విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు ప్రారంభించాడు. దృఢదీక్షతో కొనసాగించాడు. అలా కొంతకాలం గడిచింది. బ్రహ్మ ప్రత్యక్ష్యం అయినాడు. "నీవు మహర్షివి అయినావు" అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు "దేవా! మీరు నన్ను మహర్షి అన్నారు. అంటే నేను జితేంద్రియుణ్ణి అయినట్లేనా?" అని అడిగాడు. బ్రహ్మ "అందుకు ఎన్ని వికారాలు కలిగినా చలించకుండాలి" అన్నాడు. వెళ్లిపోయాడు.
విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు ప్రారంభించాడు. అలా వేయేండ్లు తపస్సు చేశాడు. అతని తపస్సుకు దేవతలు వణికిపోయారు. ఇంద్రుడు విశ్వామిత్రుని తపస్సుకు భంగం చేయాలనుకున్నాడు. రంభను పిలిపించాడు. తపోభంగం చేయమన్నాడు. ఆమె పెనుగాలికి గడ్డిపోచలా వడకిపోయింది. తాను వెళ్లనన్నది. బిగుసుక్కూర్చుంది.
ఇంద్రుడు రంభను బతిమలాడాడు. తాను స్వయంగా కోకిలనయి వస్తానన్నాడు. మన్మథుణ్ణి వెంట తెస్తానన్నాడు. రంభకు తప్పలేదు. కాదనలేకపోయింది.
రంభ భువినుండి దివికి దిగింది. అందానికి కాళ్లు వచ్చినట్లుగా వయ్యారంగా నుంచుంది. విశ్వామిత్రుడు దీక్షలో ఉన్నాడు. గమనించలేదు. కోకిల కూసింది. మన్నథుడు పూలబాణాలు విడిచాడు.
విశ్వామిత్రుడు కళ్లు తెరిచాడు.
బంగారు రేఖలా కనిపించింది.
మహర్షి గ్రహించాడు, కోపించాడు.
"దశవర్ష సహస్రాణి శైలీ స్థాస్యతి దుర్భగే"
దుష్టులారా! పదివేలేండ్ల రాతివై పడివుండు" అని శపించాడు.
రంభ రాతి రంభ అయింది.
తాను కోపించాడు. అందుకు విశ్వామిత్రుడు చింతించాడు. నిద్రాహారాలు వదిలాడు. ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు మానాడు. తూర్పు దిశకు వెళ్లాడు. ఘోర తపస్సు సాగించాడు. అలా వేయి సంవత్సరాలు గడిచాయి. అప్పుడు భోజనానికి కూర్చున్నాడు. అలాంటి సమయంలో ఇంద్రుడు వచ్చాడు. అతడు బ్రాహ్మడి వేషంలో వచ్చాడు. తనకు అన్నం పెట్టవలసిందని అడిగాడు. విశ్వామిత్రుడు చలించలేదు. తనముందున్న అన్నం బ్రాహ్మణునికి ఇచ్చేశాడు.
ఆ విదంగా జితేంద్రియుడై, తపస్సు సాగించాడు విశ్వామిత్రుడు. అతడు నిట్టూర్పు సహితం విడువలేదు. అలా వేయేండ్లు తపస్సు చేశాడు. అప్పుడు అతని బ్రహ్మరధ్రం నుండి బ్రహ్మాండం అయిన పొగ పుట్టింది.
పర్వతాలు కదిలాయి.
భూమి వణకింది.
గాలి స్థంభించింది.
సూర్యుడు వెలవెలపోయాడు.
అప్పుడు దేవతల సహితంగా బ్రహ్మ ప్రత్యక్ష్యం అయ్యాడు.
'బ్రహ్మర్షీ! స్వాగతం తే2స్తు తపసాస్మ సుతోషితాః' 'బ్రహ్మర్షీ నీకు స్వాగతం నీ తపస్సువల్ల మేం సంతుష్టులం అయినాం' అన్నాడు.
విశ్వామిత్రుడు చాల సంతోషించాడు. కాని వశిష్టుడు తనను బ్రహ్మర్షి అనాలని కోరాడు. వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు.
"దేవతలు అన్నట్లే అగుగాక" అన్నాడు. విశ్వామిత్రునితో స్నేహం చేసుకున్నాడు.
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు.
పూలవాన కురియలేదు.
దేవదుందుభులు మ్రోగలేదు.
అప్సరసలు ఆడలేదు.
కిన్నెరలు పాడలేదు.
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. అంతటితో అతడు సాగించిన ఉద్యమం విజయవంతం అయింది. అతనికి అడుగడుగునా అడ్డంకి కలిగించినవారు అతనితో చెలిమి చేశారు.
సనాతన వ్యవస్థ గడుస్తుంది. అది ప్రగతిని ఓర్చదు. వెలుగంటే దానికి పడదు. సమాజాన్ని చీకట్లో ఉంచి తన పబ్బం గడుపుకుంటుంది. ప్రగతికి అడుగడుగునా అవరోధాలు కల్పిస్తుంది. దాన్ని ఓడించడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. ప్రగతిపథం ఓడదు. గెలుస్తుంది. అప్పుడు సనాతన వ్యవస్థ దిగివస్తుంది. ప్రగతితో చెలిమి చేస్తుంది.
విశ్వామిత్రుడు రాజుగా ప్రారంభం అయినాడు. రాచరికపు దర్పంతోనే 'శబళ' ను హరింపచూచాడు. నాటి ఓటమి అతని పట్టుదలను పెంచింది. ఆ పట్టుదలతో రాజ్యాన్ని వదిలాడు. అతడు సాధించవలసిన లక్ష్యం రాజ్యంకంటె గొప్పది అని గ్రహించాడు. పట్టుదలతో త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపాడు. కాని శునశ్శేపుని వృత్తాంతంలో పట్టుదలలేదు. మానవత అతనిలో పరవళ్లు తొక్కింది. ఆ తరువాత అతడు పరిపూర్ణ మానవతామూర్తి కావడానికే ప్రయత్నించాడు.
ప్రకృతి బలమైంది. విచిత్రం అయింది. ప్రకృతికి విరుద్ధంగా మనిషి నడవలేడు. ప్రకృతిని వాడుకోగలడు. ప్రకృతి సిద్ధాంతాలను వినియోగించుకొని ప్రగతి సాధించగలడు. మానవాళికి సుఖజీవనం ప్రసాదించగలడు.
ప్రతి మనిషికి ప్రకృతిసిద్ధమైన గుణాలుంటాయి. ఒకనాడు శాంతమూర్తి. ఒకడు ముక్కోపి. ఇవి అతని ప్రధాన గుణాలు. వీటిని మార్చడం కష్టం-కాదు అసాధ్యం. అలాంటి అసాధ్యం అయిన పనిని సాధించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రునిది రాజస ప్రకృతి. అది అతడు బ్రహ్మర్షి కావడానికి ఎన్నో అడ్డంకులు కల్గించింది. వాటిని అన్నింటినీ జయించాడు. అతడు కామాన్ని జయించాడు. స్వార్దాన్ని జయించాడు.
పరిపూర్ణ మానవతామూర్తి అయినాడు.
ఆ తరువాత అతడు ఏం చేశాడో మనకు తెలియదు.
పురాణాల్లో విశ్వామిత్రుని కోపిష్టిగా చూశారు.
గంగావతరణం:
విశ్వామిత్రుడు శోణానదీ తీరంలో తన కథ చెప్పాడు. అక్కణ్ణుంచి వారు గౌతముని ఆశ్రమానికి బయల్దేరారు. ఆ ప్రయాణంలో విశ్వామిత్రుడు కొన్ని కథలు చెప్పాడు. అవి సంగ్రహంగా ఇలా ఉంటాయి.