"చిన్ని ఆమె అసలు పేరు? బ్రాహ్మణి అంటే బ్రహ్మజ్ఞానము కలది. వెన్నెల జలతారు."
"ఊహు" తలవిదిలించాడు.
ఈ కాళరాత్రివేళ ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మహాపాపము. ప్రక్కనే నలిగిన పేపర్. ప్రపంచం ఎలా వుంది? ఏమైంది? పేపరందుకున్నాడు.
సర్టిఫైడ్ స్కూల్. రోజూ ఉదయాన్నే బుద్దిగా నీళ్ళతొట్టెల దగ్గర లేగదూడల్లా స్నానం. ఆ తరువాత ప్రేయర్ పెరేడ్ సూర్యనమస్కారాలు అబద్దమాడరాదు. అన్యాయంచేయరాదు. నేర ప్రవృత్తి పాపం. దొంగతనం చేయరాదు. ఎదుటి వాడ్ని హింసించరాదు. అహింస అనివార్య అని బాలనేరస్తులతో ముక్తకంఠంతో ప్రమాణం చేయించి ఆరోజు దిన పత్రిక ఒకటి తీసుకుని ఓ మాష్టారు అందులోని వార్తల్ని వినిపించటం.
జ్ఞాపకాల్ని ఓ మూలకి విసిరి పేపరందుకున్నాడు. పెట్రోమాక్స్ లైటు పంచే బలహీనమైన వెలుగులో మొదటి పేజీవేపు చూశాడు. "ఉదయం" దినపత్రిక.
"మళ్ళీ తలెత్తిన బోగస్ దైనాన్స్ కంపెనీలు"
ఫ్రంట్ పేజీలోనే కనిపించిన బేనర్ అది. ఉదయ్ ఓ క్షణం ఆశ్చర్యపోయాడు. ఆ వార్తనెందుకో చదవాలనిపించింది అతనికి.
"ఒక ఆర్ధిక సంస్థలోపనిచేసే బిల్లు కలెక్టర్ కు కొన్ని వందలమంది చందాదారులతో పరిచయం ఏర్పడుతుంది దాన్నడ్డం పెట్టుకుని తనో చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభిస్తాడు.
తను పనిచేసిన కంపెనీలోని చందాదారుల యింటింటికి వెళ్ళి కలసి చిట్ వేయండి. మీకే చిట్ యిప్పిస్తానని అదీ తొలి నెలలోనే యిప్పిస్తానని యిది మరొకరికి చెప్పొద్దని, చేనితే మీమీద నేనేదో అభిమానం చూపిస్తున్నానని నిందిస్తారని నమ్మబలుకుతాడు.
పాపం వాళ్ళ అవసరం అతన్ని నమ్మేలా చేస్తుంది అలా నెల తిరిగేసరికి రెండొందలమందిని తన చందాదారుల్ని చేసుకుంటాడు. మొదటినెల చిట్ ని ఎవరో పాడుకుంటారు.
అతన్ని యితను అభినందించి మీ పాటకు మిగతావారిని ఎదురురావద్దని చాటున చెప్పేసా అని మరో నాటకం ఆడి గ్యారంటీ యిలాతెచ్చి అలా చిట్ సొమ్మును పట్టుకెళ్ళమని చెబుతాను.
ఈలోపు రెండోనెల వస్తుంది. మరలా ఈసారి మరొకరు పాడుకుంటారు. అతనికీ ఈసారి పాతకధే వినిపించి గ్యారంటీ తెమ్మంటాడు. అప్పటికి ఫస్ట్ టైమ్ చిట్ పాడిన వ్యక్తి గ్యారంటి తెస్తే గ్యారంటికాగితాలు సరిగా లేవని కొన్నాళ్ళు కాలయాపన చేస్తాడు. తీరా తెస్తే అతనొచ్చే టైమ్ కి యితను ఆఫీస్ లో లేకుండా క్లర్కుతో మీ చెక్ రడీ అయింది అని ఓసారి, బాస్ సంతకం చేయడం మర్చిపోయారని మరోసారి యిలా కాలయాపన చేస్తారు.
ఈలోపు మూడోనెల వచ్చేస్తుంది. అప్పటివరకు పోగయిన డబ్బు సంచితో యితర రాష్ట్రాలకు పరారి. ఇదే తరహాలో మరో మోసం...."సుందరి అనే స్త్రీ" వార్త అలా సాగిపోయింది.
నిజాల్ని నిర్భయంగా వెలికిలాగే మరో తెలుగు దినపత్రిక శభాష్ అ వార్త వ్రాసిన రిపోర్టర్ పేరుకోసం ఉదయ్ చూపులు వార్త ప్రారంభంలోకి మరలాయి.
జనవరి : 18(ఉషా).
ఉదయ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఓ ఆడపిల్లకింత గుండె ధైర్యమా? ఇంతలో సర్వర్ వచ్చాడు....పేపర్ ప్రక్కన పడేసి ప్లేట్ అందుకున్నాడు.
* * *
అప్పుడే ఇంటికి వచ్చింది ఉషా, అప్పుడుటైమ్ సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఎప్పుడూ ఆ టైమ్ కి గాఢనిద్రలోకి వెళ్ళే శశిభూషణ్ ఆరోజు కావాలనే నిద్రపోలేదు.
ఉషా కళ్ళతోనే తండ్రిని పరామర్శించి చెప్పులు విడిచి లోనకు వెళ్ళబోతుండగా__
"ఏ పాపమూ ఎరుగని నీ అన్న చిన్నవయస్సులో ప్రాణాలువదలిమా కడుపున చిచ్చుపెట్టాడు" తండ్రి మాటలకు లోనకు వెళ్ళబోయే ఉషా అక్కడే ఆగిపోయింది.
"నువ్వు ప్రమాదకరమయిన వ్యక్తుల గుట్టు బయటపెట్టి కావాలనే ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నావా తల్లీ?" శశిభూషణ్ కంఠంలో సన్నని జీర.
"ఏమిటి మీరనేది నాన్నా?" తండ్రి అంటున్నది దేనిగురించో అర్ధంకాక ప్రశ్నించింది ఉష.
"ఆ సుందరి చిట్ ఫండ్ కంపెనీ గోల్ మాల్ గురించి రాసావటగా? అదేనాన్నగారు అడిగేది" తల్లి నోటి నుంచి సమాధానం టక్కున బయటికొచ్చింది.
అంటే అప్పటికే వాళ్ళిద్దరూ తనగురించి, తను వ్రాసిన వార్త గురించి చాలసేపు చర్చించుకుని వుంటారు. అలాంటి దారుణాల్ని గతంలో చాలసార్లు తను రాసింది. అప్పుడు భయపడని అమ్మా, నాన్న ఈరోజు భయపడుతున్నారంటే?
"కళ్ళముందు జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలముందుకి తెచ్చినప్పుడే నాన్నా అది వ్రాసినవాళ్ళు నిజమయిన జర్నలిస్టు. అది ప్రచురించిన పత్రిక నిజమైన పత్రిక అయ్యేది" నీళ్ళునిండిన కళ్ళతో నిస్సహాయంగా చూసిన తండ్రిచూపుల్ని ఎదుర్కోలేకపోయింది ఉషా. ఆ చూపులకు తనవద్ద సమాధానంలేదు. తన ఆవేశానికి ఆ చూపే ఓ అడ్డుకట్ట. ఒకవేళ ఏదయినా బెదిరింపు ?