Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 26


                                ప్రెజెంటేషన్స్...

     పార్కులో ...
    "ఇక్కడ కూర్చుందాం మోహన్..." అంది రాధ నడుస్తున్నదల్లా ఆగి.
    "వద్దు రాధా...ఇంకాస్త ముందుకెళ్ళి కూర్చుందాం..." అన్నాడు మోహన్.
    "వద్దు... ఇక్కడే బాగుంది! మనం ఇక్కడే కూర్చుందాం ..." మోహన్ కాళ్ళ మధ్య తన కాలుబెట్టి మెలిపెడ్తూ అంది రాధ.
    ఆ దెబ్బకి మోహన్ కింద ధనేల్ మని పడ్డాడు. రాధ అతని పక్కన కూర్చుంది.
    "ఛీ... నువ్వు చాల చిలిపిరాధా ... కదూ?" అన్నాడు బిక్కమొహం వేసి మోహన్.
    "లేకపోతే ఏంటి?... నేను చెప్పింది కాదంటే నాకు చిర్రెత్తుకొస్తుంది... తెల్సా?" అంది రాధ.
    "మా యింట్లో కూడా అంతే ... ఎవరైనా నాకెదురుచేప్తే నాకు చిర్రెత్తుకొస్తుంది... హిహి..." హుషారుగా అన్నాడు మోహన్.
    రాధ చురుకుగా మోహన్ వంక చూసింది.
    "మోహన్... ఓసారి లేచి నిలబడవా?" అడిగింది.
    "ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ "లేచి నిలబడు... నీకే తెలుస్తుంది..."
    మోహన్ లేచి నిలబడ్డాడు.
    రాధ చటుక్కున అతని రెండు కాళ్ల మధ్య తనకాలు పెట్టి మెలితిప్పింది.
    మోహన్ బ్యాలెన్స్ తప్పి మళ్ళీ  ఢమాల్ అని పడిపోయాడు.
    "ఏంటి రాధా!... మరీ నిముషానికోసారి ఇలా నీ చిలిపితనం ప్రదర్శిస్తే కష్టమే రాధా..."
    నవ్వలేక నవ్వుతూ అన్నాడు.
    "లేకపోతే ఏంటి?... మీ ఇంటి సంగతులు నాకెందుకు?... నా దగ్గర మాత్రం నాకెదురు చెప్తే చిర్రెత్తుకొస్తుంది... తెల్సా?" అంది రాధ మొహం చిట్లిస్తూ.
    మోహన్ నవ్వాడు.
    "మనం రెండేళ్ల క్రితం మొదటిసారి పార్కుకి వచ్చినప్పుడు నువ్వు అస్సలు మాట్లాడ్లేదు...నేను పది మాటలు మాట్లాడ్తే నువ్వు ఒక్క మాట మాట్లాడావ్... అప్పుడు ఎంత సిగ్గుపడ్డావనీ... ఆ... హిహి... ఇప్పుడు మాత్రం నీకు నా దగ్గర భలే చనువొచ్చిందిలే... హిహి... కదూ?"
    రాధ మోహన్ వంక చురుకుగా చూసింది.
    "అంటే నేను ఇప్పుడు కూడా అప్పట్లా ఉండాలనా నీ ఉద్దేశం?... ఏదీ... ఓసారి లేచి నిలబడు..."
    "హబ్బే... ఇప్పుడేందుకులే రాధా... నేనేదో అప్పుడు అలా ఉండేదానివి కదా అని ఊర్కె తల్చుకున్నా... అంతేగానీ ఇప్పుడు అలా ఉండమని కాదు... నాకు నువ్వు ఇప్పుడున్నట్టుంటేనే యిష్టం... హి!" అన్నాడు మోహన్ చేతులు నలుపుకుంటూ.
    "ఊ... అట్టారా దారికి".
    మోహన్ ఓసారి కళ్లు పెద్దవి చేసి పార్కు గేటువైపు చూసి ఠక్కున కప్పలా గెంతాడు పక్కన ఉన్న పొదవెనక్కి.
    "ఏంటలా గెంతావ్?... కొంపతీసి ఇక్కడికొచ్చేముందు ఏదైనా ఛైనీస్ రెస్టారెంటుకెళ్లి కప్పలకూర తిన్నావా ఏంటి?" పొదవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రాధ.
    "అదేం కాదుగానీ... నువ్వట్టా పొదవైపు చూడకు రాధా... ప్లీజ్. అటెటో చూస్తూ కూర్చో..." పొదవెనక నుండి మోహన్ రిక్వెస్టు చేశాడు.
    "ఏం?... ఎందుకని?..." అడిగింది రాధ.
    "పార్కులోకి మా చుట్టాలాయన ఒకతను ఫామిలీతో రావడం చూశా... అతను నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా?..." పొదవెనక నుండి జవాబు చెప్పాడు మోహన్.
    రాధ బాధగా నెత్తికొట్టుకుంది.
    "నీ మొహం.. మనం వచ్చేవారంపెళ్లి చేస్కోబోతున్నాం... అయినా ఈ భయం నీకెందుకూ?..."
    మోహన్ నాలుక కర్చుకుని పొద వెనకనుండి బయటికి వచ్చి రాధ ప్రక్కన కూర్చున్నాడు.
    "అలవాటు ప్రకారం ఎవరైనా తెల్సిన వాళ్లు కనిపిస్తే ఇదివరకట్లా దాక్కున్నా... హి..." అన్నాడు మోహన్ రాధతో.
    "అఘోరించలేక పోయావ్ గానీ మన పెళ్లి తర్వాతకొత్తగా కాపురం పెడతాం కదా... మరీ మన కొత్త సంసారానికి కావాల్సిన వస్తువులు కొసడం గురించి ఏమైనా ఆలోచించావా హిహి హిహి అంటూ ఇకిలించడమేవా?"
    "అదేంటి... పెళ్లయిన తర్వాత మీ వాళ్లు చీరా, సారె పెట్టి పంపించరా?..."
    ఆశ్చర్యంగా మొహం పెట్టాడు మోహన్.
    "ఆ... ఆ... అన్నీ పెట్టి పంపిస్తారు నీ మొహానికి" అంటూ రాధ మోహన్ బుగ్గమీద ఓ పోటు పొడిచింది.
    మోహన్ బిక్క మొహం వేశాడు.
    "లవ్ మ్యారేజ్ వల్ల కట్నం లేదూ పాడూ లేదు... కనీసం సంసారానికి పనికొచ్చే సామాన్లు కూడా పెట్టి పంపరా?..." నీర్సంగా అన్నాడు.
    "ఏంటీ?... నీ మొహానికి కట్నం కావాలా?... అసలు ఎవరైనా నిన్ను పెళ్లి చేస్కోడమే గొప్ప... ఇంకా కట్నం కూడానా? నువ్వే నాకు ఎదురు కట్నం ఇచ్చినా తక్కువే!!..."
    రాధ బాధగా నెత్తికొట్టుకుంది.
    "ఈ పెళ్లి ఖర్చులకోసమే బోల్డు అప్పులు చేశాను... ఇంక ఇంటికి కావాల్సిన సామాన్లు కొనడానికి ఇంకెంత అప్పు చెయ్యాలిరా భగవంతుడా... వా... వహ్హా..." ఏడుపు లంకించుకున్నాడు మోహన్.
    "చాల్లే ఊర్కో... ఎవరైనా చూస్తే బాగుండదు" అంటూ మోహన్ నెత్తిన ఒక జల్లకాయ్ కొట్టింది రాధ.
    "హిహి..." అన్నాడు మోహన్.
    "హర్రే!... జల్లకాయ్ కొట్టగానే భలేగా నవ్వావే!!... ఏదీ మరోసారి!"
    పఠాళ్ అని రాధ మోహన్ కి జల్లుకాయ్ కొట్టింది.   
    "హిహ్హి... హిహిహి... హ్హిహ్హిహ్హి" మళ్ళీ నవ్వాడు.
    "హర్రే!... గమ్మత్తుగా ఉందే... ఏదీ మరోసారి..." సడేల్ మని కొట్టింది ఈసారి.
    మోహన్ ఈసారి నవ్వలేదు... ఆమె వంక చిరుకోపంగా చూశాడు.
    "నేనేం నువ్వు జల్లకాయలు కొడ్తుంటే నవ్వడంలేదు... ఇంక జల్లకాయలు కొట్టమాకు" అన్నాడు.
    "మరెందుకు నవ్వుతున్నావ్?" అడిగింది రాధ.
    "సడ్డెన్న్ గా నాకో విషయం గుర్తుకు వచ్చింది... నేనేం ఇంటికి కావాల్సిన సామాన్లు మొత్తం కొనక్కర్లేదుగా!..." సంబరంగా అన్నాడు మోహన్.
    "ఏం?... ఎందుకు కొనక్కర్లేదు... కొంపదీసి నన్ను పెళ్లి చేస్కోకూడదని నిర్ణయించుకున్నావా ఏంటి?... ఏదీ...ఓసారి లే... లేచి నిలబడు..." సీరియస్ గా అంది రాధ.
    మోహన్ కిసుక్కున నవ్వాడు.
    "నన్నలా అపార్థం చేస్కోకు రాధా... మరేమో నేనలా ఎందుకన్నానంటే... మన పెళ్ళికి చాలా మంది ప్రజంటేషన్లు తెచ్చిస్తారుగా!!... వాటిల్లో మన ఇంటికి  పనికివచ్చేవి చాలా ఉంటాయి... లేనివి కొన్ని మాత్రం మనం కొనుక్కుంటాం... హిహి... కదూ?
    "నీకు భలే తెలివితేటలున్నాయే!..." అంటూ రాధ మోహన్ డిప్పమీద సంబరంగా ఠపేల్ మని వాయించింది.
    వారం రోజుల తర్వాత రాధ, మోహన్ ల పెళ్లి జరిగిపోయింది.
    పెళ్లికి వచ్చిన చాలామంది చేతిలో ప్రజంటేషన్ల ప్యాకెట్లతో వచ్చారు... పెళ్లి కాగానే అందరూ వధూవరులకు బెస్ట్ విషెస్ చెప్పి, వాళ్ల చేతిలో ప్యాకెట్లు  పెట్టి భోంచేసి వెళ్ళిపోయారు.
    పెళ్ళి హడావిడి తగ్గి వచ్చిన  స్నేహితులూ, బంధువులూ వెళ్లిపోయేసరికి రాత్రి పదకొండు గంటలైంది.
    రాధ, మోహన్ ఇద్దరూ గదిలోకి చేరారు.
    మోహన్ క్రాపు రివ్వున ఎగిరి మళ్లీ నొసలు మీద పడింది.
    "హబ్బా!... గాలి చాలా ఎక్కువగా వీస్తున్నట్టుంది ...కిటికీ తలుపులు వేసేద్దామా?..." రాధని అడిగాడు మోహన్.
    "నీ మొహం... అది బయటినుండి వచ్చిన గాలికాదు... నిద్దరొస్తుంటే నేను ఆవులించా... హిహి! మనం ఇహ నిద్దరోదామా?" అంది రాధ కళ్లు మిటకరిస్తూ.
    "అప్పుడేనా?... మనకి ఏమేం ప్రజంటేషన్లు వచ్చాయో చూస్కోవద్దూ?" అన్నాడు మోహన్ గది మూల కుప్పగా పడివున్న ప్రజంటేషన్లు ప్యాకెట్ల వంకచూపిస్తూ.
    "హవును కదూ?... ఆ విషయమే మర్చిపోయా" హుషారుగా అంది రాధ.
    ఇద్దరూ ప్రజంటేషన్ల మీద ఎగబడ్డారు.
    మొట్టమొదటి పాకెట్ మోహన్ విప్పాడు. అందులోంచి ఒక టేబుల్ లైట్ బయటపడింది.

 Previous Page Next Page