అంతలో "ఎవరదీ?" అని వినపడగానే ఓ క్షణంపాటు లాలస ఉలిక్కిపడింది.
దెయ్యం విడిచిన కుబుసంలా సన్నగా ఓ ముసలివ్యక్తి ఆమెను ప్రశ్నిస్తున్నాడు.
"నా పేరు లాలస. ఈ వూరే?"
"నేను ఇక్కడ వాచ్ మాన్ ని, అయినా ఇంత రాత్రప్పుడు ఇక్కడ పనేమిటి అమ్మా?" అని మరింత ముందుకొచ్చి పరిశీలనగా చూశాడు.
"ఏం చేయను పెద్దయ్యా? నాకు ఇష్టం లేని వ్యక్తితో పెళ్ళి చేయడానికి మా ఇంట్లోవాళ్ళు పట్టుపట్టారు. ఈ రోజురాత్రి నిశ్చితార్థం తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. నేను ప్రేమించిన అబ్బాయిని ఇక్కడకు రమ్మన్నాను. అతను రాగానే ఇద్దరం ఎటైనా పారిపోతాం."
ఆ ముసలాయన జీవితంలో ఇలాంటి థ్రిల్లింగ్ విషయం వినడం ఇదే మొదటిసారి. నిశ్చయతాంబూలాలు పుచ్చుకున్న రోజు ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో లేచిపోవడం గమ్మత్తుగా వుంది.
ఆమె ప్రేమచరిత్ర వినాలన్న కుతూహలం ఆయన వయసును తగ్గించింది. ఏదో తెలియని హుషారు ఆయన ముఖంలో పొంగుతోంది.
ఆడపిల్లల విషయంలో అనవసరమైన క్యూరియాసిటి చూపించనిది ఆమెకు ఇంతవరకు తెలిసిన మగవాళ్ళల్లో తిలక్ ఒక్కడే. తానెవరో అవసరం వచ్చినప్పుడు చెబుతానంటే మరోమాట మాట్లాడలేదు. అందుకే అతనంటే చాలా గౌరవభావం ఏర్పడింది ఆమెకు....
"అలా కూర్చుని మాట్లాడుకుందాం పెద్దయ్యా!"
ఇద్దరూ రోడ్డు మధ్యలో కూర్చున్నారు.
"ఆ అబ్బాయి ఇప్పుడిక్కడికి వస్తాడా!" వాచ్ మాన్ అడిగాడు.
"వస్తాడు పెద్దయ్యా. అతనికి నేనంటే చాలా ఇష్టం. కానీ అతనికీ చాలా సమస్యలు వుంటాయి కదా. వాటినన్నిటినీ యెదుర్కొని రావాలి."
ఆ అబ్బాయి వచ్చినప్పుడు వాళ్లిద్దరి ఫీలింగ్స్ ఎలా వుంటాయో చూడాలని వుంది ఆయనకు. ఒకవేళ అతను రాకపోతే ఈ నాజూకైన అమ్మాయి ఎలా బాధపడుతుందో పరికించాలని వుంది. అందుకే ప్రేమ మహత్తరమైనది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయన్నట్టు ప్రేమ సుఖాంతమైనా, దుఃఖాంతమైనా మధురంగానే వుంటుంది వినేవాళ్ళకు.
"ఎన్నిగంటలకు వస్తానన్నాడు?"
"ఈపాటికి రావాలి. అతను రాకపోతే..." ఆ పరిణామం వూహించలేనట్టు మెల్లగా ఏడ్వడం ప్రారంభించింది.
వాచ్ మాన్ కళ్ళల్లోనూ నీళ్ళు తిరిగాయి. అంత ఖరీదుగా వుండే అమ్మాయి బేలతనంతో ఏడ్వడం చూస్తుంటే కదిలిపోతున్నాడు. అదే తనతోపాటు పనిచేసే స్వీపర్ తన ప్రేమ కథంతా చెప్పుకుని ఏడిస్తే ఆయన అంతగా చలించడు. పైపెచ్చు ఆమె ప్రేమను అవహేళన చేస్తాడు. అందుకే సినిమాల్లో హీరోనో, హీరోయిన్నో బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినట్టు చూపిస్తారు.
"వస్తాడు లేమ్మా! ఏడవకు! ఏడవకు" అని బుజ్జగింపుగా చూశాడు.
ఆమెను మరో విషయంవైపు డైవర్ట్ చేయాలని "ఇంతకీ అతను ఎక్కడుంటాడమ్మా?" అని అడిగాడు.
వెంటనే తిలక్ మెదిలాడు ఆమె మనస్సులో జైల్లో వుంటాడు అంది పరాకుగా.
వెంటనే తన తప్పును గ్రహించింది- "జైల్ లాంటి వాళ్ళింట్లో" అని నవ్వడానికి ప్రయత్నించింది.
"చదువుకున్నాడా?"
"ఆఁ.... తత్వశాస్త్రాలన్నీ చదువుకున్నాడు."
ఆయకు అర్థం కాలేదు.
"అంటే... అదీ... మనం ఎలా పుట్టామో? యెలా చచ్చిపోతామో? ఈ ప్రపంచం ఎలా ఏర్పడిందో వూహిస్తూ, విశ్లేషిస్తూ పదిమందికి చెప్పిన సంగతులన్న మాట"
"అర్థమైందిలే తల్లీ . రైల్లో చాలామంది ఇలాంటివాళ్ళు కనిపిస్తుంటారు. తొమ్మిదితూట్ల కాయమిది... లాంటి పిచ్చి పిచ్చి తత్వాలు పాడుకుంటూ అడుక్కుంటూ వుంటారు. వాళ్లను గురించి చదివాడన్న మాట."
"అవును పెద్దయ్యా! చాలా కరెక్టుగా చెప్పావే!"
"అతనితో నీకు ఎప్పటినుంచి పరిచయం? ఇలా నిశ్చయ తాంబూలాల రోజు కాకుండా ఇంతకుముందే పెళ్ళి చేసుకుని వుండచ్చు కదా"
"నాలుగేళ్ళ నుంచి అనుకుంటున్నాం పెద్దయ్యా! మా నాన్న చండ శాసనుడయితే, వాళ్ళ నాన్న ఇంట్లో నియంత. అందుకే వాళ్ళకు భయపడి ఇంతకాలం పెళ్ళి చేసుకోలేకపోయాం. అతను కొంత పిరికివాడు. నేను సరేనన్నా అతనే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఈరోజు విధిలేక ఇలా వచ్చేశాను."
"మరి అతనింకా రాలేదే"
"నాకూ అదే భయంగావుంది పెద్దయ్యా. అతను రాకపోతే నా బతుకు సర్వనాశనమయిపోతుంది" అని ముఖాన్ని చేతులమధ్య దాచుకుంది.
వాచ్ మాన్ కు ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు.
ఆమె తల పైకెత్తకనే అలాగే జైలుకేసి చూసింది. మరికొంతసేపటికి కరెంట్ ఆగిపోతుందని గుర్తుకు రావడంతో మానసికంగా అలర్ట్ అయిపోయింది.ఇక అక్కడినుంచి వాచ్ మాన్ వెళ్ళిపోతే తప్ప తన పని సజావుగా సాగదు. కరెంట్ ఆఫ్ అయిన వెంటనే తాడూ, టార్చ్ లైట్ పట్టుకుని కాంపౌండ్ గేటు దగ్గరికి వెళ్ళాలి. వాచ్ మాన్ ను అక్కడినుంచి తరిమెయ్యాలి. ఇక టైమ్ లేదనుకుంది.
"ఏం చేయను పెద్దయ్యా? ఆయన రాలేదు. ఇక తిరిగి ఇంటికి వెళ్ళలేను. ఆ పెళ్ళి చేసుకోలేను" అన్ని ఎక్కిళ్ళు పెడుతోంది.
ఆయన మరింత కదిలిపోయాడు.
"నాకూ అదే బెంగపట్టుకుంది తల్లీ. ఇప్పుడెలా?" గాద్గదికంగా ప్రశ్నించాడు.
"చచ్చిపోతాను. పెద్దయ్యా!"
ఆయన చలించిపోయాడు. "అంతమాటనకు తల్లీ"
"నువ్వేం బాధపడకు పెద్దయ్యా! చచ్చిపోవడం నాకు అలవాటే. రెండేళ్ళ క్రితం ఇదే రోజు ఆయన రాకపోతే నిద్రమాత్రలు మింగి చచ్చిపోయాను. ఆరోజు కూడా కాలేజీ ముందు కలుసుకుంటానని మాట ఇచ్చి అతను రాలేదు."
ఆ తరువాత ఆయనకు ఏమీ వినపడలేదు. మెదడులో విస్ఫోటనం ఆ శకలాలనుంచి కొత్త సత్యం బోధపడుతుంది ఆయనకు.