Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 24

    జీపు సాగర్ చేరుకుంది. మాధవి అక్కడ లేదు. సుశీలమ్మగారి కోసం వాకబు చేస్తే ఆ ఇల్లు తాళం వేసి వుంది. వాళ్ళు యాత్రలకి బయలుదేరారు. నెల్లాళ్ళవరకూ రారు అని తెలిసింది. మాధవి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిందని తెలిసింది. ఆమె ఏమైందో మిగిలినవాళ్ళందరూ ఏమయ్యారో, ఎక్కడున్నారో తెలీక తికమకపడ్డాడు అజయ్.
    "ఇప్పుడేం చేద్దాం అజయ్" బాధగా అడిగాడు కెప్టెన్ మనోహర్.
    "ఏదైనా హోటల్లో దిగుదాం. అక్కడినుంచి కార్యక్రమం ఆలోచిద్దాం" అన్నాడు అజయ్.
    మ్యూజియం చూడటానికి బోట్ లో ఎక్కుతున్నారందరు. అజయ్ ని చెయ్యి పట్టుకుని ఎక్కిస్తున్నాడు మనోహర్. బిలబిలమంటూ వచ్చారు స్కూలు పిల్లలు. పసిడి బొమ్మలలాంటి ముద్దొస్తున్న చిన్నారులు. రెండు మూడు తరగతుల్లో వున్న విద్యార్థినులు. మరికొంచెం పెద్ద అమ్మాయిలూ. వారు తీసే పరుగులకి అజయ్ నెమ్మదిగా నడుస్తున్నా అతని చేతి కర్ర ఒక అమ్మాయికి తగులుతుంది.
    "ఏయ్! ఎవరూ? కళ్ళు కనబడటంలా" అంది ఆ చిన్నారి.
    "సారీ పాపా! నాకు కళ్ళు లేవమ్మా. దెబ్బతగిలిందా?" అన్నాడు సౌమ్యంగా.
    "సారీ అంకుల్! నీకు కళ్ళు లేవని నాకు తెలీదు" అంది బాధగా.
    "ఫరవాలేదమ్మా!"
    "నీకు ముక్కు మీద దురదగా వుందనుకో నీ చెయ్యి వెళ్ళి సరిగ్గా అక్కడే గోకుతుంది. నీ చేతికి కళ్ళు లేవు కదా మరీ, సరిగ్గా అక్కడే ఎలా గోకింది చెప్పు?" అన్నాడు.
    "భలే! భలే! అవును. చేతులకి కళ్ళు లేవు కదా. మరిదానికి ఎలా కనబడుతుందబ్బా!" ఒక్కక్షణం ఆలోచించి దీనికి జవాబు చెప్పు" అంది.
    "మనకు కనబడని మరో కన్ను మనసులో వుంటుంది. అది అన్నీ చూపుతూ వుంటుంది" నవ్వుతూ అన్నాడు అజయ్.
    "మనసులో కన్ను వుంటుందని మా టీచర్ ఎప్పుడూ చెప్పలేదు అంకుల్. అందుకే మాకు తెలీదు"
    "అయితే కళ్ళు లేకపోయినా ఫర్వాలేదన్నమాట. మనసులో వున్న కన్ను అన్నీ చూస్తుందిగా!"
    పక్కనుండి సంభాషణంతా వింటున్న మేరీ టీచర్ ఇక ఆ ప్రస్తావన చాలించమని హెచ్చరించింది.
    మ్యూజియం వచ్చేసింది. ఒక్కొక్కళ్ళూ దిగుతూ వున్నారు. "శాంతి! అంకుల్ కి నువ్వు చూసినవన్నీ చెప్పాలమ్మా! ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలి సరేనా? అంది.
    "సరే టీచర్" అంది శాంతి.
    అజయ్ మనసు మనసులో లేదు. మాధవి పిలుపు ఆ చుట్టుప్రక్కల తనని రమ్మంటున్నట్లనిపిస్తుంది. శాంతో ఏదో ఒకటి చెబుతూనే వుంది. ఏ బొమ్మ చూసినా ఆ పిల్లకి ఏదో సమాధానం చెబుతూ నడుస్తున్నాడు అజయ్. కాప్టన్ మనోహర్ తో కొందరు పిల్లలూ, మేరీ కలిసి వెనకాల నడుస్తున్నారు.
    అజయ్ కి కళ్ళు ఎలా పోయిందీ, అదీ అంతా వివరించాడు మనోహర్. "అతని పేరు?" అడిగింది మేరీ.
    "కెప్టెన్ ఎ. కుమార్" అన్నాడు.
    కాసేపయ్యాక అందరూ అక్కడ ఆరుబయట జంబుకానా పరుచుకుని భోజనాలు ప్రారంభించారు. ప్రతి పాపా వారు తెచ్చినవేవో కుమార్ కీ, మనోహర్ కీ పెడుతున్నారు.
    "ఒద్దమ్మా! మీరు వినండి" అన్నాడు కుమార్.
    "ఒద్దనకండి. పిల్లలు ప్రేమతో పెడుతున్నారు. తీసుకోండి" అంది మేరీ.
    "ఎవరమ్మా మీరు" అడిగాడు కుమార్.
    "నేను ఇక్కడ కాన్వెంటులో టీచర్ ని. నాపేరు మేరీ. కెప్టెన్ మనోహర్ గారు మీ గురించి అంతా చెప్పారు. విధి ఎప్పుడూ మంచివాళ్ళనే వంచించుతుంది. దేశం కోసం మీరు చేసిన త్యాగానికి మీరు నిలువనీడ లేకుండా పోయింది. కుమార్ గారూ! నేను మీకు సోదరిలాంటిదాన్ని. మీకభ్యంతరం లేకపోతే మీ వాళ్ళ ఆచూకీ తెలిసేవరకూ మా ఇంటిలో వుండండి. నాకు ఇక్కడ ఎవరూ లేరు. మా వాళ్ళంతా కేరళలో వున్నారు. స్కూలుకి దగ్గరే మా యిల్లు" అంది మేరీ.
    "మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణీ. కానీ మీకెందుకండీ ఇంత శ్రమ. నా బాధేదో నేను పడతాను.
    "చూడు తమ్ముడూ! ఇది శ్రమే అనుకుంటే త్యాగానికీ, మంచితనానికీ విలువెక్కడుంటుంది? తోటి మనిషిగా, ఒక సోదరిగా, నా ఆహ్వానాన్ని అందుకోలేవా? మనోహర్ గారు మాత్రం ఎన్నాళ్ళు ఉంటారు? ఆ తరువాత నీ సంగతేమిటి? నట్టేటిలో నావలాగ కదూ? నీ వాళ్ళు కనిపించే వరకే నా దగ్గరుండమని కోరుకుంటున్నాను. ఒక త్యాగమూర్తికి సాయపడినానన్న తృప్తిని నాకివ్వమని వేడుకుంటున్నాను" అంది మేరీ.
    "అక్కా! నీది ఎంత పవిత్రమయిన మనసు!" అన్నాడు.
    "అంకుల్! నువ్వు మా మేరీ టీచరింటిలో వుంటే మేము రోజూ నిన్ను చూడొచ్చు. వుండిపో అంకుల్" అంది శాంతి.
    "పిల్లల మాట కాదనకు తమ్ముడూ" అంది మేరీ.
    "అలాగే అక్కయ్యా. తప్పకుండా వుంటాను. దిక్కు దివాణం లేదనుకున్న నాకు నువ్వూ, ఇంతమంది పిల్లలూ ఆప్యాయంగా ఆదరించడం, ఆహ్వానించడం నా భాగ్యం కాదూ! తప్పకుండా వుంటాను" అన్నాడు.
    "వెరీగుడ్ అంకుల్" అన్నారు పిల్లలు.   

 Previous Page Next Page