Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 24


    "బాలుతో మాట్లాడుతుంటే తెలిసింది" అన్నాడు.


    "ఏ బాలూ!" అన్నాడు మూర్తిగారు ఆశ్చర్యంగా.


    "మీ బట్లరు! అతను పొయ్యి దగ్గర కూర్చుని నుయ్యి దగ్గర జరిగింది ఏమిటో చెప్పగలడు. భారత్ లో ఉండి బ్రిటన్ సమాచారం సేకరించగలడు. అతను పొరపాటున బట్లరయిపోయాడు గానీ పత్రికల్లో గానీ పోలీసు డిపార్ట్ మెంటులో గానీ చేరితే బాగా షైనయి ఉండేవాడు" అన్నాడు ఇన్ స్పెక్టర్ షణ్ముగం.


    పెద్దగా నవ్వాడు మూర్తిగారు.


    "అయితే ఈ హత్యాప్రయత్నం చేసింది నీల్ అయుండవచ్చు అంటావ్?"

    
    "ఒకటీ ఒకటీ కలిపితే..."


    కొంచెం సీరియస్ అయిపోయాడు మూర్తిగారు. "ఒక్కోసారి మూడు కూడా అవుతుంది ఇన్ స్పెక్టర్! ఇలాంటి కేసుల్లో కంటికి కనబడని వాటిని కూడా కనిపెట్టాలి. నువ్వు కంటికి కనబడుతున్న వాటిని కూడా వదిలేస్తున్నావ్"


    "అంటే..."

    
    "ఒకచోట ఒక హత్యాప్రయత్నం జరిగిందీ అంటే ఇంక అందరినీ అనుమానంగా చూడాలి. ప్రతివాళ్ళనీ ప్రశ్నించాలి. ఐశ్వర్య మీద ఇప్పటికి ఐదారు మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. నీల్ విషయం అటు ఉంచితే ఐశ్వర్య సూపర్ రిచ్ గర్ల్. ఆమెని చంపడానికి ఎవరెవరికి మోటివ్ ఉంటుంది?"


    బుర్ర గోక్కుని చెప్పాడు షణ్ముగం. "ఆమె ఆస్తి మీద కన్నేసిన వాళ్ళకి."


    నవ్వాడు మూర్తిగారు. "ఆ లెక్కన మొదటి సస్పెక్టుని నేనే అవుతాను. ఎందుకని అడుగు?"


    "ఎందుకని!" అన్నాడు షణ్ముగం.


    "నేను ఆమె ఆస్తిపాస్తులన్నిటికీ ట్రస్టీని. నేనొక ఫైనాన్షియల్ విజార్డ్ ని. తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేసి ఆమె ఆస్తిని కాజెయ్యగలను. ఆ అమ్మాయి తండ్రి నాకు అన్న వరస. నేను వాళ్ళకి మొదట్లో బీద బంధువుని. ఇప్పుడు పవర్ ఫుల్ అడ్వయిజర్ ని. డబ్బు లెక్కల్లో ఏదన్నా తకరారు వచ్చి ఉండొచ్చు. ఆ అమ్మాయిని ఫినిష్ చేసే దురాలోచన వచ్చి ఉండొచ్చు. ఏమంటావ్!"


    "సార్! బాలూకి మంచి పత్రికా విలేఖరి అయ్యే లక్షణాలు ఉన్నట్లే, మీలో కాళిదాసుని మించిన కవి అయ్యే లక్షణాలు ఉన్నాయ్. మంచి కల్పనా చాతుర్యం ఉంది మీకు!" అన్నాడు షణ్ముగం.


    "నేను అబద్ధాలు చెప్పానా?" అన్నాడు మూర్తిగారు కోపం నటిస్తూ.


    "అన్నీ నిజాలే చెప్పారు. కానీ నిజాలలో నుంచి పిండి తీసిన సారం ఉత్త అబద్ధం!"


    "అంటే?" అన్నాడు మూర్తిగారు.


    "అంటే...మీకు మోటివ్ ఉండొచ్చుగానీ మీరు హంతకులు కారు. కాలేరు."


    "ఎందుకని?"


    "ఎందుకంటే, మీకు డబ్బాశలేదు"


    "ఎలా తెలుసు?"


    "నాకేకాదు - మొత్తం లోకానికి తెలుసు. మీరు బ్రహ్మచారి. మీకు సంసార లంపటం లేదు. మీ సంపాదన అంతా సోషల్ సర్వీసుకే ఖర్చు పెడతారు. ధారాళంగా దానధర్మాలు చేస్తారు. బిర్లా మందిర్ ని మించిన మందిరం ఒకటి కట్టిస్తున్నారు. పొయ్యి రాజేశాక చూసుకుంటే బియ్యం లేకపోతే, మీ దగ్గరికి వచ్చినవాడు ఉత్త చేతులతో తిరిగి పోడు. మానవ సేవకే పుట్టిన ఓ మహానుభావా! మీకు వేదవేదాంగాలూ తెలుసు. మత మౌఢ్యంఅని అనుకోకుండా మీరు సైన్సుని వేదాలకు అన్వయించి చెబుతారు. మీకు దేశదేశాల్లోనూ శిష్యగణం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా వారానికోసారి ఎవరి ఇంట్లోనే మీ సత్సంగం తప్పదు. మీ ప్రవచనాలు ఎందరికో ఉత్తేజం కలగజేస్తాయి!" అంటున్నాడు ఇన్ స్పెక్టర్ షణ్ముగం ఉద్వేగంగా.


    "బస్ బస్ బస్..." అన్నాడు మూర్తిగారు నవ్వుతూ. "షణ్ముగం! నువ్వు డిటెక్టివ్ నవలలు చదవవా ఏమిటి?"


    శవ సాహిత్యమా? చిన్నప్పుడు చదివేవాణ్ణి సార్!"


    "నాకు సర్ ఆర్థర్ కానన్ డాయిల్ ఇష్టం. పెర్రీమాసన్ దగ్గరనుంచి వరసపెట్టి అన్నీ చదివాననుకో! చదివినకొద్దీ అర్థం అయ్యేది ఏమిటో తెలుసా? అందరిలోకీ అతి మంచిగా ఉండే ఓ కారెక్టరే చివరికి దుష్టుడిగా తేలతాడు. కాబట్టి ఎప్పుడూ నా మీద ఒక కన్నేసి ఉంచు."


    నవ్వి, "ఇంకో విషయం కూడా ఉంది సార్!" అన్నాడు షణ్ముగం.


    కాస్త నాన్చి చెప్పాడు షణ్ముగం. "ఐశ్వర్యగారి తల్లిగారు..."


    వెంటనే, కాస్త పదునుగా అన్నాడు మూర్తి.


    "పార్వతిగారా! నిన్న శ్రీ మీదికి వచ్చిన ఆ కుర్రాళ్లు చెప్పారట. అదేనా నువ్వు అంటున్నది?"


    "ఐశ్వర్యని చంపమని ఆమే డబ్బులిచ్చిందని..." అనబోయాడు షణ్ముగం.


    "బుల్ షిట్!" అన్నాడు మూర్తిగారు పరుషమైన ఒక పదం ప్రయోగిస్తూ. ఆయన మొహంలో అసహనం కనబడిపోతోంది.


    "షణ్ముగం! నీకు దేవుడిమీద నమ్మకం ఉందా?"


    "నూట డెబ్భయ్ ముగ్గురు దేవుళ్ళని కొలుస్తాను సార్"

 Previous Page Next Page