బ్రాహ్మణ క్షత్రియుల వైరం ఈ కథలో తారాస్థాయినందుకుంది. వశిష్టుడు పురోహిత్యం వదులుకోవడానికి ఇక్కడ అంగీకరించాడు. వశిష్ట పుత్రులు త్రిశంకుణ్ణి శపిస్తారు. అతడు విశ్వామిత్రుణ్ణి - క్షత్రియుణ్ణి పురోహితునిగా ఎన్నుకున్నారు. బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్ని భంగం చేయాలనుకున్నాడు విశ్వామిత్రుడు. ఒక మహోద్యమానికి పూనుకున్నాడు. త్రిశంకువును దేహంతో స్వర్గానికి పంపుతానని దీక్ష పట్టాడు. పెత్తనం ఊడిపోతున్న వాళ్లంతా ఏకం అయినారు. వశిష్ఠపుత్రులు అడ్డు వచ్చారు. వారిని తీవ్రంగా శపించాడు. దేవతలు అడ్డువచ్చారు. "అన్యమందృం కరిష్యామి, లోకోవాస్యాదనింద్రకం" అని ఉగ్రుడైనాడు. మరో ఇంద్రుణ్మి సృష్టిస్తానన్నాడు. ఇంద్రుడు లేకుంటే ఏం పోయింది? లోకం నడవదా? అని సనాతన వాదాన్ని సవాలు చేశాడు. దేవతలు నాలిముచ్చులు. "స్వర్గలోక గతంబుధా" స్వర్గం పొందిన వారివలె అని మాత్రమే అన్నాడు. మరీ లాగితే తెగుతుందని గ్రహించాడు విశ్వామిత్రుడు. లొంగారు అంతేచాలు అనుకున్నాడు.
ఆ విధంగా అనాదిగా వస్తున్న పౌరోహిత్య వ్యవస్థను ధిక్కరించి గెలిచాడు విశ్వామిత్రుడు. అతడు ఒక సంస్కర్త అయినాడు.
దశరథుడు ఋశ్యశృంగుడితో అశ్వమేధం చేయించిన్నాటికే, త్రిశంకువు కాలానికి ఎంత మార్పు వచ్చిందో ఒకసారి గమనించండి. ఇక్కడ వశిష్ఠుడు, అతని పుత్రులు దేవతలు క్షత్రియుడు పురోహితుడు కావడానికి అన్నిరకాల అడ్డంకులు వేశారు. అక్కడ అడగ్గానే అనుమతించాడు వశిష్టుడు. ఋశ్యశృంగుడు యజ్ఞం చేయిస్తే దేవతలు అఢ్డం తగల్లేదు.
సమాజం నిరంతరం ప్రగతిపథం వైపు పయనిస్తుందనడానికి ఇదొక చక్కని నిదర్సనం.
ఒకప్పుడు అంబరీషుడు అయోధ్యను పాలించాడు. అతను ఒక యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞం జరుగుతున్నది. ఇంద్రుడు యజ్ఞపశువును దొంగిలించాడు. ఆ పశువు దొరకలేదు. నరపశువు కావాలన్నారు ఋత్విక్కులు. అంబరీషుడు నరపశువుకోసం బయలుదేరాడు. ఎన్ని లక్షల గోవులు ఇస్తానన్నా మనిషిని ఎవరూ అమ్మలేదు.
చివరకు రుచీకుడు అనే రుషి కనిపించాడు. అతనికి ముగ్గురు పుత్రులు. ఒకణ్ణి తనకు ఇమ్మన్నాడు అంబరీషుడు. తాను పెద్దవాణ్ణి అమ్మను అన్నాడు రుచీకుడు. "చిన్నవాడంటే నాకు ప్రాణం" అన్నది రుచీకుని భార్య. మధ్యవారు శునశ్శేపుడు. అతను తాను తండ్రికీ, తల్లికీ పనికిరానివాడు కాబట్టి అమ్ముపోవడానికి అంగీకరించాడు. అంబరీషుడు ధనం చెల్లించాడు. శునశ్శేపుణ్ణి కొనుక్కున్నాడు.
విశ్వామిత్రుడు చూచాడు శునశ్శేపుడు. అతనికి భోరున ఏడుపువచ్చింది. మేనమామ వడిలోపడి భోరున ఏడ్చాడు. జరిగిన కథ చెప్పాడు. అంబరీషునికి యజ్ఞఫలం లభించేట్లూ, తనకు దీర్ఘాయువు కలిగేట్లూ చూడవలసిందని ప్రార్థించాడు.
విశ్వామిత్రుడు శునశ్శేపుని మొరవిన్నాడు. అతని గుండె కరిగింది. కళ్లు చెమర్చాయి. శునశ్శేపుని రక్షించాలనుకున్నాడు. తన కుమారులను పిలిచాడు. శునశ్శేపుని బదులు యజ్ఞపశువుగా వెళ్ళవలసిందని కోరాడు. కాని విశ్వామిత్రుని పుత్రులు అందుకు అంగీకరించలేదు. విశ్వామిత్రుడు మండిపడ్డాడు. "వశిష్టుని కొడుకుల్లాగే మీరూ కుక్కమాంసం తింటూ వేయేండ్లు భూమిపై వశింతురుగాక" అని శపించాడు.
ఒక మనిషిని రక్షించడానికి తన కొడుకులనే బలిపెట్టడానికి సిద్ధపడిన మహాత్యాగి విశ్వామిత్రుడు.
కొడుకులు తనమాట వినలేదు. శునశ్శేపుణ్ణి రక్షించాలి. అందుకు ఎంతో ఆలోచించాడు విశ్వామిత్రుడు. ఇంద్రునికి సంబంధించిన రెండు గాధలు సృష్టించాడు. వాటిని శునశ్శేపునికి ఉపదేశించాడు. శునశ్శేపుడు అంబరీషుని వెంట వెళ్లిపోయాడు.
యజ్ఞం జరుగుతున్నది. శునశ్శేపుణ్ణి యూపానికి కట్టివేశారు. శునశ్శేపుడు విశ్వామిత్రుడు చెప్పిన గాధలు చదివాడు. ఇంద్రుడు ప్రీతుడయినాడు. అంబరీషునికి యజ్ఞఫలం ఇచ్చాడు. శునశ్శేపునికి దీర్ఘాయువు ప్రసాదించాడు.
ఆ విధంగా ఒక మహత్కార్యాన్ని సాధించాడు విశ్వామిత్రుడు.
మనుషుల్ని బలిపశువుగా అమ్ముకునే అతినీచం అయినా ఆచారం ఉన్నకాలం అది. కన్నకొడుకును డబ్బుకోసం కక్కుర్తిపడిన రుచీకునిలాంటి వారున్న కాలం అది. స్థానంలో నరపశువు కావాలనే రాక్షస రుత్విక్కులున్న కాలం అది. మనిషిని కొనడానికి బలి ఇవ్వడానికి సిద్దపడిన రాజులున్న రాతికాలం అది.
అలాంటి కాలంలో మనిషికీ, మనసుకూ విలువనిచ్చిన మానవతామూర్తి విశ్వామిత్రుడు. మనిషిని పశువుగా చూచిన దౌర్భాగ్య వ్యవస్థను మార్చడానికి తన మేధస్సును కప్పురంలా వెలిగించిన మహామేధావి అతడు. మనిషిని మనిషిగా గుర్తించాలనే మహోద్యమానికి తన సర్వస్వం ధారపోసిన మహాత్యాగి అతడు.
నరవిక్రయాన్నీ, నరవధనూ అంతం చేయడానికి ప్రయత్నించిన యుగకర్త విశ్వామిత్రుడు.
ఈ కథలో సంశయానికి అవకాశం ఉన్న ఒక అంశం ఉంది. విశ్వామిత్రుని నూరుగురు కొడుకులూ, వశిష్ఠునితో జరిగిన యుద్ధంలో హతమారారని చెప్పాడు. మళ్లీ కొడుకులను శపించాడని ఇక్కడ చెప్పాడు. ఇది లోపమే. ఇలాంటి లోపాలు అత్యంతాధునిక సాహిత్యంలో కూడ కనిపిస్తున్నాయి. కాగా ఒకరకంగా సరిపెట్టుకోవచ్చు. అది తరువాత కలిగిన సంతానం అనుకోవచ్చు.
విశ్వామిత్రుడు పుష్కర తీర్థంలో ఉండి మళ్లీ తపస్సు సాగించాడు. అలా వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యంక్షం అయినాడు. "నీవు ఋషిని అయితివి" అన్నాడు. అంతర్థానం అయినాడు.
విశ్వామిత్రునికి సంతృప్తి కలుగలేదు. మళ్లీ తపస్సు ప్రారంబించాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు అతనికి మేనక కనిపించింది. ఆమె పుష్కరతీర్థంలో స్నానం చేస్తుంది. మేనక అప్సరస. అందూలోనూ స్నానం చేస్తూంది. ఆ దృశ్యం చూచాడు విశ్వామిత్రుడు. అతని మనసు చలించింది. అతడు మేనకను వరించాడు. ఆమె కాదనలేదు. అలా సంవత్సరం గడిచింది.
విశ్వామిత్రుడు అప్పుడు తెలుసుకున్నాడు. తాను నిగ్రహం కోల్పోయానని గ్రహించాడు. తాను సాధించవలసింది గొప్ప కార్యం. ఇంద్రియాలకు లొంగిపోయాను అనుకున్నాడు. సిగ్గుపడ్డాడు. అతడు మేనకను కోపించలేదు. మంచిమాటలు చెప్పాడు. లాలించాడు. ఆమెను పంపించాడు.