Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 25


    "బాగా గుర్తుంచుకో! పార్వతిగారిని పల్లెత్తుమాట అంటే కళ్ళు పోతాయ్"


    "మీరే అన్నారు...అందరినీ అనుమానించాలని"


    "ఒక్క పార్వతిగారిని తప్ప" అన్నాడు మూర్తిగారు దృఢంగా.


    రిస్ట్ వాచ్ చూసుకుని, "నేను వస్తాను. బాంబే వెళ్లి అట్నుంచి సిడ్నీ... మళ్ళీ వచ్చేస్తా... త్వరలోనే..." అన్నాడు. దోమని తోలినట్లు సెల్యూట్ చేశాడు షణ్ముగం. నవ్వుకున్నాడు మూర్తిగారు. నిజానికి ఆయన లాంటి వీఐపీ ఈ ఇన్ స్పెక్టర్ తో ఇంతసేపు మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ అలా ఉండడం ఆయనకి సహజ స్వభావం! ప్రయాణాలు చేస్తున్నప్పుడు పోర్టర్లతో కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడతాడు. ఎవర్నీ, ఎప్పుడూ నొప్పించడు!


    డాక్టర్ దగ్గరికి తిరిగివస్తూ మనసులోనే అనుకున్నాడు మూర్తిగారు. "హోం మినిస్టర్ కి ఫోన్ చెయ్యాలి. ఈ హాస్యగాడికి బదులు ఇంకెవరినన్నా ఈ కేసుని డీల్ చెయ్యడానికి పంపమనాలి" అని.


    తర్వాత, డాక్టర్ దగ్గరికి వచ్చాడు మూర్తిగారు.


    అప్పటికే మంచందిగి, రెడీగా నిలబడి ఉన్నాడు కాశీ.


    "అప్పుడే! రెండ్రోజులు రెస్టు తీసుకో!"


    "అతనికేం ఫర్లేదు - ఫిజికల్ గా హీ ఈజ్ ఆల్ రైట్" అన్నాడు డాక్టరు. కాశీని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత బెటరని అతనికి అనిపిస్తోంది.


    "సార్! నన్నీ హాస్పిటల్లో ఉంచడానికి బదులు నరకానికి పంపించెయ్యండి. హాయిగా వెళ్ళిపోతా. ఒకవేళ చావే తప్పదనుకుంటే... ఇంటిదగ్గర సహజంగా చచ్చిపోవడం ఇంకా ఎంతో..."


    పెద్దగా నవ్వాడు మూర్తిగారు.


    "మృత్యుంజయుడివిరా! పద! నాతో కలసి నడవగలవా!"


    "రోజుకి ఇరవై కిలోమీటర్లు నడవకపోతే నాకు కాళ్ళు గుంజుతాయండీ!"


    నవ్వి, పరీక్షగా కాశీవైపు చూశాడు మూర్తిగారు. చందమామ కథల్లో పరోపకారి పాపన్న కారెక్టర్ లా ఉన్నాడు కాశీ. కాస్త పొడుగే! ఆరోగ్యకరమైన ఛామనఛాయ. గుండ్రటి మొహం, బుగ్గలు, కొంచెం బొద్దుగానే ఉన్నాడు మనిషి. అన్నీ మంచి అలవాట్లే ఉండి, నిరంతరం యోగాభ్యాసం చేసేవాళ్ళలో ఉండే వర్చస్సు అతనిలో కనబడుతోంది. తనలో కూడా అలాంటి తేజస్సు చాలా ఎక్కువగా ఉందని అందరూ అంటూ ఉంటారు.


    "పేషంట్లకి పళ్ళు పంచుదాం! ఒక్క పదినిమిషాలు!" అన్నాడు మూర్తిగారు. ఆయన అందరికీ పళ్ళు పంచాక, ఇద్దరూ హాస్పిటల్ బయటికి వచ్చారు. ఒక పెద్ద మేఘాల గుంపు సూర్యుడిని కప్పేసింది. చల్లగా ఉంది వాతావరణం.చాలా ఆహ్లాదకరంగా ఉంది. చల్లటి గాలి తెర ఒకటి వీచగానే, వంట్లోకి కొత్త శక్తి వచ్చినట్లయింది కాశీకి. చురుగ్గా అడుగువెయ్యడం మొదలెట్టాడు. అప్పటికే చకచక నడచి చాలా ముందు వెళ్ళిపోతున్నాడు మూర్తిగారు. ఆయన మొహం చూస్తే యాభైఏళ్లు ఉన్నట్లనిపిస్తోంది గానీ ఒళ్ళు చూస్తే పాతికేళ్ళ యువకుడిలా ఉన్నాడు.


    "నమస్కారం సార్!" అన్నాడు ఒక వ్యక్తి ఎదురుపడి.


    "ఏం నరసింహారావ్, బాగున్నావా? పాపకి ఎట్లా ఉంది?"


    "మీరు చెప్పిన ప్రేయర్ చేస్తున్నానండీ! నెమ్మదిస్తోంది" అంటూ, అతను మాట్లాడుతూనే వెంట నడుస్తున్నాడు.


    వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళేసరికి, అక్కడ అప్పుడే చాలా కార్లూ, మోటార్ సైకిళ్ళూ ఆగి ఉన్నాయి.


    ఆ గుడి నిర్మాణం ఇంకా పూర్తవలేదు. ప్రారంభ దశలోనే ఉంది. అయితే, ముందుగా వినాయకుడి గుడి మాత్రం కట్టేశారు. బహుశా విఘ్నాలు రాకుండా ఉండాలనే ఊహతో అయిఉండవచ్చు. అంతా ఇటాలియన్ మార్బుల్. తెల్లటి చలువరాయి. చలువరాతి పని అంతా రాజస్థానీ శిల్పులు చేస్తున్నారు. విగ్రహాలు చెక్కడం తమిళ స్థపతులు.


    ఒక చెట్టు మొదలు దగ్గర, దాని చుట్టూతా పాలరాతి అరుగు నిర్మాణం ఉంది.


    దేవుడి దర్శనం చేసుకుని వచ్చాక, అరుగుమీద బాసిపట్టు వేసుకుని కూర్చున్నారు మూర్తిగారు. కింద కూర్చున్న మిగిలిన వాళ్లంతా వందమందికి పైనే ఉంటారు.


    "ముందు ఓంకారంతో మొదలెడతా" అన్నారు మూర్తిగారు.


    ఓంకార నాదం చేశారు అందరూ. తర్వాత, మృదుమధుర స్వరంతో చెప్పడం మొదలెట్టాడు మూర్తిగారు. హేల్-బాప్ తోకచుక్క కనబడిన వైనం, జూపిటర్ గ్రహం తాలూకు ఒక చంద్రుడయిన యురోపా మీద జీవం ఉండడానికి ఆస్కారం ఉన్న వైనం, క్లోనింగ్ గురించి, వేపచెట్టుని ఉపయోగించి ఎయిడ్స్ కి మందు కనిపెట్టడం, రుగ్వేదంలో గొప్ప మేథమెటికల్ ఫార్ములాలు ఉన్నాయన్న విశేషం. కాసేపు సైన్సు, కాసేపు వేదాంతం... బాగా చదువుకున్నవాడు ఆయన. ఆయన చెప్పేది వింటుంటే గంటలు నిమిషాల్లాగా గడిచిపోతాయి. శ్రోతల్లో ఒకతను మంచి బాలుడిలాగా ఆయన చెప్పే ప్రతి విషయాన్ని గబగబ నోట్ బుక్కులో రాసుకుంటున్నాడు. శిష్యులలో కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషు వచ్చిన ఒక ఫారినర్ గురువుగారు చెప్పిన విషయాలని అప్పటికప్పుడు స్పానిష్ లోకి ట్రాన్స్ లేట్ చేసి చెబుతున్నాడు.


    ప్రసంగం పూర్తయ్యాక, మూర్తిగారు అడిగాడు.


    "ఏమైనా సందేహాలు ఉన్నాయా?"


    ఒకతను లేచి నిలబడ్డాడు. అతను నిలబడ్డ తీరు చూస్తే అతను "శిష్యుడు" లాగా లేడు. అటువేపు వెళ్తూ, ఈ తమాషా ఏమిటో చూద్దామని వచ్చి, అడ్డదిడ్డమైన ప్రశ్నలు నాలుగు అడిగి, ఇబ్బందిలో పడేద్దామనే ఊహతో వచ్చినట్లున్నాడు. "నాకో డౌటు!" అన్నాడు కుర్రాడు. "చెప్పు" అన్నాడు మూర్తిగారు ప్రసన్న వదనంతో.

 Previous Page Next Page