ఈ గార్డ్స్ ని తనే ఇంటర్వ్యూలో సెలక్టు చేశాడు. అంటే వారు ఇంటర్వ్యూలో సెలక్టయ్యేటట్లు శ్రీరంజని మానేజ్ చేసిందన్నమాట.
బహుశా మిగతా అప్లికేషన్స్ అన్నీ ఆమె చింపి పారేసి వుండాలి.
సెక్యూరిటీ గార్డ్స్ అందరూ బహుశా సిద్ధార్థ మనుషులయి వుంటారు.
చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా మనుషులను ప్లాన్ చేస్తున్నారు తనచుట్టూ. అంటే తనను ఖచ్చితంగా చంపేయడానికే పథకం వేశారు.
అతనికి రెండు క్షణాల వరకూ తెలియదు అది గుండె నొప్పని.
తెలిసేసరికి సముద్ర కెరటంలా విరుచుకు పడిందది.
"అబ్బా!" అంటూ ఛాతీ పట్టుకుని నేలమీద కూలిపోయాడతను.
విజయ్, మధు ఆందోలనగా ఆమెవేపు చూశారు.
శ్రీరంజని అతనివేపు కసిగా చూసింది.
"భగవంతుడే నీ పాపానికి చక్కని శాస్తి చేస్తున్నాడు. చూశావా! నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించాడు."
నిరంజన్ కి చెమటలు పట్టేస్తున్నాయి. భయంకరమయిన గుండె పోటు.
"రంజనీ ప్లీజ్! డాక్టర్ కి ఫోన్ చెయ్! అపోలో ఎమర్జెన్సీ వాన్ ని తెప్పించు. లేకపోతే చచ్చిపోతాను."
శ్రీరంజని నవ్వింది వికృతంగా.
"చాలా తీపి ఉంది ప్రాణం మీద నీకు. కానీ ఏం లాభం? నువ్వు చేసిన పాపం నిన్ను కబళించబోతోంది.
నిరంజన్ నొప్పితో విలవిలలాడుతున్నాడు. కళ్ళు తేలేస్తున్నాడు. నోటి వెంబడి నురగ.
"శ్రీరంజనీ! దణ్ణం పెడుతున్నాను. నన్ను చంపకు."
"విజయ్, మధూ! మీరెళ్ళిపోండి. ఎవరినీ లోపలకు రానీయవద్దు. ఎవరికీ ఈ విషయం చెప్పకండి. మనం ముగ్గురం ఇక్కడకు రాలేదు. మన ముగ్గురికీ అతని కేకలు వినిపించలేదు. ఉదయం నుంచీ మనం అసలు అతనిని చూడలేదు. అతనితో మాట్లాడలేదు. ఓకే?"
వాళ్ళిద్దరూ గన్స్ భుజానికి తగిలించుకుని బయటకు వెళ్ళిపోయారు.
నిరంజన్ కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతున్నాయి.
శ్రీరంజనిని వివాహం చేసుకుని తను ప్రాణానికే ముప్పు కొనితెచ్చుకున్నాడు.
తనిప్పుడు కన్ను మూస్తే దీప గతేమవుతుంది?
శ్రీరంజని గది తలుపు మూసేసి వెళ్ళిపోయింది.
భగవంతుడా! ఇప్పుడు తన కేకలు ఎవరికీ వినిపించవు.
పక్క గదిలో కూర్చున్న స్టెనోకి, తన సెక్రటరీకి కూడా వినిపించవ్.
అంతలోనే అనుమానం వచ్చిందతనికి. అవును! వాళ్ళు కూడా శ్రీరంజని మనుషులు కాదుగదా! అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి.
మరికాసేపటికి డాక్టర్స్ హడావుడిగా వచ్చి నేలమీద పడివున్న నిరంజన్ ని పరీక్షించారు.
"హి ఈజ్ డెడ్!" అన్నాడొకతను.
"మైగాడ్! అబద్ధం. ఆయన చనిపోలేదు" అంది శ్రీరంజని ఏడ్చేస్తూ.
"సారీ మేడమ్! మేము చెప్పింది నిజమే! అదివరకే మిస్టర్ నిరంజన్ కు చెప్పాము హెల్తు విషయంలో కేర్ గా వుండమని. వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కొద్దిరోజులు దూరం ఉంచమని కూడా అన్నము. ఆయన వినలేదు" డాక్టర్స్ వెళ్ళిపోయారు.
నిరంజన్ సెక్రటరీ వచ్చాడు శ్రీరంజని దగ్గరకు.
"ఇప్పుడు మేమేం చేయాలో చెప్తే ఆ ఏర్పాట్లన్నీ చేస్తాం మేడమ్!"
"ఈ విషయం దీపకు టెలిగ్రాం ఇవ్వండి. టెలిగ్రాం ఎలా ఇవ్వాలంటే ఇవాళ దీప, దీప ఫ్రెండ్స్ అందరూ జైపూర్ నుంచి ఉదయ్ పూర్ కి బయల్దేరుతారు కాబట్టి టెలిగ్రాం జైపూర్ కివ్వాలి. ఎల్లుండి ఉదయ్ పూర్ నుంచి ఆగ్రా చేరుకుంటారు కాబట్టి ఉదయ్ పూర్ కి ఎల్లుండి టెలిగ్రాం ఇవ్వాలి. అలా చేస్తే ఆమెకు టెలిగ్రాం అందకుండా వుంటుంది. ఆమె తిరిగి హైద్రాబాద్ చేరుకునేవరకూ తండ్రి చనిపోయిన విషయం ఆమెకు తెలీకూడదు. అర్థమయిందా?"
అతను నవ్వాడు.
"అర్థమయింది మేడమ్!"
"అయితే వెళ్ళిక."
అదే రోజు నిరంజన్ అంత్యక్రియలు జరిగిపోయాయ్.
వారం రోజుల తర్వాత దీప ఫోన్ చేసింది.
"హలో! డాడీతో మాట్లాడతాను. ఇంట్లో ఉన్నారా?"
"అయామ్ సారీ దీపా! నిన్ను కాంటాక్టు చేయడానికి పదిరోజుల్నుంచీ ప్రయత్నిస్తున్నాము. కానీ నీ వేర్ ఎబౌట్స్ గురించి తెలీటం లేదు."
"ఎందుకు? నాతో ఏమిటి పని?"
"నీకో విచారమైన న్యూస్ చెప్పటానికి."
దీప కొద్దిక్షణాలు మాట్లాడలేకపోయింది.
"ఏం జరిగింది పిన్నీ?"
"ఇంక నీకు డాడీ లేరమ్మా!"
దీప ఫోన్ వదిలేసింది.
ఆమె ఫ్రెండ్స్ చుట్టూ మూగారు.
"ఏమిటి ఏం జరిగింది?" అడిగింది సుచిత.
దీప హఠాత్తుగా వెక్కివెక్కి ఏడ్చేయసాగింది.
"ఏమయింది మాన్? అలా ఏడుస్తావేమిటి?"
"మా డాడీ...పదిరోజుల క్రితం చచ్చిపోయారట!"
"మైగాడ్!"
ఆ రాత్రికే హైద్రాబాద్ చేరుకుందామె.
శ్రీరంజని ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకుంది. ఆమెను చూస్తూనే దీప ఏడ్చేసింది. తనను ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడూ తన తండ్రే వస్తుండేవాడు.
దీపను దగ్గరకు తీసుకుని ఓదార్చింది శ్రీరంజని.
"మనిద్దరికీ బ్యాడ్ లక్. ఎంత ప్రయత్నించినా మర్చిపోవటం సాధ్యం కావటంలేదు."
ఇల్లు చేరుకున్నారిద్దరూ.
దీప ఏడుస్తూ తన గదిలోకెళ్ళిపోయింది.
రెండు రోజుల వరకూ దుఃఖం నుంచి కోలుకోలేదామె. గదిలో నుంచి బయటకే రాకుండా గడిపింది.
మూరో రోజు రాత్రి రెండుగంటలకు హఠాత్తుగా మెలకువ వచ్చిందామెకి.
ఎందుకో ఆ సమయంలో తండ్రి గుర్తుకొచ్చాడు. ఇంక నిద్రపట్టలేదామెకి.
లేచి తన గదిలోనుంచి బయటకు నడిచింది. ఇంకా శ్రీరంజని గదిలో లైట్లు వెలుగుతూండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆమెక్కూడా తనలాగే నిద్రపట్టటం లేదేమో! ఆమె గది దగ్గరకు నడిచింది దీప.