ఈ హత్యే ఒక వింత అనుకుంటే,
తగలబెట్టపడిన ఆ పాపకి కొద్దిదూరాన "ది గిఫ్ట్" అని రాసిన అట్టముక్క అందంగా దానిమీద వేసిన బొమ్మతో సహా కానవస్తూ చెక్కు చెదరకుండా వెక్కిరిస్తున్నట్లుగా ఉంది.
ఈమధ్య,
పేపర్ లో రకరకాల వస్తువులు నగరంలో చాలా చోట్ల తగలపెట్టబడడం, అలా తగలపెట్టబడిన చోట "ది గిఫ్ట్" అని రాసిన అట్టముక్కని వుంచటం ఆ వివరాలన్నీ రావటం వల్ల అప్పటికే చాలామందికి తెలిసిపోయింది.
"ఏ అల్లరిమూకో కావాలని తమాషాగా చేస్తున్న పని ఇది అని చాలామంది ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఇంతవరకూ వస్తువులతోనే "ది గిఫ్ట్" విషయం నగరంలో సంచలనం సృష్టించడం జరిగింది.
ఇప్పుడు ఈ హత్యలో కొత్త విషయానికి నాంది పలికినట్లయింది. ఇది ఉత్త ఆషామాషీ విషయం కాదు, హత్య. వస్తువులు ధ్వంసం చేసిన వాళ్ళే ఈ హత్య కూడా చేశారు అనటానికి ఆధారం అదే అట్టముక్క, ఆ అట్టముక్క మీద గిఫ్ట్ పాకెట్ బొమ్మ దానిమీద అక్షరాలు - ది గిఫ్ట్ అని వున్నాయి. ఏ మాత్రం భేదంలేదు.
జెన్నీని ఒళ్లోకి తీసుకుని ఏడుస్తూంటే "ఇది హత్య - పోలీసులు నచ్చినదాకా ముట్టుకోకూడదు" అని వీధిలోనే వున్న ఓ పెద్దమనిషి వాళ్ళని దూరంగా వుంచడం జరిగింది.
హత్య కాబడిన ఆరేళ్ళ జెన్నీని చూస్తూ తలోరకంగా మాట్లాడుకుంటూ పోలీసుల రాకకోసం వేచి వున్నారు అక్కడి జనం.
పోలీసులకన్నా ముందే బబిత అక్కడ ప్రత్యక్షమయ్యింది. స్కూటరు దిగి లోపలికి వస్తున్న ఆ అమ్మాయిని అందరూ ఆశ్చర్యంగా చూశారు.
వచ్చిన అమ్మాయి వాళ్ళ తాలూకా చుట్టమో, పోలీసు తామూకా మనిషో అని అనుకుంటుండగానే బబిత ప్రశ్నలు వెయ్యటం మొదలుపెట్టింది.
బబిత జెన్నీని, జెన్నీ తల్లితండ్రుల్ని, అక్కడ జనాభాని, గిఫ్ట్ తాలూకా అట్టముక్కని గబగబా ఫొటోలు తీసింది.
బబిత కొన్ని ప్రశ్నలు అడిగి ఫోటోలు తియ్యడం పూర్తిచేసి ఇంకా లోతుగా వివరాలు అడుగుతూ వుండగా పోలీసు జీపు వచ్చి వాకిట్లో ఆగింది.
మందీ మార్బలంతో ఇన్ స్పెక్టర్ మనోజ్ లోపలికి ప్రవేశించాడు.
తనకన్నాముందే అక్కడ ప్రత్యక్షమయిన బబితను చూడగానే ఇన్ స్పెక్టర్ మనోజ్ ముఖం నల్లబడింది. మర్యాదకోసమా అన్నట్లు పరస్పరం విష్ చేసుకున్నారు.
మనోజ్ చకచకా తనవాళ్ళకి ఆదేశాలు ఇచ్చి అతను రంగంలోకి దిగాడు.
బబిత చూస్తూ నిలుచుంది.
ఫింగర్ ప్రింట్ ఎక్స్ ఫర్ట్. ఫొటో గ్రాఫరూ, మొదలైన వాళ్లూ తమ పని పూర్తిచేశారు. మిగతా ఫార్మాలిటీస్ కూడా పూర్తి అయినాయి.
"అప్పుడు అక్కడ దొరకనిదీ, ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఏదైనా చిన్న క్లూదొరికిందా?" బబిత అడిగింది.
"దొరికింది!" మనోజ్ తాపీగా అన్నాడు.
"ఏమిటది?" బబిత ఆత్రుతగా అడిగింది.
"ఈ గిఫ్ట్ తాలూకా రహస్యం. ఇది చేసేది ఎవరో నాకు ముందే తెలుసు అన్నట్లు ఓ అందమైన అమ్మాయి మా కంటే ఇక్కడ తనే ముందు ప్రత్యక్షమవుతోంది. ఈ చిన్న క్లూ చాలు అనుకుంటానూ. పేపర్ లో ప్రచురించండి! వీలయితే ఆ సుందరి ఫొటో కూడా" ఈ మాట కాస్త వ్యంగ్యంగా అని చరచరా తన జీపు దగ్గరికి వెళ్ళిపోయాడు మనోజ్.
"చాతకాక మద్దెల ఓడు అన్నాడుట నీలాంటి మహానుభావుడే ఒకడు-" బబిత చిరుకోపంగా అనుకుంది మనస్సులో.
ఆ తరువాత అన్నీ యధావిధిగా జరిగిపోయాయి.
జెన్నీని పోస్టుమార్టంకి తీసుకువెళ్ళారు.
అక్కడ గుమికూడిన జనం మెల్లగా ఎవరి దోవన వారు బయలుదేరారు.
18
చాలా చీకటిగా వుంది బయట.
ఆ చీకట్లో.
బోసుబాబు వడివడిగా అడుగులు వేస్తూ ముందుకుపోతున్నాడు.
ఇంకా అప్పటికి సమయం పూర్తిగా పన్నెండు గంటలు కాలేదు. అక్కడక్కడా కొన్ని యిళ్ళల్లో దీపాలు వెలుగుతూనే వున్నాయి, వెలుగుతున్నాయి కానీ ఆ వీధిలో మాత్రం జనసంచారం లేదు. కారణం అదో సన్నటి పొడుగాటి వీధి. బజారుకి దగ్గరగా లేని వీధి. అందువల్లనే ఆ వీధిలో మనుష్య సంచారం అంతగా లేదు.
ఆ వీధిలో వున్న రెండు మూడు కుక్కలు కొత్తమనిషిని చూసి మొరగను కూడా మొరగలేదు. వాటి కళ్ళకి బోసుబాబు దొంగలాగానో లేక కొత్తవాడిలాగానో కనిపించకపోవటం వల్లనో, లేక మొరగటానికి బద్దకించాయో గాని, అరవటం లాంటి పని మాత్రం చెయ్యలేదు.
బోసుబాబుకి కొంతదూరాన, బోసుబాబుని ఫాలో అవుతూ అన్న లక్ష్మణమూర్తి వస్తున్నాడు.
పదకొండున్నరకి బోసుబాబు యింట్లోంచి బయలుదేరాడు. అప్పుడు అతని చేతిలో చిన్న లెదర్ బ్యాగ్ వుంది, బోసుబాబు యింట్లోంచి బయటకి వెళ్లటం చూసి లక్ష్మణమూర్తి మంచి అవకాశం దొరికింది కదా అని మురిసిపోతూ, దూర దూరంగా అతనిని వెన్నంటి రాసాగాడు.
"ఇవాల్టితో తన తమ్ముడి రహస్యం తెలిసిపోతుంది." అని అనుకుంటూ మురిసిపోతున్నాడు అతను. ఇంతతొందరగా ఇలాంటి మంచి అవకాశం వస్తుందని కల్లో కూడా వూహించలేదు. ఇంట్లోవాళ్ళకి పట్టని అదృష్టం ముందు తనకి పట్టిందని అనుకుంటున్నాడు అతను.
బోసుబాబు ఒక యింటి ముందు ఆగిపోయాడు.
బోసుబాబు ఆగిపోవటం చూసి, అల్లంత దూరాన బోసుబాబునీ అనుసరించి వస్తున్న లక్ష్మణమూర్తి తను కూడా గోడవారగా ఆగిపోయాడు.
బోసుబాబు ఆ యింట్లోకి వెళతాడా?"
"ఆ యింట్లోంచి ఎవరైనా బయటకి వచ్చి బోసుబాబుని కలుసుకుంటారా?"
"ఆ యింట్లో వాళ్ళకి బోసుబాబుకి సంబంధం ఏమిటి?"
లక్ష్మణమూర్తి అలా అనుకుంటూ, దూరాన వున్న తమ్ముడు ఏం చేస్తున్నదీ కానరాక కళ్ళార్పకుండా అటే చూస్తూ వుండగా, ఆ యింటి ముందున్న బోసుబాబు వంగి, అక్కడ ఏం చేశాడో తెలియదు. మళ్ళీ పైకిలేచి వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు.