Previous Page Next Page 
జయ - విజయ పేజి 24


    "అతిథిని ఇలా నుంచోబెట్టే మాట్లాడతారా?"
    "కానీ మా వార్డెన్ చూసిందంటే గొడవయిపోతుంది."
    "ఎవరూ చూడరు. తలుపులు మూసేస్తే మనిద్దరం ఇక్కడ మిగులుతాం."
    జయ భయంగా పక్క బెడ్ వేపు చూసింది.
    "మా రూమ్మేట్ ఉందా బెడ్ మీద. మీరెందుకొచ్చారు త్వరగా చెప్పండి.
    ఆమె నిద్ర లేస్తే అసహ్యంగా ఉంటుంది."
    జయా! మిమ్మల్ని చూడాలని అనిపించింది. తెల్లారేవరకూ ఆగాలని ప్రయత్నించాను గానీ, నా వల్ల కాలేదు. అందుకని వచ్చేశాను."
    జయ మనసంతా అదోలా అయిపొయింది.
    తనమీద అంత ప్రేమా?
    "కానీ..."
    అతను ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాడు.
    జయకు అతనిని అడ్డగించాలనిపించటం లేదు. అతను మరింత గాఢంగా గుండెకు హత్తుకుంటే బాగుండుననిపిస్తోంది.
    "జయా! ఇంక నీకు దూరంగా ఉండటం నా వల్లకాదు."
    ఆమెను గాలిలో కెత్తి బెడ్ వేపు నడవ సాగాడతను.
    జయకు కలవరంగానూ ఉంది.
    బెడ్ మీద అతని కౌగిట్లో నలిగిపోతోంది.
    ఒకరిలో ఒకరు ఇమిడిపోతున్న సమయంలో పక్క బెడ్ మీద నిద్రపోతున్న రూమ్మేట్ నిద్ర లేచింది.
    వారిద్దరినీ చూస్తూనే కెవ్వు కేక వేసింది.
    జయ కంగారుపడి లేచి కూర్చుంది.
    అప్పుడు తెలిసిందామెకి. అదంతా కల అని.
    ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది.
    ఏమిటిలాంటి కల వచ్చింది?
    తనూ చంద్రకాంత్ ని ప్రేమిస్తోందా?
    అతనిని కోరుకుంటుందా?
    టైమ్ చూసిందామె.
    తెల్లవారుజామున నాలుగవుతోంది.
    తను చంద్రకాంత్ ని ప్రేమిస్తే తప్పేమిటి?
    విజయ ఎలాగూ అతనిని చేసుకోదు.
    అలాంటప్పుడు తను కోరుకున్న వ్యక్తిని చేసుకుంటే నష్టం ఏమిటి?
    ఆమెకు హఠాత్తుగా కిషోర్ గుర్తుకొచ్చాడు.
    అవును. కిషోర్ సంగతేమిటి?
    అతనికీ తను మనసిచ్చింది.
    అతనినీ తను ప్రేమించింది.
    మరిప్పుడు చంద్రకాంత్ ని కూడా ఎలా ప్రేమించగలదు?
    ఆమె ఎటూ తేల్చుకోలేకపోతోంది.
    కిషోర్ ఢిల్లీ వెళ్ళి చాలా రోజులయిపోయింది.
    ఇంతవరకూ తనకు ఉత్తరం రాయలేదు.
    ఎందుకని?
    తనమీద అతనికి ఆసక్తి సన్నగిల్లిపోయిందా?
    ఏమో!
    అతనికి ఆరోజు తను మాట్లాడిన మాటలు నచ్చలేదేమో! తనను పెళ్ళి చేసుకోవాలన్న అభిప్రాయం మార్చుకున్నాడేమో!
    తను మాత్రం అతని కోసం జీవితాంతం వేచి ఉండటం, అతని కోసం దుఃఖించటం, అతను లేందే జీవితమే లేదని అనుకోవటం...అలాంటి పిచ్చి పనులేమీ చేయదు! అవన్నీ తెలుగు సినిమాల్లో కనిపించే పాత్రలు.
    నిజ జీవితంలో అలా జరగదు.
    తనకు తెలిసిన వారెవరూ అలా ప్రవర్తించలేదు. మరో వ్యక్తితో సెటిలయిపోయారు.
    తన క్లాస్ మేట్ రాధిక సంగతయితే మరీ ఘోరం. ఆమె ముగ్గురు స్టూడెంట్స్ ని ప్రేమించింది.
    ముగ్గురితోనూ సినిమాలకూ, పిక్నిక్స్ కీ వెళ్తూంటుంది. ముగ్గురితోనూ హోటల్ రూమ్ కెళ్ళినప్పుడు ఆ గొడవ బయటపడింది.
    మర్నాడు హాస్టల్ నుంచి ఆఫీస్ కి బయల్దేరేసరికి ఎదురుగ్గా నిలబడి కనిపించాడు చంద్రకాంత్.
    "ఏమిటింత పొద్దున్నే?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "రాత్రంతా మీరే కలలో ఉన్నారు. వెంటనే మిమ్మల్ని చూడాలనిపించింది. అందుకని..."
    జయకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది.

 Previous Page Next Page