ప్రభాకర్ ఊహించింది అక్షరాలా నిజమే - ప్రభాకర్ చూసిన క్షణం మొదలు గీతకి నరకం ఆరంభమైంది. ఆమెలో ఉత్సాహం, శక్తి ప్రభాకర్ మంత్రించి లాగేసినట్లు డీలాపడిపోయింది. ఏ క్షణం ఏం ఎదుర్కొనాలో అన్న భయంతో ఆమె మనసు ఒక్క క్షణం విశ్రాంతిగా వుండలేకపోయింది.
నీచుడు - దుర్మార్గుడు - మోసగాడు! కసిదీరా తిట్టుకుంది. ఏం చేస్తాడో - కృష్ణమోహన్ తో పాత సంగతులన్నీ చెప్తాడేమో! అతనితో చెప్పకపోయినా సరోజ అతని ఆఫీసులోనేగా పనిచేసేది - ఆమెతో చెపితే కృష్ణ మోహన్ కి తెలియడం ఎంతసేపు! ఈ సంగతి తెలిస్తే - తన బ్రతుకే మవుతుంది!
ప్రేమించానని కల్లబొల్లి కబుర్లు చెప్పి - కబురైన చెప్పకుండా నడిసముద్రంలోకి విడిచి పారిపోయిన నీచుడు! ఆ నీచుడు ఇప్పుడింక ఎంత నీచానికి వడిగడ్తాడో! అలాంటి నీచుడి మాటలు నమ్మి మోసపోయినందుకు, తన తొందర పాటుకి తగిన శిక్ష అనుభవించింది - పాత జీవితం పీడకలగా మరిచిపోయి - అసలు ప్రేమకి అర్ధం యిప్పుడే తెలుసుకుని కృష్ణమోహన్ లాంటి సహృదయుడితో బ్రతుకు ముడివేసుకుందామనుకుని కలలుకనే సమయంలో మళ్ళీ యీ పీడకల దావురించిందేమిటి?
దీనికంతటికీ కారణం ఆ సరోజ !- ఆ సరోజే లేకపోతే కృష్ణమోహన్ బజారు వెళ్ళేవాడుగాదు - వెళ్ళినా సరోజ లేకపోతే ప్రభాకర్ పరిచయం అవడం జరిగేది కాదు! యిప్పుడా రాక్షసి - అసలే తనమీద కోపంగా వుండివుంటుంది - ప్రభాకర్ చెప్పిందంతా చెప్పదా!-తనే మొహంపెట్టుకుని సంజాయిషీ యివ్వగలదు! యిచ్చినా అదంతా అబద్దమని నిరూపించడానికి ఆ ప్రభాకర్ దగ్గిర యింకా తన ఉత్తరాలు అవీ వుండే వుంటాయి.
ఆలోచిస్తుంటే గీతకి పిచ్చెక్కినట్లయిపోయింది. ఈ పాటికి కృష్ణమోహన్ కి అంతా తెల్సిపోయి వుంటుంది. ఏం చెయ్యడం! గీత కోపం అంతా సరోజ మీదకి తిరిగింది. అసలు సరోజ వచ్చిందగ్గిరనుంచి దానివల్లే తామిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి! అన్నింటికీ కారణం అదే గీత కసిగా ఎదరలేని సరోజని తిట్టుకుంది.
రెండు రోజులు కూతురి వాలకం కనిపెట్టి రంగారావుగారు "ఏమిటిరా నాన్నా-అలా వున్నావు? రెండు రోజులై యిల్లు కదలడం మానేశావు ఏం, మోహన్, నీవు తగువులాడుకున్నా రేమిటి?" నవ్వుతూ అడిగారు.
జవాబుగా గీత మొహం నల్లబడడం - ఆమె కళ్ళలో బెదురు చూసి ఆయన కంగారుపడి బుజ్జగించి, లాలించి ఆఖరుకి అసలు సంగతి రాబట్టగలిగారు. వినగానే ఆయనా తడబడిపోయి కంగారు పడిపోయారు. మొహం వివర్ణమయింది - "కృష్ణ మోహన్ చూశాడా - కొంప మునిగిందమ్మా. వాడు నీమీద కసితో ఏంచేస్తాడో, ఏం చెప్తాడో - ఖర్మ - సరిగా యీ వూరికే తగలడాలా అతను - ఏం చెయ్యడం-?" ఆయన గబహరా పడిపోయారు- "మరొక్క నెల గడిచిపోతే ముహూర్తం పెట్టించేసి ఆ పెళ్ళేదో జరిగిపోతే-" ఆయన గొణుక్కున్నారు. గీత వాడిపోయిన మొహం చూస్తే ఆయన గుండె ద్రవించింది. కూతురి భుజం మీద ఓదార్పుగా తట్టి- "భయపడకు తల్లీ - అంతగా అవసరం అయితే ఆ ప్రభాకరంని నయానో, భయానో లొంగదీసుకోవచ్చు - ఒక్క నెల రోజులు ఆ భగవంతుడి దయవల్ల ఎంతసేపు గడిచి పోతాయిలే-" కూతురుని ఓదారుస్తూ ఏదో అన్నా ఆ కబురు విన్న దగ్గిర నించి ఆయన కాళ్ళు చేతులు ఆడడంలేదు. తండ్రి, కూతురు పైకి నిబ్బరంగా కనిపించాలని ప్రయత్నిస్తున్నా వారి మనసులలో అలజడి మొహం మీద కన్పించక మానడం లేదు.
* * *
ఆ రోజు సంక్రాంతి - రంగారావుగారు పండగ ఏర్పాటులు అట్టహాసంగా చేశారు. కాబోయే అల్లుడిని, వియ్యపురాలీని విందుకు పిలిచారు. ఆ రోజు శాస్త్రులని పిలిపించి వివాహముహూర్తం వెంటనే నిర్ణయించాలని నిశ్చయించుకున్నారాయన.
కృష్ణమోహన్ తండ్రి సంవత్సరీకాలు వెళ్ళలేదని ఆ ఏడాది పండగ చేసుకోలేదు ఇంట్లో రంగారావుగారు అల్లుడిని, వియ్యపురాలిని ఆహ్వానించడానికి వచ్చారు. సరస్వతమ్మ తను రావడానికి ఎంత మాత్రం యిష్టపడలేదు. "మీ అల్లుడిని తీసికెళ్ళండి. నాకు పండగలుపబ్బాలు ఆయనతోటే పోయాయి-" అంది. కాని రంగారావు దంపతుల బలవంతంవల్ల కృష్ణమోహన్ పట్టుదలతో ఆవిడ వియ్యాలవారింటికి వచ్చింది. సరోజ రానంటున్నా కృష్ణమోహన్ బలవంతపెట్టి కారెక్కించాడు. "నీవు రాకపోతే నేనూ వెళ్ళను, పండగపూట ఒకర్తివీ యింట్లో ఉంటావా" అంటూ సరస్వతమ్మ అనడంతో యిష్టం లేక పోయినా కారెక్కింది సరోజ. ఆమె కెందుకో గీత ఎదుట పడాలంటే మనస్కరించదు. గీత చూపులలో చులకన, నిర్లక్ష్యం చూస్తే సరోజకి కంపరమెత్తుతుంది. ఆమెకి తన మీద అకారణంగా ఎందుకంత ద్వేషమో అనుకుంటుంది. సాధ్యమైనంత వరకు గీత వచ్చినప్పుడు ఆమె ఎదుట పడకుండా వుంటుంది. ఈ రోజు కృష్ణ మోహన్ తో గీత యింటికి వెళ్ళాలంటే ఆమె ప్రాణం చచ్చిపోయి నట్లయింది.
తలంటి పోసుకొని, కొత్తచీర కట్టుకున్న సరోజ, ఆ రోజు ఎందుకో కృష్ణ మోహన్ కి చాలా అందంగా కన్పించింది. ఎక్కువ రంగులేక పోయినా కళకళలాడుతున్న మొహంతో నిండుగా నవ్వుతూ తిరిగే సరోజని చూస్తుంటే హఠాత్తుగా అతనికి గీత గుర్తు వచ్చింది. చక్కగా గీత యిలా పూలు పెట్టుకుని, కంటినిండా కాటిక పెట్టుకుంటే ఎంత బాగుంటుంది-అనుకున్నాడు.
"సరోజా - ఈ చీర నీకు చాలాబాగుంది....మంచి సెలక్షన్" అన్నాడు ఆమెని చూస్తూ. సరోజ ఒక్కక్షణం ఆ పొగడ్తకి ఇబ్బంది పడింది.
సరస్వతమ్మ సరోజని చూసి కళ్ళు వత్తుకుంది.
"పదమ్మా వెడదాం, ఎదురు చూస్తూంటారు-" అన్నాడు కృష్ణమోహన్ తల్లిని మరిపించడానికి.