సరిగ్గా అదే తెల్లవారుజాముకు ఉదయ్ నగర సరిహద్దుల్ని చేరుకున్నాడు.
o o o
మేజర్ మార్తాండ్ బంగ్లా. ఉదయం పదిగంటల సమయం. లోపల విశాలమైన హాలుమధ్య ఇద్దరు వ్యక్తులు వున్నారు. ఒకరు మేజర్ మార్తాండ్ ఇంకొకరు అతని కొడుకు యుగంధర్. ఆ హాలుగోడలమధ్య పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు మార్తాండ్.
"మధుమూర్తి, పట్టాభిల గురించి పూర్తిగా తెలుసుకునే వెళుతున్నావుకదా?"
"అవును డాడీ వాళ్ళెంత నరరూపరాక్షసులో పూర్తిగా తెలుసుకునే వెళుతున్నాను."
"శభాష్ చివరివరకు పోరాడగలవా ?"
"సందేహించి బాధ పెట్టకండి డాడీ"
"డి. ఐ. జి. ఎంతమందికి ఆఫర్ చేశాడు ఆ పోస్టుని?"
-చేయటం చాలామందికి చేశారు. కానీ ఎవరూ మిగలరనుకుంటాను."
"కనీసం నీతోపాటు ఒకరిద్దరన్నా మిగులుతారని నా అంచనా"
"అంతటి ప్రమాదకరమయిన చోటుకి ఏ పోలీసాఫీసర్ వెళ్ళటానికి ఇష్టపడడని నా అంచనా."
"సరే....ముందువెళ్ళి అక్కడ పోస్టింగ్ నీకే వచ్చేలా ప్రయత్నించు...." మార్తాండ్ సోఫాలోంచి లేస్తూ అన్నాడు. యుగంధర్ సెల్యూట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు.
o o o
డి. ఐ.జి. బంగ్లా....ఆ మధ్యవరకూ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరోలో పనిచేసి ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. దొర....నిజంగానే దొరబాబులా వుంటాడు. శాంతి భద్రతలకు కంచుకోటలా కాపలా కాస్తాడు-తను తినడు ఇతరుల్ని తిననివ్వడు. అది చూసి కడుపునిండిన కొందరు ఆయన్ని గడ్డివాముదగ్గర కాపలా కుక్కని అంటారు. ఆయనకు తెలుసు ఆయన్నిలా అంటారని. విశ్వానికి అర్ధం చెప్పే కాపలా కుక్కతో తనను పోల్చటంలో ఒకింత మొరటుదనం వున్నా ప్రజల శాంతిభద్రతలకు తను నిజంగానే కాపలా కుక్కనని గర్విస్తాడాయన.
(ఈ పాత్రకు నిజంగానే-ఇన్ స్పిరేషన్ ఇచ్చిన పోలీసాఫీసర్ ఇప్పుడు రాష్ట్ర సర్వీసులోనే వున్నారు. వారి పేరు కె. సదాశివరావు ఐ.పి.యస్. రచయిత)
ఇప్పుడాన బంగ్లా హడావిడిగా వుంది. బంగ్లాముందు అప్పటికే పదిమందిదాక ఏ.ఎస్.పి.లు గుమికూడి ఉన్నారు.
యుగంధర్ కి తెలిసిన విషయం వారికింకా తెలీదు.
ఎందుకో హఠాత్తుగా డి.ఐ.జి. రమ్మని కబురంపాడు అంతే తెలుసు వారికి.
డిప్యూటి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిధిలో నాలుగు జిల్లాలుంటాయి. ఆ నాలుగు జిల్లాల ఎస్.పీలు, ఏ.ఎస్ పీలు, డి.ఎస్ పీలు ఆయన క్రిందనే పనిచేస్తుంటారు, ఆయన ఎవరికీ జవాబుదారికాదు ఒక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రాష్ట్ర అత్యున్నత పోలీస్ అధికారి)కి తప్ప.
సమయం ఉదయం పదకొండు గంటలు__దొరవారి బంగ్లా గంట మ్రోగింది.
జవాన్ వచ్చి సెల్యూట్ చేసి "దొరవారు హాల్లోకి వచ్చారు మిమ్మల్నిపిలుస్తున్నారు" అన్నాడు.
అందరూ తమ డ్రస్సులవైపు ఓసారి సరిచూసుకుని కేప్స్ సరిగ్గా పెట్టుకుని లోనకు నడిచారు.
పొడవైన హాలు నిశ్శబ్దంగా వుంది.
హాలుమధ్య పెద్ద టేబుల్ దాని కిటూ అటూ చెయిర్స్ దానికి ఆ చివర దొర కుర్చీ....ఆయనిప్పుడు కూర్చునిలేరు నిలుచుని వున్నారు.
"గుడ్ మార్నింగ్ సర్."
వెల్....మార్నింగ్ గుడ్ మార్నింగ్ మైడియర్ యంగ్ ఆఫీసర్స్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్" అన్నాడు గంభీరంగా ఆయన.
ఐ.పి.యస్. ట్రైనింగ్ లో పోలీస్ అకాడమీలో వున్నప్పుడు ఆయన ధైర్య సాహసాలగురించే ఆయన నీతి నిజాయితీల గురించే కథలు కథలుగా చెప్పుకోవటం వారికిప్పుడు జ్ఞాపకానికొచ్చింది. భక్తిగా ఆయన చెప్పబోయే విషయాలకోసం వారు వినయంగా ఎదురు చూస్తున్నారు.
"నిజంగా నిజాయితీగా, ఎలాంటి ప్రలోభాలకు, వత్తిడులకు లొంగకుండా మనశాఖలో ప్రతిఒక్కరు పనిచేస్తే ఇన్ని నేరాలు ఈ వ్యవస్థలో జరుగుతాయంటారా?" నెమ్మదిగా, బేస్ లో, ఒక్కోమాట స్లోమోషన్ బుల్లెట్ లా వచ్చి తగిలాయి వారికి.
ఉలికిపాటుగా సర్దుక్కూర్చున్నారు వాళ్ళు.
"వెల్....జరగవని నా ఖచ్చితాభిప్రాయం. ఇకపోతే మీ ధైర్యసాహసాలకో పరీక్ష పెడుతున్నాను. అందులో మీరు మీ ప్రాణాల్నే వదులుకోవాల్సిన పరిస్థితిరావచ్చు. అందుకు సిద్దపడినవారే ముందుకు రావచ్చు. ఇందులో ఎలాంటి నిర్భయం, అధికారం, శాసనం లేవు.... తిరిగి నిశ్శబ్దం అలుముకుంది.