రెండవ అధ్యాయము
సాంఖ్య యోగము
సంజయ ఉవాచ:
తం తథా కృపయా విష్టం అశ్రుపూర్నా కులేక్షణమ్
విశీదంత మిదం వాక్యం ఉవాచ మధుసూదన 1
అర్జునుడు బంధుప్రీతుడైనాడు. కనులు కన్నీట నిండినవి. శోకమూర్తి ఐనాడు. అటువంటి అర్జునుని శ్రీ కృష్ణ భగవానుడు చూచినాడు.
స్వామి ఇట్లు ఉపదేశించినాడు.
శ్రీ భగవానువాచ:
కుత స్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితమ్
అనార్యజుష్ట మస్వర్గ్యం అకీర్తికర మర్జున 2
అర్జునా! యీ దుస్థితి నీకు ఎట్లు కల్గినది? యీ విషమస్థితిలో ఎట్లు చిక్కినావు? ఇది ఆర్యులు మెచ్చినది గాని, స్వర్గము యిచ్చునదిగాని, కీర్తి కలిగించునది గాని కాదు.
క్లైబ్యం మాస్మగమః పార్ధ! నైతత్త్వయ్యుప ద్యతే
క్షుద్రం హృదయదౌర్భల్యం, త్యక్త్వోతిష్ఠ పరంతప 3
అర్జునా! పిరికితనము వలదు. నీకిది ఉచితముగాదు. హృదయ దౌర్భల్యము నీచము. యుద్దమునకై సిద్దమగుము.
అర్జున ఉవాచః
కధం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన
ఇషుభిః ప్రతియోత్స్యామీ పూజార్హా వరిసూదన 4
మధుసూదనా! భీష్మద్రోణులు నాకు పూజ్యులు. బాణమును ఎక్కుపెట్టి వారితోనెట్లు పోరాడగలను?
గురూనహత్వాహి మహానుభావాన్
శ్రేయోభోక్తుం భైక్ష్య మపీహ లోకే
హత్వార్ధ కామాంస్తు గురూనిహైవ
భుంజీయభోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ 5
ఆచార్యులను వధించి జీవించుట కన్న, బిచ్చమెత్తుకొనుట మేలు. వారిని చంపి అనుభవించేవి రక్తసిక్తములు అగును.
నచైత ద్విద్మః కతరత్నో గరీయః
యద్వా జయేమ యది వానో జయేయుః
యా నేవ హత్వా న జిజీవిషామః
తే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః 6
ఇది యుద్దము. ఇందులో ఎవరి బలము ఎంతయో తెలియదు. జయము మనను వరించునో వారిని వరించునో తెలియదు. ఎవరిని వధించి మనము గెలువదల్చినామో ఆ కౌరవులు మనెదుట నిలిచియున్నారు. వారిని చంపుటకు మనసొప్పదు.
కార్పణ్య దోషోపహత స్వభావః
పృచ్చామిత్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్చ్రేయః స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే -హం శాధి మాం త్వం ప్రసన్నమ్ 7
నేను పిరికిపందను. నా స్వభావము రాలిపోయింది. ధర్మము తెలియకున్నాను. కర్తవ్యము తెలియకున్నాను. స్వామీ! నాకు శ్రేయస్కరమగు దానిని తెల్పుము. నీకు శిష్యుడను - శరణాగతుడను ఉపదేశించుము.
న హి ప్రపశ్యామి మమాపనుధ్యాత్
యచ్చోకముచ్చోషణ మింద్రియాణామ్
అవాప్య భూమావసవత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యం 8
నా దుఃఖము అవయవములను దమించివేస్తున్నది. రాజ్యాధిపథ్యము గాని, ఇంద్రపదవిగాని దీని నుండి విముక్తి కలిగించలేకున్నవి.
దీపిక:
ఒకసారి రామాయణములోనికి వెళ్ళుదాము. శ్రీరామచంద్రమూర్తి! సాగర తీరమున నిలిచినాడు. వానరసేన అక్కడే కూడినది. సముద్రము దాటి లంకను చేరుటను గురించి యోచించుచున్నాడు.
అక్కడ లంకలో రావణుడు సభ దీర్చినాడు. రాముని ఎదుర్కొనుటను గురించి ఆలోచన సాగించినాడు. రాముని అవలీలగా గెలువవచ్చునని రాక్షసవీరులు ముఖస్తుతి చేసినారు.
విభీషణుడు. అన్నకు హితోపదేశము చేసినాడు. "రాజా! ముఖస్తుతులు చేయువారు ప్రతినిత్యము వేలకు వేలు లభింతురు. కాని చేదే అయినను హితము పలుకువారును, వినువారును అరుదుగా అభింతురు. రాముని శౌర్యము. ప్రతాపము అప్రతిహతములు. అతనితో యుద్దము చేసి గెలుచుట అసంభవము. సీతను రామునకు అప్పగించుము. శరణు వేడుము. లంకను, రాక్షసజాతిని రక్షింపుము".
రావణునకు, విభీషణుని నీతులు నచ్చలేదు. అతడు విభీషణుని అవమానించినాడు. విభీషణుడు లంకను విడచినాడు. ఆకాశమార్గమున సాగినాడు. రాముని చేరినాడు. శరణువేడినాడు.
రాముడు వానర ముఖ్యులను కూర్చినాడు. విభీషణుని వృత్తాంతము చెప్పినాడు. వారి నిర్ణయము తెలియపర్చవలసినదని కోరినాడు.
వానరులలో ఏ ఒక్కరును విభీషణునకు శరణు కలిగించుటకు అంగీకరించలేదు.
రాముడు వారిని చూచి ఇట్లనినాడు.
నేను శరణాగతవత్సలుడను. విభీషణుడేగాదు, రావణుడే వచ్చి శరణు కోరినను, అతన్ని రక్షించగలవాడను. శరణాగతుడైన విభీషణుని నా ముందుకు చేర్చుదురు గాక. విభీషణుడు, రాముని ఎదుటకు వచ్చినాడు. చేతులు జోడించినాడు. శరణు వేడినాడు రాముడు విభీషణుని రక్షించినాడు. అతనికి అక్కడనే శ్రీలంకకు పట్టము గట్టినాడు.
స్వామితో పని గలిగిననేగాని నరుడు స్వామినీ ఆశ్రయించడు. ఇది విభీషణుని విషయమున, గజేంద్రుని విషయమున, మరెన్నో విషయములందును వ్యక్తమైనది.
సాధారణ మానవుని విషయమునను అంతే. అక్కరపడినప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు. మ్రొక్కులు మొక్కుతాడు. తన పని నెరవేరకున్న దేవుని నిందిస్తాడు. రామదాసు అట్లు నిందించిన వారిలో నొక్కడు.
స్వామిని సేవించుట తమ విధ్యుక్త ధర్మమని తెలియువారు - స్వామిని, ఫలాపేక్ష లేకుండా ఆశ్రయించువారు ఏ నూటికో కోటికో ఒక్కరు.
ప్రస్తుత విషయములో అర్జునునకు అవసరము ఏర్పడినది. స్వామిని ఆశ్రయించినాడు.
స్వామి తండ్రివంటివాడు. తనయుల తప్పులను లెక్కచేయడు. ఆశ్రయించినవారికి ఆశ్రయము కలిగించుటయే స్వామి వ్రతము, స్వభావము, దీక్ష.
సంజయ ఉవాచః
ఏవ ముక్త్వా హృషేకేశం గుడాకేశః పరంతపః న
యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ హ 9
అర్జునుడు శ్రీకృష్ణునితో ఆ విధముగా అన్నాడు. తాను యుద్దము చేయను అన్నాడు. మూకవాడైనాడు. కూలబడ్డాడు.
తమువాచ హృషీకేశః ప్రవాసన్నివ భారత!
సేనయో రుభయో ర్మధ్యే విషీదస్త మిదం వచః 10
శ్రీకృష్ణుడు అర్జునుని ఏడుపు కన్నాడు. 'రాజా' మందహాసమున యిట్లు వుపదేశించినాడు.