Previous Page Next Page 
ఉషోదయం పేజి 24

    "మీ అనుమానం ఎవరిమీదన్నా వుందా సార్" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
    ఇంకెవరు సార్... అప్పులు ఎగ్గొట్టిన పెద్దమనుషుల జాతకాలు బయటపడడంతో వాళ్లల్లో ఎవరో కక్షతో చేసిన పని అని తెలుస్తోందిగా... వేరే ఎవరికో మా మీద ఏం పగ వుంది? తప్పకుండా ఇది డిఫాల్టర్స్ పనే...
    అందులో ఏ ఒక్కరైనా కావచ్చు, లేదంటే అలాంటి అందరూ కూడబలుక్కునైనా చేసివుండవచ్చు... నాకైతే అందరికంటే పెద్దమొత్తం నలభై ఐదుకోట్లు తీసుకున్న శ్రీధర్ రెడ్డి హస్తం వుందనిపిస్తోంది... పోలీస్ కమీషనర్ నాకు బాగా మిత్రులు. ఆయనకి ఫోన్ చెయ్యనా... మీకు సూచనలిస్తారేమో..." అంటూ ఫోన్ అందుకున్నారు.
    పోలీస్ కమీషనర్ తో మాట్లాడి ఫోన్ ఇన్ స్పెక్టర్ కి అందించారు. ఫోనులో ఆర్డర్ అందుకుంటూ "ఎస్ సార్... ఉయ్ విల్ బి ఆన్ ది జాబ్... ఇప్పుడే... ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశాం. ఎస్ సార్" అంటూ ఫోన్ పెట్టేశాడు.
    "మీరు వెళ్ళండి సార్... అన్నట్టు మీ అమ్మాయి ఫోటో ఒకటి కావాలి... వెంటనే పంపండి..."
    "సారీ, హడావిడిలో మర్చిపోయాను. వెంటనే పంపుతాను ఇతనితో... శ్రీనూ , పద వెడదాం, ఫోటో తీసుకొచ్చి ఇద్దూగాని..." అంటూ బయలుదేరారు.
    ఇంటికెళ్ళే తోవలో కారులోంచి శారదకి ఫోను చేశారు.
    అప్పుడే ఆఫీసునించి వచ్చి ప్రకాష్ భోంచేస్తున్నాడు.
    శారద ఫోను ఎత్తి విని "మైగాడ్... డాడీ..." అంటూ అరిచింది.
    ప్రకాష్ సత్యవతి తెల్లబోయారు. "ఏమిటి డాడీ! ఏం చెప్తున్నారు? ఓ గాడ్... నేను అంటూనే వున్నాను. భయపడినంతా చేశారు. డాడీ" అంటూ వణికిపోతూ కుర్చీలో కూలబడింది. "ఏం జరిగింది శారదా!" సత్యవతి కుర్చీలోంచి లేచి కోడలి దగ్గిరకి వచ్చింది.
    "ఏమైంది? ముందు సంగతి చెప్పు. ఎవరికేం అయింది" అన్నాడు ప్రకాష్. శారద చేతుల్లో తల ఆనించుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ "నీరదని ఎవరో కిడ్నాప్ చేశారట... శీనూ, నీరద స్కూటర్ మీద వస్తూంటే ఎవరో బలవంతంగా వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్ళిపోయారట..." అంది గొంతు రుద్ధమవగా.
    "నీరదని కిడ్నాప్ చెయ్యడం ఏమిటి?"ఏమీ అర్థంకాక అడిగాడు ప్రకాష్.
    శారద టూకీగా జరిగిందంతా చెప్పుకొచ్చింది.
    "ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న విషయమైనా నాతో చెప్పాలనిపించలేదా? క్రిమినల్ లాయర్ ని ఇంట్లోపెట్టుకుని" అహం దెబ్బతిన్నట్లన్నాడు.
    "ఏమో! ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? ఏదో ఉత్తి బెదిరింపులనుకున్నారు డాడీ... ప్రకాష్... మనం వెంటనే వెళ్ళాలి అక్కడికి. నాన్న బాగా షేటర్ అయిపోయారు. ఇప్పుడు అమ్మకెలా చెప్పడం... ఆవిణ్ణి ఎలా ఫేస్ చెయ్యడం, ఆవిడెలా తట్టుకుంటుందోనని ఆయన భయం. అందుకే నన్ను వెంటనే రమ్మన్నారు. పదండి వెడదాం" అంది కంగారుగా.
    "ఇప్పుడా! అలసిపోయాను" గొణిగాడు. శారద అసహనంగా చూసింది.
    "ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్ళేది... ప్రకాష్! శారదని తీసుకుని వెంటనే వెళ్ళు రాత్రికూడాను... అక్కడంతా ఎలా వున్నారో" సత్యవతి మందలించింది.
    "పోనీలెండి, నేను ఒక్కర్తినే వెళ్ళగలను..." అంది కోపంగా.
    "అబ్బబ్బ వల్లించకుపద వెడదాం..." చేయి కడుక్కుని కారుతాళాలు తీసుకున్నాడు.
    నారాయణమూర్తిగారు, శ్రీనివాస్ ఇంటికి రాగానే ఫ్రేమ్ లోంచి నీరద ఫోటోతీసి శ్రీనివాస్ కిచ్చి "వెంటనే ఇచ్చిరా.., ఇక్కడికే రా బాబూ రూముకి వెళ్లద్దు.
    "ఏమిటి ఏమైంది, నీరద ఫోటో ఎక్కడికి పంపిస్తున్నారు? అదేదీ మీతో రాలేదా? ఇంకా ఆఫీసులోనే వుందా... ఏమిటి... శ్రీనూ, ఫోటో ఎక్కడికి తీసుకెళుతున్నావు?"తెల్లబడ్డ మొహంతో కలవరంగా అడిగింది.
    నారాయణమూర్తిగారు శ్రీనివాస్ ని వెళ్ళమన్నట్టు చూసి "లలితా, అలా కూర్చో ముందు. నీరద పనిమీద వెళ్ళింది. వస్తుంది. శ్రీనివాస్ తీసుకొస్తాడు. ఊరికే గాభరా పడకు" భార్యని చెయ్యిపట్టుకుని తను సోఫాలో కూర్చుని పక్కన కూర్చోపెట్టారు.
    ఆవిడ అనుమానంగా చూసింది ఆయన వైఖరికి.
    "ఏం జరిగింది చెప్పండి" అంది సూటిగా చూస్తూ. ఆయన నిస్సత్తువగా సోఫా వెనక్కి వాలిపోయారు. "ఏమిటి మాట్లాడరు? నీరదకేమైంది? ఏదో దాస్తున్నారు నా దగ్గిర."
    "డాడీ" అంటూ శారద వచ్చి తండ్రిని కౌగలించుకుంది చిన్నపిల్లలా... ఆ సమయంలో కూతురు, అల్లుడు రావడంతో ఆవిడ అనుమానం బలపడింది.
    శారదని పట్టుకుని ఊపేస్తూ "ఏమిటే మీరంతా కలిసి నా దగ్గిర ఏం దాస్తున్నారు? నీరదకేదో జరిగింది. నాతో ఎందుకు చెప్పడంలేదు" అరిచింది.
    శారద కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా తల్లిని కూర్చోపెట్టి "అమ్మా, నీవు గాభరా పడకూడదు... శాంతంగా కూర్చోముందు. అంతా చెబుతాను" అంది. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క విషయమూ చెప్పుకొచ్చింది.
    నిలువుగుడ్లేసుకుని చూసింది లలితమ్మ. "అయింది. నేను భయపడినంతా అయింది. వద్దు వద్దు అని మొత్తుకున్నాను. తండ్రీ, కూతురు నామాట విన్నారా... ఇప్పుడేం చేస్తారు చెప్పండి... నీరదని ఎలా తీసుకొస్తారో క్షేమంగా తీసుకురావాలి. లేకపోతే నేనూరుకోను..." కాళికలా విరుచుకుపడింది భర్తమీద ఆవిడ. మీరే తెలివైనవాళ్ళు అనుకుంటారు. సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళమనుకుంటున్నారు. ఇప్పుడేం చేస్తారు చెప్పండి" ఆయన్ని పట్టుకుని ఊపేస్తూ ఆవేశంగా అరిచిందా తల్లి.
    "అత్తయ్యా... మీరు కాస్త ప్రశాంతంగా వుండాలి. ఈ సమయంలో... మమ్మల్ని కాస్త ఆలోచించనీయండి. జరిగిపోయిందాని గురించి బాధపడడం కాదు జరగాల్సింది చూడాలి. నీరదకేం కాదు... భయపడకండి... వాళ్లు బెదిరించడానికి చేశారీపని..." ప్రకాష్ నచ్చచెప్పసాగాడు. లలితమ్మ కొంగులో మొహం దాచుకుని ఏడవసాగింది. శారద తల్లిని పొదివిపట్టుకుని ఓదార్చసాగింది.
    "పోలీస్ కంప్లయింట్ ఇచ్చారా" ఆరా తీశాడు. తలవూపారు నారాయణమూర్తి. ఆ రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు. మళ్ళీ ఫోనేదన్నా వస్తుందేమోనని ఆరాటంగా చూశారు. పోలీసులు వచ్చి ఫోన్ ట్యాప్ చేసి ఓ ఇన్ స్పెక్టరుని ఏ ఫోన్ వచ్చినా రికార్డు చెయ్యడానికి ఏర్పాట్లు చేసి వెళ్ళారు.

 Previous Page Next Page