"అయితే, అమ్మ తప్పు చేసిందనేకదా?" అని దెబ్బ లాడాలనిపించింది నవీన్ కు. ఇవాళ మా అంతస్తు, ఐశ్వర్యం చూసి వచ్చావుగాని లేకపోతే వచ్చేదానివా? అని దెప్పాలనిపించింది కాని, ఇంటికి వచ్చిన అన్న బర్యను అవమానిస్తే తల్లిమనసు కష్టపెట్టకొంటుందేమోనని మౌనం వహించాడు నవీన్.
కాత్యాయన్ని సోఫామీద పడుకోబెట్టి స్టెత్ తో పరీక్షించి "జ్వరం బాగానేవుంది ఇంజక్షన్ ఇస్తాను" అని ఇంజక్షన్ చేసి "అమ్మా! గ్లాసుతో మంచినీళ్ళివ్వు! ఈ టాబ్లెట్స్ వేద్దాం" అన్నాడు నవీన్.
కాత్యాయని టాబ్లెట్స్ వేసుకోవడం అయింది.
"అత్తా! నువ్వు కారాలు, మిరియాలు పెట్టావు. కాని నేనుమాత్రం మా యింటికి వచ్చినందుకు కూల్ డ్రింకిస్తాను చూడు" అంటూ నవీన్ అయిస్ వేసిన ఆరంజ్ రసం ఇచ్చాడు.
దాహంతో గొంతు ఎండిపోతున్నట్టుగా ఉందేమో చల్లగా, తీయగా నాలిక్కి తగిలేసరికి ప్రాణం లేచి వచ్చి నట్టుగా అయింది జయలక్ష్మికి.
"ఈరోజు కాత్యాయనిని ఇక్కడే వుంచి వెళ్లు వదినా! సాయంత్రం సిటీనుండి చందన వస్తుంది! ఇద్దరూ కబుర్లు చెప్పుకొంటారు" అంది శంకరి.
"కాత్యాయన్ని అడగండి! దానిష్టం!"
"బావ ఎత్తిపొడవనూ, వెక్కిరించనూ అంటే వుంటాను!" అంది కాత్యాయని.
"నేను హాస్పిటల్ కి వెళ్లిపోతున్నాను బాబూ! నాకెందుకు?" అన్నాడు నవీన్.
కూతుర్ని అక్కడేనవదిలి తేలికయిన మనసుతో ఇంటికి బయల్దేరింది జయలక్ష్మి.