Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 23


    మనిషిలోని  నేరప్రవృత్తిని  క్రమేపీ తగ్గిస్తూ  నేరస్తుడ్ని సంస్కరించటం  అనేది జైలు అన్నపదానికి  నిర్వచనం  అనేది పదకోశ ప్రబంధాల్లోనే సమాధి అయిపోయింది.

    అతను నడుస్తున్నాడు. ఆలోచిస్తూ గతాన్ని నెమరు వేసుకుంటూ.

    అప్పటికే  సాయంచీకట్లు  ముసురుకున్నాయి. జైలు గేటు దాటగానే తన తండ్రి, తల్లి, అక్కా వస్తారని అతను ఎంతో ఆశగా ఎదురుచూశాడు.

    మరో వారంలో జైలునుంచి తనకు విముక్తి లభించబోతుందని తెల్సిన క్షణంనుంచి అతని ఆలోచనలన్నీ  అమ్మా, నాన్నా, అక్కలమీదే.

    క్షణమొక యుగంగా- యుగానికో కలగా అతని కాలం హరించుకుపోతుంటే- తాను తన కుటుంబంతో  గడపబోయే మధుర క్షణాలను  మంత్రించుకుంటూ  బయటకొచ్చాడు. గేటు బయట నిర్జనం, నిశ్శబ్దం.

    తన గేటులోంచి  బయటకు  అడుగువేయగానే టపీమని  మూసుకున్న జైలు తలుపు ఎవరో వస్తారనుకున్నాడు. ఎవరూ లేరక్కడ.

    అంతలో  అటుగా  వచ్చిన బస్ గేటుముందు నించున్న  గంభీరాకారాన్ని చూసి ఓ క్షణం ఆగింది.

    కాని అప్పటికే తన కుటుంబం నిరాదరణకు నిరసనగా  మిగిలిపోయిన  ఉదయ్ బస్ ఎక్కే ప్రయత్నం చేయలేదు, కసిగా  కాలినడకన బయలుదేరాడు.

    ఆ నిశ్శబ్ద నీరసంలో అతని అడుగులచప్పుడు చిన్న చిన్న జంతువులకు అదురు పుట్టిస్తుండటంతో అవి భీతావహంగా చెల్లాచెదురైపోతున్నాయి.

    ఆ చీకటి....

    ఆ నిశ్శబ్దం....

    ఆ నీరసం....

    ఏవీ....అవేవీ అతని ఆలోచనల్నిగాని ,అడుగుల వేగాన్నిగాని ఆపలేకపోయాయి.

    "ఏరా బచ్చానాకొడకా....వేలెడంతలేవు  అంత చలాగ్గా మర్డర్ చేసేశావే. నిన్ను ఓ కంట కనిపెట్టివుండాలి."

    ఓ జవాన్ వ్యంగ్యంగా  అంటుంటే  తనేమిచేశాడో? తనకే తెలీని ఉక్రోషం.

    ఏలూరు-శనివారప్పేటలో ఉన్న సర్టిఫైడ్ స్కూల్లో క్లాసులయిపోగానే అంబికా దర్బారుబత్తి తయారీ.... సన్నని పొడవయిన  పుల్లకు సెంటెడ్  గ్రీజ్ అతుకుతున్నప్పుడు  తన కళ్ళవెంట  తనకు తెలీకుండా  రాలిపడిన  కన్నీళ్ళు-కన్నీళ్ళతో తడిసి తయారయిన అగరబత్తీల వాసన ఎలా వుంటుంది?

    తనకోసం అమ్మా, నాన్న, అక్క ఎంత ఏడుస్తున్నారో?

    వచ్చేవారం నాన్న తనకోసం రావచ్చు. వచ్చే నెల స్కూల్ సెలవల్లో  నాన్న తన తరపున  స్కూల్ సూపరెంటెండెంట్ కి హామీ ఇచ్చి తననుఇంటికి తీసుకెళ్ళవచ్చు.

    కాళ్ళక్రింద  ఓ ఎండు కట్టె టప్పున  విరిగిన శబ్దం, జ్ఞాపకాల పొరల్ని మూసేసిన వర్తమానం పదేండ్లుగా జైలు గోడలమధ్య అతననుభవించిన ఒంటరితనం  అతన్నిప్పుడు వెక్కిరిస్తోంది.

    నన్ను మాత్రమే ఆశ్రయించిన ఓ నిర్భాగ్యుడా నీకంటూ ఎవరూ లేరా? చెళ్ళున వీపున  ఒంటరితనపు కొరడాదెబ్బ అప్పుడు త్రుళ్ళిపడ్డాడు. నలువేపులా  చూశాడు.

    శ్మశానం, బూడిద కుప్పలు, జ్ఞాపికస్థూపాలు, సగం కాలినకట్టెలు సమాధుల స్థబ్దత, కీచురాళ్ళ రొద, గుడ్లగూబల పొద పల్చని వెన్నెల బలహీన మనస్కుడ్ని భయభ్రాంతుడ్ని చేసే భ్రాంతి.

    దూరంగా సగం కాలిన శవాన్ని  పొర్లించి  కలుస్తున్న కాటికాపరి, అతన్ని  ఆవరించుకున్న ఒంటరితనం కాలిన  శవాల మధ్య ఒంటరితనం అతనిది. బ్రతికున్న  మనుష్యుల మధ్య  ఒంటరితనం తనది. వుండుండి ఒక్కసారి నవ్వాడు. పెద్దగా పెట్టిల్లు  పెనుభూతంలా  కాటికాపరి  ఉలిక్కిపడ్డాడు. ఊపిరి  తీసుకోవడము మానేశాడు. జైలుగోడల  కర్కశత్వంతో  రాటుదేలిన  రాతిశరీరము. ఉదయ్ మరలా  నవ్వాడు. ఈసారి చిన్నగా భయపడవద్దంటూ  భరోసాగా నవ్వాడు  బదులు  వచ్చేలోపే  బరువుగా సాగిపోయాడు ముందుకి. నాన్న  వచ్చిన  ప్రతిసారి  ఈసారికాదు  మరోసారి  తీసుకెళతానని  చెప్పటం__

    శ్మశానము  నుంచి  ఫర్లాంగు  దూరము వచ్చాడు. రోడ్డు అక్కడ కన్పించింది. మరికొంత  ముందుకెళ్ళాక  రోడ్డుప్రక్కగా  కనిపించిందో  టీ బంక్. రోడ్డుకి  అయిదారు  గజాల  దూరంలో  పూరిపాక. దానిలో  ఓ పెట్రోమాక్స్ లైట్. నలుగురయిదుగురు అటూ యిటూ  కదులుతూ  అందులోవున్న  చెక్కబల్లల  ముందు కూర్చుని ఖాకీదుస్తుల  శవాకారాలు. అక్కడ  ఒకింతసేపు  ఆగాలనిపించింది ఆగాడు. ఆగి ఆ పాకముందు వేసున్న నులక మంచంమీద కూర్చున్నాడు. ఆకలిగా వుందనిపించింది. ఎదురుగా  వున్న డ్రయివర్ కోడికాలును ఆబగా  పళ్ళ మధ్య  యిరికించి లాగుతుంటే  జేబులో  చెయ్యెట్టాడు. జైల్లోపడ్డ శ్రమకు  ప్రతిరూపం. కరెన్సీ కాగితాల  దొంతర.

    ఏం కావాలంటూ  తన ముందుకొచ్చి నించున్న  సర్వర్ కి కళ్ళతో  సైగచేశాడు. ఎదుటివక్తి తింటున్నదే కావాలంటూ.

    "కోడికాలు" అరిచాడతను పెద్దగా.

    తన ఆలోచనలకు ఆలంబనమయిన నిశ్శబ్దాన్ని చీల్చిన అతనివేపు  కోపంగా  చూశాడు. అతను భయంగా వెనక్కి నడిచాడు.

    తన కళ్ళంటే ఎందుకంత భయం? ఇతనికనేమిటి? జైల్లోకూడా అంతే, ఏముంది  తన కళ్ళలో? లోతయిన కళ్ళు, లేసర్ కిరణాల్లాంటి  సూటయిన చూపులు ఎన్నో భావాల్ని సయితం  యిట్టే  ప్రదర్శించగల లోతయిన  కళ్ళు ఫ్రాయిడ్ ఎక్సరేలా?"

 Previous Page Next Page