Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 24

   "అప్పడు మనమేం చేసినా ఆడాళ్లు ఓపిగ్గా భరిస్తారు...లేకపోతే సినిమా మిస్సయిపోతుందిగా మరి?..." అన్నాడు విశ్వనాథం.
    "అయితే ఇప్పుడే మ్యాట్నీ షోకి పద... సంగంలో అందరికీ మొగుడు సినిమా ఆడ్తుంది... దానికి పోదాం" కంగారుపెడ్తూ అన్నాడు కృష్ణారావు.
    ఇద్దరూ సంగం థియేటర్ కి వెళ్లారు. అప్పటికే టిక్కెట్లు ఇచ్చేస్తున్నారు. ఇద్దరూ క్యూలో నిల్చున్నారు. ఒక అయిదు నిమిషాల్లో కౌంటర్ మూసేసాడు. హౌస్ పుల్ అయిపోయింది. వీళ్లిద్దరికీ టిక్కెట్లు దొరికలేదు. కానీ ఒకతను తన ఫ్రండు రాలేదని ఒక టికెట్టు వీళ్ళకి అమ్మేసాడు.
    "మనం ఉన్నది ఇద్దరం... మన దగ్గర ఉన్నది ఒకటే టిక్కెట్టు... ఇప్పుడెలా?..." అన్నాడు విశ్వనాథం.
    "ఈ వేల్టికి సినిమాకి నేనెళ్లిపోతాలే... ఇలాంటి ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ నేనెప్పుడూ చవిచూళ్లేదుగా?... ప్లీజ్..." అంటూ బ్రతిమలాడాడు కృష్ణారావు.
    విశ్వనాథం సరేనన్నాడు. కృష్ణారావు సినిమాకి వెళ్ళాడు. విశ్వనాథం మధ్యాహ్నంపూట ఇంటికేం వెళ్తాంలే అని ఆఫీసుకెళ్లి సాయంత్రం ఇంటికెళ్ళాడు.
    విశ్వనాథం ఆటోలో ఇంటిముందు దిగాడు. అదే టైంలో వేరే ఆటోలో అతని భార్య సీతారత్నం కూడా వచ్చింది.
    ఇంటి తాళం తీసి లోపలికెళ్తుండగా అడిగాడు విశ్వనాథం.
    "నువ్వెక్కడి కెళ్ళి వస్తున్నావ్?"
    "సంగంలో అందరికీ మొగుడు సినిమా చూసొస్తున్నా..."
    ఆ మాట వినగానే తనకి టికెట్టు దొరకనందుకు సంతోషించాడు విశ్వనాథం. హాల్లో తన భార్య తను పిచ్చి వేషాలేస్తుండగా చూస్తే ఇంకేమైనా ఉందా?
    "సినిమా బాగుందా?" భార్యని అడిగాడు.
    'చూసి చస్తే కదా బాగుందో లేదో చెప్పడానికి?" విసుక్కుంటూ అంది సీతారత్నం.
    "ఏం?... నీ ముందు బన్ను పెట్టుకుని పెద్ద ముడేస్కుని కూర్చుందా ఎవతైనా?..." కిసకిసా నవ్వుతూ అడిగాడు.
    "కాదు ... వా వెనకాలెవడో ఏబ్రాసి సచ్చినోడు కూర్చున్నాడు. సినిమా మొదలైన దగ్గర్నుండీ ఆఖరి దాకా వెనుకనుండి కాల్తో నొక్కుతున్నాడు మాయదారి సచ్చినోడు... ఇంక సినిమా ఏం చూస్తానూ?..."
    విశ్వనాథం నెత్తిన చెయ్యి పెట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు.
                        *   *   * 
                                  ఏ ఊరెళ్దాం?...
   
   
    రాత్రి పది గంటలు .
    అప్పుడే భోంచేసి మంచంమీద పడుకున్నారు అంబాజీరావు, కనకదుర్గ.
    ఏదో ఆలోచిస్తున్న అంబాజీరావు ఉలిక్కిపడ్డాడు.
    కారణం...
    కనకదుర్గ అతనిమీద కాలేసింది.
    "నాకేంటో భయంగా ఉంది..." మనసులో అనుకుంటున్నట్లుగా పైకే అనేశాడు అంబాజీరావు.
    కనకదుర్గ కిలకిలా నవ్వింది.
    "మీద కాలేస్తేనే అంత భయమా?... నేనీమధ్యనేం బరువు పెరగలేదే!!..."
    అంబాజీరావు భయం వేరే ఉంది. కనకదుర్గ అలా దగ్గరకొచ్చి మీద కాలేసిందంటే ఆమె మనసులో ఏదో కోరిక ఉందన్నమాట!!
    ఇప్పుడేం కోరుతుందబ్బా... పట్టుచీరలా? నగలా??...
    "ఏంటామౌనం?..." చిలిపిగా అంటూ అంబాజీరావు నడ్డిమీద రెండో కాలేసింది కనకదుర్గ.
    అంబాజీరావు వడవడ వణికాడు.
    అలా రెండు కాళ్ళు వేసిందంటే ఏదో బలమైన కోరికే ఉందన్నమాట!!...
    "ఇంతకీ విషయమేమిటో చెప్పరాదూ?..." అన్నాడు తడారిన పెదాలని నాలుకతో తడుపుకుంటూ.
    "మరేమో మన పిల్లలకి పరీక్షలైపోయాయి కదా?..."
    "అయిపోయాయ్... అయితే?"
    "శలవలకి ఏదైనా ఊరెళ్తే బాగుంటుంది కదా?..." గునుస్తూ అంటూ కాలుని కాస్త పైకి జరిపింది కనకదుర్గ.
    "అలాగే పంపిచేద్దాం... ఏ ఊరు పంపిద్దామో చెప్తే రేపే పిల్లల్ని రైలెక్కించేస్తా..." ఆయనపడ్తూ అన్నాడు.
    కనకదుర్గ కాలు అతని పొట్టమీద ఉండడం చేత అతనికి ఆయాసం వస్తూంది. దానికితోడు అతను భోజనం అప్పుడే చేశాడు.
    "పిల్లల్ని రైలెక్కించడం ఏంటి మీ బొంద... మనం అందరం కల్సి ఊరెళ్దాం  అని అంటున్నాం..." అంది కనకదుర్గ కాలుని మరికాస్త పైకి జరుపుతూ.
    "అందరం కలిశా?... హమ్మో... నాక్కుదరదు" అన్నాడు అంబాజీరావు గుండెలు బాదుకోవాలని ప్రయత్నిస్తూ. కాని అతని ప్రయత్నం ఫలించలేదు. అతని గుండెల మీద కనకదుర్గ కాళ్ళు ఉండడం చేత అతని చేతులకి ఆమె కాళ్ళు తగిలాయ్.
    "నువ్వు కాస్త కాళ్ళు  తీస్తావా?... నాకు చిన్నపనుంది..." పళ్ళు కొరుకుతూ అన్నాడు అంబాజీరావు.
    కనకదుర్గ విసుక్కుంటూ కాళ్ళు తీసింది.
    అంబాజీరావు గభాలున గుండెలు గుభీ గుభీమని బాదుకుంటూ అన్నాడు.
    "హమ్మో... ఊరికి రావడం నాక్కుదరదు..."
    "ఊ... మీరు గుండెలు బాదుకోడం అయ్యిందా?" మొహం చిట్లిస్తూ అంది కనకదుర్గ.
    "అయ్యింది... యేం?" నవ్వుతూ అడిగాడు అంబాజీరావు.
    "ఏం లేదు... ఇందుకు"
    మళ్ళీ అతనిమీద కాళ్ళేసింది కనకదుర్గ.
    అంబాజీరావు పళ్ళు నూరాడు.
    "సరేగానీ ఊరికి రావడానికి మీకెందుకు కుదర్ధంటా?" అడిగింది కనకదుర్గ.

 Previous Page Next Page