Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 24

     

     "నాకాకలి లేదు వదినా! సాయంత్రం ఒకచోట టిఫిన్ దండిగా పడింది" అన్నాడు సుధాకర్.                                           
  

       ఆ సమయంలో తమ్ముడిని చూస్తే కుమార్ కి అసూయవేసింది.
   
    ప్రాక్టీస్ పెట్టాక సాయంత్రాలు బయటకు వెళ్ళటాలూ, స్నేహితులతో టిఫిన్ లు తినడాలూ అవీ మరిచిపోయాడతను. ఎప్పుడన్నా అర్జంటు పనివుండి డిస్పెన్సరీకి వెళ్ళకపోతే, అతనేదో తప్పు చేసినట్లు పేషెంట్లూ, అంతకన్నా గిల్టీగా అతనూ ఫీలవటం పరిపాటయిపోయింది.
   
    "కొంచెం మజ్జిగ వేసుకుని తిందువుగానీ రద్దూ..." అని ప్రభావతి బలవంతం చేసింది.
   
    "నిజం వదినా, ఆకలి లేదు."
   
    సుధాకర్ అక్కడ్నుంచి వచ్చేశాడు. సుజాత తన గదిలో టేబిల్ లైటు వేసుకుని చదువుకుంటోంది ఏకదీక్షగా.
   
    "ఏమే అమ్మడూ! అంత సీరియస్ గా చదువుతున్నావు. పరీక్షలింకా దూరంగానే వున్నాయిగా?"
   
    "పోరా! ఇప్పుడ్నుంచీ చదివితేనేగానీ క్లాసు రాదు. క్లాసు రాకపోతే ఈ చదువంతా వేస్టే."
   
    "క్లాసు తెచ్చుకుని వేస్ట్ చేసుకోవటం కన్నా, క్లాస్ తెచ్చుకోకుండా వేస్ట్ చేసుకోవటం ఓ విధంగా మేలే కదే అమ్మడూ?"
   
    "పోరా! నువ్వెప్పుడూ సినికల్ గా మాట్లాడుతావు."
   
    ఇంతలో అతనికిందాకటి పెళ్ళిచూపుల సంఘటన గుర్తుకువచ్చి "అవును గానీ మీ క్లాసులో రాధ అనే అమ్మాయి వుందా?" అనడిగాడు.
   
    "వుంది కాదు, వున్నారు. అంటే ఇద్దరు రాధలున్నారు. ఏం?"
   
    "ఏంలేదు, ఊరికినే అడిగానులే. ఆ ఇద్దరు రాధలూ నీకు తెలుసా?"
   
    "ఒక క్లాసులో వుంటే తెలియకుండా ఎలా వుంటారు? ఇద్దరు రాధలతోనూ నాకు స్నేహం వుంది. పైగా మా ముగ్గురినీ ప్రక్క ప్రక్క నంబర్లు వాళ్ళది ఆర్, నాది యస్ కదా!" అంది సుజాత.
   
    "అందులో రెండుజడలు వేసుకునే రాధ వుందా?"
   
    "మాధవరావు గారమ్మాయిగురించా నువ్వు అడిగేది? కొంచెం పొడవుగా, చలాకీగా వుంటుంది. మా క్లాసులో అందరికన్నా ఆ అమ్మాయివే పెద్ద కళ్ళు ఏం? ఎందుకడుగుతున్నావు?"
   
    "ఏం లేదులే" అని బయటకు వచ్చేశాడు.
   
    అన్నయ్య, అతని బావమరిది భోజనాలు ముగించి పైకి వెళ్ళిపోయినట్లున్నారు. వదిన ఎంగిలి కంచాలెత్తుతూ కనిపించింది.
   
    ఆ స్థితిలో వదిన్ని చూస్తే జాలేసింది.
   
    ఒకే వ్యక్తిని చూసి జాలిపడటం, కోపగించుకోవటం, అసహ్యించుకోవటం, మళ్ళీ ప్రేమించటం మొగవాడ్నిచూసి ఆడది పడటంకన్నా, ఆడదాన్ని చూసి మొగవాడు పడే సందర్భాలూ, సంఘటనలూ, అవకాశాలూ ఎక్కువ.

   
                                                6
   
    మధ్యాహ్నం రెండుగంటల వేళ అమ్మమ్మగారు ప్రభావతిని, విమలనూ తన గదిలో కూర్చోబెట్టుకుని తన చిన్ననాటి ముచ్చట్లు చెబుతోంది. ప్రభావతికీ, విమలకూ అమ్మమ్మగారంటే ఎంత విసుగయినా వాళ్లకు ఇతరత్రా ఏమీ కాలక్షేపం కానప్పుడు తమ అవసరంకోసం ఆవిడ కోర్కెను మన్నించి, ఆవిడ చెప్పే కబుర్లు ఆలకిస్తూ వుంటారు.
   
    "ఆ రోజులకూ ఈ రోజులకూ సాపత్యమేముంది? అప్పుడు  సరదాలు ఇప్పుడేమున్నాయి? అట్లతద్ది వచ్చిందంటే నాలుగు గంటలకల్లా నిద్రలేచి, స్నానాలు చేసి, పెరుగన్నం తినేసి, సూర్యోదయమయేసరికల్లా ఇరుగుపొరుగు పిల్లలమంతా చేరి ఊరిబయటికెళ్ళి, అక్కడున్న రావిచెట్లకు ఉయ్యాలలువేసి దానిమీద ఆకాశమంత ఎత్తున ఊగేవాళ్ళం.... దీపావళి పండుగ వచ్చిందంటే ఈ కాలం పిల్లల్లా టపటపా నాలుగు టపాకాయలు కాల్చేసి అరగంటకల్లా అయిందనిపించి చేతులూకాళ్ళూ దులుపుకుని ఇళ్ళల్లో దూరటంకాదు. చీకటి పడేవేళకి దీపాలు వెలిగించి, మా బుట్టలూ, సరంజామాతో అరుగులమీద కూర్చున్నామంటే తాలూకాలో పన్నెండుగంటలు కొట్టేవరకూ అలా పోటాపోటీల మీద కాలుస్తూ వుండేవాళ్ళం' అని కొంతసేపు పండగ సరదాలని గురించి చెప్పింది.
   
    "వెధవది రూపాయికిప్పుడైతే ఇలా విలువలేకుండా తగలబడిందిగానీ మా కాలంలో రూపాయికి పదిశేర్లు బియ్యం, బంగారయ్య కొట్లో అణాకు వీసెడు పకోడీలిచ్చేవాడు. పావలా మారిస్తే - మీ మొగుళ్ళు ఇప్పుడు హోటళ్ళకెళ్ళి రూపాయిలకు రూపాయలు తగలేసి తింటూంటారే-ఆ తీపీ, కారం, చక్కని కాఫీ అన్నీవచ్చేవి. ఎప్పుడైనా ఇంటికి చుట్టంవస్తే ముఖాముఖాలు చూసుకుంటున్నారుగానీ ఆరోజుల్లో వచ్చేపోయే చుట్టాలతో ఎప్పుడూ ఇల్లు కళకళలాడిపోతుండేవి" అలా కాసేపు డబ్బు విలువని గురించి చెప్పింది.
   
    మీరంతా తీర్ధయాత్రలకనీ, ఊళ్లు చూడ్డానికనీ బయల్దేరతారు ఎందుకూ? శుద్దదండగ! ఇట్టేపోయి అట్టే వచ్చేస్తారు. నిలకడగా రెండురోజులు ఒక్కచోటా ఉండలేరు. మేము తీర్ధయాత్రలకి బయలుదేరేవారమంటే ఎలా బయల్దేరేవాళ్ళం? ఆయనా, మా బావగార్లూ, మరదళ్ళూ, మా తోడికోడళ్ళూ, ఆడబడుచులూ ఓ పాతికమందికి పైగా పటాలంలా బయలుదేరేవాళ్ళం. బియ్యం, పప్పు, ఉప్పు, బొగ్గులు, కుంపట్లు సమస్తం తీసుకెళ్ళేవాళ్ళం. ఎన్నో మజిలీలు చేసేవాళ్ళం ఎంతో బందోబస్తుగా వుండేవాళ్ళం. ఎక్కడికిపోయినా, అన్నీ క్షుణ్ణంగా చూసి, తెలుసుకుని, మళ్ళీ జీవితంలో వెళ్ళకపోయినా ఫర్వాలేదన్నట్లుగా ప్రతీదీ గ్రహించి, సారమంతా జుర్రుకుని వచ్చేవాళ్ళం. ఇప్పటికాలం వాళ్ళేముంది? ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పటికప్పుడు క్రొత్తే. ఏం చూశారో తెలియదు, ఎందుకు చూశారో తెలియదు. డబ్బులుమాత్రం వేలకు వేలు ఖర్చు తిండికి తగలెయ్యటం కనిపిస్తుంది" అని మరికాసేపు అలనాటి ప్రయాణాలమీద లెక్చరు దంచింది.
   
    చివరకు తన పుట్టింటివైపు వాళ్ళ ఘనత చెప్పుకొచ్చింది.
   
    "మా నాన్నగారు లాకులమీద సూపర్ వైజ్ చేసేవారు. మీకు తెలీదుగానీ లాకులమీద సూపర్ వైజ్ అంటే ఆ రోజుల్లో ఎంత హోదా! ఎంత దర్జా! ఈరోజుల్లో అలాంటి దర్పంగల ఉద్యోగాలేవీ అసలు? పడవలవాళ్ళు ఆయన్ని చూసి గజగజలాడిపోయేవాళ్ళు కొబ్బరికాయలు, పప్పు, బెల్లం, పళ్ళు అన్నీ తెచ్చి రాసులకి రాసులు మాఇంట్లో పోసేవాళ్ళు....మళ్ళీ ఈయన కచేరీలో గుమాస్తాగా చేసేవారు. పంచా, కోటూ, తలపాగా పెట్టుకుని, చెప్పులేసుకుని రోడ్డుమీద నడుస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోయేవి కావనుకోండి. ఇప్పుడు కలెక్టరు చేసేవాడికి కూడా ఆ ఠీవిలేదు. మా రెండోతమ్ముడు ఫారెస్టు రేంజరు చేసేవాడు. పెద్ద పెద్ద అడవులన్నీ వాడి అధీనంలో వుండేవి. వాడి ఇంటినిండా నౌకర్లూ, వాడి అనుగ్రహం వుంటే చాలునని దర్శనం చేసుకోటానికి వచ్చేవాళ్ళు.....ఎంత అట్టహాసంగా వుండేదని - ఆ ఉద్యోగాలూ, ఆ హోదాలూ ఈకాలం ఆఫీసర్లకి చస్తే లేవనుకోండి."
   
    అమ్మమ్మగారు పారవశ్యంతో పొంగిపోతూ అలా చెబుతూనే వుంది. తోడికోడళ్ళిద్దరూ అలా వింటూనే వున్నారు.                                   
   
           
                               * * *
   
    కుమార్ కి మధ్యాహ్నం నిద్ర కళ్ళమీదికి మూసుకొచ్చేస్తున్నది. రాణి ప్రక్కమీద హాయిగా పడుకుని నిద్రపోతున్నది.
   
    భాస్కరం ఎదురుగుండా కుర్చీలో కూర్చుని సిగరెట్టుమీద సిగరెట్టు అంటిస్తూ అంతులేకుండా బాతాఖానీ కొట్టేస్తున్నాడు.
   
    చాలామంది చుట్టాలు ఇళ్ళకి వస్తే వాళ్ళు తినిపోయినందుకు అట్టే బాధ లేదుగానీ, వాళ్ళని ఎంగేజి చెయ్యలేక ఇంటివాళ్లకు చచ్చిన చావు అవుతుంది.
   
    భాస్కరం అప్పుడే ఆ ఇంట్లో మకాంవేసి పదిహేనురోజులు దాటిపోయింది. అతని వాలకం చూసి కుమార్ మొదటే అర్ధం చేసుకున్నాడు. పదిహేను రోజులు కాదుకదా పదిహేను నెలలయినా కదిలేటట్లుగా లేడని.
   
    కొంతమంది జీవితంలో ఏ అధ్యాయంలోనూ స్థిరంగా వుండలేరు. వాళ్ళు చేసే వృత్తుల్నీ, ఉద్యోగాలనూ గౌరవించలేరు. అలా చేయటం చిన్నతనమని మాటల్లో చెప్పరుగానీ, అడుగడుక్కీ వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతూ వుంటుంది. పట్టుమని పదినెలలు ఒక ఉద్యోగంలో వుండలేరు. ప్రపంచంలో లేని వ్యక్తిత్వాలు, స్వాభిమానాలూ వాళ్ళ నెత్తిన పీఠం వేసుకుని కూర్చున్నట్లు కనిపిస్తాయి. మిగతావాళ్ళంతా ఉద్యోగాలూ లక్షణంగా చేసుకుని, ఎట్లా ఆఫీసర్లయి, పెద్ద పెద్ద పొజిషన్లోకి ఏవిధంగా వస్తూంటారో తెలియదుగానీ వీళ్ళకిమాత్రం అడుగడుక్కీ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. "ఆ ఆఫీసరిట్లా అన్నాడు. వాడెంత? వాడి పవరెంత? ఈపాటివాడిట్లా అన్నాడు. వీడి పొగరు అణిచేస్తాను" ఇట్లా ఉంటుంది వాళ్ళధోరణి. ఎప్పుడూ గతంలాగే నిశ్చలంగా, పాదరసం పైకి ఒలగని బోరామీటర్ లా అడుగున వున్న బంకమట్టిలోనే జిడ్డు గారుతూ పొర్లుతూ చాలామంది పైకివచ్చిన వాళ్ళకన్నా అధికులమన్న ఫీలింగ్ వాళ్ళు ఛాతీ విరుచుకుని తిరిగేలా చేస్తూవుంటుంది. ఒకవైపునుంచి ఏళ్ళు వచ్చి మీద పడిపోతున్నా ముందు ముందు తమకు ఉజ్వలమైన భవిష్యత్తు వున్నదన్న నమ్మకం వాళ్ళముఖాల్లో గర్వాన్ని కనబరుస్తూ వుంటుంది. అందుకని వాళ్ళు నెలలతరబడి ఉద్యోగాల్లేకుండా వున్నా వాళ్ళ ఛాతీలు ఏమాత్రం ఒంగవు. నెలల తరబడి చుట్టాలింట్లో వున్నా స్వంతింట్లో ఉన్నంత ధీమాగా వుంటారు.

 Previous Page Next Page