Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 25


    ఇప్పుడు తను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చదవనూ, రాయనూ స్పష్టంగా వచ్చింది.

    ఆమె చెప్పటం ప్రారంభించింది.

    "నీకీరోజు సామర్ధ్యం గురించి చెబుతున్నాను. నీ జీవిత పరమపదసోపానంలో నీ తల ఓటమి అనే పాముకోరల్లో చిక్కుకోకుండా వుండటానికి దీన్ని నీ చరమ దశవరకూ గుర్తించుకో.

    "To forget is a crime.
    To be lazy is a greater crime.
    To neglect work and offer excuses is the greatest crime.
    Action without delay is the soul of Efficiency...."

    పూర్తి అర్ధం కోసం త్రినాధ్ చూపులు చంచలిస్తుండటాన్ని ఆమె గమనించింది.

    రాతి దిమ్మె మీంచి ఆమె లేచింది. సాలోచనగా అటూ ఇటూ పచార్లు చేస్తూ అంది- "దీన్ని ముందు నువ్వు ఆచరించాలి. ఆ తర్వాత నీ సిబ్బంది ఆచరించేలా చూచుకోవాలి.

    మరుపు ఒక తప్పు.

    సోమరితనం పెద్ద తప్పు.

    పూర్తి చేయవల్సిన పనిని నిర్లక్ష్యం చేసి దాన్ని కప్పి పుచ్చుకోవటానికి సాకులు చెప్పటం అతి పెద్ద తప్పు.

    అలసత్వానికి ఆమడదూరంలో వుంటూ అనుకున్నది సాధించటంలో నిగ్మనమవ్వటమే సామర్ధ్యానికి ఆయువుపట్టు..."

    త్రినాధ్ ఆమె ప్రవచిస్తున్న మానవ జీవితపు విజయ రహస్యాల్ని నిశ్శబ్దంగా తన జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తం చేసుకుంటున్నాడు.

    "ఆల్ లెర్నింగ్ ఈజ్ టు మేక్ ఏ లివింగ్...." ఆమె మాటలు పూర్తికాక ముందే అన్నాడు- "కోటి విద్యలెల్ల కూటికొరకే..." అని.

    ఆమె చిరునవ్వుతో అవునన్నట్టు తలూపింది.

    తిరిగి అంతలోనే సీరియస్ గా మారిపోయింది.

    "ఇలాంటి దరిద్రపు సామెతలే మనిషి అభివృద్ధికి పెద్ద ప్రతిబంధకాలు. కోటి విద్యలు కూటికొరకే అయితే మనిషి సాధించేదేమిటి? కేవలం పొట్ట నింపుకోవటమా? మానవ పరమార్ధం అదికాదు.

    తినటానికే పుట్టినట్టు- అని ఆ సామెత ఆధునిక మానవ జీవితాన్ని కించపరుస్తోంది. కోటి విద్యలు- మనిషి తాను బాగా బ్రతుకుతూ, ఇతరుల్ని బాగా బ్రతికించటానికి. కోటి విద్యలు ఆరోగ్యకరమైన సమాజము కోసం- బలవంతమైన భాగ్యవంతమైన దేశం కోసం కావాలి.

    మనిషి ఒక నిరంతర అభ్యాసకుడు కావాలి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుండాలి. నేర్చుకోవడం సెల్ఫ్ రియలైజేషన్ కి దారితీయాలి. నేర్చుకున్న దాన్ని తన అనుభవంలోకి తెచ్చుకుని తన శక్తిని తాను బయటపెట్టుకుని తనకు తానుగా ఎదగాలి. ఈ నేర్చుకోవటం అన్నది శక్తి సామర్ధ్యాల్ని, ఆత్మవిశ్వాసాన్ని, నిగ్రహాన్ని పెంచుతుంది. అంతేకాదు, ప్రయోజనాత్మకమైన ఊహల్ని, సాహసోపేతమైన నాయకత్వ స్పృహను, హేతుబద్ధమైన దృక్పధాన్ని నేర్పి మనిషిని ధీశాలిగా నిలబెడుతుంది. ఇది మానవ మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన సైన్స్.

    సైన్స్ నేర్చుకోటానికి-

    సాంకేతిక పరిజ్ఞానం అమలుపర్చటానికి- ఆధునిక మానవ జీవితపు సమస్యలకి సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారం చూపుతుంది. ఈ పరిజ్ఞానంలో నూతనత్వం, నిర్వహణా సామర్ధ్యం ఇమిడి వుంటాయి.

    అయితే, ఒకటి మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి త్రినాధ్. ఈ దేశ ప్రజల అవసరాల పెరిగినా, ఆలోచనలూ అభిరుచులూ మారలేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని నమ్మే ఓటర్సు ఇక్కడున్నారు. వీళ్ళందరూ ఒక్కరోజుతో మారారు. నిజంలోని కష్టాల్ని అధిగమించటాన్ని నేర్చుకోరు. కలల్లోని అద్భుతాల్ని, హీరోయిజాన్ని ఆరాధిస్తారు.

    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రేపు నీ వాణిజ్య సామ్రాజ్యపు రాజపోషకులు వాళ్ళే కనుక. అందుకే అనంత జనప్రవాహపు ఆలోచనా సరళిని అభ్యసించు..." ఆమె చెబుతూ, చెబుతూ ఓ క్షణం ఆగింది.

    త్రినాధ్ కి విస్మయంగా వుంది... ఒక విజ్ఞాన భాండాగారం తన ముందున్నదా అనే విస్మయం.

    ప్రాతఃకాలపు చిరుగాలికి ఆమె కురులు ఆమె ఫాలభాగంపై అల్లల్లాడుతున్నాయి.

    మరికొద్ది నిముషాలకు తూరుపు పొద్దు సిందూరం ప్రత్యక్షం కానుంది.

    అతనికి అసంతృప్తిగా వుంది-

    అతనిలో నానాటికి పెరుగుతున్న విజ్ఞాన్వేషణ, అభ్యాసపు తృష్ణ, మానవ జీవితపు చీకటి మూలాల శోధనాపరమైన జిజ్ఞాస అతన్ని దాహార్తని చేస్తోంది.  

    ఆరోజు పాఠపు ఆఖరి అంకం వివరించటానికి ఆమె సమాయత్తమయింది.

    "జీవితం ఒక ఛాలెంజ్...
    బెట్ కట్టు.

    జీవితం ఒక బహుమతి.
    అనుభవం ఆధారంగా ఒప్పుకో.

    జీవితం ఒక సాహసం
    తెగించు

    జీవితం ఒక భేదం
    అధిగమించు

    జీవితం ఒక దుఃఖభాజకం
    ఎదుర్కో.

    జీవితం ఒక బాధ్యత
    నెరవేర్చు.

    జీవితం ఒక ఆట
    ఆడు- ఆడి రక్తి కట్టించు.

    జీవితం ఒక మిస్టరీ
    విప్పదీయ్.

    జీవితం ఒక గీతం
    పాడు.

    జీవితం ఒక అదృష్టం
    అందుకో.

    జీవితం ఒక ప్రయాణం
    పూర్తిచెయ్

    జీవితం ఒక వాగ్దానం
    నిలబెట్టుకో.

    జీవితం ఒక ప్రేమ
    ఆరాధించి, ఆస్వాదించి, అనుభవించు..."

    అక్కడో క్షణం ఆమె ఎందుకో ఆగిపోయింది. ఆరాధనగా త్రినాధ్ వైపు ఒకే ఒక్క క్షణం చూసింది. అది ఒక లిప్తపాటు మాత్రమే.

    కంప్యూటర్ మెమొరీ డిస్క్ లా పనిచేస్తున్న త్రినాధ్ మెదడు ఆమె చూపును- ఆమె లిప్తపాటు భావాన్ని గ్రహించలేకపోయింది.

    కొద్ది క్షణాల ఏమరుపాటు కొందరి జీవితాల్ని ఎక్కడికో చేరుస్తాయి- ఏ దిశకో మారుస్తాయి.

    ఆమె మరలా చెప్పటం ప్రారంభించింది.

    "జీవితం ఒక ఉత్సాహం
    పుంజుకో.

    జీవితం ఒక పోరాటం
    యుద్ధం చెయ్

    జీవితం ఒక పజిల్
    పరిష్కరించు.

    జీవితం ఒక లక్ష్యం
    సాధించు..."

    ఆమె చెప్పటం ముగించింది. ఆ తర్వాత నిశ్శబ్దంగా వుంది.

    కొద్ది క్షణాలకు అతడు కళ్ళు తెరిచాడు. ఆమె విజ్ఞానపు విశ్వరూపం వైపు తన మనోనేత్రంతో చూశాడు.

    అప్పుడే తెలతెలవారుతోంది.

    ఆమె కదిలింది.

    వెనుకే అతను బయలుదేరాడు.

    హీరాలాల్ గురించి, యాదవ్ గురించి, తనకు ఓ నీడ దొరకటం గురించి, పేపర్ లో ఇవ్వబోతున్న ప్రకటన గురించి- అంతా చెప్పాడు.

    ఆమె మౌనంగా వింది.

    జీప్ ఎక్కబోయే ముందు అంది-

    "సుదర్శన్ రావు ఒక పోలీసు జాగిలం- ప్రియాంక కూడా తెలివి కలదే- పైగా పలుకుబడి, అండదండలున్న పౌరుషవంతురాలు. నీ చర్యలపై వారి కళ్ళు పడవచ్చు. అందుకే హెచ్చరిస్తున్నాను. నువ్వొక అంతర్వాహిలా ముందుకు సాగాలి..." అని జీప్ ఎక్కింది.

    త్రినాధ్ అప్పటికే తన ఆలోచనల్లో చాలా దూరం వెళ్ళిపోయాడు.

    జీప్ ముందుకు దూకింది.

    నగరం దగ్గరవుతుండగా అన్నాడు-

    "ఈ రోజు నుంచి మీ జీప్ ని అద్దెకు తీసుకుంటున్నాను" అని.

    ఆమె చిరు మందహాసంతో అంగీకార సూచకంగా తలూపింది.


                                                  *    *    *    *


    హీరాలాల్ కి మహదానందంగా వుంది.
   
    ఇక ఈ జన్మకు తన సొంతం కాదనుకున్న బిల్డింగ్ తిరిగి తన చేతికి చిక్కింది.

    ఆ రోజే త్రినాధ్ ఆ బిల్డింగ్ లో కాలు పెట్టబోతున్నాడు. హీరాలాల్ త్రినాధ్ ని చూస్తుంటే కొండంత ధైర్యంగా వుంది. అంతకు మించిన కృతజ్ఞత కూడా వుంది.

    అందుకే దగ్గరుండి ఫ్లోర్ అంతా కడిగించి, రంగులు వేయించి, ఇంట్లో వున్న మంచి ఫర్నిచర్ కూడా త్రినాధ్ సౌకర్యార్ధం అక్కడ వేయిస్తున్నాడు.

    సరీగ్గా 10-30కి వచ్చారు... త్రినాధ్, హిందూ, సైంటిస్టు, ఇంజనీర్ లు.

    అవసరం మేరకే మాట్లాడడం వలన అవతల వ్యక్తిని తన హద్దుల్లో వుంచవచ్చనే మాలిని హితబోధ మనస్సులో మెదులుతుండగా హీరాలాల్ కి ఒకే ముక్కలో కృతజ్ఞతలు చెప్పి పంపించాడు.

    ఆ తర్వాత సాలోచనగా ఆ ఫ్లోర్ అంతా కలయజూచాడు. విశాలమైన హాలది. దాదాపు వందమంది సిబ్బంది సౌకర్యంగా కూర్చుని పని చేసుకునే వీలున్నంత హాలు. హాలుకి ఓ చివర ఫ్లయివుడ్ పార్టిషన్. అందులోనే ఇదివరకు యాదవ్ వుంది.

    హాల్లో ఓ పది టేబుల్స్, పది కుర్చీలు, రెండు సోఫాలు, రెండు గోద్రేజ్ బీరువాలు వున్నాయి.

    త్రినాధ్ మౌనంగా పార్టిషన్ గదిలోకి నడిచాడు.

    వెనుకే ఆ ముగ్గురూ లోనకు వెళ్ళారు.

    గదిలోపల ఇప్పుడు నీట్ గా వుంది. నీట్ గా వున్న ఆ గది ఇప్పుడు నిశ్శబ్దంగా వుంది. గది మధ్యలో హీరాలాల్ వేయించిన విశాలమైన టేబుల్ దాని ముందు ఓ పెద్ద కుర్చీ వున్నాయి.

    కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా వున్న త్రినాధ్ ఓసారి మాలినిని తన మనోనేత్రం ముందు నిలుపుకున్నాడు.

    అంతే... ఆ తరువాత అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది.

    రెండే రెండంగల్లో కుర్చీని సమీపించి అందులో కూర్చున్నాడు.

    ఇప్పుడతడేం చేయబోతున్నాడో వాళ్ళే మాత్రం వూహించలేక పోతున్నారు.

    "హిందూ..." ఇప్పుడతని కంఠంలో ఓ రకమైన విశ్వాసం, అధికారం, శాసనం ప్రస్పుటమయ్యాయి.

 Previous Page Next Page