Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 26


    ఆమె చెప్పమన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది.

    "మన కంపెనీ ఇంకా రిజిస్టర్ కాలేదు. అదీకాక ఈ అడ్రస్సు ప్రకటనలో ఇస్తే ఇంటర్వ్యూకి ముందే అభ్యర్ధులు ఇక్కడకు వస్తే అప్లయ్ చేయరు. కనుక బాక్స్ నెంబర్ ఇవ్వు. ఇంటర్వ్యూ బంజారా హోటల్లో జరుగుతుందని కూడా ఇవ్వు. మరో విషయం- దయచేసి మీ రికమండేషన్స్ ని మా మీద ప్రయోగించవద్దు. అలా జరిగితే అది మీ అనర్హత క్రింద లెక్కిస్తాం అని కూడా జోడించు..." అంటూ జేబులోంచి డబ్బు తీసి రెండు వేలు లెక్కపెట్టి హిందూకి ఇచ్చి వెళ్ళి రమ్మన్నట్లుగా చూశాడు.

    హిందూ అలా వెళ్ళిపోగానే ఆ ముగ్గురూ మిగిలారు.

    "ప్రస్తుతం నేను మీకు జీతాలివ్వలేను. కాని కొంతిస్తాను. అది మీకు తిండికి, రోజూ నా ఆఫీసుకి రావటానికి సరిపోతాయి. నాకో దారి ఏర్పడగానే మొదటి నుంచి లెక్కించి అంతా ఇచ్చేస్తాను. రేపటి నుంచి మీమీ రంగాల్లో ఏఏ వ్యాపారం చేస్తే బావుంటుందో అన్వేషించండి.

    చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి, అఫ్జల్ గంజ్ లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి, సెక్రటేరియట్ కి ఎదురుగా వున్న బ్రిటీష్ లైబ్రరీకి వెళ్లండి. దేశ, విదేశ వార్తా పత్రికల్ని, మేగజైన్స్ ని, బిజినెస్ బుక్స్ ని, టెక్నికల్ బుక్స్ ని శోధించండి. మీకు వచ్చిన ఆలోచనల్ని నాకు చెప్పండి. రేపటి నుంచి కాదు- ఈరోజు నుంచే, ఇప్పటి నుంచే మీ డ్యూటీ ఇది" అంటూ సైంటిస్ట్, ఇంజనీర్ కి చెరో వందరూపాయల నోట్లిచ్చాడు.

    త్రినాధ్ చర్యలకు అప్పటికే మతులు పోగొట్టుకున్న ఆ ఇద్దరూ అతనిచ్చిన డబ్బు తీసుకొని క్రమశిక్షణను పాటించే యుద్ధసైనికుల్లా బయటకు నడిచారు.

    మెట్లు దిగుతుండగా సైంటిస్ట్ ఓ క్షణం ఆగిపోయాడు.

    "వీడొక పిచ్చివాడు. వీడు మనకు ఉద్యోగాలిస్తాడా? ఏం తమాషానా? అక్షరం ముక్క రాదు. ఐదు పైసలు లేవు. వ్యాపారం చేస్తాడా? చేసి నాలుగేళ్ళలో 40 కోట్లు సంపాదిస్తాడా...? నవ్వు రావటం లేదూ?" సైంటిస్ట్ హేళనగా అన్నాడు.

    ఇంజనీర్ ఒకింత ఆలోచన తర్వాత...

    "నాకెందుకో నమ్మకం వుంది. అతని ఆలోచనలు, చర్యలు నాకా నమ్మకం కలిగిస్తున్నాయి. నువ్వు అతని దగ్గర పనిచేయటాన్ని ఇష్టపడుతున్నట్టు లేదు. పైగా ఇన్ ఫీరియర్ గా ఫీలవుతున్నట్లుంది. కాని ఒకటి చెప్పు- మన చదువులయిపోయాక నిరుద్యోగులుగా రోడ్డెక్కాక ఏనాడన్నా, ఎవడన్నా మనకు ముందుగా డబ్బిచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? పోనీ మనం సంపాదించగలిగామా? నీకిష్టం లేకపోతే మానేయ్..." అన్నాడు తను ఇష్టపడుతున్న భావాన్ని వ్యక్తం చేస్తూ.

    "పోనీ నీవన్న దాన్ని ఒప్పుకుంటాను. కాని ఏమీ లేకుండానే ఈ ఉద్యోగ ప్రకటన మాటేమిటి...? బుద్ధి, జ్ఞానం వున్న ఏ వెధవయినా అంతంత డిపాజిట్స్ కడతాడా? ఒకవేళ కట్టారే అనుకో- వాళ్ళకి జీతాలెలా ఇస్తాడు? వాళ్ళతో ఏం పని చేయిస్తాడు...? సైంటిస్ట్ కంఠంలో అపనమ్మకం ప్రస్పుటమవుతోంది.

    "ఇంతకీ నీ ఉద్దేశ్యం?" ఇంజనీర్ సీరియస్ గా అడిగాడు.

    "నేను గోల్డ్ మెడలిస్ట్ ని, నాకు పి.హెచ్.డి. పట్టా వుంది."

    "వుంటే?"

    ఇలాంటి అనామకుల దగ్గర ఉద్యోగానికి చేరే బదులు అడుక్కు తినటం మేలు... లేదా ఆత్మహత్య చేసుకోవటం మేలు. అదీ కాదంటే పస్తులుండటం నాకిష్టం. ఎంత పొగరు...? ఎంత అహంకారం వాడికి? ఒక డాక్టరేట్ కి ఉద్యోగం ఇస్తాడా...? రాస్కెల్..." అంటూ తన చేతిలోని వంద కాగితాన్ని ఆ మెట్లమీద విసిరికొట్టి విసవిస ముందుకు సాగిపోయాడు.

    సైంటిస్ట్ ప్రవర్తనకు మ్రాన్పడిపోయిన ఇంజనీర్ తేరుకుని ఆ నోటుని అందుకొనేందుకు ముందుకు వంగుతుండగా హఠాత్తుగా త్రినాధ్ చెయ్యి ఆ నోటుని అందుకుంది.


                     *    *    *    *


    రాత్రి తొమ్మిది కావటానికి మరో ఐదు నిముషాలే వుంది. ఆ రోజు రాత్రి తొమ్మిదికి ప్రియాంక తన ఫ్రెండ్స్ తో అక్కడకు వస్తున్నట్టు బోస్ ముందుగానే తెలుసుకోగలిగాడు.

    తన గ్యాంగ్ ని అప్పటికప్పుడు పోగేశాడు. బోస్ తన గ్యాంగ్ తో కూర్చున్న జీప్ బ్లూమూన్ రెస్టారెంట్ కి ఇప్పుడు ఇరవై అడుగుల దూరంలో వుంది.

    ప్రియాంక ఎక్కిన మెర్సిడస్ కారు బుల్లెట్ లా బ్లూమూన్ వేపు దూసుకు వస్తోంది.

    సరీగ్గా అదేసమయంలో త్రినాధ్ ప్రియాంకకు ఫోన్ చేయగా... ఫోన్ చేసిందెవరో తెల్సుకోలేని సుదర్శనరావు మనుష్యులు ఆమె ఇప్పుడే బ్లూమూన్ కి బయలుదేరిందని చెప్పారు.

    అంతే... త్రినాధ్ వెంటనే ఎగిరి జీప్ ఎక్కాడు.

    త్రినాధ్ జీప్ బ్లూమూన్ వేపు దూసుకుపోతోంది.

    ఒకదాని వెనుక ఒకటి అనంతమైన ఆలోచనలు అతని మెదడులో సుడులు తిరుగుతున్నాయి.

    సుదర్శన్ రావు తనకు మేనమామ- అంటే ప్రియాంక మరదలు. తనకు వరసే. ఈ ఆలోచన రాగానే అతని పెదవుల మీద చిరునవ్వు కదలాడింది.

    తనను ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపుదిద్దుతున్న మాలినీదేవి అంటే తనకు గౌరవం, అభిమానం- వీటి వెనుక ఓ రకమైన ఇష్టం. ప్రియాంక అద్వితీయమైన అందం, పొగరు అంటే ఇష్టానికి మించినది ఏమిటది...?

    తనిస్తున్న ప్రకటన వలన ప్రయోజనం వుంటుందా? ప్రకటన ద్వారా తానాసిస్తున్న ఇంధనం సమకూరినప్పుడే తను ముందుకు అడుగెయ్యగలిగేది.

    ఆలోచనలలో వుండగానే జీప్ బ్లూమూన్ ని సమీపించింది. జీప్ ని పార్క్ చేస్తూనే ప్రియాంక మెర్సిడస్ ని చూశాడు. అదే సమయంలో రోడ్డుకు ఆవలగా వున్న బోస్, త్రినాధ్ దృష్టిలో పడ్డాడు. ఓ క్షణం అనుమానించినా దాన్నంతగా పట్టించుకోకుండా మెట్లవైపు సాగిపోయాడు.

    రెస్టారెంట్ లోకి అడుగుపెడుతూనే ప్రియాంక కోసం నలువైపులా చూశాడు. ఓ మూలగా వున్న టేబుల్ దగ్గర కూర్చుని ప్రక్కనే వున్న ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతోంది హుషారుగా. ఆ వైపు నడిచి ప్రియాంకకు దగ్గర్లో వున్న టేబుల్ ముందు కూర్చున్నాడు త్రినాధ్.

    అప్పటికే అక్కడ మరో ఇద్దరు నడివయస్కులు కూర్చుని స్కాచ్ విస్కీ తాగుతున్నారు కొద్దికొద్దిగా. త్రినాధ్ తినడానికేదో ఆర్డర్ ఇచ్చేందుకు మెనూ చూసి అన్నింటిలోకి తక్కువ రేటున్న ఐటమ్ ని గుర్తుపెట్టుకున్నాడు.

    బేరర్ కోసం ఎదురుచూస్తూ మధ్యమధ్య ప్రియాంకవైపు ఓరగా చూస్తున్నాడు.

    ఇప్పుడతనికి ఒక సంభాషణ వినిపిస్తోంది. "నిన్ను జాబ్ లోంచి తీసేయడం అన్యాయమే మిస్టర్ గుప్త. నీలాంటి అనుభవజ్ఞుడు మరలా వారికి దొరకడు..." త్రినాధ్ ఎదురుగా వున్న ఇద్దరు నడివయస్కుల్లో ఒకరు మరొకరితో అంటున్నాడు.

    "వాడో బాస్టర్డ్... ఎన్ని పనులు చేసిపెట్టాను వాడికి? ఫారెన్ మెషినరీ ఏది కావాలన్నా ఇమీడియెట్ గా తెప్పించి పెట్టాను. ఫారెన్ కొలాబరేషన్ ఏదైనా వార్ పుత్తింగ్ మీద సెటిల్ చేశాను. అలాంటిది నా కూతురు పెళ్ళికి లక్ష అడిగితే కాదంటాడా? అందుకే లక్ష కొట్టేశాను..." అతని నోటివెంట ముద్దగా వస్తున్నాయి మాటలు.

    త్రినాధ్ సడన్ గా అలర్ట్ అయి వారి సంభాషణనే వినడం ప్రారంభించాడు.

    రెండు రోజుల క్రితం మాలిని తనకు చెప్పిన పాఠం గుర్తుకొచ్చింది.

    "నువ్వు చిన్నవాడివైనా పెద్ద సర్కిల్స్ లో తిరగటం వలన చాలా ప్రయోజనాలుంటాయి. పదిసార్లు పది అరవై పైసలు పెట్టి వీధి టీ షాపులలో టీ త్రాగే బదులు ఒక్కసారి ఆర్రూపాయలు పెట్టి ఓ స్టార్ హోటల్లో ఒక్కసారి టీ త్రాగు. అక్కడ నీ ఎదురుగా ఒక లక్షాధికారి, ఓ అత్యున్నత అధికారి, ఓ బిజినెస్ మెన్, ఓ బ్లాక్ మనీ వున్నవాడు, డబ్బు దండిగా వుండి ఏం చేయాలో తెలియక వెంపర్లాడేవాడు ఎవరైనా నీకు తారసపడవచ్చు. ముందుగా వార్ని స్టడీ చేయ్. ఆ తరువాత చిన్నగా వార్ని మాటల్లోకి దింపి, మంచి చేసుకో. వారి బలహీనతల్ని కనిపెట్టి తదనుగుణంగా మసలుకో. ఏమో, వాళ్ళల్లో ఎవరైనా నీ పార్టనర్ కావచ్చు. నీ పెట్టుబడిదారుడు కావచ్చు. అదే వాళ్ళింటికి నువ్వు వెళితే నిన్ను తక్కువ అంచనా వేస్తారు. ఓ బిచ్చగాడి క్రింద చూస్తారు. ఇంకా నీ దగ్గర డబ్బుంటే రెండు రకాల క్లబ్బుల్ని ఎన్నుకో.

    ఒకటి, పెద్ద అధికారులు సభ్యులుగా వున్న క్లబ్- మరొకటి బాగా డబ్బున్నవాళ్ళు సభ్యులుగా వున్న క్లబ్- ఇంకాస్త ముందుకు వెళ్తే హైక్లాస్ బార్స్ కి వెళ్ళు. వాటిల్లో మెంబర్ షిప్ గాని, సులభమైన ప్రవేశం కాని సంపాదించు. ఈ మెంబర్ షిప్స్ ప్రవేశం ఇచ్చేవారు ఉద్యోగులే. మధ్యతరగతి వారే. వార్ని నీ తెలివితేటలతో మేనేజ్ చేయ్..." పక్కనేదో పెద్ద శబ్దం కావడంతో ఉలిక్కిపడి ఆలోచనల్నుంచి తేరుకున్నాడు త్రినాధ్.

    గుప్తా అనే వ్యక్తి పొరపాటుగా విస్కీ సీసాను పడేశాడు. అది టేబుల్ మీంచి వచ్చి త్రినాధ్ ఫాంట్ మీద పడింది.

    గుప్తా ఒకింత కంగారుపడ్డాడు- త్రినాధ్ ఎక్కడ ఉతికేస్తాడోనని.

    త్రినాధ్ అదే కదా నేర్చుకున్నది మాలిని దగ్గర! చిరునవ్వుతో గుప్తావేపు చూసి "ఇట్సాల్ రైట్" అన్నాడు. గుప్తా ఆశ్చర్యపోయాడు. అతను తడబడుతూ లేచి త్రినాధ్ దగ్గరకు వచ్చి నేప్ కిన్ తో తుడవబోయాడు.

    త్రినాధ్ గుప్తాని మృదువుగా వారించాడు. ఇప్పుడేమయిందన్నట్టుగా చూశాడు. గుప్తా కృతజ్ఞతగా చూశాడు.

    త్రినాధ్ పెదవులు దాటని చిర్నవ్వుతో మౌనంగా కూర్చున్నాడు.

    కృతజ్ఞత అనే భావం ఏ చిన్నచోటైనా, ఏ చిన్న మేలుతోనైనా ఆరంభం కావచ్చు. సరీగ్గా ఇప్పుడదే జరిగింది.

    తను ఒళ్ళూపై తెలియక మందు పారబోసినా ఆ తప్పును తేలిగ్గా క్షమించగలిగాడు ఈ యువకుడు- అని విస్మయంగా త్రినాధ్ వైపు చూస్తూ చిర్నవ్వు నవ్వాడు గుప్తా.

    "క్షమించగలిగే చిన్న తప్పుల్ని క్షమిస్తే, ఆ తప్పు చేసినవవారిలో స్వీయ పశ్చాత్తాపం వస్తుంది. గిల్టీగా ఫీలయి మన ముందు తలవంచి తన అల్పత్వాన్ని ఒప్పుకుంటారు. ప్రతి వారిమీద, ప్రతిదానిమీద కాలు దువ్వకూడదు. ఇరిటేషన్ అంటారు. మనిషికి కావల్సింది బాలన్స్ కాని ఇరిటేషన్ కాదు. అవతలవాడు మనల్ని తిట్టి దిగజారిపోతే మనం నోరెత్తకుండా హుందాగా వ్యవహరించడమే వారికి పెద్ద శిక్ష" మాలిని చెప్పిన ప్రసంగం తన చెవులలో మార్మోగుతున్నట్టుగా ఫీలయ్యాడు త్రినాధ్.

    వెంటనే గుప్తాతో మాటలు కలిపాడు. అరగంటైంది... గంటైంది.... త్రినాధ్ ఆ ఇద్దరితో సంభాషిస్తూనే వున్నాడు.

    "మాటల్ని అమ్మగలిగేవాడు వస్తువుల్ని కూడా అమ్మగలడు-" మాలిని ప్రసంగంలోని ఒక అమూల్యమైన సూత్రం అతనికి జ్ఞప్తికి వచ్చింది.

    మొత్తానికి గంటన్నర తరువాత ఆ ఇద్దరూ తమ విజిటింగ్ కార్డ్సు ఇచ్చారు త్రినాధ్ కి.

    ఆ ఇద్దరిలో ఒకరు గుప్తా, ఫారెన్ బిజినెస్ ఎఫైర్స్ లో కాకలు తీరినవాడు. ఏ విదేశం నుంచైనా సరే మెషినరీ తప్పించాలన్నా, సాంకేతిక సహకారమైనా, ఎక్స్ పోర్ట్స్ అయినా క్షణాల్లో ఆ పనుల్ని పూర్తి చేసుకు రాగల సామర్ధ్యం వున్నవాడు.

    మరొకరు రామచంద్ర- లక్షలకు లక్షలు డబ్బులు మూల్గుతూ వాటితో ఏం చేయాలో తోచక పిచ్చెక్కి బార్లెంట తిరిగే అగమ్యగోచరుడు.

    త్రినాధ్ దగ్గరుండి ఆ ఇద్దర్ని కారెక్కించి పైకి వచ్చేసరికి ప్రియాంక వెళ్ళేందుకు లేచింది. త్రినాధ్ వెంటనే గేట్ దగ్గరే ఆగిపోయాడు.

    ప్రియాంకను బాగా దగ్గరగా రానిచ్చి "హలో-" అన్నాడు.

    ప్రియాంక సడన్ గా త్రినాధ్ ని చూసి ఆశ్చర్యపోయింది.

    తిరిగి అంతలోనే చిర్నవ్వుతో అంది- "ఉద్యోగం తీసేయిస్తానని ముందే నీకుగా నువ్వే వెళ్ళిపోయావా?" హేళన ధ్వనిస్తున్న స్వరంతో అంది.

    "కాదు-" అన్నాడు త్రినాధ్ స్థిమితంగా. ప్రియాంక చుట్టూ వున్న యువతులు వీరిద్దరివేపే చూస్తున్నారు విస్మయంగా.

    "స్విమ్మింగ్ ఫూల్ మీ ఇంట్లోనే కట్టించుకోవాలనే పట్టుదల నీలో రేపడానికే నేనక్కడ ఉద్యోగంలో చేరాను. నువ్వు గొప్ప అందగత్తెవని నీ స్ట్రక్చర్ వైపు చూడలేదు. నిన్ను రెచ్చగొట్టడానికే చూశాను-" త్రినాధ్ ఆమెను మరలా రెచ్చగొట్టాడు నువ్వు అందగత్తెవు కావన్నట్టు. అతనికి తెలుసు నిజానికి ఆమె గొప్ప అందగత్తేనని.

 Previous Page Next Page