ఇంజనీర్, సైంటిస్ట్ ల వైపు చూస్తూ అన్నాడు త్రినాధ్.
"ఎలా వార్ని దెబ్బకొట్టగలిగావు? అదే నాకు అర్ధం కావడం లేదు" అయోమయంగా చూస్తూ అంది హిందూ.
"వెరీ సింపుల్... శత్రువుని మానసికంగా ఒకింత భయపెట్టగలిగితే మన గెలుపు సులభం."
"కాని వాళ్లంతా నీ వెనుక ఎలా వచ్చారు?"
"డబ్బు... డబ్బు ఏ పనైనా చేయగలుగుతుంది. క్లియోపాట్రా యుద్ధంలో తన దగ్గర అపారమైన సైన్యం వుండే గెలవలేదు. గేదెలకు, కొమ్ములుండే జీవాలకు ఒక్కో కొమ్ముకు ఒక్కో కాగడా కట్టి చీకట్లో ముందుకు వదిలింది. ఒక్కోకాగడా ఒక్కో సైనికుడని భావించిన శత్రుసైన్యం స్థయిర్యం తగ్గి వెనుకంజ వేసింది. వారి ఏమరుపాటే క్లియోపాట్రాకు విజయాన్ని తెచ్చి పెట్టింది. హీరాలాల్ డబ్బుతో, వయస్సులో వుండి బలంగా వున్న వందమంది రిక్షావాలాలను కొనేసి ఓ గంట నా వెనుక నిలబడమన్నాను. వాళ్ళందర్ని నా మనుష్యులని భావించి యాదవ్ మనుష్యులు ఖంగుతిన్నారు. వాళ్ళు పాతిక మంది, నా వెనుక వందమంది."
హిందూ త్రినాధ్ తెలివితేటలకు కొద్ది క్షణాలపాటు దిమ్మెరపోయింది.
"రేపే నా వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాను. అందుకు మీ సహకారం కావాలి" అంటూ ఆ ముగ్గురివైపు చూశాడు.
వాళ్ళింకా ఆ విస్మయం నుంచి తేరుకోలేదు.
"హీరాలాల్ బిల్డింగ్ రేపటినుంచి నా ఆఫీసు 'వసుంధరా ఇండస్ట్రీస్' అనేది నా కంపెనీ పేరు."
శిలాప్రతిమల్లా బిగుసుకుపోయి వింటున్నారు వాళ్ళు.
"రేపు నా కంపెనీ తరఫున నేనో ఉద్యోగ ప్రకటన ఇవ్వాలనుకుంటున్నాను. తక్కువ టారిఫ్ రేటున్న పేపర్ని నువ్వే సెలక్ట్ చేయ్."
అప్పటికి తేరుకున్నారు వాళ్ళు.
"ఉద్యోగ ప్రకటనా?? ఏమీ లేకుండానే??" సైంటిస్ట్ కి మతిబోతోంది త్రినాధ్ ఆలోచనలకు.
"ఏమీ లేకుండానే ఉద్యోగాలిస్తాను."
"ప్రజలంతా వెర్రివాళ్ళనుకోకు మిస్టర్ త్రినాధ్" ఇంజనీర్ వుక్రోషంగా అన్నాడు.
"ప్రజలు... నీలాంటి నిరుద్యోగులు ఎంత తెలివికలవారన్నది ఒక వారంలోనే రుజువు చేస్తాను. ఇంతకీ మీరు నా కంపెనీలో చేరతారా లేదా?"
సైంటిస్ట్ కి కోపం వచ్చింది సర్రున.
"ఏం తమాషానా? నీకోటి దిక్కులేదు. మాకు ఉద్యోగాలిస్తావా?"
"ఆవేశంకన్నా ఆలోచన చాలా గొప్పది దిగ్రేట్ ఇండియన్ సైంటిస్ట్!"
"సరే... ఒప్పుకుంటున్నాం..." అంది హిందూ ఆ ఇద్దరి తరఫున హామీ ఇస్తున్న ధోరణిలో.
"థాంక్స్. అయితే వెంటనే నా కంపెనీకి ఒక క్యాషియర్, మేనేజర్, టైపిస్ట్, ఎకౌంటెంట్ కావాలి. ప్రకటన ఎలా వుండాలన్నది చెబుతాను రాసుకో."
హిందూ గదిలోకి వెళ్ళి పెన్, కాగితం తెచ్చింది.
త్రినాధ్ చెప్పడం ప్రారంభించాడు.
"కోట్లతో వ్యాపారం చేయబోతున్న ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేయటానికి సిబ్బంది కావలెను. ఆకర్షణీయమైన జీతంతోపాటు ఇతర సదుపాయాలు కూడా కలవు."
త్రినాధ్ మాటలకు సైంటిస్ట్ మధ్యలోనే అడ్డొచ్చాడు.
"నీకేమన్నా పిచ్చెక్కిందా తిమ్మడు?"
సైంటిస్ట్ మాటలు పూర్తి కాకముందే ఉగ్రుడయ్యాడు.
"బాస్ దగ్గర మర్యాదగా ప్రవర్తించటం నేర్చుకో. క్రింద ఉద్యోగిగా నువ్వు సలహా ఇవ్వచ్చు అదీ నేనడిగితేనే. నేనే పేరు చెబితే ఆ పేరుతోనే నన్ను పిలవాలి. అదీ నేను నీకు అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చేవరకే. నువ్వేంటి చదివావ్...? ఆయిల్స్ కి సంబంధించింది. త్వరలోనే నీకో అవకాశం ఇస్తాను. అందులో నీ పొగరు, ఒగరు, తెలివితేటలు చూపించు. అంతేకాని మరొకరి విశ్వాసాన్ని దెబ్బకొట్టటంలో కాదు."
శాసిస్తున్నట్టున్న త్రినాధ్ కంఠానికి సైంటిస్ట్ నివ్వెరపోయాడు.
"కీప్ సైలెన్స్ సైంటిస్ట్! ఇంట్రస్ట్ వుంటే చెప్పింది విను. అంతే" హిందూ ఒకింత కోపంగా చూస్తూ అంది.
"రాసుకో హిందూ- కావలసిన సిబ్బంది.
ఒక మేనేజర్ : నిజాయితీగా ఒళ్ళువంచి పనిచేయటమే అనుభవం. సెక్యూరిటీ డిపాజిట్.
50,000/-
ఒక క్యాషియర్ : లెక్కలలో డొక్క శుద్ధి వుండాలి. లక్షలు టర్నోవర్ చేయవల్సి వుంటుంది కనుక డిపాజిట్ 50,000/- కట్టాలి.
ఎకౌంటెంట్ : ఎకౌంట్స్ లో ప్రావీణ్యత వుండాలి.
40,000/- డిపాజిట్ కట్టాలి.
టైపిస్ట్ : తప్పులు దొర్లకుండా, వేగంగా టైప్ చేయగలిగిన అభ్యర్ధి కావాలి. 25,000/- డిపాజిట్ కట్టాలి.
నిబంధనలు : ఐదు సంవత్సరాలలోపు ఉద్యోగం మానకూడదు.
ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభను బట్టి జీతం నిర్ణయించబడుతుంది. సంవత్సరంపాటు ట్రైనీలుగా కొనసాగాక వారి పనిపట్ల కంపెనీ సంతృప్తి పడితే వార్ని పర్మినెంట్ చేసి జీతం పెంచడం జరుగుతుంది.
ఈ ప్రకటన పేపర్ లో పడిన వారంలోపు అప్లయ్ చేయాలి.
చైర్ మెన్,
వసుంధరా ఇండస్ట్రీస్,
హైదరాబాద్.
చెప్పటం ముగించాడు త్రినాధ్.
హిందూ ఆశ్చర్యపోతూనే రాస్తే, మిగతా ఇద్దరూ శిలాప్రతిమలై పోయారు.
"నాకు తోచిన విధంగా చెప్పాను. దాన్ని ప్రొసీజర్ ప్రకారం తయారు చేయ్" అన్నాడు త్రినాధ్ హిందూ నుద్దేశించి.
"చేస్తాను. కాని ఏమిటిదంతా...?
ఇంతింత డిపాజిట్స్ కడతారా? ఒకవేళ కట్టినా ఏం పని చేయిస్తావ్ వారితో...? వాళ్ళకి జీతాలెలా ఇస్తావ్?" హిందూ అడిగింది.
త్రినాధ్ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు.
"మొత్తం ఎంత...? లక్షా అరవైఐదువేలా? సరిపోవేమో-?!" త్రినాధ్ తనలో తాను అనుకుంటున్నట్టున్నా ఆ మాటలు పైకే వినిపించాయి.
అప్పుడు సమయం రాత్రి పదిగంటలవుతోంది.
ఆ నీరవ వాతావరణంలో సుదర్శన్ రావు మనుష్యులు వేస్తున్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణపు పలుగుదెబ్బలు వినిపిస్తున్నాయి వుండుండి.
త్రినాధ్ ముఖం సీరియస్ గా వుంది. సాలోచనగా ఆ చిన్నగదిలో అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఆ పలుగుదెబ్బలు అతని గుండెపై పడుతున్నట్టు ఫీలవుతున్నాడు అతను.
అతనా స్థితిలో వుండగా ఆ ముగ్గురికి పలకరించే ధైర్యం లేకపోయింది.
కాని వారి ముగ్గురి మొఖాల్లో కనిపిస్తున్న సందిగ్ధతను త్రినాధ్ పసిగట్టాడు.
"మీకు నామీద నమ్మకం వుంటేనే నా సంస్థలో చేరండి. లేదంటే ఇప్పుడే, ఇక్కడే మిత్రులుగా విడిపోదాం. కాని ఒక్కటి గుర్తుంచుకోండి. నేను ఎవర్నీ మోసం చేయాలనుకోవడం లేదు. ఎవర్నీ ముంచాలనుకోవటం లేదు. చట్ట ప్రకారం ఒప్పు, న్యాయప్రకారం తప్పు అని కథలు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనేదో గొప్పవాడ్నని, గొప్ప పనులు చేస్తున్నానని కూడా చెప్పటం లేదు.
నాకిప్పుడు ఆదర్శం నిజజీవితంలో కష్టపడి పైకొచ్చిన ఎంతోమంది గొప్పవారు.
అఫ్ కోర్స్! నాకు నా పగతీరాలి. పందెం నెగ్గాలి. కాని నేననుసరించబోయే మార్గం మరికొందరి వాస్తవానికి, ప్రాక్టికాలిటీకి అందాలి. ఎంతెంతో చదువులు చదివి కూడా ఎలా బ్రతకాలని నిస్పృహ చెందే కోట్లాది భారతదేశ యువతకు నా జీవితమే ఒక పాఠం నేర్పాలి.
ఈ నిజజీవిత మహా సంగ్రామంలో నేను ఓడానా, గెలిచానా అన్నది ప్రధానం కాదు. నా విధిని నేను త్రికరణ శుద్ధిగా నెరవేర్చానా లేదా అన్నదే ప్రధానం.
నాకిప్పుడు స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు... అంబికా దర్బార్ బత్తి శ్రీ ఆలపాటి రామచంద్రరావు, త్రివేణి వక్కపొడి శ్రీ దేసు వెంకట సుబ్బారావు, లెదర్ టెక్నాలజిస్ట్ డాక్టర్ వై. నాయుడమ్మ. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ జి.డి.నాయుడు, రిటైల్ కింగ్ శ్రీ పన్నీర్ దాస్, శ్రీ ఎల్.వి. ప్రసాద్, శ్రీ చలసాని దత్తు, విమల్ ధీరూబాయ్ అంబాని... ఇంకా మరెందరో. ఏం వీళ్ళు ఎదగలేదా? వీళ్ళందరికీ పెట్టుబడి వుండే వ్యాపారం మొదలుపెట్టారా...? హంగు, ఆర్భాటం వుండే నెగ్గుకొచ్చారా...? మరెలా ఈనాడు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలకు చక్రవర్తులయ్యారు?
"మీకు నన్ను చూస్తే ఆశ్చర్యం కలగవచ్చు. నవ్వు రావచ్చు. జాలి కలగొచ్చు.
బట్ ఐ డోంట్ కేర్...
శత్రుబలాన్ని అంచనా వేయాలే కాని, చూసి అధైర్యపడకూడదు. అది నా పాలసీ. ఇప్పుడు నా ముందున్న ప్రథమ శత్రువు పావర్టీ- పేదరికం. నా శ్రమతో దానికి అడ్డుకట్టవేస్తాను. నా తెలివితో దాన్ని జయిస్తాను. ఆత్మ విశ్వాసానికి అర్ధం తెలీని వారికి నా ప్రవర్తన అసహ్యంగాను, అవహేళనగానూ, సొంతడబ్బాగానూ, పొగరు, అహంకారం, పిచ్చితనంగానూ కనిపించవచ్చు.
అయినా సరే... చెప్పానుగా... ఐ డోంట్ కేర్. ఆఖరి మాట- నామీద అమ్మకం వుంటే నావెంట వుండండి. మీ తెలివితేటల్ని నేను డబ్బుగా మార్చుతాను. కాని ఒక్కటే నాకు నచ్చంది... నేను చెప్పినట్టు వినకపోవటం... నా విశ్వాసాన్ని దెబ్బకొట్టటం..."
త్రినాధ్ నోటినుంచి వచ్చిన ఒక్కొక్క మాట సూటిగా వెళ్ళి వారి మెదళ్ళలో ఎంతకాలంగానో గూడుకట్టుకున్న నిరాశా, నిస్పృహల పొరల్ని ఛేదించి వేశాయి. ఎదుటివార్ని శాసిస్తున్నట్టు జీవితంపై తిరిగి ఆశని కలిగిస్తున్నట్టు, ఆధునిక మానవ జీవిత అర్ధశాస్త్రపు లోతుల్ని విశ్లేషిస్తున్నట్టుగా వున్న త్రినాధ్ మాటలు వార్ని ఆలోచనల్లో పడవేశాయి.
"మనకి పెట్టుబడి చాలదు. కనుక కావల్సిన స్టాఫ్ ని పెంచు... ఆ తర్వాత నీ ఉద్యోగం బయట ప్రపంచంతో సత్ సంబంధాలు ఏర్పాటు చేయడం. రేపే ఈ ప్రకటన ఒక దినపత్రికకు ఇవ్వు. ఆ తరువాత నా పేరు అఫీషియల్ గా మార్చాల్సి వుంది. మరోరెండు రోజులకే మన ఆఫీసు అట్టహాసంగా తయారవ్వాలి. ప్రస్తుతానికి నీ పనులు..."
హిందూ మౌనంగా తలూపింది.
"మీ ఇద్దరేం చేయాలన్నది త్వరలోనే చెబుతాను. మీ ముగ్గురూ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి. వ్యాపారం ఎంతదైనా వ్యాపార రహస్యం అనివార్యం..."
వారికిప్పుడు ఆశ్చర్యంగా లేదు త్రినాధ్ ని చూస్తుంటే.... అద్భుతంగా వుంది... ఓనమాలు రాని ఒక నిరక్షరాస్యుడు, చేతిలో చిల్లిగవ్వలేని ఒక అనామకుడు ఇంతింత చదువులు చదివిన తమకు ఉద్యోగాలివ్వటం! వేలకోట్లతో బడ్జెట్ తయారుచేసి, లక్షలాది ఉద్యోగ యంత్రాంగాన్ని, ఆర్ధిక వ్యవస్థను ఆటలాడించేటి గ్రేట్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలివ్వలేని బ్రతుకుదెరువును ఏమీలేని, ఎవరూ లేని ఈ ఒంటరి ఇస్తానంటున్నాడు...?! దాదాపు వారికి ఒక షాక్ తగిలినట్టే వుంది త్రినాధ్ ప్రవర్తన.
వారా షాక్ నుంచి తేరుకునేలోపే త్రినాధ్ కనుమరుగయ్యాడు.
* * * *
తెల్లవారుఝాము నాలుగు గంటలకే త్రినాధ్, మాలిని శివాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఒకింతసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా వున్నారు.
తిమ్మడు త్రినాధ్ కావటానికి, త్రినాధ్ త్రినేత్రుడుగా రూపాంతరం చెందటానికి మొదలెట్టిన ఆ మహాయజ్ఞం ప్రారంభమై ఆ రోజుకి మూడు వారాలైంది.
అప్పటికే త్రినాధ్ మాటతీరులో, వేషభాషల్లో గణనీయమైన మార్పొచ్చింది.