"ప్రభాకరంగారూ....ఏమిటంటున్నారు...?"
"ఏం అర్ధంగాలేదాండీ....ఆవిడ కొన్నాళ్ళు నన్ను ప్రేమించిందండీ నన్ను చూడందే నిద్రపట్టేది కాదుట. నేను లేకపోతే తనకేంలేదుట. అనుక్షణం నేనే కావాలనిపించేటంత గాఢంగా ప్రేమించింది లెండి. కాని పాపం తరువాత..... వాళ్ళనాన్న "డబ్బుంటేనే ప్రేమలు తల్లీ" అన్న సూక్తి బోధ పరిచాక నాలాంటి ఆఫ్టరాల్ గుమస్తాగాడిని కట్టుకునే టంత ప్రేమ తనకేం లేదని అర్ధం చేసుకుని వుంటుంది.
"సరోజగారూ.....అన్నింటికంటే నన్ను బాధించింది ఏమిటో తెలుసా, తనకు తానుగా నీకు నాకు కుదరదు అంటే అంత బాధ పడేవాడిని గాను - పెళ్ళి చేసుకుందాం డాడీతో చెప్తాను యింటికిరా అని పిలిచి తను కంటబడకుండా తండ్రిచేత నానా మాటలు అనిపించి నన్ను గెంటించింది - ఆ గీత... ఆ గీతని నేనెలా మరిచిపోతాను- సరోజ గారూ - యీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నన్నింక అవమాన పరచిన యీ గీతకి బుద్ధిచెప్పే సమయం అవకాశం నాకు దొరికింది - నాకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాను--" ఆవేశంగా పళ్ళు బిగపట్టి అన్నాడు.
సరోజ చకితురాలై వింటూన్నదల్లా గాభరాగా-- "ఛా...ఛా....వద్దు అదేంపని----ఏదో తెలిసీ తెలియని వయసులో ఏదో చేసింది - దానికోసం మీరిప్పుడు పాత పగ తీర్చుకోడం ఆ అమ్మాయి బ్ర్తతుకు నాశనం చెయ్యడం అవుతుంది--చదువుకునే రోజుల్లో ఏదో ప్రేమ అనుకొని మోజులో పడటం - ఇంట్లోవాళ్ళు కేకలేయగానే ఆ ప్రేమ మోజుతీరిపోవడం - యివి యించుమించు ప్రతీ టీనేజ్ గర్ల్ కి అనుభవంలోదే - ఆ మాత్రం కోసం మీరు--"
ప్రభాకర్ అదోలా నవ్వాడు "ఆ మాత్రం అంటే, ఏదో పిచ్చిగా ప్రేమమాటలు వల్లించి, రెండుత్తరాలు రాసుకోడంతోనే మా ప్రేమాగి పోయిందనుకుంటున్నారా- అదే అయితే నేనింత బాధ పడేందుకు ఏముంది? సరోజ గారూ -మేమిద్దరం తప్పుచేశాం ..... కాలుజారాం ఉద్రేకంలో. ఇద్దరం విచ్చల విడిగా తిరిగాం రెండునెలలు- దాని ఫలితం - నలుగురికీ తెలుస్తుందనీ గీత భయపడింది. అనుమానపడింది. అందుకే ఇద్దరం త్వరగా పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. వాళ్ళ నాన్నతో చెప్పి, పెళ్ళికి ఒప్పిస్తానంది. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. తెలిసిందల్లా - గీత రమ్మన్న వేళకి యింటికి వెడితే ఎదురయిన అవమానిం! అది యీ నాటికీ నన్ను దహిస్తూంది. "ఏం చూసుకొని నా కూతుర్ని పెళ్ళాడాలను కున్నావు. ఏం మొహం పెట్టుకు ప్రేమించావు - మళ్ళీ దాని దరిదాపులకి వస్తే చూడు -" అంటూ కుక్కలా తరిమారు ఇంట్లోంచి. సరోజాగారూ! ఆనాటి తరువాత ఈనాడు మళ్ళీ గీతని చూశాను" ఆవేశంగా అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా వింది.
"మరి -గీతని తరువాత ఎప్పుడూ కలుసుకోలేదా! గీత కనీసం క్షమాపణ అయినా చెప్పలేదా...."
"నేను ఆమర్నాడే ఆ వూరు విడిచి వెళ్ళిపోయాను శలవలకి చదువయిపోయి ఉద్యోగంలో జాయినయ్యాను యిక్కడ-ఆ తర్వాత గీతని నిన్ననే చూశాను - మానిన గాయం కెలికినట్లయింది. గీతని చూశావా యింత జరిగాక ఏం తెలియనట్లు కృష్ణమోహన్ గార్ని పెళ్ళాడడానికి తయారైందంటే....యీ డబ్బున్న వాళ్ళకి నీతి అన్నది ఎంత అల్పవిషయమో ఆలోచించండి - కృష్ణ మోహన్ గారి లాంటి మంచివారిని చూస్తూ చూస్తూ యీ వలలో పడనీయడం మంచిదేనేమో ఆలోచించండి-"
సరోజ జవాబు చెప్పలేకపోయింది "మరి - అప్పు డేదో అనుమానం అన్నారు. ఆ విషయం ఏమయింది?" సందేహంగా అంది సరోజ.
ప్రభాకర్ హేళనగా నవ్వి, "డబ్బుంది - డబ్బుతో చేయలేని పని ఏముంటుంది సరోజగారూ? డబ్బిచ్చి కూతురి మచ్చ మాయంచేసివుంటారు. అదీరోజుల్లో ఏం కష్టం!.... ఆ మచ్చ తుడిచేసి కృష్ణమోహన్ లాంటి అల్లుడిని కొనడానికి తగినంత డబ్బుందిలెండి వారికి."
సరోజ మొహం దించుకుంది - గీత.....ఇలాంటిదని, ఆమె వెనక యిలాంటి మచ్చ వుందని తెలిస్తే కృష్ణ మోహన్ ఆమెని చేసుకుంటాడా! కృష్ణమోహన్ ఏమిటి, చూస్తూ చూస్తూ ఎవరు చేసుకుంటారు? ఎంత నిష్ట నియమాలున్నాయి అతని తల్లికి. ఆవిడకి తెలిస్తే కోడలిగా ఎప్పటికీ అంగీకరించదు. వంశం, పరువు ప్రతిష్ట యివన్నీ ఏమవుతాయి. యీ సంగతిగాని తరువాత తెలిస్తే - కాని చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బ్రతుకు నాశనం చేయడమా!
"ఏమిటాలోచిస్తున్నారు సరోజగారూ - చెప్పండి - చూస్తూ చూస్తూ కృష్ణ మోహన్ గారిని యీ గీతని చేసుకోనియమంటారా! ఆయనకీ చెప్పండి మీరూ. మీరు చెప్పకపోతే నేనే చెపుతాను." కసిగా అన్నాడు.
"వద్దు-వద్దు-నేను చెప్పను. దయచేసి మీరూ చెప్పకండి ప్రభాకర్ గారూ....జరిగింది ఏదో జరిగింది. యిప్పుడీ సంగతి బైటపడితే ఆ అమ్మాయి బ్రతుకేమవుతుంది...పాత సంగతి మరిచిపొండి-ప్లీజ్-ఈ మాట ఎక్కడా అనద్దు. దయచేసి జరిగింది మరిచిపొండి అలా అని నాకు మాట యివ్వండి."
"నేను మరిచిపోయినా గీత మరిచిపోలేదు లెండి - చూశారుగా ఉదయం నన్ను చూసి ఎలా పరుగెత్తిందో - ఆమె ఈ క్షణంనించి తన నీడచూసి తనే భయపడుతూ వుంటుంది. అదే-నాకు కావల్సింది. నాకు చేసిన అవమానానికి యింతకంటే వేరే శిక్ష అక్కరలేదు, గాని-కృష్ణ మోహన్-ఐ పిటీ హిమ్-"అన్నాడు.
* * *