Previous Page Next Page 
హైజాక్ పేజి 24

అది మామూలు ఎయిర్ టర్ బులెన్స్ కాదనీ ప్రకృతి విలయతాండవం మొదలెట్టగా వీస్తున్న ప్రళయ ప్రచండమారుతమనీ రాజేందర్ కీ అర్థం కాలేదు.
అందులో చిక్కుకుంది ఎయిర్ బస్ విమానం!
సమర్థుడైన పైలట్ లేకుండా!!
"ఎయిర్ టర్ బ్యులెన్సా?" అన్నాడు మెహతా కంగారుగా. వెంటనే వెదర్ రిపోర్ట్ తెప్పించుకుని చూశాడు.
ఎయిర్ బస్ ఉన్న ప్రాంతంలో ప్రచండ వేగంతో తుఫాను గాలులు వీస్తున్నాయి. ఆ చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలలో హోరున కుంభవృష్టి పడుతోంది.
"రాజేందర్! వెంటనే ఆల్టిట్యూడ్ పెంచు! విమానాన్ని ఇంకా ఎత్తుకి తీసుకెళ్ళు" అంటూ అది ఎలా చెయ్యాలో చెప్పాడు మెహతా.
ఆదుర్దాగా కంట్రోల్స్ వైపు చెయ్యి జాపాడు రాజేందర్.
ఆలోపలే....
ఉన్నట్లుండి ఒక పక్కకి ఒరిగిపోయి ఎగురుతూ, మళ్ళీ తనంతట తనే సరైన పొజిషన్ లోకి వచ్చింది.
పాసెంజెర్సు కేబిన్ లో....
డాక్టరుకి ఇంజెక్షను ఇవ్వబోతూ, యథాలాపంగా అతని మొహంలోకి చూశాడు శతృఘ్న. వెంటనే ఆగ్రహంతో అతని పెదిమలు వణికాయి.
"బాస్టర్డ్!" అన్నాడు పెద్దగా.
"బాస్టర్డ్! నువ్వా?"
పాసెంజెర్సు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
"షాట్ గన్! ఏమిటీ? ఏమయింది?" అన్నాడు ఇక్బాల్ కంగారుగా.
సమాధానం చెప్పకుండా, ఆ డాక్టరు మొహంవైపే తీక్షణంగా చూస్తున్నాడు శతృఘ్న. తన చదువూ, భవిష్యత్తూ, తన ఆశలూ, తన ఆశయాలూ - అన్నీ మట్టిలో కలిసిపోవడానికి కారణమైన ఆ మనిషి వైపు కసిగా చూస్తున్నాడు.
బాధతో కొంకర్లు పోతున్నాడు ఆ డాక్టరు. అతని గొంతులోనుంచి గురక లాంటి ధ్వని వస్తోంది.
అతను పడుతున్న యాతనని నిశ్చలంగా గమనించాడు శతృఘ్న.
ఇంజెక్షను ఇచ్చి ఈ క్రూర మృగాన్ని కాపాడాలా తను?
నో నో నో నో! నెవర్ నెవర్!
ఇలాగే గిలగిల తన్నుకుని చావనివ్వాలి వీడిని!
ఆ ఆలోచన ఎందుకో అసంతృప్తిగా అనిపించింది అతనికి.
కాదు! కాదు! వీణ్ణి ఇంత తొందరగా చావనివ్వకూడదు. ముందు వీణ్ణి బతికించి తర్వాత క్షణం క్షణం ప్రాణభయంతో వణికిపోయేలా చేసి తను చేసిన తప్పుని తలుచుకుని, తలుచుకుని కుమిలిపోయేలా చేసి, తర్వాత అతి దారుణంగా, ఇలాంటి మానవరూపంలోని పిశాచాలకు హెచ్చరికగా ఉండేలా చంపాలి!
అందుకుగానూ ఏం చెయ్యాలో వెంటనే తట్టింది అతనికి దాన్ని మనసులోనే నోట్ చేసి పెట్టుకున్నాడు.
సీరియస్ గా ఆ డాక్టరుకి ఇంజెక్షను ఇచ్చాడు శతృఘ్న.
విమానం మళ్ళీ ఒరిగింది.
పాసెంజెర్సు అందరూ బాలెన్స్ తప్పి ఒకళ్ళమీద ఒకళ్ళు పడ్డారు. ఏడుపులు - కేకలు.
కాక్ పిట్ లో....
"దిసీజ్ ఎమర్జెన్సీ?" అన్నాడు రాజేందర్ అర్జెంటుగా "విమానం బాగా ఒరిగిపోతోంది. నేనేం చెయ్యాలి?"
ఆదుర్దాగా జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు అతను.
కానీ, హెడ్ ఫోన్స్ డెడ్ అయిపోయాయి. వాటిల్లో మాటలు వినబడటం లేదు!
విమానం ఒరిగినప్పుడు, అతను ముందుకు పడటంలో చెయ్యి దేనికో తగిలి కంట్రోల్ టవరుతో సంబంధం తెగిపోయింది!
అప్పుడు పాసెంజర్సు కేబిన్ లో నుంచి వినబడింది ఒక స్త్రీ కంఠం!
గందరగోళంగా ఉన్న ఈ భూగోళం మీద పడాలనే అమాయకపు ఆరాటం తొలి ప్రయత్నం చేస్తూ ఒక శిశువు తల్లి కడుపులో కదలగా, పేగులు తెగిపోయి ఆ నొప్పి భరించలేక తల్లి పెట్టిన కేక!
పాసెంజెర్సులోని ప్రెగ్నెంటు అమ్మాయికి నొప్పులు రావడం మొదలయ్యాయి.
ఆ ప్రెగ్నెంటు అమ్మాయి నొప్పులు భరించలేక పెడుతున్న కేకలు వినగానే శతృఘ్నకి మతిపోయినట్లయింది.
అన్ని రకాల విషమ పరిస్థితులూ ఒకేసారి ముంచుకొచ్చేస్తున్నాయి.
నొప్పులు పడుతున్న ఆ అమ్మాయిని ఎవరు అటెండ్ అవుతారు ఇప్పుడు? తనేనా?
ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి తను? ఏం చెయ్యకూడదు? ఏది ముందు? ఏది వెనక?
అంతా అయోమయం!
ఆ అమ్మాయి దగ్గరికి మోనికా వెళ్ళడం కనబడింది. వంగి, భుజంమీద చెయ్యివేసి ధైర్యం చెబుతోంది తను.
"ఐ గివ్ అప్" అన్నాడు రాజేందర్ హఠాత్తుగా - విమానాన్ని కంట్రోలు చేసే వ్యర్థ ప్రయత్నం మానేసి సీట్లో వెనక్కి జారగిలబడ్డాడు. "ముందే చెప్పాను నేను - ఇంత పెద్ద జెట్ ని హాండిల్ చెయ్యడం నా తరంకాదు."
"షటప్!" అన్నాడు శతృఘ్న కర్కశంగా. తన చేతిలోని రివాల్వరుని రాజేందర్ కణతలకు ఆనించాడు. "పిచ్చి పిచి వేషాలేశావంటే నీ తలకాయని పేల్చేసి, నీ మెదడుని కాక్ పిట్ అంతా స్ప్రే చేసేస్తాను. డూ సమ్ థింగ్! ప్రయత్నాలు మానకు!"

 Previous Page Next Page