Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 26


    "ఐశ్వర్య మీకు వరసకి కూతురవుతుంది"


    "వరసకి కూతురు - నిజానికి అంతకంటే ఎక్కువే! ఆ మాటకి వస్తే అందరూ నా వాళ్ళే - మనమందరం ఆ పరమాత్ముడి పిల్లలం!" అన్నాడు మూర్తిగారు.


    "ఐశ్వర్య తన ఐశ్వర్యాన్ని అడ్డదారుల్లో సంపాదించిందని అంటారు" అన్నాడా యువకుడు.


    "ఎవరు చెప్పారు?"


    ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పకుండానే ప్రతిధ్వనిస్తుంటాయి! మొదట్లో అమెరికన్ ప్రెసిడెంటు ప్రాపకం సంపాదించింది ఐశ్వర్య. తర్వాత అలా అలా అల్లుకుపోయింది. ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ డెవలప్ చేసుకుంది. ఒక గవర్నమెంటు చేత ఇంకో గవర్నమెంటుకి అప్పులు ఇప్పించేటంత లెవెలుకి చేరుకుంది!"


    "అది ఆమె సామర్థ్యం" అన్నాడు మూర్తిగారు సౌమ్యంగా.


    "ఇదివరకు కూడా ఇట్లాగా ఒక ఇండియన్ - జయంతి ధర్మతేజ అనే తెలుగాయన అట్లాగే చాలా అడ్వంచరస్ గా వెళ్ళిపోయాడు. ఇంటర్నేషనల్ కాంటాక్టులు పెంచుకున్నాడు. ఇండియాకి వచ్చి నెహ్రూని బాగా ఇంప్రెస్ చేశాడు. జపనీస్ గవర్నమెంటు నుంచి అప్పులు కావాలంటే ఇప్పిస్తానన్నాడు. జయంతి షిప్పింగ్ కంపెనీ అని పెట్టాడు. హైదరాబాద్ లో రిపబ్లిక్ ఫోర్జ్ అని పెద్ద ఫౌండ్రీ ఒకటి పెట్టాడు. అంత ఎత్తున, అంత స్పీడుగా వెళ్తున్న ఆ పెద్దమనిషికి ఎక్కడో ఏదో ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆయన అడ్రసు లేకుండా పోయాడు. చివరిసారిగా వార్త తెలిసినప్పుడు ఆయన ఓ పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనీ, టాక్సులు ఎగ్గొట్టే వాళ్లకి స్వర్గం లాంటిదయిన పోర్టోరికోలో ఉంటున్నాడనీ తెలిసింది. పోర్టోరికో ప్రెసిడెంటు ఆయనకి పర్సనల్ ఫ్రెండు. జయంతి ధర్మతేజ సార్ చేసిన రిపబ్లిక్ ఫ్లోర్జ్ కంపెనీని మూసెయ్యడానికి ఈ ఏప్రిల్ లో ఒక నిర్ణయం తీసుకుంది ఏపీ గవర్నమెంటు"


    "ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నావ్?" అడిగాడు మూర్తిగారు చిరునవ్వు నవ్వుతూ.


    "పోలికలు గమనించమంటున్నాను. ఐశ్వర్య కూడా హై ఫ్లయింగ్! ఇండియా వచ్చి ఆర్భాటం మొదలెట్టింది. ఆమెకి చాలా కంపెనీలు ఉన్నాయి. కొన్నింటికి పబ్లిక్ ఇష్యూ మొదలెట్టారు. ఆమె కంపెనీ షేరు పది రూపాయలది వెయ్యి రూపాయల ప్రీమియంకి అమ్ముడు పోయింది. అంటే, పది రూపాయల షేరు వెయ్యీ పది రూపాయలు! అప్పుడు మొదలయింది ఒక రూమరు."  


    ఈ కుర్రాడు అన్నాడు "ఈ విషయాలు ఇక్కడున్న వాళ్ళలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. తెలియని అతి కొద్దిమంది కోసం చెబుతున్నాను. పది రూపాయల షేరు వెయ్యి రూపాయల ప్రీమియంకి అమ్మారా - ఆ తర్వాత వదంతులు మొదలయ్యాయి. కంపెనీ ఆర్ధిక పరిస్థితి అంతగా బాగాలేదని, ఇంటర్నేషనల్ గా ఆమె ఏదో ఇబ్బందులలో ఇరుక్కుందనీ టాక్ వచ్చింది. దానికి తోడుగా వరసగా మూడు నెలల పాటు ఆ కంపెనీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదు. మొదట్లో పెద్ద బడాయిగా, కొంత మందికి లక్ష రూపాయల దాకా సాలరీ ఆఫర్ చేసి తీసుకున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ కి నెలకి పది లక్షలని ప్రతీతి! ఉద్యోగులు జీతాలు అందక వేరే కంపెనీల్లో చేరారు. మూడు నెలల తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ ఉద్యోగం వదిలేసి ఒక పెయింట్స్ కంపెనీలో చేరాడు. ఆ తర్వాత జరిగింది అసలు విశేషం" అని ఆగి, అందరివైపూ చూసి, డ్రమెటిక్ గా అన్నాడు అతను.


    "కంపెనీ ఎంత దీనస్థితికి దిగజారిందంటే, చివరికి టీ సప్లయ్ చేసే చాయ్ వాలాకి కూడా బాకీ పెట్టింది కంపెనీ! ఆఫ్టరాల్ అయిదువేల రూపాయల బిల్లు చెల్లించలేకపోయారు. ఐదువేల రూపాయల బిల్లు కోసం 'ఐశ్వర్యా అసోసియేట్స్' మీద కేసు పెట్టాడు చాయ్ వాలా!


    ఇంకేముంది! పానిక్! కంపెనీ ఇవాళ దివాలా తీస్తుందంటే నిన్ననే అయిపోయిందని జనం! వెయ్యీ పది రూపాయలకి కొన్న షేర్ల ధర కేవలం పది రూపాయలకి పడిపోయింది. ఇంకో వారం గడిస్తే పది రూపాయల షేరుకి ఐదు రూపాయలు కూడా పలకదని అనుకున్నారు జనం.


    అందరూ అయినకాడికి అమ్మేసుకున్న తర్వాత తెలిసింది. జరిగిపోయిన దారుణం! ఆ షేర్లన్నీ తనే కొనేసింది ఐశ్వర్య! కొన్ని తన పేరుతో - కొన్ని బినామీ పేర్లతో! అప్పుడు గ్రహించారు జనం. కంపెనీ పరిస్థితి బాగుండకపోవడం, దివాలా ఎత్తే స్థితికి రావడం - అదంతా కావాలని స్ప్రెడ్ చేసిన రూమర్ అని! దివాలా ఎత్తే పరిస్థితి కల్పించింది ఐశ్వర్య. రాజీనామా చేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఐదు వేల కోసం కోర్టుకి వెళ్ళిన చాయ్ వాలా, ఆమె మనుషులే! జనం ఆమె గ్లామర్ లో పడి అంత ఎక్కువ ధరకు కంపెనీ షేర్లు కొన్నారు. ఆమె ప్లే చేసిన ట్రిక్కుకి బోల్తాపడి అయినకాడికి అమ్ముకున్నారు. అన్ని షేర్లూ తనే కొనుక్కుంది ఐశ్వర్య. వారం తిరక్కుండా మళ్ళీ అవే షేర్లు రెండేసి వేలకి అమ్ముడుపోయాయి. కన్నుమూసి తెరిచేలోగా కోట్లు సంపాదించింది ఐశ్వర్య."


    అంతా విని, తలపంకించి నవ్వాడు మూర్తిగారు.


    మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు ఆ కుర్రాడు.


    "అంతటితో ఆగలేదు ఐశ్వర్య. మళ్ళీ రిపీట్ పెర్ ఫార్మెన్స్ చేసింది."


    "ఊరవతల ఇళ్ళ స్థలాలు" అన్నారెవరో.


    "కరెక్ట్! ఊరికి కిలోమీటర్ల దూరంలో వెయ్యి ఎకరాలు కంది ఐశ్వర్య. అప్పుడు మళ్ళీ ఒక వార్త వెలుగులోకి వచ్చింది."


    "ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు" అన్నారెవరో.


    "యా! ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! హైదరాబాద్ లో సరికొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మించాలని ఎప్పటినుంచో ఆలోచన. అది అమల్లోకి రాలేదంటే కారణం ఎప్పుడూ ఉన్న ఏడుపే! ఫండ్స్ లేకపోవడం! ఐశ్వర్య గ్లామర్ మళ్ళీ పనిచేసింది. విరగబడి కొన్నారు జనం. మరుసటి వారంలో మళ్ళీ వదంతులు మొదలయ్యాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అక్కడ కడతారన్నది ఉత్త రూమరు అనీ, జపనీస్ గవర్నమెంటుకి ఈ ప్రాజెక్టులో ఏమాత్రం ఇంట్రెస్టు లేదనీనూ!

 Previous Page Next Page