Read more!
Next Page 

                                              విశిష్ట
                                                                --- పోల్కంపల్లి శాంతాదేవి
   
               
    విశిష్ట, కరుణ, సింధు, బిందు ఒక వీధి వాళ్ళే కాదు. చిన్నప్పటి నుండి స్నేహితులు కూడా. నలుగురూ ఒకే సబ్జక్ట్ ఎంచుకొని ఎం.ఎ ఫస్టియర్ కి వచ్చారు.

    యూనివర్శిటీలో చేరిన వారం పది రోజుల తర్వాత ఒకనాటి సాయంత్రం కాలేజీ గ్రౌండ్ లో చెట్ల మధ్య కూర్చొని కబుర్లలో పడ్డారు నలుగురు.

    "సుభాషిణి మేడమ్ చాలా బాగుంటుంది కదూ? ఆమె పాఠం చెబుతున్నా, మాట్లాడుతున్నా ఏదో సంగీతం పాడుతున్నట్టుగా వుంటుంది నాకు. ఈ కాలేజీలో నాకు అందరికంటే బాగా నచ్చిన మనిషి సుభాషిణి మేడమ్" అంది బిందు.

    "ఏయ్, బుద్దూ ఆడవాళ్ళకు ఆడవాళ్ళు నచ్చడమేమిటి?" బిందు తొడగిల్లింది కరుణ.

    "బాగుంటే నచ్చక ఏం చేస్తారు? ఆడవాళ్ళయితేనేం? మగవాళ్ళయితేనేం?"

    "దాపరికాలెందుకు, యార్? నిజంగా మీ కెవరు నచ్చారో చెప్పాలి. దయచేసి ఆడవాళ్ళ పేర్లు మాత్రం చెప్పకండి" అంది సింధు.

    "నాకు మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ పృధ్వి నచ్చాడు. మంచి హాండ్ సమ్ పర్సనాలిటీ. సినిమా యాక్టర్ లా వున్నాడు. ఆయన సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలిగాని తప్పకుండా తీసుకుంటారు!" అంది కరుణ. బిందు అందుకొంది.  "పాపం ఆయన అందం ఆయనకు తెలియనట్టుంది. నువ్వు చెప్పకూడదూ మీరు చాలా అందంగా వున్నారు , సార్! మీరు సినిమాల్లోకి వెళ్ళాలేగాని కళ్ళకద్దుకుని తీసుకుంటారు అని!"

    విశిష్ట అంది - "కాని, ఆయన పాఠం చెబితే నాకు ఒక్క ముక్కా అర్ధమై చావదు"

    అయితే నీ మనసు పాఠంమీద కాకుండా ఆయన అందం మీద ఉంటుంది! అందుకే అర్ధం కాదు" కరుణ పొడిచినట్టుగా అంది.

    "నేను అందాన్ని ప్రేమిస్తాను. కాని, మీలాగ బాహ్య సౌందర్యం చూసి మాత్రం కాదు.... ఆత్మ సౌందర్యానికే నేను ప్రాముఖ్యత నిస్తాను. మనిషి అందంగా లేకపోయినా  సరే, మనసు మంచిదైతే నేను ఆత్మ సమర్పణకు రెడీ!"

    "గుణసుందరి కథలో శివరావు టైప్ అయినా సరే పెళ్ళాడతావన్నమాట!" సింధు వెక్కిరించింది.

    "పృధ్వి సార్ కి బాహ్య సౌందర్యంతోపాటు ఆత్మ సౌందర్యమూ ఉండొచ్చుగా?" కరుణ అడిగింది.

    "నాకెందుకో ఆయన్ని చూస్తే వాసన లేని, జీవం లేని వట్టి కాగితం పువ్వులా అనిపిస్తారు. అయినా మనం మాస్టార్లలో చూడాల్సింది వాళ్ళ అందచందాలు హాండ్ సమ్ పర్సనాలిటీలు కాదు. వాళ్ళెంత మేధావులని! ఎంత విజ్ఞానం ప్రొది చేసుకున్నారని! వాళ్ళ శిక్షణలో మనం ఎంత పురోగమించగలమని! అయినా, మీకు ఎవరెంత అందంగా వున్నారన్న ఆలోచన ఎందుకు? గురువంటే తండ్రితో సమానమంటారు. ఏ కూతురైనా తండ్రి లోని యవ్వన సౌందర్యాలను చూస్తుందా? చూస్తే అంతకంటే అనైతికం ఏమైనా వుంటుందా? చదువుకోసమని వచ్చిన మనం మాస్టార్ల అందచందాలకు మార్కులు వేస్తూ కూర్చోవడమంటే సరస్వతీదేవి పట్ల అపచారం చేసినట్టే అవుతుంది!" సీరియస్ గా అంది విశిష్ట.

    "అందుకే నీ పేరు 'గీతోపదేశం' అని పెట్టాం!" బిందు అంది విసుగ్గా.

    "మంచి మాట చెబితే వినాలి! వెక్కిరించకూడదు."

    "మా పిన్ని కూతుర్ని వాళ్ళ తెలుగు లెక్చరర్ ప్రేమించి పెళ్ళాడాడు. తండ్రి కూతుర్ని పెళ్ళాడినట్టా?" అడిగింది కరుణ.

    "నైతిక విలువలకి విలువనిచ్చే వాళ్ళ దృష్టిలో అది అనైతిక బంధమే!"

    "వాళ్ళేం ప్రేమించి లేచిపోలేదే తల్లీ! ఇరువైపుల పెద్దలూ అంగీకరించి శాస్త్రీయంగా, సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించారు. వాళ్ళదిప్పుడు ఎంతో ముచ్చటైన కాపురం! వాళ్ళకి ముత్యాల్లాంటి యిద్దరు పిల్లలూ"

    "ఎక్కడో ఏదో సంఘటన జరిగితే అందరూ అలాచేస్తే తప్పులేదనడం తప్పు! కాలేజీలంటే స్వయంవర వేదికలు కావు. గురువులు గురువుల్లా వుండాలి! శిష్యులు శిష్యుల్లా వుండాలి. విద్యార్ధి విద్యార్ధి కావాలిగాని ప్రేమార్తి కాకూడదు" విశిష్ట అంది.

    బిందు తమాషాగా బుఝాలు ఎగరేసి "ఎరక్కపోయి ఇరుక్కున్నాం! టాపిక్ మారుద్దాం!" అంది.

                                              *    *    *

    విశ్రాంతి పీరియడ్ లో సుభాషిణి మేడమ్ ఉత్తరాల కట్ట ముందు వేసుకుని ఒక్కొక్కటీ శ్రద్దగా చదువుతూ ప్రక్కన బొత్తిగా పెడుతోంది.

    ఆమె కలం పేరుతో కథలూ, నవలలూ వ్రాస్తూంటుంది ఈ మధ్యే తెలిసింది విశిష్ట వాళ్ళకి.

    "అభిమానుల ఉత్తరాలా మేడమ్!" కుతూహలంతో ప్రశ్నించింది విశిష్ట.

    "కాదమ్మా! కొందరు పిచ్చివాళ్ళ ఉత్తరాలు"

    "అభిమానం ముదిరితే పిచ్చే అవుతుంది. కద మేడమ్?" బిందు అంది.

    "అభిమానులు కాదమ్మా! యువతుల సమస్యలకు పరిష్కారం సూచించే పని ఒక పత్రిక నాకప్పగించింది. వాళ్ళనుంచి వచ్చిన ఉత్తరాలివి. వీళ్ళ సమస్య, దానికి నేనిచ్చే సమాధానం ఆ పత్రికలో ప్రచురింపబడతాయి."

    "పిచ్చివాళ్ళంటున్నారు. ఏం రాశారు మేడమ్?" సిందూ కుతూహలంతో అడిగింది.

    "వీళ్ళ పేర్లు నేను బయట పెట్టకూడదు కాబట్టి ఒక సోదరి అని చెబుతాను. ఈమె టి.వి.లో కనిపించే అడ్వర్ టైజ్ మెంట్ మోడల్ ఒకతన్ని ప్రేమించి అతడిని తప్ప ఇంకెవరినీ పెళ్లాడకూడదన్న నిర్ణయానికి వచ్చిందట. అతడి గురించి వివరాలు కావాలంటే ఎవరికి వ్రాయాలి, ఏం చేయాలి అని వ్రాసింది" అంటూ మరో ఉత్తరం తీసింది.

    "ఈ సోదరిది కూడా చిత్రమైన సమస్యే. ఈమె ఒకతన్ని ప్రేమించిందట. అతనికి భార్యా పిల్లలున్నారని తెలిసినా తన ప్రేమను చంపుకోలేక పోతున్నదట. అతడికి దగ్గర కాలేక, దూరం కాలేద చిత్రవధ అనుభవిస్తున్నదట...... నా సమస్యకు పరిష్కారం ఏమిటి అని అడుగుతోంది..............!

Next Page