శ్రీభగవానువాచః
అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః 11
అర్జునా! ఏడువకూడని దానికై ఏడుస్తున్నావు. పైగా ప్రజ్ఞను పేలుచున్నావు. ప్రాణములు వున్నవారిగురించిగాని, పోయిన వారి గురించిగాని, పండితులగువారు దుఃఖించరు.
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయ మతః పరమ్ 12
నీవు నేను యీ రాజన్యులు పూర్వము లేరు. భవిష్యత్తులో వుండరు. మనమంతా వర్తమానులము.
దేహినో -స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి 13
ఈ దేహములో ప్రాణముంటుంది. అప్పుడు బాల్యము యవ్వనముగా, యవ్వనము వార్ధక్యముగా పరిణమిస్తుంది. మరో దేహానికి మారటముగూడా అలాంటి పరిణామమే. అందుకు జీవుడైనవాడు చలించడు.
దీపిక:
స్వామీ తనను అర్జునునితోను, ఇతరాదుల తోనూ పోల్చుకొనుచున్నారు.
స్వామి స్వామియే, సేవకుడు సేవకుడే.
పదమూడవ స్లోకమున పరిణామవాదమును ఉపదేశించినాడు.
కాలములో ఏ లిప్తయు నిలిచియుండదు. ప్రతిక్షణము పరిణామమే. బాల్యము, యవ్వనము, జరా ఇవి దేహములో వచ్చు ప్రధాన పరిణామములు మాత్రమే. సమస్త సృష్టి, మార్పులేక, పరిణామము మీదనే ఆధారపడియున్నది. ఈ పరిణామము సమస్త సృష్టికి వర్తించునది. స్థావరజంగములు మాత్రమే గాదు సూర్యచంద్రగ్రహనక్షత్రాదులకు గూడా యీ పరిణామము వర్తించుచున్నది. వాటి కాలము లెక్కలు వాటివి.
ఈ జీవితము నిశ్చితము గాదు. మరో జీవితమునకు ప్రయాణము తప్పనిసరి. బాలుడు యవ్వనుడైనప్పుడు. యవ్వనుడు వృద్దుడైనప్పుడు ఎవ్వడు దుఃఖించడు. మృత్యువు మరో దేహమునకు పయనమే. అప్పుడెందుకు శోకము? ఇది తెలిసిననాడే నిజమైన విద్వాంసుడు.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ! శీతోష్ణ సుకదుఃఖదాః
ఆగమాపాయినో - నిత్యాః తాం స్తితిక్షస్వ భారత! 14
అర్జునా! విషయములు, ఇంద్రియములు వేరు వేరు. వీటి కలయిక వల్లనే, చలి, వేడి, సుఖము, దుఃఖము కల్గుచున్నవి. అవి పుట్టిగిట్టునవి. వాటిని గురించి పట్టించుకొనకుము.
దీపిక:
స్వామీ! విషయములు నీ సృష్టియే. ఇంద్రియములు నీ సృష్టియే. వాటి కలయిక నీ మహిమయే. చలి, వేడి, సుఖము, దుఃఖము నీ సృష్టియే వానిని పట్టించుకొనకుండుట సామాన్యులకు సాధ్యమా స్వామీ!
యం హి న వ్యథయంతి ఏతే పురుషం పురుషర్షభ
సమ దుఃఖసుఖం ధీరం సో -మృతత్త్వాయ కల్పితే 15
విషయములను, దేహములను, వాటి సంగములను ఎవడు గ్రహించుచున్నాడో అట్టివాడు సుఖదుఃఖములను సమముగా భావించుచున్నాడు. అతడు అమృతత్వమును చేరకోనుచున్నాడు.
నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః
ఉభయో రపి దృష్టో-౦త త్వనయో స్తత్త్వదర్శిభిః 16
అవినాశి తు తద్విద్ది యేన సర్వ మిదం తతమ్
వినాశ మవ్యయస్సాస్య న కశ్చిత్కర్తు మర్హతి 17
అసత్యమునకు ఉనికిలేదు. సత్యమునకు తుదిలేదు. ఈ విషయములు తెలిసినవాడే తాత్వికుడు.
దీపిక:
సృష్టిసాంతము అసత్యము. స్వామి మాత్రమే సత్యము. ఇది తెలిసినవాడు జ్ఞాని అగుచున్నాడు. శంకర భగవత్పాదులు అద్వైతమను ప్రవచించినాడు. ఇది సాంతము బ్రహ్మమే అనుట అద్వైతము. బ్రహ్మము వేరుగా ఉండదు. ఒక శిష్యుడు శంకరుని ఒక సంశయమును అడిగినాడు. 'ఆచార్యా సృష్టి భిన్నముగా కన్పించుచున్నది గదా! సృష్టి సమతము ఏకబ్రహ్మము ఎట్లు అగును?' శంకరుడు మాట్లాడలేదు. ఒక అమావాస్యనాటి రాత్రి ఆ శిష్యుని మేల్కొలిపినాడు. తన వెంట రమ్మన్నాడు. ఉభయులు సాగినారు. ఒకచోట శిష్యునకు పాము కన్పించినది. భయమున శిష్యుడు పలాయనము చిత్తగించినాడు. శంకరుడు అతనిని తన వెంట తీసుకొని సాగినాడు. ఈ లోగా మరియొక శిష్యుడు దీపము తీసుకొని పామువున్న స్థలము చేరినాడు. గురుశిష్యులు అక్కడకే చేరినారు. నాయనా చూడు అది పామా! తాడా! అని ఆచార్యుడు అడిగినాడు. స్వామీ అది తాడు. పాము కాదు అనినాడు.
తొలుత పాము అన్నావుగదా? ఆచార్యుని ప్రశ్న
గురువర్యా భ్రమపడినాను.
భ్రమ ఎట్లు తీరును అని ఆచార్యుని ప్రశ్న.
దీపమువల్ల భ్రమ తీరును అని శిష్యుడు చెప్పినాడు. ఆచార్యులు దీపమే జ్ఞానము నాయనా అనినాడు. నీకు సృష్టి విభిన్నముగా కనిపించుట భ్రమ. జ్ఞానము వలన సృష్టి సమస్తము బ్రహ్మమే అని తెలియగలవు.
ఈ శ్లోకమువలన సత్యము వేరు. అసత్యము వేరు అని చెప్పుచున్నాడు. సృష్టి వేరు, బ్రహ్మము వేరు. ఇది ద్వైతము అగును.
అంతవంత ఇమే దేహాః నిత్యస్లోక్తా శ్శరీరిణః
అనాశినో- ప్రమేయశ్య తస్మా ద్యుధ్వస్వ భారత! 18
ఈ దేహములు అంతములు గలవి. ఆత్మ గ్రహించరానిది. ఆత్మను తెలియుము. యుద్దము చేయుము.
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్
ఉభౌ తౌ న విజానీతః నాయం హన్తి న హన్యతే 19
ఆత్మ ఇతరులను చంపుటగాని, ఇతరులచే చంపబడుటగాని జరుగదు. ఆ విధముగా భావించువారు అజ్ఞానులు. ఏలనన ఆత్మ ఒకరిని చంపదు. ఇతరుల చేత చంపబడదు.
న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్య శ్శాశ్వతో యం పురాణః
న హన్యతే హన్యమానే శరీరే 20
ఆత్మ పుట్టదు. గిట్టదు. దానికి భావ వికారము లేదు. ఆత్మ నిత్యము శాశ్వతము. పురాతనము. దేహము మరణిస్తుంది. కాని ఆత్మకు చావులేదు.
వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్
కథం స పురుషః పార్ధ! కం ఘాతయతి హన్తికమ్ 21
ఆత్మ ఆద్యంత రహితము మార్పు లేనిది. అవినాశ్యము. అది తెలిసినవారు ఎవరిని చంపును? చంపించును?
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో -పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ 22
చిరిగిన బట్టను వదిలివేస్తాం, కొత్త బట్టను కట్టుకొంటాం. అదే విధముగా ఆత్మ పాతదేహాన్ని వదులుతుంది. కొత్త దేహాన్ని ధరిస్తుంది.