తార గది నుంచి ఎవరో ప్రొడ్యూసర్లు , నటులు రావడం. తను చూసినప్పుడు ఎర్రబడ్డ తార మొఖం -- ఆ ఎర్ర దనం తను అలా చూడడం వల్ల వచ్చిందో, నిజంగా తప్పు చేసినందు వల్ల వచ్చిందో అప్పుడు గ్రహించలేని తను, పెళ్ళయ్యాక అవన్నీ చూస్తూ తప్పుకుని ఏం తెలీనట్టు వెళ్ళిపోయే తను.... రెండు మూడు సారులు ఆమె మాటల తడబాటు , ఆ నిషా అన్నీ స్వయంగా చూసిన దృశ్యాలు.
పత్రికలలో నటీమణుల గురింఛి రాసే వార్తలు నిజాలా అబద్ధాలా - నిజం కాకపోవడం ఏమిటీ -- తార పుట్టిం రోజు అందరూ , తారని భుజాల చుట్టూ చేతులు వేసుకు కౌగలించుకోడం, బుగ్గల మీద ముద్దులు పెట్టుకోడం -- ఏదీ మాములు ఆడదాని మీద అలా చేతులు వేస్తారా?
తార ఫోనులో మాటలు, ఒకసారి హీరో శ్యామ్ తార స్టూడియోలో ఆడుకునే హాస్యాలు , మాటలు . మరోసారి స్టూడియోలో తార వినడం లేదని ప్రొడ్యూసరు ,మేకప్ మేన్ తో "హీరోయిన్ గారికి ...... కట్టవయ్యా" అన్న మోటు మాటలు, షూటింగులో ఒక్కొక్కరోసారి వచ్చి మొహం బుజాలు అటు ఇటు తిప్పడం, చీర కొంగులు సర్దడం -- ఇవన్నీ హీరో యిన్ మొగుళ్ళు భరించాల్సిందేనా? సుందరి తార గావడానికి ముందు తనకి తెలియని నిజాలు ఇంకా ఏమున్నాయో! ఆ ఎక్స్ట్రా సప్లయర్ సుందరిని వూరికే అన్నాళ్ళూ వుంచుకున్నాడా ఇంట్లో? సుందరిని ఆ మొదటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వూరికేనే సినిమాలో చాన్సు ఇచ్చేసారా? - సినీనటి గావాలంటే - అందరూ అనుకునే వన్నీ త్యాగాలు చేయాలా? ఈ మాటల్లో నిజం ఉందా? వుంటే తన కెందుకు లేకపోతే తన కెందుకు.
--లక్ష అనుమానాలు , లక్ష దృశ్యాలు కళ్ళ ,ముందు కదిలి పోయాయి రాత్రంతా. ఓసారి "అయ్యో పాపం తార తనని నిజంగా ప్రేమించింది. తార అమాయకురాలు. ఆ ఇంట్లో సుఖం, శాంతి లేదు ఆమెకి! తనని డబ్బు కోసం కాక తనని తానుగా ప్రేమించే మనిషిని కోరుకుంటుంది. ఆ మనిషి తనవ్వాలని ఆమె ఆశ! ఆమె ఆశలని కలలని నిర్దాక్షిణ్యంగా చీల్చేయడమేనా!
భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు పెట్టుకుని, సిగ్గు బిడియం అన్నీ విడిచి తన దగ్గిర కొచ్చి కన్నీళ్ళతో బ్రతిమాలాడింది --- నీవు లేకుండా బ్రతకలేనంది. ఇంతలా ప్రేమించే స్త్రీకి అందచందాలు వుండాలా? మనసుంటే చాలదా! ముందే జీవితం గడిపిందో తన కెందుకు-- ఇప్పటి ఆమె ప్రేమ చాలదూ! తను కోరితే నట జీవితానికి స్వస్తి చెప్పేస్తుంది . కాని ..... ఓసారి డబ్బు రుచి మరిగాక ఆ మాట మీద నిలకడగా వుంటుందా! అలా అన్న ఎందరో మళ్ళీ నటించడం ఆరంభించలేదు! డబ్బు....డబ్బు, దాని ముందు తన మాటకి విలువ ఇస్తుందా? తనూ డబ్బుకి లొంగిపోకుండా తన జీతంతో సరిపెట్టుకోగలిగే నిబ్బరం వుందా? ------ కోరి తద్దినం తెచ్చుకోడం కాదూ, యీ బెడద అంతా కౌగలించుకోడం, ఏ లేనింటిదాన్ని చేసుకుంటే తనకి ఓ భర్తగా గౌరవం లభిస్తుంది ------ తారని పెళ్లాడితే తనన్నీ వదిలేసుకోవాలి --- అందుకు సిద్దపడగలిగితే తారని, తార చేతలని ఆమోదించే హృదయ వైశాల్యం వుందా----- అసలు తార మీద తనకే ప్రేమా లేదు. మరింకా దేని కోసం యీ పెళ్ళి ! డబ్బు కోసమా! ఆమె మీద జాలి పడా! ఆమె మీద జాలితో తన జీవితం నాశనం చేసుకోవాలా! తారని పెళ్ళాడితే నాశనం అవుతుందా తన బ్రతుకు -----
ఆలోచనలతో సారధి బుర్ర వేడెక్కి పోయింది. ప్రక్క మీద దొర్లి దొర్లి నిద్ర పట్టక తలుపు తీసుకుని బయటికి వచ్చి వరండాలో నిల్చున్నాడు.
బయట పండు వెన్నెల కురుస్తుంది చల్లగా. ఆకాశం నిండా లెక్కలేనన్ని తారలు మిణుకుమిణుకు మంటున్నాయి అందంగా మెరుస్తున్నాయి.
అలా చూస్తుంటే ఓరోజు తార అన్నమాట గుర్తు వచ్చింది -----"ఆకాశంలో మిలమిలలాడే అందమైన తారలని అక్కడి కెళ్ళి చూస్తె ఏముంది గుంటలు గోతులు తప్ప -- మా బ్రతుకులూ అంతే!"
ఎంత నిజం -- ఆ తారలని దూరం నుంచి చూస్తేనే వాటి అందం! అవి అందుకోవాలని ప్రయత్నించనంతవరకే వాటి మిలమిల! అందుకున్నాక ఏముంది బుగ్గి, మన్ను గుంటలు, గతుకులు! ఆకాశంలోని తారలని అందుకోవాలని ఆశించడం అవివేకం గదూ!.......
అలా చాలాసేపు చూసి సారధి లోపలి వచ్చి లైటు వేసుకుని కాగితం కలం తీసుకున్నాడు.
--------