"కన్పిస్తే?" యధాలాపంగా అడిగింది.
"ఆ రాత్రి ఇంటికి తీసికెళ్ళాడు."
"తీసుకెళ్ళి ఏం చేశాడు?"
ఆమెలో ఆదుర్దాకంటే అసహనమే ఎక్కువగా కన్పించింది కృష్ణకు.
"కథ చెప్పాడు."
"కథా? ఏం కథ?" పెదవి విరిచింది.
"నీ కథే!" గొంతులోనే ఆగిపోయింది.
గుటకమింగి 'తన కథే' అన్నాడు కృష్ణ.
"సాగదీసి చంపకండి. అతడి కథేమిటో తేల్చి చెప్పండి" పైట కొంగు వెలికి చుట్టుకుంటూ అంది సుధ.
"కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అతడిని ప్రేమించింది. ఒకానొక పరిస్థితిలో శారీరక బలహీనతకు గురయినారు."
"పెళ్ళికాకముందే కడుపొచ్చింది. అంతేనా?" ఠపీమని అంది సుధ.
నిండుకుండ బద్దలయిన నీళ్ళన్నీ తన ముఖంమీదే చిందినట్టు అయింది కృష్ణకు.
"నీకెలా తెలుసూ?"
"నాకే కాదు. బుర్రలో ఇంత గుజ్జు వున్నవాడికి ఎవడికైనా తెలుస్తుంది."
కృష్ణ గుడ్లు తేలేసి చూశాడు.
"ఆడదీ మగవాడూ పుట్టినప్పటినుంచి జరుగుతున్న కథే యిది నడుస్తున్న చరిత్రే ఇది."
"ఆ పిల్లతండ్రి వాళ్ళ పెళ్ళి జరక్కుండా అడ్డుపడ్డాడు."
"ఇదీ మామూలే. ఏ కథలోనైనా నెక్స్ట్ చాప్టర్ అదేగా?" తేలికగా అనేసింది.
కృష్ణ ఆమె కళ్ళల్లో ఏదో వెదకాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. అద్భుతం. అలాంటి నటన తను ఎక్కడా చూడలేదు. తొణకడం లేదు, బెదరడంలేదు. తాపీగా నిండుగా ఏదో తనకు పట్టీపట్టనట్టు, అంటీ అంటనట్టు మాట్లాడుతున్నది.
"ఆ అమ్మాయి తండ్రి పోలీసాఫీసరట. వేడిని బెదిరించి ఆ పిల్లను తీసుకుపోయి వేరే పెళ్ళిచేశాడట."
"పోలీసువాడి కూతురితో ప్రేమకలాపం ఆడిన మీ ఫ్రెండ్ మీద నాకు జాలి పుడుతున్నది. తప్పు మీ ఫ్రెండుదే."
"ఆ అమ్మాయి కాలేజీలో శకుంతల వేషం వేస్తే చూసి ఆమె ప్రేమలో పడ్డాడట.
ఊపిరి బిగబట్టి ఆమె ముఖంలోకి చూశాడు.
ఆమె ముఖంలో రంగులు మారతాయనీ, కండరాలు బిగుసుకుంటాయనీ, పెదవులు వణుకుతాయనీ ఆశించిన అతనికి నిరాశ మళ్ళీ ఎదురైంది.
గటికురాలు!
ఎంత చెడ్డా పోలీసువాడి కూతురు కదా!
అనుకున్నాడు కృష్ణ.
"మీ ఫ్రెండు కధ శకుంతల కథకు పారడీగా వుందే? అసలు కథలో దుష్యంతుడు ఆమెను గర్భవతినిచేసి మర్చిపోయాడు. ఇక్కడేమో ఆమె అతడిని మర్చిపోయింది. హాయిగా మరొకడితో కాపురం చేస్తున్నది. కాని ఆ అపర దుష్యంతుడు__అదే మీ స్నేహితుడు పాపం.....తన ప్రియురాలిని మర్చిపోలేకుండా వున్నాడు. అదేనా కథ?"
నేలమీదవున్న గడ్డిపరకను త్రుంచి పారేస్తూ అంది సుధ.
"కరెక్టుగా చెప్పావ్!" ఆగి ఆమె ముఖంలోకి చూశాడు.
ఆమె తలవంచుకొని గడ్డిపరక త్రుంచుతూ వుంది.
"ఎలా ఊహించగలిగావూ?"
ఆమె త్రుంచిన గడ్డిపరక విసిరిపారేసింది.
"నాకు చాలా ఆశ్చర్యంగా వుంది" అన్నాడు కృష్ణ సాలోచనగా.
ఆమె ఏదో ఆలోచిస్తున్నది.
అతని మాటలు వినీ విననట్టుగా వుంది.
కృష్ణ ఆలోచనలో పడ్డాడు.
అవును ఎలా చెప్పగలిగింది?
పైగా కరెక్టుగా చెప్పింది.
ఎందుకు చెప్పలేదూ?
ఇంకా సందేహం ఎందుకూ?
స్వానుభవం!
అక్షరాలా తాను అదే పని చేస్తూంది.
ఇది పారడీకాదు.
ఈ కథ తన కథకు పేరలల్.
చాలా తెలివిగా మాట్లాడుతున్నాననికొంటోంది. ఆమాత్రం తను అర్ధంచేసుకోలేడా? తొందరపడకూడదు.
గుట్టమీహ్ది అడవిలో పులి వుంది. ఆ పులిని మెల్లగా బయటికి లాగాలి. పొదలమాటున పొంచి వుంది. పొదను కదిలిస్తేసరి! పులి బయటికొస్తుంది.
"వెళదామా?" లేవడానికి ప్రయత్నించింది సుధ.
"నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు" సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు కృష్ణ.
"చెప్పాలా?" ఆమె కళ్ళల్లో గౌరవర్ణం తలుక్కుమంది.
ఏమిటి ఈ మనిషి ఇలా ఐపోయాడు.
సమ్ థింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్!
ఉదాత్తంగా, గంభీరంగా ఉండే కృష్ణ ఇలా ఐపోయాడేమిటి? నిజంగానే మద్రాస్ లో ఏదో జరిగే వుంటుంది. అది కప్పిపుచ్చి ఏదో కథ అల్లి చెబుతున్నాడు. అదీ అతుకులబొంత. స్నేహితుడట? ప్రేమట? శకుంతలా దుష్యంతుడూ__
"అది నీ మనసు కష్టపెట్టే విషయం అయితే మానేసెయ్" ధైర్యం చేశాడు కృష్ణ.
చివాల్న తలెత్తి అతడి ముఖంలోకి చూసింది సుధ.
కాటువేయడానికి పడగవిప్పిన త్రాచులా కనిపించింది కృష్ణకు.
అంతలోనే ఆమె ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా అంది__"ఇందులో నా మనసు బాధపడేదేముంది? పెద్దగా బుర్రబద్దలు కొట్టుకోవాల్సిందికూడా ఏమీలేదు. మీ స్నేహితుడు ఇంకా తన ప్రేమ కథను గుర్తుపెట్టుకొని చెప్పాడంటే, ఇంకా తన మాజీ ప్రియురాలిని మరచి పోలేదన్నమాటేగా? కాళిదాసు శకుంతల కథకు ఇది రివర్స్ లో లేదా మరి?"
"అతను ఆమెను మర్చిపోలేక పోతున్నాడు, ఆమెను ఓ దేవతగా ఆరాధిస్తున్నాడు. ఆ ఆరాధనలోనే అతని జీవితం కొవ్వొత్తిలా కరిగిపోతూంది...."
"ఇంతకీ మీకొచ్చిన బాధేమిటో?" ఆమె గొంతులో ధ్వనించిన వ్యంగ్యార్దానికి కృష్ణ కలవరపడ్డాడు.
"అతను నా స్నేహితుడు."
"అయితే ఆమాత్రం సలహా ఇవ్వలేకపోయారా?"
"ఏమని?"
"ఆమెను మర్చిపోయి మరొకదాన్ని కట్టుకొని సుఖంగా వుండమని."
"అది అతను చెయ్యగలిగితే అసలు సమస్యే లేదు,"
"ఐతే మీరు చూపిస్తున్న పరిష్కారమార్గం ఏమిటో?"
పెదవి విరిచింది.
లేచి నిలబడింది.
చీరకు అంటుకున్న గడ్డిపరకల్ని దులుపుకొని నడిచింది.
అతనూ లేచాడు.
ఆమెవెనకే నడవసాగాడు.
"మాట్లాడరేం?" చెరువు ఒడ్డున నిలబడి నీళ్ళల్లోకి చూస్తూ అంది సుధ.
కృష్ణ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి సుధవెనకే నిలబడ్డాడు. అతడు విడుస్తున్న వేడిగాలి ఆమె మెడకు తగులుతోంది.
"శకుంతల భరతుడ్ని తీసుకుని వెళ్లినట్టు ఆమె అతని దగ్గిరకు వెళ్ళాలి.
"కాళిదాసు శకుంతలకు పెళ్ళికాలేదు. కానీ మీ శకుంతలకు భర్త ఉన్నాడే?"
"భర్తామెను అతని దగ్గిరకు పంపించడానికి సిద్దంగా వున్నాడు."
సుధ గిర్రున వెనక్కు తిరిగింది.
నీళ్ళవైపుకు ఒరిగినామెను రెండుచేస్తులతో పట్టుకొన్నాడు.
"అతను మూర్ఖుడైన ఐవుండాలి లేక దేముడైనా ఐవుండాలి."
"రెండూకాదు. మామూలు మనిషే!"
"ఐతే అతను మీకు తెలుసా?" సుధ ఆశ్చర్యంగ అడిగింది.
"తెలుసు" నింపాదిగా అన్నాడు కృష్ణ.
"ఐతే ఇంకేం? మీరామెను తీసుకెళ్ళి మీ స్నేహితుడి దగ్గిర వదిలెయ్యండి."
"అందుకామె ఒప్పుకోవాలిగా?" నిట్టూర్చాడు కృష్ణ.