"ఆఁ......ఆఁ....కోప్పడకోయ్!.....కాఫీ యింకా పడలేదు. అందుకని ఉత్సాహం రావడంలేదు!" అన్నాడు సుందర్రావు.
"ముందు యీ వేడివేడి జిలేబీలు, బజ్జీలు ఆరగించండి....." అంటూ ప్లేట్లు తెచ్చి, అందరికి అందించింది పూర్ణ.
"ఉషా, కూర్చుండి పోయావేమిటి? లేచి మీ ఆయనకి కాఫీ, ఫలహారాలు సొంతంగా యిచ్చుకో." మేనకోడలికి బాధ్యత గుర్తు చేస్తూ అంది పూర్ణ. ఉష సిగ్గుపడి కదలలేదు.
"సిగ్గేమిటమ్మా!.....తీసుకువచ్చి యియ్యి!" అప్పుడే వచ్చిన రామం కూతురికి ధైర్యం యిచ్చాడు.
"పోనీ, ఆ గదిలోకి వెళ్ళవోయ్, అక్కడికి తీసుకువస్తుంది!" అని అల్లుడిని లోపలికి పంపించాడు.
"స్వహస్తాలతో భార్యామణి అందిస్తేగాని కాఫీ రుచించ దేమిటోయ్?" సుందర్రావు కొత్త పెళ్ళి కొడుకుని హాస్యం చేశాడు.
"స్వానుభవం కాబోలు!" అని రామం బావగారికి బదులు చెప్పాడు. అందరూ నవ్వారు. ఆ పూట అంతా నవ్వులతో, ఛలోక్తులతో, హాస్యాలతో, ఆటలతో ఉల్లాసంగా గడిపారు అందరూ.
* * *
"అయితే మన ప్రయాణం ఎప్పుడు? కృష్ణుడు, పూర్ణ రేపు వెళ్ళి పోతామంటున్నారు" అన్నారు జగన్నాథంగారు భార్యతో ఆ రాత్రి.
"మీరూ అప్పుడే వెళ్ళడం ఏమిటి, ఎవరో దూరపు బంధువులు లాగ" అంటున్నాడురామం. ఓ పది రోజులుండి సావకాశంగా వెళ్ళవచ్చునంటున్నాడు. మీనాక్షి కూతురితో మూడు నిద్రలకి వియ్యాల వారింటికి వెడుతుందిట. కాస్త యిల్లు కనిపెట్టుకుని వుండమంది వచ్చేవరకు." పార్వతమ్మ అంది.
"ఉహూఁ; అయితే మనం మిగులుతా మన్నమాట, అందరూ వెళ్ళినా. అన్నట్లు శకుంతల ప్రయాణం ఎప్పుడు!...."
"అదీ రేపే వెడతానంటోంది.....రామం దాన్ని కాస్త మంచి డాక్టరుకి చూపించి మందు రాయిస్తాను, ఉండిపొమ్మంటున్నాడు.....దానికి మీరైనా కాస్త చెప్పండి. అయిం దెలాగూ అయింది, యింకా యిప్పుడు యిలా కోపాలు, పంతాలు పెట్టుకుని ఆరోగ్యం చెడగొట్టుకోడం వల్ల యేం లాభం! ఒంట్లో కాస్తయినా శక్తిలేదు దానికి. ఆ గండం గడిచి పిండం బయట పడాలా?"
"నేను చెప్పడానికేం? అలాగే చెపుతాను.....పోనీ, ఒక నెలో రెండు నెలలో వచ్చి మనదగ్గిర ఉంటుందేమో అడగమన్నావా యేమిటి! నెల్లాళ్ళ పాటు వచ్చి వుంటే తేరుకుంటుందేమో!"
"మీకంటే ముందేఅడిగానామాట!'నా పిల్లలకి పురుళ్ళు పోసే వయసు వచ్చింది. ఇంకా మీచేత పురుళ్ళు పోయించుకో మంటావా? అసలే సిగ్గుతో చస్తున్నాను. అయినా, ఎలాగ కుదురుతుందమ్మా? పిల్లల చదువులు అవీ-వాళ్ళని వదిలి ఎలా వస్తానంది?"
"ఆ మాటా నిజమేలే!....అయినా చెపుతాను దానికి!" నిట్టూర్చాడు జగన్నాథంగారు.
* * *
మర్నాడు ఉదయం అందరూ ప్రయాణాలు పెట్టుకున్నారు. సరదాగా యింకో నాలుగు రోజులు ఉండాలని వున్నా, ఉద్యోగ బాధ్యతలవల్ల తప్పనిసరిగా ప్రయాణాలు పెట్టుకున్నారు.
మీనాక్షి అందరికి కొత్త బట్టలు పెట్టింది. మినపసున్ని, అరిసెలు పొట్లాలు కట్టి యిచ్చింది. శంకర్ విమానంలో ఢిల్లీ వెళ్ళాడు. కృష్ణమూర్తి రైల్లో వెళ్ళాడు. పూర్ణ, సుందర్రావు కారులో బయలుదేరారు.
ఆ మర్నాడు ఉదయం పెళ్ళికొడుకుని, పెళ్ళికూతుర్ని తీసుకుని వియ్యాల వారింటికి ప్రయాణ మయింది మీనాక్షి.
కూతురి నూతన సంసారానికి కావలసిన ఫర్నిచర్ కోసమని వెయ్యిరూపాయలకి చెక్కు యిచ్చాడు రామం. వంట సామానులన్నీ యేదీ మరచిపోకుండా ముందే కొని ఉంచింది మీనాక్షి. అవికాక, ఉషకి వచ్చిన పెళ్ళి బహుమతులతో ఓ గదికి గదే నిండిపోయింది. మీనాక్షికి ముందు రోజంతా ఆ సామానులన్నీ సర్దడంతోనే సరిపోయింది. కూతురికి యింకా యివ్వవలసినవి యేమేం మరచిపోయిందో అన్నీ జ్ఞాపకం చేసుకుని పెట్టెలన్నీ సర్దింది. అక్కడ మూడు నిద్రలు అయ్యాక, నూతన దంపతులొక నెల రోజులపాటు హనీమూన్ కి వెళ్ళి, అక్కడనుంచి అత్తవారింటికి వచ్చి సామానులన్నీ తీసుకుని, సుధాకర్ ఉద్యోగపు టూర్ కి వెళ్ళడం నిశ్చయం అయింది. కూతురు మళ్ళీ యిక్కడికి రాదు కాబట్టి యేదీ మరచిపోకుండా అన్నీ సర్దమని భార్యను పురమాయించాడు రామం.
ఉష తన వస్తువులన్నీ సర్దుకుంటూ మధ్యమధ్య ఎవరూ చూడకుండా కళ్ళ నీరు తుడుచుకుంటూంది. తన గది, తన మంచం, తన పుస్తకాలు, తను పుట్టి పెరిగిన యిల్లు, తనని ప్రాణంగా పెంచిన తల్లినీ, తండ్రినీ ఒక్కసారిగా వదిలి వెళ్ళాలంటే ఏ ఆడపిల్లకన్నా బాధే అనిపిస్తుంది. భర్త ఎంత అనురాగంతో చూసేవాడైనా కనిపెంచిన తల్లి దండ్రులను వదిలి వెళ్ళడం ప్రతీ ఆడపిల్లకీ కష్టంగానే ఉంటుంది! కాలక్రమాన తన సంసారం యేర్పరచుకుని, కొత్త వాతావరణంలో యిమిడిపోయి, మామూలు అవడమూ సహజమే!
ఒక్కగానొక్క కూతుర్ని అత్తవారింటికీ పంపుతూ ఆడదాని లాగ ఏడ్చాడు రామం. ఉషని దగ్గిరికి తీసుకుని తల నిమురుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు, తండ్రికి పాదాభివందనం చేసి తండ్రిచేతుల్లో ముఖం దాచుకు ఏడ్చింది ఉష. కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని. అల్లుడిని అనేకవిధాల కోరాడు. మళ్ళీ మూడు నాలుగు నెలలలోపల ఒకసారి పంపేటట్లుమాట తీసుకున్నాడు.
వెళ్ళేముందు తాతగారికి, బావకి నమస్కారం చేసింది ఉష. "వెయ్యేళ్ళు సుమంగళిగా, సుఖంగా కాపురం చేసుకో తల్లీ!" అంటూ మనవరాలిని మనసారా ఆశీర్వదించి, అక్కున చేర్చుకున్నారు జగన్నాథంగారు. సుధాకర్ ఆయన ప్రక్కకి వచ్చి, "తాతగారూ! మీ మేలు ఎన్నటికి మరవలేను. ఉషని నాకు యిచ్చిన మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియడంలేదు" అని మెల్లిగా ఎవరూ వినకుండా తన మనసులోని కృతజ్ఞతని, ఆనందాన్ని వెల్లడించాడు.
"నేను చేసిందేముంది, నాయనా! మీ యిద్దరికీ రాసిపెట్టి ఉంది?" అన్నారాయన సుధాకర్ భుజం తడుతూ.
భర్త వైపు అనురాగంతో చూసింది ఉష, అంత దుఃఖంలోనూ.
"మా ఉష ఉత్త అమాయకురాలు బాబూ! దాన్ని ఎలా చూసుకుంటావో, ఏ మాత్రం కష్టం సహించ లేదు అది." అంది పార్వతమ్మ.