Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 25


    రంగారావుగారు దంపతులు ముగ్గురినీ సాదరంగా ఆహ్వానించారు. సరోజని చూసి గీత మొహం చిట్లించి పలకరించనైనాలేదు. ఆరోజు కొత్తరకం ఫాషన్ మాక్సీ తొడిగింది గీత. జుత్తువిరబోసుకుంది బాబ్ గా. ఆమెని చూడగానే కృష్ణమోహన్ సరోజవంక చూడకుండా వుండలేక పోయాడు.
    గత ఇరవై రోజులుగా గీత కృష్ణ మోహన్ తో ఇదివరకులా మాట్లాడలేక పోయింది. అసలు ప్రభాకరం కనబడిన తరువాత రోజునించి మరి వారం పదిరోజులు ఇల్లు వదలలేదు. సరోజ కృష్ణమోహన్ కి అంతాచెప్పేసి వుంటుందని, అతనేం అడుగుతాడో ననే భయంతో అతని ఎదుటపడడం మానేసింది. ఫోన్ వచ్చిందంటే చాలు కృష్ణమోహన్ అని ఆమె గుండె ఒక్క క్షణం లయ తప్పేది. గీత రావడంలేదని ఒక రోజు కృష్ణ మోహన్ రాగానే గీత గుండె ఆగిపోయింది. బెదురుగా వచ్చికూర్చన్న గీతని చూసి కృష్ణమోహన్ ఆశ్చర్యపడ్డాడు. ఆ వారం పదిరోజులకే ఏదో జబ్బుపడ్డదానిలా తగ్గిపోయి, నల్లబడి పోయిన ఆమె మొహాన్ని చూసి, ఆరాటపడ్డాడు. వంట్లో బాగులేదా అంటూ గీత చెప్తున్న కారణం విని ఆశ్చర్యపడ్డాడు. "వంట్లో బాగులేకపోతే డాక్టరయిన నా దగ్గరికి ఎందుకురాలేదు యిదివరకులా"అన్నాడు. గీత జవాబు చెప్పలేక తడబడింది. రంగారావుగారు కల్పించుకుని ఏవో సంజాయిషీలు యిచ్చారు.
    ఇరవై రోజులయినా కృష్ణ మోహన్ ఏమీ అడగక పోవడంతో ప్రభాకరం సరోజకి ఏమీచెప్పి వుండడని నమ్మి గుండెలమీద భారం దించినట్లయి నిశ్చింతగా ఊపిరి తీసుకోడం ఆరంభించింది-ఒక్క క్షణం ప్రభాకరంకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ మరుక్షణమే ఆ ఏం చెప్తాడు-ఓ ఆడపిల్లని మోసంచేసి, పిరికివాడిలా పారిపోయానని ఎలా చెప్పుకుంటాడు - అనుకుంది కసిగా. ఆ మాట అనుకోగానే యిన్నాళ్ళు తననీడచూసి తనే బెదిరినందుకు సిగ్గుపడింది.
    దాంతో పూర్వపు గీత అయిపోయింది - అన్నాళ్ళు కాస్త సరోజ అంటే మనసులో బెదిరిన గీత యింకేం ఫరవాలేదన్న నిబ్బరంతో నిర్లక్ష్యంగా చూసింది సరోజ వంక. వారిద్దరి వెంట ఆమె రావడం యిష్టంలేని గీత ఆమెని చూసి మొహం చిట్లించింది. ఆమె అనే మనిషే లేనట్లు ప్రవర్తించింది.
    సరోజకి అసలే కొత్తచోటు -దానికితోడు గీత నిర్లక్షయ వైఖరి - పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూంటే ఎవరితో మాట్లాడాలో తెలియక ఒంటరిగా యిబ్బంది పడింది. అది గుర్తించాడు కృష్ణమోహన్ అందుకే మధ్య మధ్య సరోజతో చనువుగా మాట్లాడుతూ ఆమె కొత్త పోగొట్టాలని ప్రయత్నించ సాగాడు. భోజనం దగ్గిరకూడ, "సరోజ ఇదితిను - అది తిను. అంత మొహమాట పడతావేం." అని చనువుగా మాట్లాడుతూంటే గీత ఉక్రోషంగా చూసింది. అందంగా ఎంతో శ్రద్దగా అలంకరించుకున్న తన ముస్తాబుని గమనించకుండా సరోజ చీర గురించి ఆమె సెలక్షన్ ఎంతమంచిదో చెప్తుంటే కోపంతో మండిపడింది. కోపం ఎలా చూపాలో అర్ధంకాక మొహం ఎర్రపరుచుకుంది.
    భోజనం కాగానే సరస్వతమ్మ తను వెంట తెచ్చిన చీర, పసుపుకుంకం, పళ్ళు సరోజచేత బొట్టుపెట్టించి గీతకి యిప్పించింది. చీర అందుకుంటూంటే గీత మొహం కాస్త విప్పారింది. ఆ సంబరం కాస్తా చీర పాకెట్టు విప్పి చూడగానే పోయింది. దానికితోడు కృష్ణమోహన్ "గీతా, ఈ సెలక్షన్ మా సరోజది. ఎలావుంది" అన్నాడు. గీత మొహం కోపంతో జేవురించింది. ఆ చీరవంక సరోజ కట్టుకున్న చీరవంక మార్చి మార్చి చూ
సింది. ఇద్దరిదీ ఒకే రకం. రంగువేరు అంతే!
    "కట్టుకురా అమ్మా." అంది సరస్వతమ్మ "ఆ పూలు పెట్టుకో!" గీత విసురుగా ఆ చీర సోఫామీద పడేసి "కట్టుకోను. ఇంట్లో పనివల్లని, ఇంటి కోడలిని సరిసమానంగా భావించి మీరిచ్చిన ఆ చీర కట్టుకునేటంత గతి లేని దాన్నికాదు. ఇదికూడా దాచి మరో పండక్కి ఆవిడకి యీయండి. నాకేం చీరల లోటు లేదు." అంది వ్యంగ్యంగా.
    ఆ మాటలకి అందరూ ఒక్క క్షణం అచేతనులయ్యారు. అందరి మొహాలు నల్లబడ్డాయి. సరోజ మొహం మరీ మాడి పోయింది. అందరికంటే ముందుగా తేరుకున్నది కృష్ణమోహన్. కోపంగా గీత వంక తిరిగి "గీతా!" అన్నాడు కఠినంగా. గీత నిర్లక్ష్యంగా తలెగరేసింది. "మోహన్, నన్నింత అవమానించుతావని ఎన్నడూ అనుకోలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని దాని కంటే నీకు నేనేం ఎక్కువ అవనని తెలియచెప్పినందుకు చాలా థాంక్స్ నా పట్ల నీకున్న ప్రేమకి థాంక్స్!" ఉక్రోషంగా అంది.
    "గీతా.....నీవేం మాట్లాడుతున్నావో తెలుస్తూందా?"
    "తెలిసే మాట్లాడుతున్నాను. మీకు ఆవిడమీద అంత ప్రేమాభిమానాలు వుంటే నెత్తి కెక్కించుకోండిగాని, నా తాహతు అంతస్థు మరిచి దాని స్థాయికి దిగజారాల్సిన గతి నాకేం లేదు. మరొక్కసారి యిలా నన్నెప్పుడూ అవమాన పరచకండి. యీ బుద్ధి మీకే పుట్టిందా? ఎవరన్నా సలహా చెప్పారా" గీత కసిగా సరస్వతమ్మ వంక చూసింది.
    జరిగిన దానికి అవమానంతో తలెత్తుకోలేని సరస్వతమ్మ ఆ మాటతో యింక ఓదార్చుకోలేక పోయింది. నల్లబడిన సరోజ మొహం చూడగానే ఆవిడ ఆవేశాన్ని అణుచుకోలేకపోయింది.
    "అవునమ్మా గీతా, ఈ బుద్ధితక్కువ సలహా చెప్పింది నేనే! కూతురు, కోడలుని ఒకేలా చూడాలన్న మంచి మనసుతో వాడికీ సలహా యిచ్చాను. కాని యిప్పుడర్ధం అయింది. కూతురు కోడలు ఒకటెలా అవుతారు? ఎవర్నుంచాల్సిన స్థానంలో వారి నుంచాలని బాగా తెలియ చెప్పావు గీతా సరోజ మా యింటి ఆడపడుచు నే బతికి వున్నన్ని రోజులు, సరోజ మాయింట వున్నంతకాలం. ఆడబిడ్డ హోదాలోనే వుంటుంది. ఆమెని ఎవరూ ఏ విధంగా అవమానించినా నేను సహించను. సరోజా, పదమ్మా వెడదాం." అంటూ చెప్పవలసింది స్థిరంగా తెలియచెప్పి ఆవిడ లేచి నిల్చుంది.

 Previous Page Next Page