Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 25

   "నాకు శలవు ఇవ్వడు మా ఆఫీసరు" మెల్లగా గొణుకుతూ అన్నాడు అంబాజీరావు.
    "ఎవడా సన్నాసి ఆఫీసరు... రేపు నేను మీ ఆఫీసుకొస్తాను... ఆ ఆఫీసరెవడో చూపించండి... నేను వాడినడుగుతా ... మీకు శలవెందుకివ్వడో..."
    "నువ్వు తియ్యను... కావాలంటే నెత్తి కొట్టుకోండి..." మొండిగా అంది కనకదుర్గ.
    అంబాజీరావు పళ్ళు బిగించి నెత్తికొట్టుకుంటూ అన్నాడు. "నువ్వు ఆఫీసుకు రానక్కర్లేదూ, మా ఆఫీసర్ని కలవక్కర్లేదూ... నేనే ఆయన్ని ఎలానో బతిమాలో బామాలో అడుగుతా...'
    హమ్మయ్య... అయితే ఊరు ప్రయాణానికి మీరు ఒప్పుకున్నట్టే నన్నమాట!!..." సంబరపడిపోతూ అంది కనకదుర్గ.
    "ఒప్పుకోక చావనా?" మొహం చిట్లించి అన్నాడు అంబాజీరావు.
    "ఏం కూశారూ?" సూటిగా అతనివంక చూసి అడిగింది కనకదుర్గ.
    "హబ్బే... కూయడానికి నేనేమైనా కోయిలనా?... మామూలుగానే అంటున్నా... ఒప్పుకోకపోతే ఎలా అని..." కులాసాగా నవ్వేస్తూ అన్నాడు.
    "ఏవండే వండేవండీ ..." కాలు కాస్తపైకి జరుపుతూ గునిసింది కనకదుర్గ.
    "ఏమిటి?" అన్నాడు అంబాజీరావు.
    "మరేమో మనం ఏ ఊరికెళ్దామండీ?" గారాలుపోతూ కాలుని మరింత పైకి జరుపుతూ అడిగింది.
    "గుర్... గుర్... గుర్... గుర్..." అన్నాడు అంబాజీరావు.
    "అబ్బ... చాల్లెద్దురూ ... అదేంటో స్పష్టంగా సరిగ్గా చెప్పి ఏడవండి..."
    "గుర్... గుర్... గుర్... గుర్..."
    "ఆ... ఏంటీ?"
    అంబాజీరావు కనకదుర్గ కాళ్ళని చేతుల్తో దూరంగా నెట్టేసి మెడ రుద్దుకున్నాడు.
    "నువ్వు నా పీకమీద కళ్ళేసి చెప్పండీ చెప్పండీ అంతే గొంతెలా వస్తుందని అనుకున్నావ్?"
    కనకదుర్గ సిగ్గుపడింది.
    "పోన్లెండి... మీ బొజ్జమీద కాళ్ళేస్తా... ఇప్పుడు చెయ్యండి... ఏ ఊరెళ్దాం ?"
    "ఇంత రాత్రివేళ దాని గురించి ఏం మాట్లాడ్తాంగానీ... రేపు పొద్దున్న మాట్లాడదాం..." అన్నాడు అంబాజీరావు ఆవలిస్తూ.
    "సర్లెండి... రేపు పొద్దున్న మళ్ళీ మాట మార్చారో... అప్పుడు మీసంగతి చెప్తా..." అంది కనకదుర్గ అతనిమీదనుండి కాలు తీస్తూ.
    మర్నాడు ఉదయం.
    కాఫీలయ్యాక మళ్ళీ  ప్రయాణం విషయం ఎత్తింది కనకదుర్గ.
    "ఇంతకీ ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్లాల్సిందేనంటావ్... తప్పదా?" అన్నాడు అంబాజీరావు.
    "ఒహో ... మళ్ళీ మాట మారుస్తున్నారే... మీరు రాత్రి సరేనన్నారని మీరిప్పుడు నిద్రలేవకముందే పిల్లలకి చెప్పేశాను మీరు ఊరుకి తీస్కెళ్తున్నారని..." అంది కనకదుర్గ.
    "అవున్నాన్న... మనం ఊరికెళ్దాం నాన్నా..." అంది ఆరేళ్ళ బుజ్జి అంబాజీరావు జుట్టుపట్టి లాగుతూ.
    "మమ్మల్ని ఊరికి తీస్కెళ్లు నాన్నా..." అన్నాడు నాలుగేళ్ళ కన్నా అతని పొట్టమీద గుద్దుతూ.
    "చూద్దాంలే... మీరు బయటికెళ్లి ఆడుకోండి" విసుక్కుంటూ అన్నాడు అంబాజీరావు.
    "మేమేం ఆడుకోం... మమ్మల్ని ఊరికి తీస్కెళ్తామని అంటేనే మేం బయటికెళ్ళి ఆడుకుంటాం... మమ్మల్ని తీస్కెళ్ళు నాన్నా..." అంది గోళ్ళతో అతని మెడమీద రక్కుతూ బుజ్జి.
    'మమ్మల్ని ఊరికి తీస్కెళ్ళకపోతే నువ్వు మా ట్యూషన్ టీచర్ని ముద్దు పెట్టుకున్నానని నేనమ్మతో చెప్పేస్తాగా?" అంబాజీరావు చెవిలో మెల్లగా అన్నాడు కన్నా.
    "అలాగేరా ... అలాగే తీస్కెళ్తా... హిహి... కన్నిగాడు హెంత ముద్దొస్తున్నడో!!" అంటూ కన్నా బుగ్గలు చిదుముతూ నవ్వలేక నవ్వుతూ అన్నాడు అంబాజీరావు.
    "హే... నాన్న మనల్ని ఊర్కి తీస్కెళ్తున్నారోచ్... ఊర్కి తీస్కెళ్తున్నారోచ్...ఊర్కి తీస్కెళ్తున్నారోచ్..." అంటూ అతని నెత్తిమీద ఫటఫట కొడ్తూ గంతు లేయసాగారు పిల్లలిద్దరూ.
    పిల్లలిద్దరూ  అతని నెత్తిమీద కొట్టడం ఆపి బుద్దిగా నిల్చున్నారు.
    "ఏవండీ...మీరోమారు బెడ్రూములోకి పదండి"అంది కనకదుర్గ కొంటెగా అంబాజీరావు వంకచూస్తూ .
    "బెడ్రూములోకా ? ఇప్పుడెందుకూ ?"ఆశ్చర్యంగా అడిగాడు అంబాజీరావు.
    "ఎందుకంటే మీరు మంచంమీద పడుకుంటే మీ పక్కన నేను పడుకుని మీమీద కాలేస్తాను....అప్పుడు ఎంచక్కా మనం ఏ ఊరెళ్ళాలో మాట్లాడుకోవచ్చు.." అంది కనకదుర్గ సంబరంగా.
    "ఎం వద్దు...ఇక్కడే మాట్లాడుకుందాం"అన్నాడు అంబాజీరావు. "చెప్పు...ఏ ఊరెళ్దాం?" అని అడిగాడు.
    "ఎంచక్కా మైసూర్, బెంగుళూర్, ఊటీ అవన్నీ తిరిగొద్దామండీ...."అంది కనకదుర్గ.
    "మరే...మరే....అవన్నీ తిరగడానికి డబ్బులేవి?...."
    "మీ ఆఫీసులో యల్టీసి అనో ఏదో ఇస్తారుగా?"
    "వాళ్ళు రానూ పోనూ రైలు ఛార్జీలే ఇస్తారు....హోటల్ ఖర్చులూ, మిగతా ఖర్చులూ ఇవ్వరు. అసలు ఈ రైలు ఛార్జీలకంటే అవే ఎక్కువ అవుతాయ్ తెల్సా?...సుబ్బరంగా మీ అమ్మావాళ్ళ ఊరు అప్పన్నడొంకకి వెళ్దాం..."
    "చాల్లెండి... సర్దాగా ఏదైనా ఊరెళ్దాం అండీ అంటే అప్పన్నడొంకకట! నాకేం తెలీదు.... నన్నేదైనా మంచి ఊరికి తీస్కెళ్ళండి" అంది కనకదుర్గ.
    "నా దగ్గర డబ్బులు లేవని చెప్పానా?... పోనీ ఓ పని చేద్దాం... నీ నగలు ఇలా ఇవ్వు. వాటిని తాకట్టుపెట్టి ఆ డబ్బుతో బెంగుళూరు,మైసూర్,ఊటీ అన్నీ తిరుగుదాం.
    "అమ్మా... నా నగలు  నేనెందుకిస్తాను?... పోనీ ఓ పని చేద్దాం... మనం మద్రాసెల్దాం."
    "ఏం! మద్రాసెళ్తే మనకి డబ్బు ఖర్చవదా?... అక్కడ చెట్టుకింద ఉంటామా?" మొహం చిట్లించి అన్నాడు " అంబాజీరావు.
    "ఎలాగవుతుంది... మద్రాసులో మా వేలు విడిచిన మేనమామ పినతల్లి కొడుక్కి బావమర్ది ఉన్నాడుగా... మనం అతనింట్లో ఉండి ఊరంతా చూద్దాం..."
    "మరీ అంత దూరం బంధువుల ఇంట్లో బాగుండదు..." నసిగాడు అంబాజీరావు.
    "మరేం చేద్దాం?..." అడిగింది కనకదుర్గ.
    రెండు మూడు రోజులు వాళ్లలా ఎంత ఆలోచించినా ఎక్కడికి వేళ్లలో తోచలేదు. చివరికి అప్పన్నడొంకకి వెళ్దామనే నిర్ణయానికే వచ్చారు. పోనీలే పుట్టింటికే కదా వెళ్తున్నానని సరిపెట్టుకుంది కనకదుర్గ. అంబాజీరావు ఆఫీసర్కి మస్కాకొట్టి నెల్రోజులు శలవు కూడా సంపాదించాడు.
    వాళ్ళు ఊరెళ్ళడానికి ముందురోజు గున్నారావు భార్యా, నలుగురు పిల్లలూ సమేతంగా అంబాజీరావు ఇంటికి వచ్చాడు.
    గున్నారావు అంబాజీరావు వదినకి తమ్ముడి మరదలి మేనత్త కూతురుకి మొగుడౌతాడు.
    "ఈ ఎండాకాలం శలవులకి మీ ఇంట్లో గడపాలని నెలరోజులు శలవు తీస్కుని వచ్చాను" అన్నాడు గున్నారావు అంబాజీరావుతో.
    అంబాజీరావూ, కనకదుర్గా కొయ్యబారిపోయారు.
                                              *  *  *    
                

 Previous Page Next Page