Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 23

    అఫండీ గొప్పవాడా-? నిస్సందేహంగా ఇద్దరూ గొప్పవాళ్ళే.
   
    ఒకరు ప్రపంచంలోని అత్యున్నతమయిన ప్రేమను అనుభూతిస్తే- మరొకరు ఆ ప్రేమికుడి పెట్టుబడితో తాజ్ మహల్ కి ఆకృతిని కల్పించాడు.
   
    ఈ సమాజ స్థాయికి ఒక స్త్రీ తన ఇష్టాన్ని బైటపెట్టుకోవడం, అనైతికంగాను, పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయంగానూ కనిపించవచ్చేమో- ఈ సమాజాన్ని ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ లో కూర్చోబెట్టి, కళ్ళకు ఆపరేషన్ చేయిస్తేగానీ, ఒక స్త్రీ ఇష్టం చక్కగా కనిపించదేమో.
   
    పిరికితనంతో ఈ సమాజం విధించే వంద సంకెళ్ళను వంటికి చుట్టుకోవడం కంటే, బరితెగింపుతో వాటిని విదిల్చేసుకోవడం సుఖంగా వుండదా?
   
    మనకు తెలియకుండానే, ఒక వ్యక్తిమీద పుట్టే ఇష్టాన్నీ, ప్రేమనీ, స్పందననీ అణచివేసుకుని అవేమీ లేనట్లే ధర్మామీటర్ లోని పాదరసంలా ఒక స్థాయికి స్పందించి, భయంతో దిగిపోవడం కంటే హేయమైనది మరొకటి ఈ ప్రపంచంలో ఉండదేమో అనిపిస్తోంది.
   
    అయిష్టంగానైనా భర్తతోటే, రాత్రివేళ తంటాలు పడమని ఈ చట్టం, సమాజం శాసించటం తోటే స్త్రీకి మొదటి సంకెల పడిందని నా నమ్మకం.
   
    అమెరికన్స్, యూరోపియన్స్ ఎంతసేపూ శరీరాల్ని పరిశుభ్రంగా వుంచే సుగంధద్రవ్యాల్ని తయారుచేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు వాటితోటే పనెక్కువ గనుక. డాలర్ కోసమైనా మన దేశానికి మాత్రం మనసుల్ని పరిశుభ్రం చేసే పరిమళాల్ని ఎక్స్ పోర్ట్ చేస్తే బావుంటుంది. వాళ్ళకు వ్యాపారం పెరుగుతుంది- మనకు మనసు వికసిస్తుంది.
   
    ఆకాశంలో సగభాగం అన్యాయమైపోతూ వస్తోందని, ఇప్పటికైనా నీకనిపించడం లేదా?"
   
    ఆమె ఎంత భావోద్వేగంతో అన్నదో అర్ధం చేసుకోవటానికి కందిపోయిన ఆమె మోమే నిదర్శనం.
   
    ఆమె చెప్పినట్లు చేసి ఆకాశంలో సగభాగం ఏమైవుంటుందో తెలుసుకోవాలనిపించింది మనోహర్ కి. తెలియని ఏదో ఆవేశం అతన్ని ఉన్మాదంలా చుట్టుముట్టింది. అది కసో, కోపమో, ఉక్రోషమో, ఉద్రేకమో, ఉద్వేగమో తెలియదు.
   
    మరొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెని తన కౌగిలిలో బంధించాడు. ఆపైన ఆమెమీద కోపంతో, తన ఆశక్తతమీద తనకే పుట్టిన చిరాకుతో ఆమెను మరింత బలంగా బంధించాడు తన కౌగిలిలో. అతని కౌగిలి క్షణక్షణం ఆమె చుట్టూ మరింత బలంగా బిగుసుకుపోతోంది. కడుపునింపుకున్న కొండ చిలువ అరుగుదలకు మానును చుట్టుకున్నట్లు.....
   
    ఆమెకయితే వూపిరి అందుతుందా, లేదా అన్న భావం కలిగి అతని కళ్ళలోకి అమితాశ్చర్యంతో చూసింది. అతికష్టంమీద వూపిరి తీసుకుంటూ ఇతను అందమయిన అమ్మాయిని ఆర్తితో అక్కున చేర్చుకున్నాడా? కోపంతో నలిపి పిప్పి చేయాలనుకుంటున్నాడా? ఆమెకేమీ అర్ధంకాలేదు.
   
    సరిగ్గా అదే సమయంలో అదే ఆఫీసులో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనోహర్ ఫ్రెండ్ దుర్గాప్రసాద్ జరూరుగా లోపలికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి షాక్ తినేశాడు.
   
    ఒక్కక్షణం దుర్గాప్రసాద్ కేం అర్ధంకాలేదు.
   
    మరికొంతసేపు అక్కడుండటం మంచిది కాదని అడుగుల శబ్దం కూడా వినిపించకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
   
    మనోహర్ కోపంతో ఉన్మాదంతో మిస్ మాయాదేవిని కౌగిలించుకున్నప్పుడు, మాయాదేవి ముఖం మనోహర్ ఎడమ భుజం మీద వుంది.
   
    సుఖంతో కాక తన్మయత్వంతో ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నవేళ, ఆమె కన్నులు అరమోడ్పులయ్యాయి. అప్పుడామె ఆ స్థితిలో తనను చూసిందా, లేదా.....అన్న మీమాంసకు లోనైన దుర్గాప్రసాద్ టెన్షన్ అంచుకు చేరుకున్న వాడిలా వున్నాడు తన క్యాబిన్ లో.
   
    అటు దుర్గాప్రసాద్ కూ, ఇటు మనోహర్ కూ తెలియని విషయం ఒకటుంది.
   
    మరికొద్ది క్షణాల్లోనే ఉక్రోషంతోటో, ఉన్మాదంతోటో మనోహర్ తనని కౌగిలించుకోవడం ఖాయం అని నిర్ధారణకొచ్చిన మాయాదేవి ఎంతో నేర్పుగా, మనోహర్ కు కనిపించకుండా ఇంటర్ కమ్ బోర్డులో వున్న పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ క్యాబిన్ బటన్ ప్రెస్ చేసింది.
   
    మేడం పిలిచిందనుకుని దుర్గాప్రసాద్ వేగంగా మాయాదేవి క్యాబిన్ లోకి ఎంటర్ అవుతుండగానే మనోహర్, మాయాదేవిని తన కౌగిలిలోకి లాక్కున్నాడు. అది మనోహర్ కు ఇష్టమై చేసిన పనిగానే దుర్గాప్రసాద్ కి అనిపించింది.
   
    ఇక ప్రస్తుతానికి వస్తే-
   
    మనోహర్ అంతకంతకు ఆమె శరీరంమీద తన పట్టును బిగిస్తున్నాడు.
   
    అతను కోపంతోనే ఆ పని చేస్తున్నాడని గ్రహించిన మాయాదేవి-
   
    "పువ్వుని నాసికతోటి ఆస్వాదిస్తే దాని పరిమళం అనుభవంలోకి వస్తుంది-నలిపేస్తే కాదు.....అయినా నీ కౌగిలి కమ్మగా వుంది. మరింత బిగించు....మరో ప్రపంచాన్ని చూస్తాను" అతికష్టంమీద నవ్వుతూ అంది.
   
    ఆమె మాటలు వినగానే చటుక్కున ఆమెను వదిలేశాడు మనోహర్.
   
    యుద్దంలో ఓడిపోయిన సైనికుడి ముఖంలా వున్న మనోహర్ ని చూసి ఫక్కున నవ్వింది మాయాదేవి.
   
    చటుక్కున తలెత్తి ఆమెకేసి ఆశ్చర్యపోతూ చూశాడు.
   
    "ఆకాశంలో సగభాగం అర్ధమైందా?" చిలిపిగా పైపంటిని నొక్కిపెడుతూ అడిగింది మాయాదేవి.
   
    "ఏమీ అర్ధంకాలేదు" చిరాగ్గా అన్నాడు మనోహర్.
   
    "అవన్నీ అర్ధం కాలేదు గనుకే నీలో నాకు మనిషి కనిపిస్తున్నాడు. అర్ధమయ్యుంటే మగవాడు కనిపించేవాడు. మీరు రమ్మన్నప్పుడు వచ్చి మిమ్మల్నెందుకు వాటేసుకోవాలి? ఈ శాసనం ఏమిటి? అని అడిగావు కదా.....చెబుతాను.
   
    కొన్ని వందల ఏళ్ళు బ్రిటీషర్స్ భారతదేశంలో తిష్టవేసి, భారతీయుల్ని బానిసలుగా చూశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చాక, వాళ్ళువాళ్ళ దేశం వెళ్ళాక, ఒక దశాబ్దం తరువాత బ్రిటీష్ కాన్స్ లేట్ లో ఒక సంఘటన జరిగింది.

 Previous Page Next Page