Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 23


    ఇందర్ వళ్ళు మండింది. "మాటలురావా" కరుకుగా అడిగాడు. అవంతి మాట్లాడకుండా తల దించుకుంది.

    "అడిగిందానికి జవాబు చెప్పకుండా మిన్నకుంటే నేను వూరుకోను" అంటూ ఇందర్ దగ్గరకు రాబోయాడు.

    మంచానికి అవతలి పక్కనున్న అవంతి ఓ అడుగు అవతలికి జరిగి "రావద్దు నా దగ్గరకు రావొద్దు" భయంతో అంది.

    ఇందర్ తెల్లబోయాడు.

    ఇదేం పిల్ల అడిగిందానికి జవాబు చెప్పదు. ముందుకు వక్క అడుగు వేశానో లేదో ఆ భయం ఏమిటి! ఆ అరుపు లేమిటి! నేనేమన్నా విలన్ ననుకుందా! ఈవిడగారినేదో నేను రేప్ చేయబోయినట్లు ఆ ఫోజు ఏమిటి? చూస్తుంటే ఈ పిల్ల దేనికో చాలా భయపడినట్లుంది. ముఖ్యంగా మగాళ్ళని చూస్తే మరీ భయం లాగుంది.

    ఇందర్ ఆలోచనలు అలా సాగాయి.

    అవంతి మామూలు ఆడది కాదన్న సత్యం ఇందర్ కి తెలియదు. నలుగురు మగాళ్ళకి వక్కతే సమాధానం చెప్పగల శక్తివంతురాలు. అవంతి మొదటి చూపులోనే ఎవరు ఎట్లాంటి వాళ్లో కనిపెట్టగలదు. ఇందర్ ని ప్రథమ వీక్షణంలోనే చక్కగా అంచనా వేసింది.

    "నేను వస్తే ఏమయింది!" ఇందర్ అడిగాడు.

    "వద్దు వద్దు" అవంతి భయంతో కనుగుడ్లు పెద్దవి చేసి అంది.

    "వస్తే ఏమిటని అడుగుతున్నాను!"

    అవంతి మాట్లాడలేదు.

    "ఈ పిల్ల ఎవరురా బాబూ, కొరుకుడుపడని కొయ్యముక్క" అనుకున్నాడు ఇందర్.

    "సరే నేను దగ్గరకు రానుగాని నా ప్రశ్నలకు జవాబివ్వు. చంద్ర ఎక్కడి కెళ్ళాడు!"

    "ఏమో!"

    "నీ పేరు ఏమిటి?"

    "ఏమో?"

    "ఏంటి నీ పేరు ఏమోనా!"

    కంగారుగా తల అడ్డంగా తిప్పింది అవంతి.

    "నీ పేరేమిటో చెప్పు!" ఇందర్ గద్దిస్తూ అడిగాడు.

    "అ...." అన్న అవంతి ఆపై మాట మింగేసింది.

    "ఇదిగో అమ్మాయ్! నీ తల భాష ఏమిటో నాకు బొత్తిగా అర్ధం కావటం లేదు. తల వున్నది అడ్డంగా నిలువుగా తిప్పటానికి కాదు. తల అన్నది మెదడుని దాచుకోవటానికి మైండిట్!"

    అవంతి అమాయకంగా చూసింది.

    "మరో మాట నీవు మూకీ వదిలి టాకీలోకి దిగాలి. ముందు నీ పేరు అ.... ఇ.... అంటూ పొడి అక్షరాలు చెప్పక పూర్తిపేరు చెప్పు."

    "అపర్ణ విజయచాముండేశ్వరీ కుసుమకోమల గాయత్రీ దేవీ" అవంతి తడుముకోకుండా చెప్పింది.

    "అమ్మబాబోయ్, ఇదంతా నీ పేరే!"

    "ఇంకా చాలా పెద్దది వుంది అని చెప్పాలన్న చిలిపి కోరికని బలవంతాన ఆపుకుంది అవంతి.

    "నీవు అయిదు వాక్యాలకి ఓ అక్షరం బదులిస్తున్నావ్, నా సహనాన్ని పరీక్షించక సరిగ్గా మాట్లాడు. చంద్ర నిన్ను ఇక్కడ ఎందుకు వుంచాడు! వాడెక్కడికి వెళ్ళాడు! ఇదైనా చెప్పు"

    అవంతి మౌనం వహించింది.

    "పురోహితుడ్ని తీసుకురావటానికి వెళ్ళాడా! బాజా భజంత్రీలు కోసం వెళ్ళాడా!"

    "ఏమో!"

    "ఏమిటి ఏమో! లోపల హాయిగా నీవు నిద్రపోతున్నావ్ చంద్ర బైట తాళం వేసి వెళ్ళాడు. పాపం ఏమీ తెలియదేం!" అంటూ ఇందర్ కిటికీ తలుపులు తీయటానికి ఓ అడుగు ముందుకు వేశాడు.

    "వద్దు వద్దు నా దగ్గరకు రావద్దు" అవంతి అరిగిపోయిన రికార్డ్ లా అంది.

    అవంతి పక్కనే అటుగా కిటికీ వుంది. కిటికీ రెక్కలు తీయాలంటే ఇందర్ అటు వెళ్ళక తప్పదు, ఇందర్ మొండిగా అటు నడిచాడు.

    అవంతి ఒక్కసారిగా బేర్ మంది.

    ఇందర్ సడన్ బ్రేకు వేసినట్లు ఆగిపోయాడు.

    "ఎందుకు ఏడుస్తావ్, ఏయ్ నిన్నే!" ఇందర్ తెల్లబోతూ అడిగాడు.

    "నా దగ్గరకు రావద్దు నన్నేం చేయవద్దు. నీకు దండం పెడతాను."

    "నిన్ను నేనేం చేస్తాను!"

    "ఏమో నాకు భయం."

    "ముందు ఆ ఏడ్పు ఆపు. ఏడ్పు అంటే నాకు మా చెడ్డ చిరాకు."

    "నా దగ్గరకు రావద్దు."

    "నేను అటే వస్తాను."

    "వద్దు వద్దు."

    "కిటికీ తియ్యాలి"

    "వద్దు వద్దు."

    "తీస్తే ఏంటిట!"

    "నాకు భయం."

    "ఎందుకు?"

    "ఏమో!"

 Previous Page Next Page