"ఇది వీళ్ళ గ్రీటింగు అనుకుంటాను" అన్నాడు సందీప్ స్వప్నతో.
నాయకుడు తన ముక్కుని స్వప్న ముక్కుకి కూడా రాయబోయాడు.
కెవ్వున కేకవేసి, వెనక్కి జరిగింది స్వప్న.
నాయకుడు బిత్తరపోయి, ఇంక భూతాలరాజుకి కూడా 'గ్రీటింగు' అందజేసే ప్రయత్నం విరమించి, తన అనుచరులతో సహా వెళ్ళిపోయాడు.
కోపంతో స్వప్న ముక్కు పుటాలు పెద్దవయ్యాయి. "ఆ ముత్యాల హారం మా అమ్మ నా బర్త్ డే ప్రెజెంటేషన్ గా కొనిచ్చింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మధ్యన నువ్వొచ్చి..."
"నేను మీ అమ్మకి అల్లుడిని అవునో కాదో గానీ వాడు మాత్రం మనందరినీ రంకు మొగుడిలా తగులుకున్నాడు. వాళ్ళకి కరెన్సీ విలువ తెలియదు. అందుకనే నీ హారం పరిహారంగా ఇచ్చి వదిలించుకోవలసి వచ్చింది. వెరీ వెరీ సారీ !" అని జీపుని ముందుకు పోనిచ్చాడు.
జీపు ఒక రెండొందల గజాలు పోయాక, అక్కడే పొదల చాటున నిలబడి ఉన్న ఆటవికులు మళ్ళీ బయటకు వచ్చారు. వాళ్ళ నాయకుడు పగలబడి నవ్వుతూ తన మొహానికి ఉన్న పులి మాస్కు తొలగించాడు. ఎక్కడినుంచో ఒక నలిగిన సిగరెట్ బయటికి తీసి, అంటిస్తూ, "ఎలా ఉంది ఈ చిన్నీగాడి ప్రతాపం?" అన్నాడు శుభ్రమైన తెలుగులో.
అతనివైపు ప్రశంసాపూర్వకంగా చూశారు మిగతావాళ్ళు. "భలే హడలగొట్టేశావు గురూ వాళ్ళని! మాంచి ముత్యాల హారం ! ఎంత లేదన్నా అయిదువేల రూపాయలకు తక్కువ ఉండదు!" అన్నాడు ఒకడు.
వాళ్ళు నిజంగా ఆటవికులు కారు. అడవిలో నివాసం ఏర్పరుచుకున్న దోపిడీ దొంగలు.
ప్లానుకి పంక్చరు
మరో ఫర్లాంగు దూరం వెళ్ళిన తర్వాత సడెన్ బ్రేకువేసి జీపు ఆపాడు సందీప్. కిందికి దూకి నేలని పరీక్షగా చూడడం మొదలెట్టాడు.
"ఏమిటి ? పులి అడుగుజాడలేమైనా కనబడుతున్నాయా?" అన్నాడు భూతాలరాజు.
ఊపిరి బిగపట్టింది స్వప్న.
కాసేపు మాట్లాడలేదు సందీప్, తర్వాత నెమ్మదిగా అన్నాడు. "పులి అడుగుజాడలు కాదు. మరో జీపు తాలూకు టైరు గుర్తులు."
"అంటే ?"
"అంటే మనకంటే ముందరే ఇంకెవరో కూడా ఇదే దారిలో వెళ్ళారన్నమాట!"
తుపుక్కున ఉమ్మేశాడు రాజు. "దేని కోసం ?" అన్నాడు అనుమానంగా.
"చెప్పలేం ! బహుశా వాళ్ళుకూడా మమ్మీని వెదకడానికే బయలుదేరి ఉండినా ఆశ్చర్యం లేదు. దాదాపు అయిదారు మంది ఉండి ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఎందుకో కాసేపు ఆగారు. అడుగుజాడలు కనబడుతున్నాయి."
అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.
"నేను వెళ్ళిపోతాను! ప్లీజ్!" అని మళ్ళీ మొదలెట్టింది స్వప్న. ఆమె గొంతులో దైన్యం వినబడుతోంది.
సానుభూతిగా ఆమెవైపు చూసి, భుజం నిమిరాడు సందీప్. ఈసారి ఆమె దూరంగా జరిగిపోలేదు. పైగా, ఆసరా కోసం అన్నట్లు అతనికి మరింత దగ్గరగా జరిగి, ఆనుకుని నిల్చుంది.
అందరూ జీపు ఎక్కారు.
ఒకటిన్నర కిలోమీటరు వెళ్ళిన తర్వాత ఎదురుగా సన్నటి బ్రిడ్జి కనబడింది. బ్రిడ్జి మీదికి పోనిచ్చాడు జీపుని. సగం దాటగానే వెనక నుంచి పెద్దగా ప్రేలుడు వినబడింది. బ్రేకులేసి, జీపుని ఆపాడు సందీప్. వెనక్కి తిరిగి చూశాడు.
ఎవరో డైనమైట్ పెట్టారు బ్రిడ్జిమీద వాళ్ళు బ్రిడ్జి మీదకు రాగానే పేల్చారు దాన్ని. అయితే, అదృష్టవశాత్తు అప్పటికే ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయింది జీపు.
వాళ్ళు దాటివచ్చినంత మేరా బ్రిడ్జి కూలిపోయింది. ముందు భాగాన మిగిలిఉన్న బ్రిడ్జి నిలువునా చీలిపోయి ఉంది. సరిగ్గా జీపు పట్టేటంత వెడల్పు మాత్రం ఉంది ఒకవైపు.
"ముందుకి వెళ్ళడం తప్ప మనకి గత్యంతరం లేదు. కదలకుండా కూర్చోండి! ఒక్క వెంట్రుకవాసి పక్కకు పోయినా జీపు అగాధంలో పడిపోతుంది" అన్నాడు సందీప్.