయి, ఇది ప్రజాస్వామ్యదేశం, ఎన్నికలు తప్పవు కనుక ఏదో ఒక రాయిని ఎన్నుకుని పళ్ళూడగొట్టుకోవటమే ప్రత్యామ్నాయం. కాకపోతే చిన్నరాయి, పెద్దరాయి చూసుకుని ఎన్నుకోవడమే వాళ్ళ చేతిలో వుంది.
ఈ వ్యవస్థకు రాజకీయ దుర్గంధం పటిష్టమయిన పునాదుల్ని బూతులను వడకట్టి సంస్కారవంతమైన భాషలో అందించటం గొప్ప తృప్తి నివ్వటంలేదు నాన్నగారూ.
పెద్ద దొంగలయిన రాజకీయ నాయకులనుంచి ఎలా ప్రజల్ని రక్షించాలన్నది ఇంకా తేలని సమస్యే. ఈలోపే పెద్దదొంగల అండతో చిన్న దొంగలు, పేద, మధ్యతరగతి ప్రజల కష్టార్జితంతో ఆడుకుంటుంటే చూస్తూ వూరుకుంటే మా వృత్తికి ద్రోహం చేసినట్లు కాదా? దొంగ చిట్ ఫండ్ కంపెనీలున్నాయి, ఫైనాన్స్ కంపెనీలున్నాయి జాగ్రత్త, అని హెచ్చరిస్తే కొంతమందయినా జాగ్రత్తపడరా" నెమ్మదిగానే అన్నా ఆమె కంఠంలో ఒకింత ఆవేశం తొంగిచూసింది.
"మమ్మల్ని పోషించటానికేనా తల్లీ నీకీ ఉద్యోగం?" తండ్రి మాటలు ఆమెకర్ధంకాలేదు.
"అదే అయితే వేరే ఏ ఉద్యోగం చేసయినా బ్రతికించవచ్చుగా? అసలయినా కాటికికాళ్ళు చాపుకున్న వాళ్ళం మా బ్రతుకుపట్ల శ్రద్ధకన్నా నీ భవిష్యత్ పట్ల శ్రద్ధ ముఖ్యం తల్లీ. నా మాటవిని ఈ ఉద్యోగం మానేయ్" తండ్రి కంఠంలో అర్దింపు.
ఉష కదిలిపోయింది.
"అమ్మా....నువ్వయినా చెప్పు, ఏం జరిగింది? ఎవరయినా బెదిరించారా?" తల్లిదగ్గరకు వెళ్ళి ఆమె భుజాలమీద చేతులువేసి అనునయంగా అడిగింది. ఆమె పైటకొంగుతో కళ్ళొత్తుకుంది.
"ఎవరో ఇద్దరు రౌడీలొచ్చారు మధ్యాహ్నం. మేం సుందరిగారి మనుష్యులమని. నీ కూతురు మా సుందరిగారి గురించి బేడ్ గా వ్రాసిందని పేపర్ ని ముక్కలు ముక్కలుగా చింపి మా మొఖానకొట్టి, వారంలోపు మీ కూతురు వ్రాసింది తప్పని సుందరి నిజాయితీ పరురాలే అని అదే పేపరులో అదేచోట వ్రాయకపోతే మీ కూతుర్ని నడిరోడ్ మీద మర్డర్ చేస్తామంటూ బెదిరించి వెళ్ళారు" ఉషా తల్లి ఏడుస్తూనే చెప్పింది.
"వ్వాట్....?" ఉషా గొంతులో ఒకింత కలవరపాటు.
అవునన్నట్లు శశిభూషణ్ కూడా తలూపాడు.
ఆ రాత్రికామె భోంచేయలేదు. ఆలోచిస్తూండిపోయింది. తెల్లవారుజాముకు ఆమె ఓ స్థిరమైన నిర్ణయాని కొచ్చేసింది.