Previous Page Next Page 
రక్తచందనం పేజి 24


    మరికొద్దిసేపటికి గుట్ట కిందకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ముత్తప్ప సిద్ధంగా వున్నాడు.
    "ఏదయినా ముఖ్యమైన వార్తా?" అంటూ అతన్ని చెక్ చేశాడు.
    "అవును....యజమానరే ఎక్కడ....?"
    "పద...." అని ముత్తప్ప ముందుకు నడిచాడు.
    పావుగంట ప్రయాణించాక ఒకచోట ఆగారిద్దరూ.
    ముత్తప్ప వేలుపెట్టి ఓ దిక్కుకి చూపించాడు. కోట గోడలా వున్న ఆ గుట్ట అంచులో ఓ పెద్ద రాయిపై వీరూ నిద్రిస్తూ కనిపించాడు.
    వార్తాహరుడు మంచి వార్త తెచ్చానన్న ఉత్సాహంతో, అటుకేసి రెండడుగులు వేయగానే భైరవీ ప్రత్యక్షమయిందక్కడ క్రూరంగా నాలుక చాచి చూస్తూ.
    దాన్ని చూస్తూనే అతని పై ప్రాణాలు పైనే పోయినట్లయింది.
    "యజమానరే ఆలస్యంగా పడుకున్నాడు. లేవటానికి ఇంకా గంట పట్టవచ్చు. అప్పటివరకు నిన్నే కాదు మమ్మల్ని కూడా భైరవీ యజమానరే దగ్గరకు వెళ్ళనివ్వదు. గంటాగు...." అన్నాడు ముత్తప్ప.
    వీరూ నిద్రలోకి జారుకున్న దగ్గర్నుంచి, నిద్రలేచేవరకు తంబి ఎత్తయిన వృక్షం ఎక్కి శత్రుజాడనీ దూరంనించే కనిపెట్టే ప్రయత్నం చేస్తుంటే, భైరవీ వందగజాల వృత్తాకారంలో పరిభ్రమిస్తుంటుంది. పురుగుని కూడా తన పరిధిలోకి రానివ్వకుండా అప్రమత్తంగా వుంటుంది. ఆ సందర్భంలో ఏమాత్రం శబ్దం చేయదు. తన యజమానికి నిద్రాభంగం కలిగించకూడదనే అలా చేస్తుంది.
    మామూలు సమయాల్లో చీమచిటుక్కుమంటే అప్రమత్తమయ్యే వీరూ, తను నిద్రించేప్పుడు మాత్రం తన రక్షణను, అప్రమత్తతను భైరవికి వదిలేస్తాడు.
    సరీగ్గా గంటకి వీరూ నిద్రలేచాడు.
    పరిసరాల్ని గమనించాడు.
    ఆపైన భైరవికి సంజ్ఞ చేశాడు.
    భైరవి పహరా ఆపేసింది.
    తూర్పు దిక్కుకి తిరిగి చేతులెత్తి నమస్కరించాడు వీరూ.
    "ఏమిటి వార్త....?" నిశ్శబ్దంగా వున్న ఆ ప్రాంతంలో వీరూ గంభీరస్వరం ప్రతిధ్వనించింది.
    భయాందోళనలతో కూడిన గగుర్పాటు మూలంగా వెంటనే ఏం చెప్పలేకపోయాడా వార్తాహరుడు.
    "చెప్పు" తిరిగి ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది.
    "రంజిత్ అనే ఐ.పి.ఎస్. ఆఫీసర్ ఫారెస్ట్ విభాగానికి ఎస్.పి.గా వచ్చాడు. శర్మ అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ డి.సి.ఎఫ్ గా వచ్చాడు. ఇద్దరూ కలిసి మీకు వలపన్నే పధకంలో నిమగ్నమయి వున్నారు యాజమానరే.... నాకు సెలవిప్పిస్తే వెళ్ళి వస్తాను...." ఎంతో ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకొని అన్నాడా వార్తాహరుడు.
    ఆ మరుక్షణం భైరవీ ఒక కవర్ ని తెచ్చి వార్తాహరుడికి అందించింది. అతను తిరుగుముఖం పట్టాడు.


                            *    *    *    *


    ఆరోజు ఉదయం ఏడు గంటలకు రంజిత్, శర్మ తమ సిబ్బందితో మలైమహదేశ్వరా హిల్స్ కి బయలుదేరారు.
    పోలీసులకు 9 ఎమ్.ఎమ్. పిస్టల్స్, స్టెన్ గన్స్, 307 రైఫిల్స్ వాటికి అవసరమయ్యే తూటాలు అందించబడ్డాయి.
    రంజిత్ గతం తెలిసిన పోలీసులు ఈసారి వీరూని పట్టుకోవటం ఖాయం అని భావిస్తే, ఇంకొందరు మరో వ్యర్థప్రయత్నమని భావించారు.
    మధ్యాహ్నం రెండు గంటలకు ఆరు జీవులు, నాలుగు వ్యానులు పది బులెట్ మోటార్ బైక్స్ మలై మహదేశ్వరా హిల్స్  టౌన్ లోకి ప్రవేశించాయి.
    క్షణాల్లో ఆ వార్త టౌన్ లోని ప్రతి ఒక్కరికి చేరిపోయింది.
    తనకు దత్తమైన స్పెషల్ పవర్స్ ని ఉపయోగించి పోలీస్ క్యాంప్ కి ఆర్డర్స్ పాస్ చేశాడు రంజిత్.
    ఎస్.ఐ. దినేష్ సంగతి తెలిసుండటంతో ఎమ్.ఎమ్. హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా అతన్ని నియమించాడు అప్పటికప్పుడే.
    సరీగ్గా సాయంత్రం నాలుగు గంటలకు పోలీసులు అటవీశాఖ సిబ్బంది ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో బరూరుగా సమావేశమయ్యారు.
    "నేనెవరో, శర్మగారెవరో మీకీపాటికి తెలిసే వుంటుంది. ఎందుకోసం ఇక్కడ క్యాంప్ చేశామో కూడా తెలిసే వుంటుంది. అనవసర ఉపోద్ఘాతాలు, పరిచయాలు అనవసరం. ఆరు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా, ఒకే ఒక వ్యక్తిని పట్టుకోలేకపోవటం ఆశ్చర్యంగాను, అవమానకరంగాను వుంది.
    ప్రభుత్వ పరువు మర్యాదలకే కాదు. మన శక్తిసామర్థ్యాలకు, నీతి నిజాయితీలకు ప్రశ్నగా మారిన వీరూని మట్టుబెట్టాలి. పిట్టని కాల్చినట్టు కాల్చిపడేయాలి.
    నాకు తెలుసు_ మీలో కొందరు అతనికి ఇన్ ఫార్మర్స్ గా పనిచేస్తున్నారు. ఇంకొందరు ప్రాణభయంతో నిరసక్తంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ప్రలోభానికి లొంగిపోతున్నారు. ఇప్పుడీ క్యాంప్ విషయం కూడా అతనికి ఈ రాత్రికే తెలిసిపోతుంది.
    జరిగిందేదో జరిగిపోయింది.
    ఇకపై గతంలో జరిగింది పునరావృతం కాకూడదు...." రంజిత్ చెప్పటం ఒక్క నిమిషం ఆపాడు.
    అక్కడున్న చాలామంది కళ్ళల్లో మృత్యువు అంచుకు వెళ్ళబోతున్న భావన చోటుచేసుకొని వుంది. వారిలో పోలీసులు, ఎస్.ఐ.లు, సి.ఐ.లు, అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్స్, రేంజి ఆఫీసర్స్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్టర్స్, ఫారెస్ట్ గార్డ్స్, రిజర్వు ఫారెస్ట్ వాచర్స్ కూడా వున్నారు.
    ఎవరికి వారే కిక్కురుమనకుండా వింటున్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరికి మరొకరిమీద అనుమానం. అతను వీరూ మనిషేమోనని.
    ఆ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణ చుట్టుప్రక్కలకు కూడా డిపార్ట్ మెంట్స్ కి చెందినవాళ్ళు తప్ప ఇతరులు రాకుండా కాపలా పెట్టి కట్టుదిట్టం చేయించాడు రంజిత్.
    ఆ ప్రాంతంలో క్రమంగా చీకటి ముసురుకోబోతోంది.
    అటవీ అంతర్భాగంలో పొంచివుండే మృత్యువు చైతన్యాన్ని పుంజుకోబోతున్నవేళ రంజిత్ తిరిగి చెప్పటం ఆరంభించాడు.
    సరిహద్దుల్లో పొంచివున్న శత్రుసేనని తుదముట్టించేందుకు మిలటరీ కమేండర్ తన సిపాయిలకు ధైర్యాన్ని ఎలా నూరిపోసి యుద్ధానికి మానసికంగా సిద్ధం చేస్తాడో అలాగే చేస్తున్నాడు రంజిత్.
    "మనం చేసేది వ్యాపారం కాదు. దొంగ వ్యాపారం అంతకంటే కాదు. ప్రజాసేవ, దేశసేవ, చట్టాన్ని రక్షించవలసిన బాధ్యత మనమీదుంది. మీకు అవసరాలు లేవని, భయంలేదని, పెళ్ళాం బిడ్డలు లేరని నేను అనటంలేదు. అలాగే మన బాధ్యతల్ని కూడా గుర్తించాలి.
    అతనిది చీకటి బ్రతుకు_ కేవలం చీకటిలోనే అతను సంచరించాలి. మనం చీకటిలో, వెలుతురులో కూడా సంచరించవచ్చు. అతనికి లేని అధికారాలు మనకున్నాయి. అతనికిలేని చట్టపరమైన అస్థిత్వం, ప్రభుత్వాల అండదండలు మనకున్నాయి. ఒక మనిషి ఒకసారి కాదు వందసార్లు తప్పు చేయవచ్చు, ప్రలోభపడవచ్చు. కానీ తప్పు చేయటమే, ప్రలోభపడటమే జీవితం కారాదు. మీకు అండగా ప్రభుత్వం వుంది. చట్టం వుంది_పైన నేనున్నాను.
    సహజమయిన మానవ బలహీనతల్ని, హ్యూమన్ మార్జిన్ ని కూడా నేను కాదనటంలేదు.
    కానీ ఇక వాటికి అడ్డుకట్టవేయండి. అప్రమత్తంగా వుండండి. అవకాశం కోసం పొంచి వుండండి....అదనుచూసి దెబ్బ కొట్టండి. ఎవరికీ ఆయుధాలు కావాలో తీసుకోండి. వైర్ లెస్ సెట్స్ తీసుకోండి. బేటాలు, ఇతర ఖర్చులకు డబ్బు తీసుకోండి. సమస్త సౌకర్యాలు మీకు నేనందిస్తాను.
    కో ఆర్డినేషన్, కోఆపరేషన్ ని విస్మరించకండి. ఎవరిమీద అనుమానం వచ్చినా కస్టడీలోకి తీసుకోండి. రక్తం కక్కించయినా సమాచారాన్ని రాబట్టండి. మీకు ప్రమాదం సంభవించే పరిస్థితే వస్తే పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపడేయండి. ఎవర్ని ఎందుకు అరెస్టు చేశారనిగానీ, ఎందుకు చంపారనిగానీ ఎవరూ మిమ్మల్ని అడగరు, నిలదీయరు. మీ ధైర్య సాహసాల్ని, నీతినిజాయితీల్ని నిరూపించుకోండి.

 Previous Page Next Page