"అందరికీ మీ వైరాగ్యం అబ్బుతుందా? ఏదో నేను ఉన్నన్నాళ్ళూ ఇలా బాధపడతాను!" అంది పార్వతమ్మ నడుం వాలుస్తూ.
"వాడెలాగూ చేసుకోడు. ఆమాత్రందానికి మనమంతా నోరు నోప్పి పెట్టేటట్టు వాగడం ఎందుకు? పడుకోండి. పన్నెండున్నరయింది. నే వెళ్ళి ఆ లైట్లు ఆర్పి, తలుపులు వేసి వస్తాను" అని రామం లేచాడు.
"ఆఁ.....అవనిద్దూ.....ఏం మాట్లాడుకున్నా ఈ రెండురోజులే రా. మళ్ళీ ఎన్నాళ్ళకి కలుస్తామో అందరం!" పూర్ణ అంది.
"మీకేం అమ్మా, గేస్తులుకనక హాయిగా మాట్లాడుకుంటారు కూర్చుని. అవతల బోలెడు పనివుంది. ఆ వంటవాళ్ళు ఏం చేస్తున్నారో? మా వాళ్ళందరూ పడుకున్నారో లేదో!"మీనాక్షి లేచి వెడుతూ అంది.
"పడుకోండమ్మా ఇంక. అర్దరాత్రి అయింది. రేపు మాట్లాడవచ్చు. పూర్ణా! అక్కయ్య ఎక్కడుందో చూసి పిలుచుకురా పడుకోడానికి. మీరందరూ తలోమాట అనగానే పాపం అదివెళ్ళిపోయింది" అంటూ జగన్నాథంగారు ఆవులించి పడుకున్నారు.
పార్వతమ్మ మాగన్నువేసింది. సావిత్రి మాటల మధ్య ఎప్పుడో నిద్రకి జారింది. శంకర్, కృష్ణమూర్తి లైటార్పి పక్కల మీద వాలారు. సుందర్రావు సిగరెట్లు కాల్చడానికి బయటికి వెళ్ళాడు.
7
గుడ్ మార్నింగ్! హౌ డు యు లైక్ ది ఛేంజ్!" కొంటెగా అడిగాడు సుందర్రావు, ప్రొద్దునే గదిలోంచి వచ్చిన కొత్త పెళ్ళికూతుర్ని.
ఉష ముఖం ఎర్రబడి, తల ప్రక్కకి తిప్పుకుంది సిగ్గుతో. ఉష ముఖంలో ఏదో వింతకాంతి మెరుస్తూంది. రేగిన జుత్తు, వాడిన జాజులదండ, నిద్రలేని కళ్ళు, నలిగిన తెల్ల జరీ చీర అన్నీ కలిపి నూతన వధువుకి వింత అందాన్ని కూర్చాయి. గదిలోంచి రాగానే అందరికళ్ళు తననే పరిశీలిస్తున్నట్లనిపించి, ఉషకి సిగ్గు, బెరుకు ముంచుకొచ్చాయి. అందర్నీ తప్పుకుని తప్పుకుని తిరగసాగింది.
"దాంతో మీకు హాస్యం ఏమిటి చెప్పండి!" అని పళ్ళు తోముకుంటున్న పూర్ణ భర్తని మెల్లగా మందలించింది, సిగ్గు పడుతున్న ఉషని చూసి.
"మాఁవని ఆమాత్రం హాస్యం కూడదేమిటి? ఇంతకీ నే నే మన్నాను?....ఈ కొత్త లైఫ్ ఎలా వుందన్నాను. అంతే గదూ!" అమాయికత నటించాడు సుందర్రావు. ఉష తప్పించుకుని పారిపోయింది లోపలికి.
మధ్యాహ్నం అయేసరికి మూడువంతులు పెళ్ళివారిల్లు ఖాళీ అయింది. దూరపు బంధువులందరూ వెళ్ళిపోయారు. మిగతావారు కొందరు ప్రయాణసన్నాహంలో ఉన్నారు. మగవాళ్ళు వీధి పందిట్లో పేకాట వేశారు, కొత్త పెళ్ళికొడుకుని కూడా కలుపుకొని. పూర్ణ, అనూరాధ, సుజాత కాఫీ ఫలహారాలు సప్లయి చేయడానికి నడుం కట్టారు.
"అయితే నూతన దంపతులు హనీమూన్ ఎటు వెడదామనుకుంటున్నారు?" అన్నాడు సుందర్రావు. సుధాకర్ కాస్త సిగ్గుపడి, చిన్నగా నవ్వి ఊరుకున్నాడు-కొంచెందూరంలో కూర్చున్న ఉష వైపు దొంగచూపొకటి విసిరి.
"పాపం, వాళ్ళకంటే మీకెక్కువ ఆత్రుతగా వున్నట్లుందే!" అని పూర్ణ సమాధానంగా అంది.
"కాదు మరీ! మన పెళ్ళినాటికి యిలాంటి 'హనీమూన్'లు లేకపోయాయే అని విచారిస్తున్నాను."
"పోనీ. ఆముచ్చట యిప్పుడు తీర్చుకోకూడదు టండీ బావ గారూ!" అని శంకర్ హాస్యం ఆడాడు.
"ఉషా! బొంబాయి రండి, మీ యిద్దరూ....మీ విహారాలకి అన్ని ఏర్పాటులు నేను చేయిస్తాను!" అన్నాడు కృష్ణమూర్తి కొత్త దంపతులను ఆహ్వానిస్తూ.
"మీ అందరి దగ్గిరా ఉంటే అది హనీమూన్ ఎలా అవుతుందిరా!" జగన్నాథంగా రన్నారు.
"అదీ పాయింటే!" అన్నాడు కృష్ణమూర్తి.
"సౌత్ కి వెడదా మనుకుంటున్నాము-మైసూరు, బెంగుళూరు నేను చూడలేదు." సుధాకర్ నెమ్మదిగా అన్నాడు. పేకముక్కలు చూస్తూ.
"కాశ్మీర్, డార్జిలింగ్, ముస్సోరి-ఎన్నో మంచి ప్లేసులుండగా, యీ మైసూరే దొరికిందా నీకు?" శంకర్ అన్నాడు.
"నార్తులో ఉంటాం కనక, నార్త్ ఎప్పుడన్నా చూడవచ్చు. అందుకు యిప్పుడు దక్షిణాది అంతా చూడాలని....."
"శుభస్య శీఘ్రం! ఎక్కడికో అక్కడికి నాలుగు రోజులు సరదాగా తిరిగిరావడం ముఖ్యం. ఎప్పుడు బయలుదేరుతారు!" సుందర్రావు అడిగాడు.
"ఇదిగో,......ముందు మా యింట్లో యేవో గృహప్రవేశం అవీ వుంటాయిగా. అవయాక అక్కడినుంచి వెడతాం."
"ఈ నాటి పిల్లలు అదృష్టవంతులు! పెళ్ళయిన మర్నాటి నుంచీ చేతులు కలుపుకుని జంటగా తిరుగుతారు.....మా కాలంలో కట్టుకున్న పెళ్ళాంతో నలుగురి యెదుట మాట్లాడడమే ఓనేరం! ఇంక భార్యా భర్తలు సరదాగా ఎక్కడికన్నా వెళ్ళడం అన్న ప్రసక్తే లేదు. రాత్రి పది గంటలవరకు పెళ్ళాం కంటబడదు. అప్పుడయినా గట్టిగా మాట్లాడితే నలుగురూ ఎక్కడ వింటారో అన్న భయం. చీకటి గదుల్లో కాపురాలు చేసేవారు. పగలు అసలు భార్యాభర్తలన్నట్లు ఉండకూడదు. ఓ సరదా, పాడూ లేదు! అలా ఉండేవి ఆనాటి నూతన దాంపత్యాలు! ఈనాటి వాళ్ళని చూస్తే ముచ్చట వేస్తుంది! ఓ అత్తపోరు, బిడ్డ పోరు లేకుండా వేరింటి కాపురాలు పెట్టుకుంటున్నారు." జగన్నాథంగారు వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు.
"అందరూ మాటల్లో పడ్డారు. ఎవరూ ఆట సరిగా ఆడడం లేదు..... మానేద్దామా? సరిగా ఆడతారా?" అని శంకర్ చిరాగ్గా అడిగాడు.